సోయం గంగులు
సోయం గంగులు | |
---|---|
జననం | జమేదారు బంజర (కోయగూడెం), దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ |
మరణం | మే 12, 1951 రుద్రాక్షపల్లి, తెలంగాణ |
ప్రసిద్ధి | ఆదివాసీ యోధుడు |
సోయం గంగులు (మ. మే 12, 1951) నిజాం సైన్యం, భారత యూనియన్ సైన్యంతో అపజయం ఎరుగక పోరాడిన ఆదివాసీ యోధుడు.[1] కోయ బెబ్బులిగా ప్రసిద్ధిగాంచిన ఈయన పాల్వంచ అటవీ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు.[2]
జననం
[మార్చు]గంగులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర అనే కోయగూడెంలో జన్మించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]గోదావరి తీరంలోని వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి లో ఉన్న బాలానందస్వామి అనుచరుడైన సింగరాజు కోయజాతి యువకులను సమీకరించి రజాకార్లతో పోరాడుతుండేవాడు. ఆయన యూనియన్ సైన్యంలోకి వెళ్లిపోవడంతో ఆ ఉద్యమ బాధ్యతను దళ సభ్యుడైన సోయం గంగులు స్వీకరించాడు. నిజాం వ్యతిరేక పోరాటానికి కొనసాగిస్తూ, తక్కువకాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగి, అజ్ఞాత దళంలోనే ప్రాథమిక విద్యను నేర్చుకున్నాడు. 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోకి ప్రవేశించి కమ్యూనిస్ట్ దళంలో చేరిపోయాడు. అరణ్యంలో అజ్ఞాత దళనేతగా, జనారణ్యంలో జననేతగా అనతికాలంలోనే ఎదిగాడు.
పార్టీలో సెంట్రల్ కమాండర్‌గా ఎదిగిన గంగులు గెరిల్లా దళాల నిర్మాణంలో కీలక బాధ్యత పోషించాడు. దమ్మపేట కేంద్రంగా ఒక చెట్టు ఉద్యమ జెండాను పాతాడు. రుద్రాక్షపల్లిలో ఒక భూస్వామిని అంతమొందించాడు. రజాకార్ల కాలం నుంచి కొనసాగుతున్న నిరంకుశ ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకంగా 1946 నుంచి 1951 (చనిపోయే) వరకు తన పోరాటం సాగించాడు.
మరణం
[మార్చు]జీలుగు కల్లుతాగి మత్తులో స్పహ కోల్పోయిన గంగులును స్త్రీ సహాయంతో వ్యూహాత్మకంగా వలపన్ని పట్టుకుని సైన్యం అరెస్టుచేసి మిలిటరీ వ్యాన్‌కు కట్టేసి గ్రామగ్రామాన ఊరేగించారు. అనంతరం సత్తుపల్లి దగ్గరలోని రుద్రాక్షపల్లి లోని రావిచెట్టుకు కట్టి 1951, మే 12 న యూనియన్ సైన్యాలు కాల్చి చంపాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (31 January 2016). "విస్మృత వీరులు". జూలూరు గౌరీశంకర్ (కవి, సీనియర్ జర్నలిస్ట్). Retrieved 3 November 2017.
- ↑ 2.0 2.1 ఆంధ్రజ్యోతి, హోం, ఎడిటోరియల్ (12 May 2017). "ఆదివాసీ యోధుడు సోయం గంగులు". వూకె రామకృష్ణ దొర. Retrieved 3 November 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]