వికీపీడియా:వాడుకరి పేజీ
తిరునగరి శరత్ చంద్ర ప్రముఖ తెలుగుకవి, సినీగీతరచయిత. గేయాలు, వచనకవితలు, గజళ్ళు, రుబాయీలు, సినిమాపాటలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేశాడు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు
జననం[మార్చు]
తిరునగరి శరత్ చంద్ర జననం 1993 మే 28 కోరుట్ల, జగిత్యాల
నివాస ప్రాంతం:హైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లు: శరత్
వృత్తి: కవి, సినీగీతరచయిత
సాహితీవేత్త
బాల్యం - విద్యాభ్యాసం[మార్చు]
తిరునగరి శరత్ చంద్ర 1993, మే 28 న (అనగా శ్రీముఖ సంవత్సరం వైశాఖమాసం సప్తమి రోజు) న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలో జన్మించాడు. తండ్రి తిరునగరి శ్రీనివాసస్వామి ప్రముఖకవి. తల్లి మాధవి గృహిణి. శరత్ చంద్ర కోరుట్లలోని ఆదర్శవిద్యాలయంలో ప్రాథమిక విద్య, గౌతమ్ ఉన్నతపాఠశాల, శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో హైస్కూల్ విద్య, శ్రీవిద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్క్రతాంధ్ర కళాశాలలో B.A.L ఓరియంటల్ తెలుగు పూర్తి చేశాడు.
ఆ తరువాత హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశాడు. ఎం.ఏ పరీక్షల్లో ప్రథమస్థానం పొంది స్వర్ణపతకాన్ని సాధించాడు. యు.జి.సి వారి జాతీయ అర్హత పరీక్షల్లో (NET) అర్హతను సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఆచార్య సూర్యాధనంజయ్ గారి పర్యవేక్షణలో 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే అంశంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. బాల్యంనుంచే తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కనబరిచాడు. సినిమాపాటల్లోని సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యాడు.
ఉద్యోగం[మార్చు]
తిరునగరి శరత్ చంద్ర 2015 నుంచి 2017 వరకు కోరుట్లలోని ప్రభుత్వ డిగ్రీ & పి.జి. కళాశాలలో ఎం.ఏ విద్యార్థులకు పాఠాలు బోధించాడు. 2017 లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా (అతిథి తెలుగు అధ్యాపకునిగా) పనిచేశాడు. 2018 నుంచి రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా (అతిథి తెలుగు అధ్యాపకునిగా) పనిచేస్తున్నాడు.
రచనాప్రస్థానం[మార్చు]
శరత్ చంద్ర కలం నుండి గేయాలు, వచనకవితలు, గజళ్ళు,రుబాయీలు, సాహిత్యవ్యాసాలు, మినీకవితలు, సినిమాపాటలు మొదలైనవి వెలువడ్డాయి. 7 వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పటినుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. తన తండ్రి తిరునగరి శ్రీనివాసస్వామి గారు ప్రముఖకవి, సినీగేయరచయిత . తండ్రి వెళ్ళే సాహిత్యకార్యక్రమాలకు, కవిసమ్మేళనాలకు తండ్రితో పాటు శరత్ చంద్ర కూడా వెళ్ళేవాడు.
అలా ప్రముఖకవులందరిని చాలా దగ్గరినుంచి చూడడం, వారి ప్రసంగాలు, కవితాగానాలు వినడం జరిగేది. 'చిరుచిరునగవుల కవితా తలపుల పిలిచిన పిలుపుల చూసిన చూపుల అంటూ గేయఛందస్సులో తొలికవిత రాసి తండ్రికి చూపించాడు. తండ్రి మెచ్చుకుని కవిత్వ మెళకువలు నేర్పించాడు. అలా శరత్ చంద్ర కవితాప్రస్థానం ప్రారంభమైంది. 10 వ తరగతిలో ఉండగానే రాష్ట్రస్థాయి పద్యపఠనపోటీలో ప్రథమ బహుమతి పొందాడు. ప్రాచీన, ఆధునిక మహాకవులు రాసిన 200 పద్యాలను కంఠతాచెప్పాడు. డిగ్రీ పూర్తయ్యే వరకు దాదాపు 1200 పద్యాలను కంఠస్థం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఎం.ఏ లో చేరాక శరత్ చంద్ర సాహిత్యప్రస్థానం కొత్త మలుపు తిరిగింది. గేయకవిత్వంతో పాటు సరికొత్త పోకడలతో అద్భుతమైన వచనకవిత్వమూ రాశాడు. గజళ్ళు, రుబాయీలు, పరిశోధనాత్మకమైన వ్యాసాలు రాశాడు. దాదాపు 300 కి పైగా గేయకవితలు, 600 కి పైగా వచనకవితలు, 100 గజళ్ళు, 200 రుబాయీలు రచించాడు. 100 కి పైగా పరిశోధనాత్మకమైన వ్యాసాలు రాశాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 80 కి పైగా పత్రసమర్పణలు చేశాడు. పలుపత్రికల్లో కొన్ని వందల కవితలు ప్రచురితమయ్యాయి.
నమస్తే తెలంగాణ ఆదివారం బతుకమ్మ సంచికలో 'తెలంగాణ సినిమాకవులు' పేరిట, నవతెలంగాణ ఆదివారం సోపతి సంచికలో 'పాటలముచ్చట' పేరిట కొంతకాలం ప్రత్యేక శీర్షికలను (కాలమ్స్) నిర్వహించాడు. నిరంతరం సాహిత్యాధ్యయనం చేస్తూ కవితాసృజన చేస్తున్నాడు. దాశరథి, సినారె, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్రశర్మ, కె.శివారెడ్డి మొ. కవుల ప్రభావం తనపై ఉందని చెబుతుంటాడు. లెక్కలేనన్ని సభల్లో, కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా పనిచేశాడు. పిహెచ్.డి విద్యార్థిగా ఉన్నప్పుడే 2019 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మేరకు గౌరవ అతిథిగా వెళ్ళి 'దాశరథి సినిమాపాటల్లో విశిష్టత' గూర్చి ప్రసంగించాడు. ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండి మరో విశ్వవిద్యాలయానికి అతిథిగా వెళ్ళే అవకాశం రావడం నిజంగా అదృష్టమే.
తన గేయకవితల్లో కొన్నింటిని 'అక్షరశిఖరం' పేరిట 2019 లో పుస్తకంగా ప్రచురించాడు. ప్రముఖ సినీగేయరచయిత, జాతీయ అవార్డు గ్రహీత డా.సుద్దాల అశోక్ తేజ ఆ కవితాసంపుటిని ఆవిష్కరించారు. అదే సభపై తన తండ్రి తిరునగరి శ్రీనివాసస్వామి గారి 'వెన్నెలవాన' పాటలసంపుటి కూడా ఆవిష్కరించబడడం మరో విశేషం. తండ్రీకొడుకుల పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరించబడడం ప్రత్యేకమైన విషయం. ఆ తరువాత 'చైతన్యలహరి'(తెలుగు గజళ్ళు), 'విశ్వవీణ'(తెలుగు రుబాయీలు) పుస్తకాలను ప్రచురించాడు. ప్రస్తుతం మూడు వచనకవితాసంపుటాలు ముద్రణలో ఉన్నాయి.
సినీప్రస్థానం[మార్చు]
తిరునగరి శరత్ చంద్ర 2021 లో 'ఒక్కడే' సినిమాలో 'సవాలు నిన్నుతాకి చుట్టు ముట్టె చూడరా' అనే పాటతో గీతరచయితగా ప్రస్థానం మొదలుపెట్టాడు. అదే సినిమాలో 'అన్యాయాన్ని చీల్చీ ..దుర్మార్గాన్ని కూల్చీ..' అనే పాటను కూడా రాశాడు. ఆ తరువాత తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'నమస్తే సేట్ జీ', విక్రాంత్ దర్శకత్వంలో వచ్చిన 'దక్ష' సినిమాలకు పాటలు రాశాడు. ఇంకా.. 'మోనార్క్', 'కలవరమాయే మదిలో', 'అంతిమసమరం', 'కాలమేగా కరిగింది?', 'రుగ్వేదం', 'సాగేకథనం', 'రాబిట్', 'వారధి', 'అంతామంచికే', 'పులగం పాండ్రే', 'దొండ్రాగావ్' మొ.సినిమాలకు పాటలు రాశాడు. దాదాపు 20 సినిమాల్లో 50 వరకు పాటలు రాశాడు. కొన్ని లఘుచిత్రాలకు, వెబ్ సిరీస్ లకు కూడా పాటలు రాశాడు.
ఆయన రాసిన 'అలలవోలె అడుగులెత్తి సాగిపోనీ నీ గమనం' అనే పాటను ప్రసిద్ధగాయని, గానకోకిల, పద్మభూషణ్ డా.ఎస్.జానకి గారు పాడడం గొప్ప విషయం.
అనువాదాలు[మార్చు]
శరత్ చంద్ర రాసిన కవితలెన్నో వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని కవితలను శాంతకుమారి గారు కన్నడంలోకి, డా.నాగపురి సంతోష్ గారు మరాఠీలోకి, అమోహగారు ఉర్దూలోకి, ఎన్.విజయ్ గారు తమిళంలోకి అనువదించారు. శరత్ చంద్ర రాసిన వాటిలో 50 కవితలను ఇనుగుర్తి లక్ష్మణాచారి 'Versrs Of The World' పేరిట ఇంగ్లీష్ లోకి అనువదించాడు.
పురస్కారాలు:[మార్చు]
1) ఎం.ఏ లో యూనివర్సిటి ఫస్ట్ వచ్చినందుకు 2019 లో అప్పటి రాష్ట్రగవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ గారి చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
2) రాష్ట్రస్థాయి పద్యపఠనపోటీలో ప్రథమబహుమతి, హైదరాబాద్ (2008)
3) రాష్ట్రస్థాయి ఉత్తమకవితా పురస్కారం, హైదరాబాద్ (2015)
4) 'చెలిమి' సాహితీ పురస్కారం, విజయవాడ (2016)
5) రాష్ట్రస్థాయి సినారె యువకవి పురస్కారం, హైదరాబాద్(2019)
6) యువభారతి కవితాపురస్కారం, హైదరాబాద్ (2019)
7) భిలాయివాణి కవితాపురస్కారం, భిలాయి (2019)
8) ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఎక్సెలెన్సి అవార్డు, హైదరాబాద్ (2019)
9) బి.ఎస్.రాములు స్ఫూర్తి పురస్కారం, హైదరాబాద్ (2019) మొ.పురస్కారాలు లభించాయి.
ప్రశంసలు[మార్చు]
1) శ్రీ తిరునగరి శరత్ చంద్ర కమనీయ భావుకత ఉన్న రమణీయ తెలుగుకవి.
--డా.సి.నారాయణరెడ్డి
2) ఉత్తమకవికి ఉండవలసిన దార్శనికత, భావాభివ్యక్తి, ప్రయోజనాత్మకమైన తాత్త్వికత పుష్కలంగా పెంపొందే లక్షణాలన్నీ ఈ కవికి ఉన్నాయి.
--- డా.జె.బాపురెడ్డి
3) శరత్ చంద్రుడు భవిష్యత్తుకు మరో సూర్యుడు.
---డా.సుద్దాల అశోక్ తేజ
4) డా.దాశరథిగారు, డా.సి.నారాయణరెడ్డి గారు, డా.తిరుమల శ్రీనివాసాచార్యగారు ఈ ఛందస్సులో చక్కని కవితారచనలు చేసి తెలుగువారి హృదయాలను దోచుకున్నారు. అదే మార్గంలో శరచ్చంద్ర కూడా పయనిస్తూ కవితారచన చేయడం ముదావహం.(విశ్వవీణ రుబాయీల సంపుటి గురించి)
--- డా.రవ్వా శ్రీహరి
5) గేయాలు,గజళ్ళు, వచనకవితలు, వ్యాసాలతో ఒక ఉప్పెనలా ఎగసివస్తున్న యువసాహితీతరంగం ఈ శరచ్చంద్రుడు. ఇప్పటికే తన ఉనికిని చాటుకున్న ఈ యువకిశోరం రాబోయే కాలంలో మన తెలుగు సాహిత్యమ్మీద తన ముద్రను ప్రగాఢంగా వేస్తాడనే నమ్మిక కుదురుస్తున్నాడు.
---డా.బేతవోలు రామబ్రహ్మం
6) భావసంపదతో పాటు భాషాసంపద శ్రీ శరత్ చంద్రకు పుష్కలంగా ఉంది.
-- 'పద్మశ్రీ' ఆచార్య కొలకలూరి ఇనాక్
7) శరత్ చేతిలో మాటలను బంగారం చేసే రసవాద విద్య ఉంది.
-- డా.ఎన్.గోపి
8) జాతి ఏకాత్మభావనలో నడవాలి. అప్పుడే సంఘటితశక్తి ఏర్పడుతుంది. రాజకీయం కాదు రాజనీతి ముఖ్యమన్న సందేశమందించాడు యువకవి శరత్ చంద్ర.
---డా.కసిరెడ్డి వేంకటరెడ్డి
9) చిరంజీవి శరత్ చంద్ర సత్తా ఉన్న కవి. నేటి యువకవితకు కొత్త పుంతలు దిద్దిన ధీశాలి. అతని కవిత్వంలో జాతి ఉన్నతి, నీతిరీతి, పురోగామి మానవస్వభావానికి స్వాగతగీతులు ఉన్నాయి.
-- డా.రావికంటి వసునందన్
10) అప్పుడే ఈ కవికిశోరానికి 'మండేగుండెల ఎండిన బ్రతుకుల ఆవేదనలే వినబడుతున్నా'యంటే ఇతడొక శ్రీశ్రీ అవుతాడేమాననిపిస్తుంది. అది కాక 'పూసిన పువ్వుల విరిసిన మనసుల ఆరాటాలే కనబడుతున్నా'యంటే ఇతడొక కృష్ణశాస్త్రి అవుతాడేమోననిపిస్తుంది. ఏది ఏమైనా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు కావడం మాత్రం నిజం.
--- డా.మసన చెన్నప్ప
11) తండ్రి డాక్టరైతే కొడుకు డాక్టరు కాగలడు. తండ్రి ఇంజనీరైతే కొడుకు ఇంజనీరు కావచ్చు. తండ్రి రాజకీయనాయకుడైతే కొడుకు కూడా రాజకీయనాయకుడు కావడం సర్వసాధారణం. కాని తండ్రి కవి అయితే కొడుకు కావడం మాత్రం పూర్వజన్మ సుకృతమే. అలా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువకవి శరత్ చంద్ర.
--- డా.సూర్యాధనంజయ్
12) అనేక రకాలైన భావాలతో ప్రకృతిలో ఒదిగిపోయే నూతన భావుకుడిగా, సమాజంలో జరిగే అల్లకల్లోలాలకు ఒక ప్రాశ్నికుడిలా, పెద్దలమార్గాలను అనుసరిస్తూ వారి ప్రేరణకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న కవికిశోరమీ శరత్ చంద్ర.
--- డా.సాగి కమలాకరశర్మ
13) గేయకవితను ఓ ప్రవాహంలా ఉరకలెత్తిస్తూ యువకవుల్లో తనదైన ముద్రను పదిలపరుచుకున్నాడు శరత్ చంద్ర.
--- 'అభ్యుదయకవి' అదృష్టదీపక్
14) శరత్ పుట్టుకవి. పుట్టతేనెలా ఉంటుంది ఆయన కవిత్వం. వ్యాఖ్యానాలు అవసరం లేని సరళసుందరమైన కవితాశైలి శరత్ చంద్రది. వస్తునవ్యత, అభివ్యక్తి నవ్యత శరత్ చంద్ర కవితలోని విశిష్టగుణాలు.
--- డా.తిరునగరి
15) కవి శరత్ చంద్ర గొప్ప భావుకుడు. గేయాన్ని నడిపించడం బాగా తెలిసినవాడు.
---డా.పత్తిపాక మోహన్
16) ఏ వస్తువునైనా కవిత్వంగా మలచగల నేర్పు శరత్ చంద్రకు పుష్కలంగా ఉంది. అతని కవితలు మనల్ని చైతన్యపరుస్తాయి. ఒక రకమైన తాదాత్మ్మంలో ఓలలాడిస్తాయి.
--- మౌనశ్రీమల్లిక్
కొన్ని కవితాపంక్తులు[మార్చు]
1) చిరుగాలుల వీణియపై సరిగమలే పలికిస్తా సిరివెన్నెల వన్నెలపై రంగులనే చిలికిస్తా
2) జ్వాలలతో ఈ వేళ పోటీపడతాను రాళ్ళగుండెలందు నేను దీపం పెడతాను పయనంలోనే ప్రతిభ రుజువవుతుందంటే గమ్యాన్ని కొద్దిసేపు వెనక్కి నెడతాను
3) ఈ చీకటి ఏం చేస్తుంది? నా కవితలవాకిటిలో దీపమై కూర్చుంటుంది.
4) అంతుపట్టని ప్రశ్నలనీడల్లో నువు ముడుచుకుపోయిన క్షణాలకు జిడ్డుముఖాలు తిరిగే అసహాయపు చీకటి వాకిట్లో నిన్ను నమిలేసిన గడ్డుకాలపు రోజులకు ఇంకా..తెరపడిపోనేలేదు..
5) నీటిచుక్కలుగా రాలిపడుతున్న చీకటికి కాసింతరంగు పూద్దామని ఓ వెలుతురుపిట్ట ఆరాటపడుతోంది.
వాస్తవానికి, అవాస్తవానికి మధ్య అడ్డుకట్టలా నిలబడ్డ కాలానికి ఓ పిచ్చిస్వప్నం రెక్కలు తొడుగుతోంది.
6) గతుకులదారుల్లో ఎంత నడిచినా ఎండదెబ్బలకు అరికాళ్ళు రక్తమోడ్చినా జాలిపడని కాలంపై కొంచెమైనా విసుగుపడక సూరీడుతో కలిసి తిరిగే సోపతిగాళ్ళ గురించి కొన్ని వాక్యాలు రాయాలని ఉంది.
మూలాలు:[మార్చు]
1) ది లిరికల్ హరికేన్ - నవతెలంగాణ ఆదివారం 'జోష్' శరత్ చంద్ర ఇంటర్వ్యూ..
2) జాతికి గీతిక పాడిన యువకవి శరత్ చంద్ర