Jump to content

వేంపల్లె షరీఫ్

వికీపీడియా నుండి
వేంపల్లె షరీఫ్
జననం
షేక్ మహమ్మద్ షరీఫ్

(1980-04-18) 1980 ఏప్రిల్ 18 (వయసు 44)
ఇతర పేర్లుషరీఫ్
వృత్తిటీవీ జర్నలిస్టు, రచయిత
పిల్లలుఒకపాప, ఒక బాబు
తల్లిదండ్రులు
  • రాజాసాహెబ్ (నిమ్మకాయల వ్యాపారి) (తండ్రి)
  • నూర్జహాన్ (తల్లి)

వేంపల్లె షరీఫ్ (జననం 1980 ఏప్రిల్ 18) తెలుగునాట ప్రముఖ కథా రచయిత. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు కడప జిల్లా వేంపల్లె గ్రామానికి చెందినవారు. ఇతని జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012కు ఎంపికైంది [1].ఈ పుస్తకంలోని కథలను కడప ఆల్ ఇండియా రేడియో వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.

జుమ్మా కథల సంపుటి పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్లంలోకి అనువాదం చేయబడింది. ఆ తరువాత, ఆయన తియ్యని చదువు, టోపి జబ్బార్, చోంగారోటీ వంటి పలు సంకలనాలను తీసుకువచ్చాడు. ఆయన రాసిన "ఆకుపచ్చ ముగ్గు' కథ 2024-2025 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిఏ, బీకాం, బిఎస్ సి, బిబిఏ కోర్సులు చదివే డిగ్రీ విద్యార్థులకు పాఠ్యంశంగా చేర్చింది. ఈ కథను జుమ్మా కథా సంకలనం నుంచి తీసుకున్నారు.[2][3] ఇక నవంబరు 2024లో వచ్చిన కథల పుస్తకం చారల పిల్లి కూడా పుస్తక ప్రియులను ఆకట్టుకుంటోంది.

జుమ్మా

[మార్చు]

జుమ్మాఁ ఒక కథల సంపుటి.[4] జుమ్మా అంటే ఉర్దూలో శుక్రవారం అని అర్థం. హైదరాబాద్ లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ హిందీ, ఇంగ్లీషు, మైథిలి, కొంకణి, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి.ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘిక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ పుస్తకం తృతీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.

జుమ్మాలో ఉన్న కథలు

1. జుమ్మా

2. అయ్యవారి చదువు

3. పర్దా

4. తెలుగోళ్లదేవుడు

5. ఆకుపచ్చముగ్గు

6. చాపరాయి

7. జీపొచ్చింది

8. రజాక్‌మియాసేద్యం

9. పలక -పండగ

10. దస్తగిరి చెట్టు

11. రూపాయి కోడిపిల్ల.

బాల్యం

[మార్చు]

వేంపల్లె షరీఫ్ అసలు పేరు షేక్ మహమ్మద్ షరీఫ్. తండ్రి రాజాసాహెబ్, తల్లి నూర్జహాన్. కడప జిల్లాలోని వేంపల్లెలో పేద ముస్లిం కుటుంబంలోపుట్టారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. బాల్యమంతా వేంపల్లెలోనే గడిచింది. పదవ తరగతి వరకు వీరి చదువు సజావుగా సాగింది. తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. మొదట చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. రాయలసీమ గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా మలుస్తున్నారు. 2003లో సొంత ఊరు వదిలేసి హైదరాబాదు చేరారు. హైదరాబాద్ వచ్చాక ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

విద్యాభ్యాసం

[మార్చు]

హైదరాబదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పిహెచ్ డి చేశారు. "టీవీ ప్రకటనల్లో సంస్కృతి'' అనే అంశంపై పరిశోధన చేశారు. అదే యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. "తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ' అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు. ఎం ఏ తెలుగు చేశారు. ఆల్ ఇండియా రేడియో నుంచి "వాణి సర్టిఫికెట్ కోర్సు' పూర్తి చేశారు.

రచనలు

[మార్చు]

1. జుమ్మా (2011)- కథల సంపుటి (జుమ్మా కథా సంకలనం ఇంగ్లీషులో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం కన్నడ భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)

2. తియ్యని చదువు (2017)- పిల్లల కథలు

3. టోపి జబ్బార్ (2017)- కథల సంపుటి

4. కథామినార్ (సహ సంపాదకత్వం) (2018) - నవ్యాంధ్ర ముస్లిం కథా సంకలనం

5. చోంగారోటీ (సంపాదకత్వం) (2020) - రాయలసీమ ముస్లిం కథా సంకలనం

6. తలుగు (2015) - ఏక కథాపుస్తకం - మనిషైనా, పశువైనా పరపీడన నుంచి విముక్తి కోరుకుంటే ఎలాంటి 'తలుగు'లనైనా ఇట్టే తెంచుకోవచ్చని చాటి చెప్పిన కథ

7. టీవీ ప్రకటనలు (2021) - పరిశోధనా రచన

తెలుగు టీవీ ప్రకటనల్లో భాషా సంస్కృతులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణగా వివరించిన పరిశోధనా పుస్తకం ఇది. తెలుగులో టీవీ ప్రకటనలకు స్క్రిప్టు ఎలా రాయాలి? అనువాదం ఎంత జాగ్రత్తగా చేయాలి? భావం ఎంత స్పష్టంగా ఉండాలి? సంస్కృతీపరమైన అంశాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాల మీద ఈ పరిశోధన సాగింది. రచయిత తన పిహెచ్ డి పరిశోధనలో భాగంగా ఈ పుస్తకం రాశారు. మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకంగా దీనిని విమర్శకులు ప్రశంసించారు.

8. యువ (Under 40) ( 2022) - తెలుగులో నలభై ఏళ్ల లోపు వయసున్న కథకుల కథా సంకలనం ఇది. తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రయత్నంగా ఈ సంకలనంగా గుర్తింపు పొందింది.

9. చారల పిల్లి (2024) - వర్తమాన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సంకలనంలో పదమూడు కథలు ఉన్నాయి. విజయవాడ ఆల్‌ఇండియా రేడియో నుంచి ఇందులోని కొన్ని కథలు వరుసగా సరీయలైజ్ అవగా, మరి కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన కథలలో చారల పిల్లి, బడే పీర్‌, మట్కా, బాబయ్య స్వామి దర్గా వంటివి ప్రముఖమైనవి.

ఇతర రంగాలు

[మార్చు]

వేంపల్లె షరీఫ్ రచయితగానే కాకుండా అప్పుడప్పుడు న్యూస్ రీడర్ గా కూడా టీవీల్లో కనిపిస్తారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్ ఎమ్ 101.9 లో ఆర్.జెగా వినిపిస్తారు. గతంలో వివిధ పత్రికల్లోనూ పనిచేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్యాకేంద్రం విద్యార్థులకోసం కొన్ని జర్నలిజం పాఠాలు రాశారు. చెప్పారు. సారంగ సాహిత్య వెబ్ మ్యాగజైన్లో 2012 నుంచి 2013 వరకు కథల విభాగానికి ఎడిటర్ గా పనిచేశారు. కొంతకాలం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెలువడుతున్న బాలికల ద్వైమాస పత్రిక "కస్తూరి''కి ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఉత్తమ కథలను స్వయంగా చదివి రికార్డు చేసి యూట్యూబ్ లో "కథనం'' పేరుతో ప్రచురిస్తున్నారు. వీటికి అశేష ప్రజానీకం దగ్గర్నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

అవార్డులు

[మార్చు]
  • కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం (జాతీయ పురస్కారం) 2012
  • గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2017
  • విమలాశాంతి సాహిత్యపురస్కారం (అనంతపురం)
  • డా.కవితా స్మారక సాహిత్య పురస్కారం (కడప) (2011)
  • కొలకలూరి భగీరథి కథా పురస్కారం (తిరుపతి)
  • కథాపీఠం సాహిత్య పురస్కారం (రచన ప్రతిక)
  • అక్షర గోదావరి కథా సాహిత్య పురస్కారం (విశాఖ) 2017
  • వేదగిరిరాంబాబు కథానిక పురస్కారం (హైదరాబాద్) 2017
  • విళంబి నామ ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2018
  • కన్నడ సాహిత్యపరిషత్ పురస్కారం (కర్ణాటక ప్రభుత్వం) 2018
  • చాసో సాహితీ స్ఫూర్తి పురస్కారం (విజయనగరం) 2018
  • కువెంపు భాషా భారతి ప్రాదికార పురస్కారం (బెంగళూరు) 2019
  • తెలుగు భాషా వికాస పురస్కారం(2023), అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్.
  • నెల్లూరు విశాలాక్షి సాహిత్య పురస్కారం (2024)

మూలాలు

[మార్చు]
  1. ‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్[permanent dead link]
  2. "'వేంపల్లె షరీఫ్‌'కు అరుదైన గౌరవం | - | Sakshi". web.archive.org. 2024-09-15. Archived from the original on 2024-09-15. Retrieved 2024-09-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Varma, P. Sujatha (2024-09-06). "Story by writer from Kadapa district included in UG curriculum". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-09-15.
  4. "జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష." Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-31.

ఇతర లింకులు

[మార్చు]