విలియం కెరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలియం కెరే
పుట్టిన తేదీ, స్థలం17 August 1761
మరణం9 June 1834
వృత్తినాటక రచయిత, కవి
జాతీయతఇంగ్లీష్
కాలం1761–1834

విలియం క్యారీ (English: William Carey; ఆగష్టు 17, 1761 - జూన్ 9, 1834) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి.[1] అతను ఆంగ్లంలోకి రామాయణాన్ని అనువదించాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

విలియం క్యారీ 1761 ఆగష్టు 17 న ఇంగ్లాడులో జన్మించాడు. క్యారీ మొదట వృత్తిరీత్యా బూట్లు తయారుచేసేవాడు. క్రైస్తవ మతస్థులు కానివారికి క్రైస్తవ చరిత్రను తెలియజెప్పడానికీ, క్రైస్తవ సువార్తను ప్రచారం చేయడానికి ఇంగ్లాండు లో 1792లో బాప్టిస్టు మిషనరీ సొసైటీ స్థాపించబడింది. ఆ మిషన్ తరపున బెంగాల్ లో పనిచేయడానికి ముందుకు వచ్చినవాడు క్యారీ.[3][4]

క్యారీ 1793లో కలకత్తా చేరుకున్నాడు. 1800 సం.లో కలకత్తా సమీపంలో శ్రీరామపూర్ లో బాప్టిష్టు మిషన్ నెలకొల్పబడినది. ఇది బెంగాలు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అని బెంగాలీ సాహిత్య చరిత్రకారుడు డా.సుకుమార్ సేన్ వ్రాశాడు. ఈ మిషన్ కు విలియం క్యారీ, జాషువా మర్ష్‌మన్మా, విలియం వార్డ్ మూర్తి త్రయం వంటివారు. మిషన్ తో పాటు ఒక ముద్రాక్షశాలను కూడా పెట్టారు. ఈ మిషన్ వారు పాఠశాలలు స్థాపించి భారతీయులకు ఇంగ్లీషునేర్పారు. ఒకప్పుడు సతీసహగమనము సంఖ్య అధికంకాగా ఆవిషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని ఆపమని కోరారు. రాజా రామమోహనరాయ్ సందర్శించగా క్యారీ ఆయనకు సగౌరవంగా స్వాగతం చెప్పి, బైబిల్ ప్రతిని ఆయనకు కానుకగా ఇచ్చాడు. స్కూల్ అభివృద్ధికోసం రామమోహనరాయ్ గారు కొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు.

క్యారీ 1801లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజీలో బెంగాలీ సంస్కృతశాఖల అధిపతిగా నియమితుడైనాడు. ఆ రోజులలో ఆ కాలేజీ వివిధ యూరప్ పండితులు, భారతీయ విద్వాంసులూ కలుసుకొనే విద్యాకేంద్రంగా వాసికెక్కింది. వారి సహకారంతో క్రైస్తవమత గ్రంధాలను ప్రధానమైన భారతీయ భాషలలోకి అనువదించాలని క్యారీ తలపెట్టాడు. ఆపనికి గాను ఎనిమిది మంది పండితులను నియమించాడు. వారిలో ముఖ్యుడు మృత్యుంజయ్ విద్యాలంకార్. ఆతని మాతృ భాష ఒరియా, మనిషి స్ఫురదృపి, సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్న విమర్శకుడు. వీరు 1808లో న్యూటెస్ట్ మెంట్ ను సంస్కృతంలో ముద్రించారు. 1883 నాటికల్లా బైబిలు 33 భాషలలోకి అనువదించబడినది. ఈ అనువాదాలు పూర్తి అయ్యే సమయానికి క్యారీ ఆ భాషలో చక్కని ప్రవేశం పొందాడు. అంతేకాక దాని అనువాద పాఠంలో తగు సవరణలు చేసి మెరుగులు తిద్దగల స్థితిలో ఉండేవాడు.

తన అనువాద పద్దతిని గూర్చి క్యారీ ఇట్లా చెప్పుకునేవాడు. 'నా అనువాద శైలినీ, వాక్య విన్యాసాన్ని నా పండితుడు పరిశీలించేవాడు. మూలమునకు వ్యత్యాసం లేకుండా సరిగా ఉన్నదాలేదా అని చూచేవాడు. నా అనువాదాన్ని నాకు చదివి వినిపించేవాడు. అతడు వత్తిపలుకు విధానమును నేను గమనించి, అతనికి పూర్తిగా అర్ధమైనదీ లేనిదీ గ్రహించగలిగేవాడిని. అతను సరిగా చదవలేకపోతే నా అనువాదమును గూర్చి శంక కలిగేది. బెంగాలీలో ఒక్క పుల్ స్టాప్ తప్ప, ఇతర విరామ స్థానములు గుర్తులేకుండటచేత ఎక్కడ నొక్కి చదవవలెనో పాఠకునికి అంత సులభమైన పనికాదు.'

అయితే క్యారీ ఇన్ని భాషల అనువాదాల అజమాయిషీ ఎట్లా చేసేవాడా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు ఆయన చెప్పిన సమాధానం: "సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ, పర్షియన్, పంజాబీ, తెలుగుభాషలతో పూర్తి పరిచయం కలిగిందంటే ఇతర దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించడం కష్టమేమీ కాదు."

క్యారీ మృత్యుంజయ్ విద్యాలంకార్ సహకారంతో బెంగాలీ భాషలో శిక్షణ పొందవలసిన సివిలియన్ ఉద్యోగుల ఉపయోగం కొరకై పాఠ్యపుస్తకాలు కూడా రచించాడు. సంస్కృతం, మరాఠీ, పంజాబీ భాషలకు వ్యాకరణములు నిర్మించాడు. అందులో సంస్కృత వ్యాకరణం ప్రసిద్ధికెక్కింది.

కెరేకు, ఆతని సహచరులకు ఇంగ్లాండులో మెప్పు లభించలేదు. హీనులు అని దూషించారు. క్రైస్తవ మత ప్రచారానికి పంపితే క్యారీ చేసింది బెంగాలులో విద్యావ్యాప్తి, భారతీయ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ. పూర్తిగా మత ప్రచారం చేయక, భాషలలో పడి తన కర్తవ్యం మరిచాడని విమర్శ. కాని సమకాలీక ఆంగ్లకవి రాబర్ట్ సౌథీ క్యారీను గూర్చి చెబుతూ "ప్రపంచంలోని రాజులూ ప్రభువులూ విశ్వవిద్యాలయాలూ ఇతర సంస్థలూ చేసిన, చేయ ప్రయత్నించిన దానికన్న క్యారీ క్రైస్తవ మతగ్రంధాలలోను జ్ఞానమును వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషిచేసాడు" అన్నాడు.

విలియం క్యారీ జీవిత చరిత్రను జె.సి.మార్ష్మన్ రచించాడు. 1885లో జార్జి స్మిత్ మరొక జీవిత చరిత్రను రచించాడు.

వనరులు[మార్చు]

  • 1982 భారతి మాస పత్రిక. వ్యాసము: డా.విలియం కెరే వ్యాసకర్త శ్రీ. డి.రామలింగం.

మూలాలు[మార్చు]

  1. Vishal Mangalwadi (1999), The Legacy of William Carey: A Model for the Transformation of a Culture, pp. 61–67, ISBN 978-1-58134-112-6
  2. Kopf, David (1969). British Orientalism and the Renaissance: The Dynamics of Indian Modernization 1778–1835. Calcutta: Firma K.L. Mukhopadhyay. pp. 70, 78.
  3. "Paulerspury: Pury End". The Carey Experience. Retrieved 9 July 2016.
  4. "William Carey's Historical Wall – Carey Road, Pury End, Northamptonshire, UK". UK Historical Markers. Waymarking.com. Retrieved 9 July 2016. Includes image of memorial stone