వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/కాశీయాత్ర చరిత్ర వినియోగం
తెలుగులో తొలి యాత్రాచరిత్ర(ఆధునిక జానర్లో)గా సుప్రఖ్యాతి వహించిన కాశీయాత్ర చరిత్ర 1830లో యాత్రాచరిత్రకారుడు, దాత, ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి ఏనుగుల వీరాస్వామయ్య చేసిన యాత్రాఫలితంగా ఆవిర్భవించింది. డోలీలు, బండ్లు, నడక వంటి పాత పద్ధతుల్లో గ్రామాలు దాటుకుంటూ, నదులు తరిస్తూ చేసిన యాత్రను ఆయన అప్పటి శిష్టవ్యావహారికంలో వ్రాశారు. గ్రంథ రచనకు 70ఏళ్ళ పిమ్మట తెలుగులో గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదాలు చెలరేగినప్పుడు అభినవ వాగనుశాసనుడైన గిడుగు రామమూర్తి పంతులు వాదానికి లక్ష్యంగా నిలిచి చాలా ఉపకరించింది. ఈ గ్రంథానికి చరిత్ర, భాషాశాస్త్రం వంటి రంగాల్లో చాలా విలువ ఉంది. 19వ శతాబ్ది తెలుగు వారి సాంఘిక చరిత్ర రచనలో దీని ఉపయోగం అంత ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అందుకు నిదర్శనగా సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 19వ శతాబ్దినాటి సాంఘిక స్థితిగతుల గురించి దీనిపై విపరీతంగా ఆధారపడడం నిలుస్తుంది. ఆంద్రుల సాంఘిక చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచనే కాక ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసుల పోటీ పరీక్షల్లో ప్రామాణిక గ్రంథ హోదా కలిగివుంది. తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇంటర్నెట్లో ఉచితంగా సాఫ్ట్ కాపీలు లభిస్తున్న పుస్తకాల నుంచి వ్యాసాలను అభివృద్ధి చేసి, మరికొందరు వికీపీడియన్ల సహకారం ఈ విషయంలో తీసుకుని ఈ పుస్తకాలకున్న విజ్ఞాన సర్వస్వ మూలాల హోదాను అలా నిర్ధారించి, వాటి వాడుకను తెవికీలో ప్రోత్సహించడమూ ఒకటి. అందులో భాగంగా ఈ ఉపపేజీ ప్రారంభించడం జరిగింది.
గ్రంథానికున్న విజ్ఞాన సర్వస్వ విలువ
[మార్చు]ఏనుగుల వీరాస్వామయ్య చెన్నపట్టణం నుంచి చిత్తూరు జిల్లాలో ప్రవేశించారు. ఆపైన మజిలీల మీదుగా వెళ్తూ కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల మీదుగా ప్రయాణం చేశారు. అలా క్రమాంతరాల మీద ప్రయాణిస్తూ ఆదిలాబాద్ మీంచి నేటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణాను దాటారు. అలాగే వచ్చేప్పుడు ఈ త్రోవ కాకుండా నేటి పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల మీదుగా శ్రీకాకుళంలో ప్రవేశించి విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు దాటుకుని చెన్నపట్టణం బాటపట్టారు. ఇలా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తీరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, తెలంగాణా రాష్ట్రమూ కూడా కవర్ చేశారు.
వ్రాయడంలో ప్రతీ మజిలీ గ్రామాన్ని గురించి కూడా మౌలికమైన వివరాలు చెప్పారు. గ్రామంలో సత్రాలు, బ్రాహ్మణుల ఇళ్ళు వంటి ఆయన సౌకర్యాల గురించిన విషయాలు అనవసరం అనుకున్నా గ్రామం 1830లో పేట స్థలమా(వ్యాపారాలు జరిగేందుకు తగ్గ సంతలు, కోమటి కొట్లూ(అప్పట్లో) వంటివి ఉండే ప్రాంతం), చిన్న గ్రామమా, బస్తీగా ఉండేదా, లేక షహరా అన్న విషయం తెలుస్తుంది. పరిపాలనాధికారులు గ్రామంలో నివాసం ఉంటే ఆ వివరాలు వ్రాశారు(దాని వల్ల అప్పటికి గ్రామం/పట్టణం స్థాయి తెలుస్తుంది). గ్రామంలో జలవనరులు ఎలా ఉండేవి, అటవీస్థలం దగ్గరగా ఉందా వంటి విషయాలూ వ్రాశారు. అంతేకాక అప్పటికి గ్రామంలో ఎవరైనా ధర్మాత్ములు ముసాఫర్లకు(యాత్రికులు) నిరతాన్నదానాలు చేయడం వంటివి చేసినా, అలాంటి ఏర్పాట్లు చేసినా వారి వివరాలు ఉంటాయి. చిత్తూరు వరకూ ఈస్టిండియా కంపెనీ పాలన కాగా, కడపలో కొంత భాగం, కర్నూలు పూర్తిభాగం అప్పటికి కందనూరు(కర్నూలు) నవాబు పరిపాలనలో ఉండేది. కర్నూలు నవాబుల పరిపాలన ఎలా ఉండేదో తెలిసేందుకు ఇదొక ప్రబల సాక్ష్యం. ఆయన పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించి తరించేందుకు ఈ యాత్ర చేశారు. కనుక దారిలో వచ్చే తిరుమల, మహానంది, అహోబిలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, శ్రీకూర్మం వంటి పుణ్యక్షేత్రాలు, సంగమేశ్వరం వంటి తీర్థాలు ఎలా వుండేవన్న విషయాలు చాలా చక్కగా వ్రాశారు. తెలుగు గ్రామాలు, పుణ్యక్షేత్రాలు, కోటలు, సంస్థానాలు, నగరాలు, జిల్లాలు, ఆపైన భారతదేశ జిల్లాలు(ప్రస్తుతం 29/11/2014 నాటికి భారతదేశ జిల్లాల ప్రాజెక్టును సుజాత గారు నిర్వహిస్తూ చాలావరకూ జిల్లాల వ్యాసాలు వ్రాయడం దీనికి ఉపకారి అవుతున్నారు) వంటివాటిలో చరిత్ర, ప్రముఖ వ్యక్తులు, నాటి సాంఘిక చరిత్ర వంటివాటి విషయంలో ఈ పుస్తకం నుంచి సమాచారాన్ని స్వీకరించి వ్రాయవచ్చు.
గ్రామవ్యాసాల స్థితి
[మార్చు]తెలుగులో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గ్రామాలన్నిటికీ వ్యాసాలుండడం వల్ల చాలా లాభం కలిగింది. ఇప్పటికీ కొత్తగా తెవికీకి పరిచయం ఎవర్నైనా చేయాల్సి వస్తే గ్రామ వ్యాసాలే చాలా ఆకర్షణీయమైన మార్గం. మా ఊరికి కూడా ఓ వ్యాసం ఉందా? అని ఆశ్చర్యపోయి. ఉన్నదానిలో సమాచారాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తూంటారు. ఐతే వీటిని మనకు దొరికే ప్రామాణిక మూలాలతో వీలున్నపుడల్లా అభివృద్ధి చేస్తూండాలి. కేవలం ఆకార మాత్రంగా ఉన్న చాలా గ్రామ వ్యాసాలను తెలుగులో దొరుకుతున్న మూలాలతో కొంత అభివృద్ధి చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ క్రమంలో ఈ పుస్తకం, ఇప్పుడు చేపట్టిన పని ఉపకరిస్తుంది.
ఎదురయ్యే సమస్యలు
[మార్చు]సమస్య
[మార్చు]కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించిన ఊళ్ళపేర్లలో మార్పులు వచ్చివుండడం, ఒకే ఊరిపేరుతో జిల్లాలో నాలుగైదు గ్రామాలుండడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
పరిష్కారం
[మార్చు]హఠాత్తుగా ఏదో ఒక పేజీ ప్రారంభించి మధ్యలో ఒక ఊరిపేరు తీసుకుని మొదలుపెడితే మాత్రం చాలా కష్టమవుతుంది. దీనికి పరిష్కారంగా ఆయన మజిలీల్లో అత్యంత ప్రముఖమైన తిరుపతి, అహోబిలం, మహానంది, వనపర్తి, హైదరాబాద్ వంటివాటిలో ఒకటి స్వీకరించాలి. అప్పుడు ఆయన తర్వాతి మజిలీ ఎంత దూరంలో వేశారో, ఏ మార్గంలో వెళ్ళారో క్లుప్తంగా వ్రాసుకుంటారు. మనకు భౌగోళిక స్పృహ అలా కలగడంతో తేలికగా గ్రామాన్ని గుర్తించగలుగుతాం. అదేకాక ఏదైనా గ్రామం పేరు వెతికినా దొరకకుంటే ప్రక్కనే ఉన్న మండలం(వివరాలు మనం వ్రాస్తున్న గ్రామానికి చెందిన మండలం పేజీలో ఉంటాయి) పేజీ తెరిస్తే ఆ మండలంలో మనకి కావాల్సిన గ్రామం పేరు దాదాపుగా చిన్న ఉచ్ఛారణ భేదంతో దొరికేస్తుంది. ఒకే జిల్లాలో ఉన్న నాలుగు మండలాలలో అదే పేరుతో గ్రామాలుంటే మండలం పేజీ గమనించాలి. మండలం పేజీలో ఆ మండలం జిల్లాలో ఎక్కడ ఉందన్న విషయం అత్యంత వివరంగా మ్యాపులో ఉండడం చాలా ఉపకరిస్తుంది. యాత్రాచరిత్రకారుడు వీరాస్వామయ్య తాను విడిసిన గ్రామం నుంచి మరో మజిలీ ఎంత దూరమో సవివరం వ్రాశారు గనుక మండలం పేజీలు చూస్తే మాపుల ఆధారంగా ఆయన ఎంతదూరం ప్రయాణించారో, రెండో మజిలీ ఏ గ్రామమో తెలిసిపోతుంది.
ఔత్సాహికులు
[మార్చు]ఎవరైనా ఔత్సాహికులు ఈ కృషిలో పాల్గొనదలిస్తే కింద సంతకం చేయండి. ఐతే సంతకాలు చేయనంతమాత్రాన ఈ కృషి చేయరాదనేమీ లేదన్న విషయం గుర్తించగలరు.
- పవన్ సంతోష్ (చర్చ) 13:15, 29 నవంబర్ 2014 (UTC)