Jump to content

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో

వికీపీడియా నుండి
ఆదికవి నన్నయ్య

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో అంటూ ప్రారంభమయ్యే శ్లోకం శ్రీమదాంధ్ర మహాభారతంలో తొట్టతొలి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆదికవి నన్నయ్య రాశారు. తెలుగులో తొలికావ్యమైన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ఈ సంస్కృత భాషా శ్లోకంతో ప్రారంభించడం సాహిత్య చరిత్రలో విశేషంగానూ, కొందరికి విచిత్రంగానూ నిలిచిపోయింది. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూన్న ఈ శ్లోకంలో త్రిమాతల ప్రస్తావన, లోకాల స్థితి గురించి వస్తుంది.

శ్లోకం

[మార్చు]

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీ పుంస యోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావ స్సురై:
భూయాసు: పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరా: శ్రేయసే

తాత్పర్యం

[మార్చు]

లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతిలను (వరసగా) రొమ్ము, ముఖము, శరీరములయందు ధరించుచు, స్త్రీపురుష యోగోద్భవంగా లోకముల స్థితిని యెడము లేనిదిగా చేయుచున్నవారు, వేదత్రయమూర్తులు, దేవతలతో పూజింపబడేవారు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిపురుషులు మనకు శ్రేయస్సు ఇచ్చేవారు అగుదురుగాక.

సందర్భం

[మార్చు]

మహాకావ్యాలను ప్రారంభించేటప్పుడు ఆస్తికులైన పూర్వకవులకు మొట్టమొదట ఇష్టదేవతా స్తుతి చేసే అలవాటుండేది. అది సాంప్రదాయామైనది. తెలుగు భాషలో తొలికావ్యమైన ఆంధ్రమహాభారతం ప్రారంభించేటప్పుడు అలాగే నన్నయ్య ఈ శ్లోకంలో త్రిమూర్తులను స్తుతించాడు. అలా ఆంధ్రమహాభారతం ప్రారంభంలో వచ్చిన శ్లోకమిది.

విశేషాలు

[మార్చు]

వ్యంగ్యార్థం (గూఢార్థం }

[మార్చు]

నన్నయ్య ఉద్దేశించిన ఈ అర్థమే కాకుండా మరో అర్థాన్ని కూడా కొందరు పండితులు ప్రతిపాదించారు. నన్నయ్య అన్న పదం నారాయణయ్య అన్న పదానికి తెలుగు రూపం, అది నారాయణ శబ్దభవం. తిక్కనకు కవిబ్రహ్మ అని బిరుదు, ఎర్రాప్రగడకు ప్రబంధ పరమేశ్వరుడన్న ప్రఖ్యాతి ఉన్నాయి. వీరు ముగ్గురు వ్రాసిన ఆంధ్ర మహాభారతం పూర్తయ్యేందుకు మూడువందల యేళ్ళు పట్టింది. ఈ శ్లోకంలో చిరాయ దధతో అన్న పద్యానికి చిరకాలం ధరించేదని అర్థం స్వీకరించి, శ్లోకంలోని త్రిమూర్తులకు ఈ కవిత్రయాన్ని వ్యంగ్యార్థంగా స్వీకరించి, వీరు ఆంధ్రమహాభారతాన్ని పూర్తిచేసేందుకు మూడువందల ఏళ్ళు పడుతుందని అర్థం కూడా చెప్పారు. నన్నయ ఋషికల్పుడు కనుకనే ఆంధ్ర మహాభారతం రచన ఎలాఉండనుందో చెప్పాడని ఊహించారు.[1]

విమర్శలు

[మార్చు]

తొలి తెలుగు కావ్యం ప్రారంభిస్తూనే తెలుగు పద్యం కాక శ్లోకంతో ప్రారంభించాడంటూ ఈ శ్లోక రచన విషయంలో విమర్శించారు. ఈ విషయాన్ని తెలుగు సాహిత్యంలో తప్పులు అంటూ వ్రాసిన పుస్తకంలో మొదటి తప్పుగా దీన్నే ఎంచుకున్నారు. అయితే మరికొందరు దీన్ని ఓ శిల్పంగా ఎంచి, ఒప్పని భావించారు.[1] ఏడవ స్థానంలో చకార ప్రయోగం విషమాక్షరమని, దీని కారణంగానే నన్నయ్య కావ్యాన్ని తనొక్కడే పూర్తిచేయలేకపోయాడని మరికొందరు భావించారు.[2]

ప్రాచుర్య సంస్కృతిలో

[మార్చు]

1983లో ఆంధ్ర కేసరి సినిమాలోని వేదంలా ఘోషించే గోదావరి పాట మధ్యలో శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో పద్యం వినవస్తుంది, వెనువెంటనే "ఆదికవిత నన్నయ్య రాసెనిచ్చట" అన్న చరణం వస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 విశ్వనాథ, సత్యనారాయణ (2007). సాహిత్య సురభి (2 ed.). విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్. pp. 1–5.
  2. పి.వి.బి., శ్రీరామమూర్తి. "అందమైన తిట్లూ ఆనందమే!". సాహిత్య సేవ. Retrieved 5 October 2015.[permanent dead link]
  3. "వేదంలా ఘోషించే గోదావరి". స్వరాల పల్లకి. Archived from the original on 26 అక్టోబరు 2017. Retrieved 5 October 2015.