వికీపీడియా:స్థూలదృష్టి ప్రశ్నలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:Overview FAQ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...


స్థూలంగా.. (తరచూ అడిగే ప్రశ్నలు) :

వికీ అంటే ఏమిటి?[మార్చు]

వికీ అనేది ఒకదానికొకటి అనుబంధమున్న వెబ్‌ పేజీల సమూహం . వీటన్నిటినీ ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు, మార్పు చేర్పులు చెయ్యవచ్చు.(collaborative software). ఇది ఆసక్తికరంగానూ, సరదాగానూ అనిపిస్తోంది. కానీ, దీని వలన సమాచారానికి భద్రత కరవై, తప్పులతో కూడి పనికిరాకుండా పోవచ్చు. వార్డ్‌ కన్నింగ్‌హామ్‌ ఈ భావాన్నీ, సాఫ్ట్‌వేర్‌ ను కనుక్కున్నారు. ఈ పేజీలో పైనున్న "మార్చు" అనే లింకును నొక్కి, ఈ పేజీని సైతం దిద్దుబాటు చెయ్యవచ్చు లెదా కుడి పక్కనున్న "[edit]" అనే లింకును నొక్కి ఏదో ఒక విభాగాన్ని మాత్రమే దిద్దుబాటు చెయ్యవచ్చు! ఈ పేజీలో మార్పులు చేర్పులు చెయ్యటానికి మీకేమీ కనిపించకపోతే, అసలిది ఎలా పనిచేస్తుందో చూడాటానికి ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి. ఇంకా చూడండి: దిద్దుబాటు ప్రశ్నలు.

వికీపీడియా అంటే ఏమిటి?[మార్చు]

వికీపీడియా అనేది ఆన్‌లైన్లో స్వేచ్ఛగా ఉచితంగా లభించే విజ్ఞాన సర్వస్వం. దీనిలో మీరూ సమాచారాన్ని చేర్చవచ్చు, మార్పుచేర్పులు చెయ్యవచ్చు. "అత్యున్నత ప్రమాణాలతో, స్వేచ్ఛగా, ఉచితంగా లభించే బహు భాషా విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేసి భూమ్మీద నివసించే ప్రతీ ఒక్కరికీ వారి భాషలోనే అందించే ప్రయత్నం" అని వికీపీడియా స్థాపకుడు జిమ్మీ వేల్స్ వికీపీడియా గురించి చెప్పాడు. విజ్ఞాన సముపార్జన చెయ్యాలనుకునే వారికి దాన్ని అందించేందుకే వికీపీడియా ఉంది. మరింత సమాచారం కొరకు వికీపీడియా:గురించి చూడండి.

దీన్ని వికీపీడియా అని ఎందుకంటారు?[మార్చు]

వికీపీడియా అనేది "వికివికి" మరియు "ఎన్‌సైక్లోపీడియా" అనే పదాల కలయికతో పుట్టిన పదం.

వికీపీడియా లక్ష్యం ఏమిటి?[మార్చు]

విస్తృతి లోనూ, లోతు లోను కూడ అత్యంత పెద్దదైన ఒక ఉచిత, నమ్మదగ్గ విజ్ఞాన సర్వస్వాన్ని— తయారుచెయ్యడమే. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు!

వికీపీడియా ఎవరిది?[మార్చు]

ఈ వెబ్‌సైటు ఎవరిది? వికీపీడియా సాంకేతిక ఫ్రేమ్‌వర్కును లాభాపేక్ష లేని మాతృ సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషను నిర్వహిస్తుంది. వికీపీడియా సోదర ప్రాజెక్టులైన విక్షనరీ (వికీ నిఘంటువు), వికీబుక్స్‌ (ఉచిత పాఠ్యపుస్తకాలు) మొదలైన వాటిని కూడా నిర్వహిస్తుంది. సంబంధిత డోమైన్‌ పేరులన్నిటి స్వంతదారు కూడా. ఇదివరలో, ఈ సైటును జిమ్మీ వేల్స్‌ కు చెందిన బొమిస్‌ Inc అనే కంపెనీ సర్వర్లలో హోస్టింగు చేసేవారు. 2003 జూన్‌ 20 న వికీమీడియా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన తరువాత, డొమైన్‌ పేర్లన్నిటి స్వామిత్వం ఫౌండేషన్‌కు బదిలీ అయ్యాయి. జిమ్మీ వేల్స్‌ ప్రవచించిన సిధ్ధాంతాల మార్గదర్శకత్వంలో వికీపీడియనుల సముదాయం ప్రస్తుతం ఈ సైటును నిర్వహిస్తోంది. నిష్పాక్షిక దృక్పథం ఆ సిద్ధాంతాలకు ఒక ఉదాహరణ.
వికీపీడియా వ్యాసాలు ఎవరి స్వంతం? ఈ సైటులో ప్రచురించిన వ్యాసాలన్నీ అనేక మంది రచయితలు రాసినవి. వాళ్ళంతా తమ దిద్దుబాట్లను (దిద్దుబాట్లు చేసేటపుడే) సిసి-బై-ఎస్ఎ 3.0 లైసెన్సు, జిఎఫ్డిఎల్(GFDL) లైసెన్సులకు లోబడి వెలువరిస్తామని అంగీకరించారు. కాబట్టి ఈ వ్యాసాలన్నీ ఉచితం. వీటిని ఆ లైసెన్సులకు లోబడి ఉచితంగా వాడుకోవచ్చు కూడా. వికీపీడియా వ్యాసాలను ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడం కొరకు కాపీ హక్కులు, పాఠకుల ప్రశ్నలు చూడండి.
చట్టరీత్యా, దిద్దుబాట్లు చేసినవారే ఆయా దిద్దుబాట్లకు స్వంతదార్లు. వాళ్ళు ఈ లైసెన్సుకు లోబడి ఉండరు. తమకు చెందిన కంటెంటును తమకిష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. అయితే, అనేక మంది రచయితలు సమర్పించిన మీడియాను లైసెన్సుకు లోబడి కాక, వేరేవిధంగా వాడుకో దలిస్తే ఆయా రచయితలందరి నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది.

వికీపీడియా లోని వ్యాసాలకు బాధ్యులెవరు?[మార్చు]

మీరే! దిద్దుబాట్లు చెయ్యడమనేది ఒక సమష్టి ప్రయత్నం. లక్షలాది మంది ఈ ప్రాజెక్టు లోని వివిధ భాగాలలో సమాచారాన్ని సమర్పిస్తున్నారు. మీతో సహా, ఎవరైనా ఈ పని చెయ్యవచ్చు. దీనికి పేజీని ఎలా దిద్దుబాటు చెయ్యాలనేది, ఇతరులతో పంచుకోడానికి కాస్త విజ్ఞానం తెలిస్తే చాలు. ఈ విజ్ఞాన సర్వస్వం వినియోగదారులకు కొంత స్వేఛ్చనిస్తుంది.
ఏదైనా పేజీలో మార్పులు ఎవరెవరు చేసారనేది పేజీకి పైన ఉండే "చరిత్ర" అనే ట్యాబును నొక్కి తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న కూర్పులో ఏమైనా తప్పులున్నట్లు మీరు గుర్తిస్తే, వాటిని సరిదిద్దటానికి చొరవగా ముందుకు రండి. ఈ విజ్ఞాన సర్వస్వపు విశ్వసనీయతను కాపాడడంలో ఇది ఒక మౌలికమైన సమీక్షా వ్యవస్థ. తత్ఫలితంగా, అంతర్జాలంలో అత్యంత విస్తృతమైన సమాచారాన్ని అందించే గ్రంథాలయాల్లో వికీపీడియా ఒకటైంది.
ఏదైనా వ్యాసంలో పదాలు గానీ, వాక్యాలు గానీ మీకు అస్పష్టంగా, సందిగ్ధంగా అనిపిస్తే, ఆ భాగాన్ని ఉదహరిస్తూ సంబంధిత చర్చా పేజీ లో ప్రశ్నించండి. దీని ద్వారా తప్పులు, సందిగ్ధత, సందేహాస్పదమైనవీ, తప్పు అర్ధం వచ్చే వాటినీ సత్వరమే తీసివేసే వీలు కలుగుతుంది. పైగా దీన్ని సముదాయం హర్షిస్తుంది కూడా.

ప్రాజెక్టును ఎలా సంప్రదించాలి?[మార్చు]

ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు పాల్గొనే ప్రాజెక్టులో ఒకే సప్రదింపుల కేంద్రం ఉండదు. ప్రాజెక్టు సంబంధిత సందేహాల నివృత్తికై మాట్లాడడానికి చాల మెయిలింగు లిస్టులు ఉన్నాయి. meta:మెయిలింగు జాబితాలు పేజీని చూడండి. ప్రాజెక్టేతర విషయాల కొరకు ఫౌండేషన్‌ మైలింగు జాబితాను, మెటా వికీనీ చూడండి. బహిరంగంగా సంప్రదించడానికి మీరు ఇష్టపడకపోతే, ఫౌండేషన్‌ డైరెక్టర్లను board@wikimedia.org లో సంప్రదించవచ్చు. ఫలానా సభ్యునితో సంభాషించాలంటే ఆ సభ్యుని వ్యక్తిగత చర్చా పేజీలో సందేశం రాయండి; వ్యక్తిగత పేజీల జాబితా (మీ దానితో సహా) వికీపీడియనుల జాబితాలో చూడవచ్చు. చాలా మంది వికీపీడియనులు తమ ఈ-మెయిలైడీని నమోదు చేసుకున్నారు. వారి వాడుకరి పేజీకి వెళ్ళి, పరికరాల పెట్టెలో ఉండే "ఈ వాడుకరికి ఈమెయిలు పంపు" లింకును నొక్కి ఈమెయిలు‌ పంపవచ్చు. ప్రతీ సభ్యునికీ, ప్రతీ వ్యాసానికీ సంబంధిత చర్చా పేజీ ఉంటుంది. సభ్యునికి సందేశం ఇవ్వటానికి, వ్యాసంపై వ్యాఖ్యానం రాయడానికీ ఈ పేజీ మీకు అవకాశమిస్తుంది. చర్చ ట్యాబును నొక్కి చర్చా పేజీకి వెళ్ళవచ్చు.

నుపీడియా అంటే ఏమిటి?[మార్చు]

నుపీడియా అనేది ఇదివరకటి విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టు. ప్రస్తుతం అది పనిచేయడంలేదు; en:Wikipedia:Nupedia and Wikipedia చూడండి.

ఖాతా ప్రారంభించడం తప్పనిసరా? అనామకంగా వ్యాసాలను సరిదిద్దలేనా?[మార్చు]

వికీపీడియాలో ఖాతా ఉన్న ఎడిటర్లు చాలా సౌకర్యాలు అనుభవిస్తారు. మంచి నాణ్యమైన పనికి లభించే గుర్తింపు, కీర్తి వాటిల్లో ఒకటి. వ్యాస వివాదాలను పరిష్కరించడంలో చక్కటి చరిత్ర వున్న వికీపీడియన్ల మాటకు విలువ వుంటుంది. పైగా, ఊరూ పేరూ లేని వారితో కలిసి పని చేయడం వికీపీడియన్లకు ఇబ్బందిగా వుంటుంది. దీనర్ధం వికీపీడియాలో అధికార సోపానం అనేది ఒకటేదో ఉందని కాదు. కానీ ఇక్కడ నిర్వాహక హక్కులున్న ఎడిటర్లున్నారు (వికీపీడియా:నిర్వాహకులు చూడండి) - వీళ్ళని సముదాయం ఎంపిక చేసింది. కాస్త అరాచకంతో నైనా సరే, వికీపీడియాలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యడమే వికీపీడియన్ల లక్ష్యం.
ఒక రకంగా చెప్పలంటే నమోదై, లాగినై ఉన్న వికీపీడియన్లకే ఎక్కువ గోప్యత ఉంటుంది: ఎందుకంటే లాగిన్‌ అవని సభ్యుని ఐపి అడ్రసును ఎవరైనా చూడవచ్చు, అదే లాగిన్‌ అయినవారి ఐపి అడ్రసును సర్వరు నిర్వాహకులు మాత్రమే చూడగలరు. కాబట్టి, గోప్యత, అనామకత్వం గురించి అలోచించేట్లయితే మీరు లాగిన్‌ అయితేనే మంచిది.
ఏదేమైనా, మీరు చీకట్లోనే ఉండాలని అనుకుంటే, లాగిన్‌ కాకుండానే దిద్దుబాట్లు చెయ్యవచ్చు. ఎంతో మంది ఈ పధ్దతినే ఎంచుకుని విలువైన పనులు చేశారు.

సమాచారం సరి యైనదే అని మీరు ఎలా తెలుసుకుంటారు?[మార్చు]

ఎవరైనా, ఏ వ్యాసాన్నైనా దిద్దవచ్చు కాబట్టి, పక్షపాత పూరితమైన, కాలదోషం పట్టిన లేక తప్పుడు సమాచారాన్ని ప్రచురించే అవకాశం ఉంది. కానీ, ఎంతో మంది ఇటీవలి మార్పులు పేజీలో ఈ వ్యాసాలను చదువుతూ, గమనిస్తూ ఉంటారు కాబట్టి, తప్పుడు సమాచారాన్ని త్వరగానే సరిదిద్దుతారు. ఈ విధంగా, రోజురోజుకూ పెరుగుతున్న సభ్యుల కారణంగా స్థూలంగా విజ్ఞాన సర్వస్వపు ప్రామాణికత మెరుగు పడుతూ ఉంది. వ్యాసాల్ని సరిదిద్దటానికీ, మీ విజ్ఞానాన్ని పంచడానికీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

X అనే సైటు వికీపీడియా కాపీ హక్కులను అతిక్రమిస్తుందనిపిస్తోంది. మీకీ సంగతి తెలుసా?[మార్చు]

వాళ్ళు హక్కులను అతిక్రమించి వుండక పోవచ్చు. గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్స్ ను పాటించినంత కాలం వికీపీడియా లోని సమాచారాన్ని ఎవరైనా వాడేసుకోవచ్చు. 100 కు పైగా సైట్లు వికీపీడియా లోని సమాచారాన్ని వాడేసుకోవడాన్ని గమనించాం. en:Wikipedia:Mirrors and forks లో ఈ సైట్ల వర్గీకరణను చూడవచ్చు.

వికీపీడియా ఏ సాఫ్ట్‌ వేర్‌ పై నడుస్తుంది?[మార్చు]

వికీపీడియా:మీడియావికీ చూడండి