Jump to content

వేలూరి శివరామ శాస్త్రి

వికీపీడియా నుండి
(శతావధాని వేలూరి శివరామశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
వేలూరి శివరామ శాస్త్రి
జననంవేలూరి శివరామ శాస్త్రి
1892
కృష్ణా జిల్లా, చిరివాడ
మరణం1967
ఇతర పేర్లువేలూరి శివరామ శాస్త్రి
ప్రసిద్ధిపండితుడు, శతావధాని , బహుశాస్త్రవేత్త
తండ్రివేంకటే్శ్వరావధానులు
తల్లివిశాలాక్షి

శ్రీ వేలూరి శివరామశాస్త్రి జమెరిగిన పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త . కథానికా నిర్మాణంలో సిద్ధ హస్తులు .

బాల్యం, విద్య

[మార్చు]

వేలూరి శివరామశాస్త్రి కృష్ణా జిల్లా చిరివాడలో 1892లో విశాలాక్షి, వెంకటేశ్వరావధానులు అనే దంపతులకు జన్మించారు. చిన్నతనం లోనే వేదవేదాంగాలలో షట్శాస్త్రాలను ఔపోషన పట్టారు. ఇంగ్లీషు, ఫ్రెంచి తదితర విదేశీ భాషలను, బెంగాలీ, గుజరాతీ, హిందీ తదితర భారతీయ భాషల్లో పాండిత్యం సాధించారు. యోగం, సాంఖ్యం, వేదాంతం, జ్యోతిష్యం, మొదలైన శాస్త్రాలలో ఆయన పరిశ్రమ నిరుపమానం. వ్యాకరణంలో ఆయన్ని మించిన వారు ఆ కాలంలో లేరన్నది ప్రతీతి. ఒక పర్యాయం గుంటూరులో కొప్పరపు సోదర కవులకు, తిరుపతి వేంకట కవులకు విద్యా వివాదం సంభవించింది. ఆ వివాదం చివరకు ముదిరి ఎవరు ఏమిటో తేలిపోవాలన్న దశకు చేరుకుంది. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరులకన్నా అన్నిటిలో మిన్నే అయినా ఆశు కవిత్వంలో మాత్రం ఒక వాసి తక్కువే అని అప్పట్లో అనుకొనేవారు. వేలూరికి పద్దెనిమిదేళ్ళ వయసులో వారి గురువులైన తిరుపతి వేంకటకవులకు, కొప్పరపు సోదరులతో వివాదం జరిగింది. ఆశు కవిత్వంలో తమ గురువుల పక్షాన కొప్పరపు సోదరులను ఢీకొని అందర్నీ మెప్పించారు. తొలిసారిగా ఆయన విద్వత్తు సభికులకు అక్కడే పరిచయమైంది. ఆ తర్వాత ఆయన వెనుదిరగలేదు. తన గురువుల దారిలోనే నడుస్తూ ఆంధ్రదేశంలో అన్ని నగరాల్లో అష్టావధానాలు, శతావధానాలు చేసి గురువులకు తగిన శిష్యుడిగా గుర్తింపు పొందారు. కథకుడిగా వేలూరి తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. వస్తువులో ఎంతో వైవిధ్యం, యుగయుగాల మనుష్యులు, రకరకాల మనస్తత్వాలు, ఆనాటి చారిత్రక రాజకీయ ఉద్యమాలు, సామాజిక సమస్యలు, భావ సంఘర్షణలు... ఇవన్నీ ఆయన కథల్లో కనిపిస్తాయి.

అవధానాలు

[మార్చు]

వేలూరి శివరామశాస్త్రిగారు విద్యాభ్యాసానంతరము బంధుమిత్రుల సమక్షంలో తేలప్రోలు సంస్థానంలో మొట్టమొదటి అవధానం చేశారు. పిమ్మట వారు ఈ క్రింది అవధానాలను నిర్వహించారు.[1]

  • కొవ్వూరు శతావధానము 06-05-1911
  • బోడపాడు అష్టావధానము 08-05-1911
  • చిరివాడ అష్టావధానము 08-06-1911
  • గుంటూరు కాలేజీ సంపూర్ణ శతావధానము 11-09-1911
  • తెనాలి శతావధానము 23-12-1911
  • బెజవాడ శతావధానము 23-03-1912
  • బెజవాడ అష్టావధానము 24-03-1912
  • లక్ష్మీనరసాపురం అష్టావధానము (1915)
  • చాట్రాయి శతావధానము (1923)
  • తేతలి శతావధానము (మార్చి 1924) - గురువు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రితో కలిసి జంటగా.
  • తాళ్ళపూడి శతావధానము (20-04-1924) మున్నగునవి.

19 యేళ్ల పిన్నవయసులో గుంటూరు కాలేజీలో విజయంతంగా నిర్వహించిన సంపూర్ణ శతావధానాన్ని చూసి కాలేజి ప్రిన్సిపాల్ ఎల్.ఎల్.ఊల్ శివరామశాస్త్రిగారి మేధాసంపత్తికి ఆశ్చర్యపోయాడు. అవధానానంతరం పురజనులు అవధాని గారిని, వారి గురువు వేంకటశాస్త్రి గారిని పురవీధులలో ఊరేగించారు.

అవధాన పద్యాలు కొన్ని

[మార్చు]
  • సమస్య: పంది పుటుక్కునం గొరికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

పూరణ:

చెందవబోలు నెమ్మొగము; చెల్వగు దత్కరపల్లవంబు; జ
క్కందన మొప్పు కన్నులు, వికాసిత నొప్పెడు మేనుదీవయున్
సుందరమైన రూపు గడుసుందనము గని మోహవార్ధ్య ని
ష్పంది పటుక్కునం గొరికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

  • సమస్య: సరసీరుహ నేత్ర కొక్క స్తనమే కనుమా!

పూరణ:

గిరివరుఁడగు హిమవంతు కొ
మిరె యీశ్వరు సామిమేని మేకొను శక్తి
స్ఫురణం జెలువారెడు నా
సరసీరుహ నేత్ర కొక్క స్తనమే కనుమా!

  • దత్తపది: అనుము - జనుము - సెనగ - మునగ ఈ పదాలతో భారతార్థములో పద్యము

పూరణ:

అనుము దుష్టకృత్య మియ్యదంచుఁ గౌరవేయుతోఁ
జనుము వేగనటకు నీవు సంజయాదు లెన్నఁజే
సె నగడొందక హరియంచుఁ జెందుఁగీర్తి నిన్ను న
మ్ము నగధారియంచుఁ జెప్పెముందు ధర్మజాతుడున్

  • వర్ణన: వసంతము

పూరణ:

అంత దిగంత దంతుర నిరంతర కాంత వనాంత సంతతా
క్రాంత లతాంత మంతక దురంతక కంతు నిరంతరాంత వా
సంతిక మంతరాంతర నిశాంత లతాంతర కాంత కాంత మ
శ్రాంతము సంతసంబిడె వసంతము సంతత మంతనంతటన్

రచనలు [2], శైలి

[మార్చు]

రాశిలో తక్కువైనా వీరికథలు వాసిగలవి . కథావస్తువులో, భాషావిన్యాసంలో, పాత్రచిత్రణములో శాస్త్రిగారి కథలలో అచ్చపు తెలుగుతనము ప్రతిబింబిస్తుంది . విద్వత్కవి కథారచనను చేపట్టితే ఆ సాహిత్య ప్రక్రియ ఎన్ని వన్నెలు - చిన్నెలు దిద్దుకుంటుందో తెలుసుకోవడానికి వేలూరివారి కథానికలు చదివితీరాలి . ఏ రవన అయినా ఒకసారి చదివి అవతల పారవేసేదిగా ఉండకూడదు . ఉత్తమకావ్యము లాగే ఉత్తమ కథానిక పదేపదే చదివిస్తుంది . పదికాలాల పాటు నిలుస్తుంది . టాల్ స్టాయ్, సోమర్ సెట్ మామ్‌ మపాసా, ఠాగోర్, ఓ.హెన్రీ మొదలైనవారి కథలలో లాగే శివరమశాస్త్రి కథలలో విశ్వజనీనత, ఔచిత్యమూ కుదురుకొంటాయి . అన్నింటినీ మించి రససిద్ధి పరిమళిస్తుంది . అందుకే అవి నిత్యనూతనాలుగా విరాజిల్లుతూ ఉంటాయి . వీరి కథానికలలో పాత్రలు ఆదర్శ పాత్రలు కావు . ముమ్మూర్తులా మానవపాత్రలు . అవి తప్పులూ చేస్తాయి, ఒప్పులూ చేస్తాయి. ఆ పాత్రలు మనము ఎక్కడో చూచినట్టు అనిపిస్తాయి. అంతకంటే రచనకు సాఫల్యము ఏమికావాలి. శివరామ శాస్త్రిగారు గొప్ప పండితులయినప్పటికీ రచనలో భాషాడంబరాన్ని ప్రదర్షించలేదు . సముచిత భాషాప్రయోగపాటవము వీరి సొత్తు . వాచాలత్వం లేదు . అల్పాక్షరముల అనల్పార్ధ రచన వీరి ధ్యేయము . వర్ణనలు అతి వాస్తవికాలు . గ్రాంధిక, వ్యావహారిక భాషలు కమ్మగా కలిసిపోయి కథలు సూటిగా నడుస్తాయి . పిచ్చిపిచ్చి టెక్నిక్కులతో విషయాన్ని అయోమయం చేసి చదువరులను కలవర పెట్టే పద్ధతి వీరి కథలలో ఉండదు .

నేను కథకుణ్ణి కాదు, కవిత్వము రాసుకునేవాణ్ణి, అయినా నచ్చిన కథ గురించి వ్రాయడానికి కథానికా రచయితే కానక్కరలేదని భావించిన స్వాతి సంపాదకులు నాకు నచ్చిన కథను అందించమని కోరారు . అందరిలాగే నేనూ మంచివీ, చెడ్డవీ వేలాది కథలు చదివాను కానీ నా గుండెలో తిష్ఠచేసున్నది శా్స్త్రి గారి " సులతానీ " కథ అని అంటారు. . దాన్ని గురించి రెండు మాటలు-- సులతాని చాలా ముద్దుపేరు . అయినా అసలు పేరుకాదు . లోకులతోపాటు రచయిత కూడా సులతానీ అసలు పేరు మరచిపోయారు . సులతానుకు మారు మనువు వెళ్ళి సులతానీ అవుతుంది . సులతాను నిరంతరము తిట్టి, కొట్టి హింసించినా నిర్భరమైన ప్రేమతో భరిస్తుంది సులతానీ, కలవారి ఇంట్లో అంట్లు తోమి భర్తకు సాయపడుతూవుంటుంది . రెండవ మగడు చావగొట్టినప్పుడు మొదటి మగడు పరమానందాయి జోక్యము కలిగించుకొనజూస్తే తీవ్రముగా వారిస్తుంది . సులతానుకు శిక్షపడినపుడు తానే ఆ శిక్షను అనుభవిస్తుంది . పాత మగనిదగ్గర ఉన్నప్పుడు తాను కూడబెట్టిన కాసులు అతనికే చెందాలని, కొత్ తమగనికి చెందకూడననీ ధర్మ నిర్ణయం చేస్తుంది . ఆశ్రయ మిచ్చిన పురుషుణ్ణి దేవుడిగా కొలుస్తుంది . మన నీతిశాస్త్రాలకు అర్ధంకాక పోయినా ఆమెకూ ఒక నీతి అంటూ ఉంది . : ప్రాణాలయినా ఇచ్చే నేస్తం నాది . మళ్ళానాకు మల్లే ప్రాణాలిచ్చే నేస్తం నాకు దొరకలేదు . ఇక అక్కర్లేదు ' అని వెయ్యి నామముల వాడితో నేస్తం కట్టడానికి సులతానును కూడా విడిచి వెళ్ళిపోతుంది - ప్రణయాన్వేషిణీ సులతానీ. సులతానీ కథ చదివిన తర్వాత మనకు తెలిసిన ఒక సులతానీ, ఒక క్షమాదేవత, ఒక సాధుమూర్తి, ఒక ప్రేమస్వరూపిణి మన మనోనేత్రాల ముందు గోచరిస్తుంది . సందేహము లేదు .

రచనలు

[మార్చు]
  1. ఉత్తర హరివంశ విమర్శనము
  2. ముక్తాలత
  3. తాలుకుట్టనము
  4. కృతక సూత్రము
  5. మాధవవర్మ,
  6. ఉపగుప్త
  7. బెడాలోపాఖ్యానము
  8. ఆత్మ కథ (మహాత్మా గాంధీ జీవితానువాదము

కథలు-గాధలు

[మార్చు]
  1. ఏకావళి
  2. రాముని బుద్ధి మంతనం
  3. తీరని కోరికలు
  4. బాపన పిల్ల
  5. కథాషట్కము
  6. కథాసప్తకము,

ఇతర విశేషాలు

[మార్చు]

శరత్‌బాబు రచనలను తొలిసారిగా తెనిగించిన కథకుడు, శతావధాని వేలూరి శివరామశాస్త్రి-మహామహులు

  • బెంగాలీ భాష నుంచి శరత్‌బాబు రచనలను తొలిసారిగా పరిచయం చేసిన వారెవరు?
  • గుజరాతీ భాషలోని మహాత్మాగాంధీజీ ఆత్మకథను అనువదించిన వారెవరు? -

ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం- వేలూరి శివరామశాస్త్రి అన్నదే. అంతే కాదు ఫ్రెంచి భాష నుంచి నేరుగా విక్టర్‌ హ్యూగో లేమి జరబల్స్‌ నవలను 'దివ్య జీవనం'గా అందించినవారూ ఆయనే. అరవిందుల యోగ దర్శనాన్ని సైతం తెనిగించిన వారు వేలూరి శివరామశాస్త్రి. శంకర భగవత్పాదుల వివిధ రచనలను అందించినవారూ ఆయనే. విద్వాంసులు కథకులు కాలేదన్న లోటు వేలూరి శివరామ శాస్త్రిగారి వల్ల తీరింది- అని స్వామి శివశంకర శాస్త్రి అన్నారంటే వేలూరి ఎంతటి గొప్ప కథకులో అర్థం చేసుకోవచ్చు. అలాగే గొర్రెపాటివారు మళ్లీ మళ్లీ చదివించేది మంచి కథ. అటువంటి కథలు అనేకం వ్రాశారు శాస్త్రిగారు అని గొర్రెపాటివారు అక్షరాభిషేకం చేశారంటే వేలూరి శివరామశాస్త్రి కథల విశిష్టత ఏమిటో అర్థమవుతుంది. వేళూరి శివరామశాస్త్రి రాసినవి నలభై అయిదు కథలు. వారి జీవిత కాలంలో రెండు కథానికా సంకలనాలు వెలువడ్డాయి. 1949లో మొదటి సంపుటి అయిన కథా షట్కము. పేరునుబట్టి ఇందులో ఆరు కథలున్నాయని ఇట్టే చెప్పవచ్చు. 1950లో వెలువడిన రెండో సంపుటి- కథాసప్తకము. పేరునుబట్టే ఇందులోనూ ఏడు కథలున్నాయని తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్‌ మహాతీ శంకర్‌ ఆధ్వర్యంలో 1985లో శతావధాని వేలూరి శివరామశాస్త్రి కథాభారతి విడుదలైంది. ఇందులో మొత్తం పదకొండు కథలున్నాయి. ఏకాదశి, కథలు గాథలు వీరి ఇతర రచనలు. వీరి శిష్యులలో ప్రముఖులు పిశుపాటి చిదంబర శాస్త్రి, అంబటిపూడి వెంకటరత్నం, గడియారం రామకృష్ణశర్మ మొదలైనవారున్నారు[1].

వారి మొదటి కథ కృతి

[మార్చు]

మానవుడు తన ఉనికిని గుర్తించి పంచభూతాలను ఎలా వశం చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడో తెలిపే కథ ఇది. శివరామశాస్త్రి తన కథలకు పెట్టిన పేర్లు ఎంతో గమ్మత్తుగా ఉంటాయి. పద్మాక్షి, ఓరినాయనా, చెలి, దత్తు, ఊరిబడి, నకల్‌ హైదరాబాద్‌, రాచపట్టు, సులతానీ, తన్మయత, జన్మాంతర సంబంధం, వావి, సౌందర్యోపాసన, వ్యత్యయము, మాలదాసరి, మూడు తమాషాలు... ఒకటే చీర, దేవుడు, సిపాయి, గన్నేరు... ఇవన్నీ ఆయన కథలు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మనుషుల ప్రవర్తనలో మార్పు లేదని మనం విచారిస్తున్నాం. ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే నైతికంగా మనిషి పెరగనిదే ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం శూన్యం అని తేల్చేశారు. ముక్తికి భక్తి ముఖ్యమనీ, దానికి కుల మతాల పక్షపాతం లేదని, అంతరాలు లేవనీ అనే సత్యాన్ని తన కథలో ప్రతిపాదించారు. బ్రిటిషు వారి కాలంలో రాజకీయ సుస్థిరత సాధించడానికి మతాన్ని ఒక సాధనంగా ఎలా ఉపయోగించుకున్నారో వీరి కథలు తెలుపుతాయి. ఆయన తన కాలంలో ఉన్న అనేక సామాజిక సమస్యలనూ ఇతివృత్తాలుగా స్వీకరించారు. ఆయన కథల్లో రాయల కాలంనాటి పరిస్థితులు, నిజాం కాలంనాటి స్థితిగతులు, జమీందారుల అరాచకాలు అన్నీ చోటు చేసుకున్నాయి. విమర్శకుల మాటల్లో చెప్పాలంటే- శివరామశాస్త్రి గారి కథలకు, నేటి కథలకు స్పష్టంగా ఒక భేదం కనిపిస్తుంది. ఆయన కథనం కంటే కథకే ప్రాధాన్యమిస్తారు. నేటి కథలు మెరుపులు. శాస్త్రిగారి కథలు గజగమనంతో నడుస్తాయి. నేటి కథలలో ఉన్న వేగం శాస్త్రిగారి కథలతో మృగ్యం. ఒక సంఘటన- ఒక విలక్షణ వ్యక్తిత్వం, ఒక మనః స్థితి- రెండు స్వభావాల తారతమ్యం. చెప్పదలచుకొన్నది ఏ విషయమైనా తాపీగా సాధ్యమైనంత సమగ్రంగా చెప్పడం శాస్త్రిగారి కథలలో కనిపిస్తుంది. ఇతివృత్తానికి ప్రాధాన్యత కల్పిస్తూనే శాస్త్రిగారు చూపిన శిల్పంలో ఒక విలక్షణ గోచరిస్తుంది. ఈ విలక్షణత కథా శీర్షికలలో ప్రారంభ ఉపసంహారాలలో, పాత్రలలో, సన్నివేశాలలో, భాషలో సర్వత్రా గోచరిస్తుంది. పాత కొత్తల మేలు కలయికకు వేలూరి కథలు అక్షర రూపాలు. 1925-50 మధ్య కాలంలో ఆయన అభ్యుదయవాదులకు కొండంత బలం చేకూర్చారు. తొలి దశలో గ్రాంధిక భాషవైపు మొగ్గినా, చివరకు వ్యవహార భాషకు ఆయన ఊతమిచ్చారు. ఆయన కథలు అక్షయ దీపాలు.

  • చీకోలు సుందరయ్య

మరణం

[మార్చు]

సంస్థానాధీశులచే, సాహితీప్రియులచే, గురువులచే మన్ననలు, సత్కారాలు పొందిన వేలూరి శివరామశాస్త్రి గారు తమ స్వగ్రామమైన చిరివాడలో 1967, మార్చి 17వ తేదీన మరణించారు[1].

సూచికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 175–181.
  2. వేలూరి శివరామ శాస్త్రి గారి రచనల జాబితా.

యితర లింకులు

[మార్చు]