వి.కె. సరస్వత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ కుమార్ సరస్వత్
మాతృభాషలో పేరు विजय कुमार सारस्वत
జననం 1949
జాతీయత భారతీయుడు
చదువు B.E from Madhav Institute of Technology and Science, Gwalior
M.E from IISC, Bangalore
PhD from Osmania University, Hyderabad.[1]
వృత్తి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్
క్రియాశీలక సంవత్సరాలు 1972 – ఇప్పటిదాకా
గుర్తింపు తెచ్చినవి పృథ్వి క్షిపణులు
మతం హిందూ
పురస్కారాలు 1998 లో పద్మశ్రీ

విజయ్ కుమార్ సరస్వత్ భారతీయ శాస్త్రవేత్త. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసాడు. భారత రక్షణ మంత్రికి ముఖ్య  శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పనిచేసి,[2] 2013 మే 31 న రిటైరయ్యాడు.[3] ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యునిగా ఉన్నాడు. [4]

పృథ్వి క్షిపణిని అభివృద్ధి చెయ్యడంలోను, దాన్నిభారత సైన్యంలో మోహరించడం లోను డా. సరస్వత్ కీలకపాత్ర పోషించాడు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీపద్మభూషణ్ పురస్కారాలు పొందాడు.[5]

తొలి జీవితం[మార్చు]

డా. సరస్వత్ 1949 లో గ్వాలియర్లో  ఓ మార్వాడీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. గ్వాలియర్‌లోని మాధవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగు చదివాడు. బెంగళూరులోని భారత శాస్త్ర విజ్ఞాన సంస్థలో MTech చేసాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రొపల్షన్ ఇంజనీరింగులో డాక్టరేటు సాధించాడు. 

సరస్వత్ 1972 లో DRDO కు చెందిన DRDL లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొట్టమొదటి దేశీయ ద్రవ ఇంధన ఇంజను DEVIL అభివృద్ధిలో పాలుపంచుకున్నాడు. పృథ్వి ప్రాజెక్టు డైరెక్టరుగా, ఆ క్షిపణి రూపకల్పన నుండి మోహరింపు దాకా ఆయన నేతృత్వం వహించాడు. ఎ.పి.జె. అబ్దుల్ కలాం బృందంలోని కీలక శాస్త్రవేత్తల్లో ఆయన ఒకడు. కలాం యొక్క ప్రభావం సరస్వత్ మీద చాలా ఉందని భావిస్తారు.

ఆయన సారథ్యంలో ధనుష్ క్షిపణి రూపొందింది. కదులుతున్న నౌక నుండి ధనుష్ క్షిపణిని ప్రయోగించి, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించడం, భారత రక్షణ సామర్థ్యానికి కొత్త ఊపునిచ్చిందని భావిస్తారు. హైదరాబాదులోని రిసెర్చి సెంటర్ ఇమారత్ కు డైరెక్టరుగా పనిచేసాడు. 2005 నవంబరులో CCR&D(MSS) కు నేతృత్వం వహించాడు.

భారత బాలిస్టిక్ క్షిపణి నిరోధ వ్యవస్థను అభివృద్ధి చెయ్యడంలో సరస్వత్ నాయకత్వ పాత్ర పోషించాడు. పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD), ఎడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) లను అభివృద్ధి చెయ్యడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. క్షిపణి నిరోధక క్షిపణుల అభివృద్ధి, రాడార్లు, సాఫ్టువేరు, జాతీయ గగనతల రక్షణ వ్యవస్థల ఏకీకరణ ఈ కార్యక్రమంలో భాగం.  RCI డైరెక్టరుగా భవిష్యత్తు ఏవియానిక్స్ కు అవసరమైన మైక్రో, నానో సెన్సర్ల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసాడు. 

గౌరవాలు[మార్చు]

నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ లలో డా. సరస్వత్ సభ్యుడు. SAMEER యొక్క నిర్దేశక కమిటీలో సభ్యుడు. AICTE పరిశోధన బోర్డులోను, CSIR లాబ్స్ లోను, ఉస్మానియా విశ్వవిద్యాలయపు బోర్డ్ ఆఫ్ స్టడీస్ లోను, కంబషన్ ఇన్‌స్టిట్యూట్‌లోను, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (హైదరాబాద్ శాఖ) లోను సభ్యుడు. MTCR కారణంగా భారతదేశానికి అందకుండా  పోయిన అనేక కీలక క్షిపణి సాంకేతికతలను అభివృద్ధి చెయ్యడంలో డా. సరస్వత్ కృషి చేసాడు. తద్వారా క్షిపణి కార్యక్రమంలో, భారత్ స్వావలంబన సాధించేందుకు తోడ్పడ్డాడు. 

1987 లో DRDO వార్షిక శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నాడు. 1993 లో నేషనల్ ఏరోనాటికల్ ప్రైజు, 1996 లో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవార్డు, 1999 లో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు. 1998 లో పద్మశ్రీ పురస్కారం పొందాడు. 2013 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[6] 2010 జనవరిలో సూరత్ ఎన్‌ఐటి నుండి, 2012 డిసెంబరులో ఎస్‌ఆర్‌ఎమ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లను పొందాడు.

వివాదాలు[మార్చు]

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డా. సరస్వత్ నిర్ణయాలపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినపుడు[7] భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆయన ఆర్థిక అధికారాలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది.[8]  2013 లో DRDO డైరెక్టరు జనరలుగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది..[9]

మూలాలు[మార్చు]