వైను బప్పు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.కె.వి.బప్పు

మనాలి కల్లాత్ వైను బప్పు (ఆగష్టు 10, 1927 - ఆగష్టు 19, 1982) భారతీయ ఖగోళ శాస్త్రవేత్త , అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అధ్యక్షుడు. ఆధునిక భారతీయ ఖగోళ శాస్త్ర పితామహుడు'గా పేరొందిన ఎం.కె.వైను బప్పు స్వల్ప జీవిత కాలంలో ఖగోళ శాస్త్రానికి ఎనలేని సేవలందించాడు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ) స్థాపనలో, తమిళనాడులోని కవలూరులో ఉన్న దానితో సహా అనేక ఇతర సౌకర్యాలను ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. 1940,1950 ల చివరలో హైదరాబాదులోని నిజామియా పరిశోధనా సంస్థ ( నిజామియా  అబ్జర్వేటరీ  అని పిలుస్తారు). వైను బప్పు ఇక్కడి నుండే తన ముఖ్యమైన పరిశీలనలు చేసాడు. వైను బాపు చిన్నతనంలోనే ఖగోళశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి ఎం.కె.బప్పు ఖగోళ శాస్త్రవేత్త. బప్పు నిజామియా అబ్జర్వేటరీలో టెలిస్కోపులను, వాటి పని తీరు చూడటం, ఆకాశాన్ని వీక్షించడం వంటివి చేసి  ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పొందాడు. నిజాం కళాశాల నుంచి సామాన్య శాస్త్రం (సైన్స్ గ్రాడ్యుయేట్), మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1946-47లో కరెంట్ సైన్స్ జర్నల్ లో నిజామియా అబ్జర్వేటరీ నుండి చేసిన అస్థిర నక్షత్రాల (ఆకాశంలోని నక్షత్ర వస్తువులు) పరిశీలనల ఆధారంగా బప్పు తన మొదటి శాస్త్రీయ పత్రాన్ని ప్రచురించాడు.[1] ఖగోళ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భారతీయుడు.

జీవితం[మార్చు]

ఎం.కె.వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించాడు. తండ్రి మనాలి కుకుజీ బప్పు, తల్లి కల్లట్ సునన్న బప్పు. తండ్రి హైదరాబాదులోని నిజామియా అబ్జర్వేటరీలో సీనియర్ ఖగోళ శాస్త్రవేత్త. విద్యార్థి దశ నుంచే బాపు తెలివైన విద్యార్థి, చదువుల్లో పాల్గొనడమే కాకుండా వకృత్వ పోటీలలో(డిబేట్లు), వివిధ క్రీడలతో సహా ఇతర పాఠ్యాంశాలపై ఆసక్తి కనబరిచేవాడు. తండ్రి ఖగోళ శాస్త్రజ్ఞుడు కావడంతో బాపు చిన్న వయసులోనే ఖగోళ శాస్త్రం పై మక్కువ పెంచుకున్నాడు. ఖగోళ శాస్త్రం ఆయన అభిరుచిగా మారింది. బాపు ఖగోళ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా అనేక పత్రాలను ప్రచురించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ) పట్టా పొంది, ఆయన ప్రతిష్ఠాత్మక పిహెచ్ డి డిగ్రీ కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి స్కాలర్ షిప్ పొందాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరిన వెంటనే తన సహచరులతో కలిసి బాపు-బోక్-న్యూకిర్క్ తోకచుక్కను కనుగొన్నాడు. ఇలాంటి మార్గాన్ని కనుగొన్నందుకు బాపుకు ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ది పసిఫిక్ డోన్హో కామెట్-మెడల్ను ప్రదానం చేసింది. 1952 సంవత్సరంలో డాక్టరేట్ పట్టా వచ్చిన తరువాత, ప్రతిష్ఠాత్మక కార్నెగీ ఫెలోషిప్ పై పాలోమర్ అబ్జర్వేటరీలో చేరాడు. ఈ అబ్జర్వేటరీలోనే విల్సన్ తో కలిసి బాపు విల్సన్-బాపు ప్రభావాన్ని కనుగొన్నారు. విల్సన్-బాపు ప్రభావంలో కొలిన్ విల్సన్, వైను బాపు నిర్దిష్ట రకాల నక్షత్రాల ప్రకాశానికి, వాటి కొన్ని స్పెక్ట్రల్ లక్షణాలకు మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. బాపు కనుగొన్న ఈ ప్రభావాన్ని నక్షత్రాల ప్రకాశాన్ని, దూరాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు[2].

భారత దేశంలో సేవలు[మార్చు]

యూరప్, అమెరికా దేశాలలో అనేక ఉద్యోగావకాశాలను వదులుకున్న వైను బప్పు, భారత దేశానికి తిరిగి వెళ్లాలని ,అక్కడ ఖగోళ శాస్త్ర అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు, భారతదేశంలో ఖగోళశాస్త్ర కోర్సులు లేదా ఆధునిక పరిశీలనా సౌకర్యాల లేక పోవడం, ఈ లోటును పూరించగల సంస్థలను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. నేషనల్ సైన్స్ అకాడమీలో ఫెలోషిప్ తరువాత, వైను బప్పు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లోని వారణాసి స్టేట్ అబ్జర్వేటరీలో (పరిశోధనాలయం) ప్రధాన ఖగోళ శాస్త్రవేత్తగా నియమించబడ్డాడు. అక్కడి నగర కాలుష్యం కారణంగా వారణాసి ఆప్టికల్ అబ్జర్వేటరీకి అనువైనది కాదని, హిమాలయాల దిగువన ఉన్న నైనిటాల్ సమీపంలోని కొండ ప్రాంతమైన మనోరా శిఖరానికి పరిశోధనాలయం ( అబ్జర్వేటరీని) మార్చాడు. పరిశోధనాలయం లో అత్యుత్తమ పరికరాలను సమకూర్చడమే కాకుండా, యువ ఖగోళ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చి పనిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వైను బప్పు 32 సంవత్సరాల వయస్సులో కొడైకెనాల్ లోని అతిపెద్ద సోలార్ అబ్జర్వేటరీ డైరెక్టర్ అయ్యాడు. సోలార్ అబ్జర్వేటరీ తన పనిని నక్షత్ర పరిశీలనలకు కూడా విస్తరించాలని, అందుకు తమిళనాడులోని కవలూరు గ్రామ సమీపంలోని గంధపు అడవిలో 40 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసుకుని నక్షత్ర అబ్జర్వేటరీని ప్రారంభించారు. అక్కడ 1967 నాటికి, వారు నక్షత్ర పరిశీలనలను ప్రారంభించడానికి 38 సెంటీమీటర్ల టెలిస్కోప్ను నిర్మించారు. 1972లో జర్మనీలోని కార్ల్ జీస్ నుంచి 102 సెంటీమీటర్ల టెలిస్కోప్ ను కొనుగోలు చేసి అబ్జర్వేటరీలో పెట్టారు. ఈ టెలిస్కోప్ కవలూర్ లోని ఖగోళ శాస్త్రవేత్తలకు జోవియన్ ఉపగ్రహం గనిమెడ్ లో వాతావరణం ఉనికిని కనుగొనడానికి, యురేనస్ చుట్టూ ఉన్న వలయాలను నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఖగోళ శాస్త్రానికి స్వయంప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటుకు ఆయన బాహాటంగా మద్దతు తెలుపుతూ, 1971 సంవత్సరంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ను స్థాపించారు, దీనికి వైను బప్పు వ్యవస్థాపక డైరెక్టర్ గా ఉన్నాడు[3].

వైను బాపు అబ్జర్వేటరీ[మార్చు]

వైను బాపు అబ్జర్వేటరీలో 93 అంగుళాల టెలిస్కోప్ భవనం

వైను బాపు అబ్జర్వేటరీ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన ఒక ఖగోళ పరిశోధనాలయం (అబ్జర్వేటరీ) తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని జావడి కొండల్లోని కవలూర్ వద్ద ఉంది. కావలూరు అబ్జర్వేటరీ 100 ఎకరాల అటవీ భూమిలో ఉంది. ఈ అబ్జర్వేటరీలో అనేక ఆప్టికల్ టెలిస్కోపులు ఉన్నాయి, వీటిలో ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ 2.3 మీ వైను బాపు టెలిస్కోప్, 1.3 మీటర్ల జెసి భట్టాచార్య టెలిస్కోప్, 1 మీ కార్ల్ జీస్ టెలిస్కోప్, అనేక ఇతర చిన్న టెలిస్కోప్ ఉన్నాయి. టెలిస్కోపులతో పాటు, భూమి థర్మోస్ఫియర్ నుండి ఎయిర్గ్లో ఉద్గారాలను అధ్యయనం చేయడానికి ఫాబ్రీ-పెరోట్ ఇంటర్ఫెరోమీటర్ కూడా ఉపయోగించబడుతుంది. ఈ అబ్జర్వేటరీ 725 మీటర్ల ఎత్తులో ఉంది.

వైను బాపు అబ్జర్వేటరీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వైను బాపు టెలిస్కోప్ పనితీరు చూపించబడుతుంది.వాతావరణం సరిగా ఉంటే 15 సెంటీమీటర్ల విజిటర్ టెలిస్కోప్ ద్వారా రాత్రి వేళల ఆకాశాన్ని కూడా చూపిస్తారు[4].

మూలాలు[మార్చు]

  1. "Vainu Bappu, renowned astronomer, learnt his basics at Nizamiah Observatory in Hyderabad". The Siasat Daily (in ఇంగ్లీష్). 2020-08-10. Retrieved 2023-03-18.
  2. "M. K. Vainu Bappu, Indian Astronomer". IndiaNetzone.com. Retrieved 2023-03-18.
  3. Aranha, Jovita (2019-07-02). "MK Vainu Bappu: The Only Indian to Have a Comet & an Asteroid Named After Him". The Better India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-18.
  4. "tripuntold". www.tripuntold.com. Retrieved 2023-03-18.