Jump to content

సిర్నాపల్లి సంస్థానం

వికీపీడియా నుండి

సిర్నాపల్లి సంస్థానము నిజామాబాదు జిల్లాలోని ముఖ్య సంస్థానాలలో ఒకటి.

సిర్నాపల్లి గడీ

నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్వాయి, నిజామాబాదులోని సిర్నాపల్లి గడి, కోటగల్లి గడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాదు - నిజామాబాదు రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్‌పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

సిర్నాపల్లి గడీ

[మార్చు]

తెలంగాణ గడీల్లో అతి పురాతన చరిత్ర గల గడీ నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి గడీ. సిర్నాపల్లి సంస్థానం మొదట కాకతీయుల పాలనలో, తరువాత కులీ కుతుబ్‌షాహీల పాలనలో ఉండి, ఆ తర్వాత నిజాం పాలన కిందకు వచ్చింది. దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న సిర్నాపల్లి కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా కళాత్మకంగా ఉంది. ఈ కోటపై బురుజులు పిరమిడ్‌ ఆకృతిలో తీర్చదిద్దబడినవి. కుతుబ్‌షాహీల పాలకులు ధరించిన టోపీల్లాగా కనిపిస్తాయి. ఈ గడీని పాఠశాలకు దానం చేయడం వల్ల శిథిలం కాకుండా ఉంది.

రాణి జానకీబాయి

[మార్చు]

ఈ సంస్థానానికి చెందిన ప్రసిద్ధ రాణి శీలం జానకీబాయి గురించి స్థానిక గ్రామస్తులలో అనేక ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నవి. నిజాం దగ్గర పనిచేసే ఒక అధికారి వేట కోసం అడవిలోకి ఒంటరిగా వెళ్ళి అడవిలోనే దారి తప్పిపోయి కొన్ని రోజుల పాటు భయం భయంగా అడవిలోనే గడుపుతుంటే, కట్టెల కోసం వచ్చిన ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఆ అధికారిని చూసి క్షేమంగా అడవినుండి బయటకు తీసుకు వచ్చిందట. ఆ అమ్మాయిలో అపారమైన తెలివితేటలు, అత్యంత చురుకుదనం చూసిన ఆ అధికారి నిజాం రాజుతో సంప్రదించి, సిర్నాపల్లి సంస్థానాన్ని ఆ బాలికకు అప్పగించాడని ఒక కథనం. ఈ బాలికే సిర్నాపల్లి గడీ నుంచి 141 గ్రామాల్ని పరిపాలించిన శీలం జానకీబాయి.

అతి చిన్న వయసులోనే సిర్నాపల్లి సంస్థాన సింహాసనాన్ని అధిష్టించిన ఆ రాణి చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు తవ్వించారు. పన్నులు సకాలంలో వసూలు చేయడం, సకాలంలో నిజాంకు అప్పగించడంలో జానకీబాయి చూపిన పాలనా దక్షతకు నిజాం ముగ్ధుడయ్యాడు. జానకీబాయి కాపాడిన అధికారి ఆమెని సమర్థవంతమైన పరిపాలనాధికారిణిగా తీర్చిదిద్దాడని చెబుతారు. జానకీబాయికి యుక్త వయసు రాగానే మెదక్ జిల్లా టేక్మల్కు చెందిన రెడ్డి కులస్తుడిని పెళ్ళాడి ఇల్లరికం తీసుకువచ్చుకున్నదట. కానీ సంతానం కలగనందున మెదక్ జిల్లా నుంచి రామచంద్రారెడ్డిని దత్తత తీసుకున్నదట.

జానకీబాయి పరిపాలన గురించి చెప్పేవాళ్ళు ఆమెని పగటి మషాల్ దొరసానిగా అభివర్ణిస్తారు. పగటి మషాల్ అంటే పగలే దివిటీలు వెలగటం అని. జానకీ బాయి పల్లకిలో ఏ ఊరు వెళ్ళినా ముందూ వెనకా దివిటీలు పట్టుకుని నడిచేవారట. పగలు దివిటీలతో పల్లకీలో వెళ్ళడం ఆ కాలంలో ఒక అత్యున్నతమైన రాణియోగానికి ప్రతీక అనుకునేవారట.[1]

నిజాం నవాబులకాలంలో రాణి జానకీబాయి హయంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం.1887లో మొదటి సాలార్‌జంగ్ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నపుడు జానకీబాయే, ఇందూరుగా పిలవబడే ప్రాంతాన్నంతా 'నిజాంబాద్'గా మార్చిందట. ఆ 'నిజాంబాదే...' క్రమంగా 'నిజామాబాద్'గా మారింది. నిజాం నవాబైన మీర్ మహబూబ్ అలీఖాన్ 1899లో హైదరాబాదు నుండి మహారాష్ట్రలోని మన్మాడ్ వరకు రైల్వేమార్గాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. తొలి ప్రణాళిక ప్రకారం బొల్లారం నుండి మన్మాడ్ రైలుమార్గం బోధన్ గుండా వేయనున్నట్టు తెలుసుకుని, జానకీబాయి దీన్ని సిర్నాపల్లి, ఇందూరుల మీదుగా ఏర్పాటు చేసేలా రాజును ఒప్పించిందట. దీనికి కృతజ్ఞతగా ఇందూరు పట్టణానికి నిజామాబాదు అని పేరు పెట్టారు. ఆ విధంగా 1905వ సంవత్సరంలోనే నిజామాబాదుకు రైల్వేస్టేషన్ ఏర్పడింది.

సంస్థానాధీశులు

[మార్చు]

సిర్నాపల్లి రాజవంశానికి వనపర్తి, దోమకొండ, వేలూర్పు సంస్థానాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వనపర్తి యువరాణి జానమ్మ (రెండవ రామేశ్వరరావు కూతురు) సిర్నాపల్లి రాజా రామలింగారెడ్డిని వివాహం చేసుకుంది.[2] ప్రసిద్ధ రాణీ జానకీబాయి వేల్పూరు సంస్థానానికి చెందిన రేకులపల్లి కుటుంబపు ఆడపడచని ప్రతీతి.సంస్థానపు చివరి పాలకుడైన శ్రీరాం భూపాల్ ఐ.ఏ.ఎస్ అధికారిగా పదవీవిరమణ పొంది కుటుంబంతో సహా హైదరాబాదులో స్థిరపడ్డాడు. [3]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ గడీలు - 10 పన్నెండేల్ల బాలిక పాలించిన సిర్నాపల్లి గడీ - ఆంధ్రజ్యోతి[permanent dead link]
  2. "The Princes and Princess of Wanaparthi, Andhra Pradesh". Archived from the original on 2012-06-05. Retrieved 2012-12-27.
  3. "Our cooking was influenced by Muslim culture" - Times of India

బయటి లింకులు

[మార్చు]