సంధ్యాసమయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేకర్ బీచ్ వద్ద సంధ్యాసమయం

ఉదయం (రాత్రి తరువాత వెలుగు కనిపించే సమయం), సూర్యోదయం మధ్య కాలాన్ని, అలాగే సూర్యాస్తమయం, రాత్రి మధ్య కాలాన్ని సంధ్య లేదా సంధ్యాసమయం అంటారు. సూర్యోదయానికి ముందూ, సూర్యాస్తమయం తరువాతా సూర్యుడు క్షితిజరేఖ (horizon) కు దిగువున ఉంటాడు. కాని వాతావరణంలో సూర్యకాంతి చెదిరినందున (scattered) ఆ సమయంలో కూడా కొంత వెలుగు కనిపిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు కనిపించడు. ఈ సమయంలో ఉండే కొద్దిపాటి వెలుగుకు సాహిత్యంలో ఎన్నో అందాలు, వర్ణనలు జతచేయబడ్డాయి. కవులకు, ఫొటోగ్రాఫర్లకు, చిత్రకారులకు కూడా ఇది ప్రియమైన దృశ్యంగా ఉంటూవచ్చింది. "sweet light" "blue hour", l'heure bleue వంటి పదాలు ఈ సమయాన్ని వర్ణించడానికి వివిధ భాషలలో వాడారు. తెలుగులో ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి పదాలు వాడుకలో ఉన్నాయి.


సాంకేతికంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత, సూర్యుడు కనిపించనపుడు (అనగా సూర్యకాంతి నేరుగా భూమి ఉపరితలంపైపడనపుడు), వాతావరణంలో చెదిరిన కాంతి కనిపించిన సమయంగా పరిగణించారు.[1] ఆనిర్వచనం ప్రకారం సంధ్యాకాలాన్ని ఈ చిత్రంలో చూడవచ్చును.

Various definitions of twilight.

అసుర సంధ్య

[మార్చు]
గోధూళి వేళ - 1813నాటి మేవార్ శైలి చిత్రం

హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం. సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్చరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వం తో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి, నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

కల్పాంత సంధ్య

[మార్చు]

హిందూపురాణాలలో చెప్పిన కాలమానం ప్రకారం ప్రతి మన్వంతరము తరువాత మరొక మన్వంతరము ప్రారంభమయ్యేటపుడు మధ్యకాలాన్ని "కల్పాంత సంధ్య" అంటారు. ఈ సంధ్యాకాలానికి చెందిన లెక్కలు ఇలా ఉన్నాయి.


దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.


  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
  • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
  • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
  • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
  • మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.


కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "Definitions from the US Astronomical Applications Dept (USNO)". Archived from the original on 2015-08-14. Retrieved 2009-03-03.


బయటి లింకులు

[మార్చు]