స్త్రీ లైంగికత
స్త్రీ లైంగికత (ఆంగ్లం: Human Female Sexuality) స్త్రీల లైంగిక ప్రవర్తన, లైంగికత గుర్తింపు/లైంగికత దిశ, శారీరక/మానసిక/సాంఘిక/సాంస్కృతిక/ రాజకీయ/ఆధ్యాత్మిక/మతసంబంధ ప్రక్రియల వంటి అనేకానేక విషయాలతో కూడుకొన్న అతి విస్తారమైన అంశం. స్త్రీ లైంగికతను చర్చిస్తే, నైతిక విలువలు, సౌశీల్యం, వేదాంతాలను చర్చించవలసి వస్తుంది. చరిత్రలోని దాదాపు అన్ని శకాలలో, సాహిత్య దృశ్యకళలలో, సంస్కృతులలో సంఘం మానవ లైంగికతను ప్రస్తావించినపుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ ప్రస్తావనలో స్త్రీ లైంగికత నిగూఢమై ఉంటుంది.
చాలా మటుకు సంఘాలలో, న్యాయ పరిధులలో స్త్రీ యొక్క లైంగిక ప్రవర్తన ఏ విధంగా ఊండాలి అన్న వాటిపై పరిమితులున్నాయి. సాంస్కృతికంగా, ప్రాదేశికంగా, చారిత్రకంగా లైంగికత యొక్క నిర్వచనం మారుతూ ఉన్నది. దీని వలన స్త్రీ లైంగికత యొక్క అర్థం కూడా మారుతూ వస్తోన్నది. శారీరక సంబంధాలు, శరీరాకృతి, ఆత్మ గౌరవం, వ్యక్తిత్వం, విలువలు, వైఖరులు, లైంగిక పాత్రలు, సంబంధ బాంధవ్యాలు, భావప్రకటన స్త్రీ లైంగికతను ప్రభావితం చేస్తాయి.
హైందవంలో స్త్రీ లైంగికత
శాక్తేయం
భూమిపై ప్రకృతిగా అవతరించిన ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపం. పరమసత్య స్వరూపం. సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి. ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఈ జగత్తుకు శివుడిని పురుషుని రూపంలో ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉన్నది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.
-
శివ-శక్తుల సంగమమే సృష్టికి మూలం, ఇదే అఖండ సత్యం
శైవం
శివుడి మూర్తీభవించిన రూపమే కాలగతికి చిహ్నం. ఆది పరాశక్తి యొక్క శక్తితో శివుడిలో చలనము కలుగుతుంది. ఈ శక్తితోనే శివుడు విశ్వవినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడౌతాడు. మహాశక్తియే శివుడి భార్య.
- శివ లింగము, శివుడి పురుషాంగం. శివ లింగము పురుష లైంగికతకు ప్రతీక.
- లింగ యోని, ఆది పరాశక్తి యొక్క యోని. ఇదే మహాయోని, స్త్రీ సృజనాత్మక శక్తికి ప్రతీక.
- శివ లింగము యొక్క పరిపూర్ణ రూపం, లింగ యోని లో అమర్చబడిన లింగము. లింగ యోనుల సంగమం స్త్రీ శక్తియైన నిష్క్రియాత్మక విశ్వం, పురుష శక్తియైన క్రియాత్మక గతుల (కాలాల) అద్వైత ఐక్యతను (ఒకదానితో మరొకటి అల్లుకుపోయి, విడదీయలేనంత బంధాన్ని) సూచిస్తుంది. ఇదే జీవరాశి యొక్క ఉద్భవంగా ఘోషిస్తుంది
తంత్ర శాస్త్రము
- తంత్ర దర్శనము ప్రకారం స్త్రీ సౌందర్యానికి సూచిక, పురుషుడు మగసిరికి సూచిక; అయితే నపుంసకులు రెంటికీ సూచికలు.
- తంత్ర శాస్త్రం బోధించే ప్రధాన విషయాలలో ఒకటి, వ్యతిరేక శక్తుల సంగమమే అనంత సౌఖ్యానికి దారి.
- పురుష శక్తి కరుణ, ఉపాయాలకి సంకేతము. స్త్రీ శక్తి ప్రజ్ఞకి సంకేతము. శివ-శక్తుల (బౌద్ధంలో యాబ్-యుం ల) అనంత కౌగిలి గురించి, ఈ భంగిమలో అనుసంధానించబడే వ్యతిరేక శక్తుల గురించి, దీనిని అవలంబంచటం లో పొందగలిగే సత్ఫలితాల గురించి నవ తంత్రము లో విస్తృతంగా చర్చించబడినది. అంతే కాక ఈ భంగిమ ద్వారా సాధారణ గృహస్థు లైంగిక పారవశ్యాన్ని ఎలా పెంచుకొనవచ్చునో కూడా నవ తంత్రము తెలుపుతుంది
- తంత్ర దర్శనములో ప్రధాన యంత్రమైన శ్రీ చక్రానికి నవయోని చక్రమని పేరు.
- దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది.
- శ్రీ చక్రయంత్రములో మధ్యనున్న బిందువు సర్వ ఆనందమయి
చరిత్ర
స్త్రీ లైంగికత గురించి భారతదేశం, జపాన్, చైనా వంటి ప్రాచీన నాగరికతలలో కామసూత్ర, తంత్ర దర్శనము వంటి వాటిలో విస్తారంగా చర్చించబడినది. చరిత్ర అంతటిలోనూ స్త్రీ లైంగికత, పురుష లైంగికతకు అధీనమైనదిగా వర్ణింపబడినది. స్త్రీ ప్రవర్తన పై ఉండే పరిమితులే స్త్రీ లైంగికతను నియంత్రించేవిగా పరిగణించబడినవి. సాంప్రదాయిక, సాంస్కృతిక పద్ధతులు స్త్రీ లైంగికతకు వినమ్రత, పవిత్రతలను ఆపాదించాయి. ఈ విషయాలలో పురుష లైంగికతను మినహాయించాయి.
-
శ్రీ చక్రం యొక్క త్రిమితీయ నమూనా