స. వెం. రమేశ్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
స. వెం. రమేశ్ ఒక తెలుగు భాషాభిమాని, తెలుగు భాషోద్యమ సమాఖ్యలో చురుకైన సభ్యులు. తెలుగు రాష్ట్రాల బయట తెలుగు వారి భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. అచ్చ తెలుగు పదాలను తన రచనల్లో ఉపయోగించి, ఇతర భాషా పదాలకు ప్రత్యామ్నాయంగా తెలుగు పదాల సౌందర్యాన్ని పాఠకులకు పరిచయం చేసిన అన్వేషకుడు, భాషాభిమాని. వీరు రచించిన ప్రళయ కావేరీ కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా పిలువబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను ఈ కథలుగా మలిచి అందించారు.
తెలుగు భాషా మాండలికాలపై రమేశ్ అభిప్రాయాలు
[మార్చు]స. వెం. రమేశ్ తెలుగు భాషాభివృద్ధి గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ, భాషల అభివృద్ధిలో తమిళం ఆరు మెట్లు ఎక్కితే, తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపాద, చలం వంటి వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయిందని ఆయన అభిప్రాయం. కవులు, మేధావులు భాషా సంస్కృతులను కాపాడుకోవడంలో ఉదాసీనత వహిస్తున్నారని, కవితల్లో కూడా యథేచ్ఛగా ఆంగ్లాన్ని వాడుతున్నారని విమర్శించారు. రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్థమయ్యేలా రాయాలని, పాఠకుడు శ్రమించాలని కోరకూడదని ఆయన వాదిస్తారు. భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకు ప్రాముఖ్యత పెరగాలని, తెలుగు నాట అనేక మాండలికాలు ఉన్నప్పటికీ ఒక మాండలికాన్ని మాత్రమే "ప్రామాణికం" చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచీకరణను ఎదుర్కోవాలంటే స్థానికీకరణ అవసరమని (ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవడం వంటిది) ఉదహరించారు. దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, జీవన విధానం, ఆహారపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలని ఆయన ఆకాంక్షించారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం దీనికి చాలావరకు సహాయపడిందని తెలిపారు.
ప్రళయ కావేరీ కథలపై రచయిత ఉద్దేశం
[మార్చు]రమేశ్ తన "ప్రళయ కావేరీ కథలు" గురించి మాట్లాడుతూ, అవి తన బాల్యానికి చెందినవని పేర్కొన్నారు. అయితే, ఎదిగిన మనసుతో ఇప్పుడు చూస్తే తమ కుటుంబం పాటించిన వివక్ష తన జ్ఞానానికి అందిందని తెలిపారు. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా పెద్దవాళ్ళు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ తాతలు చేసిన తప్పులకు తమను ఎందుకు బాధ్యుల్ని చేస్తారని కొందరు అడిగిన ప్రశ్నకు, తప్పకుండా బాధ్యత వహించాలని, అలా బాధ్యత వహించడానికి సంసిద్ధంగా లేకపోతే మనం మారనట్లేనని ఆయన అన్నారు. తాను ఎంత సంస్కర్తనైనా 'బ్రాహ్మిణిజం' అనే మాటకు ఉడుక్కుంటున్నానంటే తనలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లేనని, ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మిణిజం అని స్పష్టం చేశారు.
కథల్లో స్త్రీ పాత్రలకు ప్రాధాన్యత
[మార్చు]తన కథల్లో స్త్రీ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రశ్నించగా, తనకు 14 మంది అమ్మమ్మలు ఉన్నారని, వారి మధ్య పెరిగానని స. వెం. రమేశ్ వివరించారు. స్త్రీల బలాలు, బలహీనతలను దగ్గరగా చూసినవాడిని కాబట్టే తన కథలన్నీ ఎక్కువగా స్త్రీల చుట్టూ తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
రచనలు
[మార్చు]- ప్రళయకావేరి కథలు
- ఎల్లలు లేని తెలుగు
- కతల గంప
- మొరసునాడు కతలు (స.వెం.రమేశ్, స. రఘునాథ సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం)
- సజీవ సంప్రదాయంగా వేమన
- తెలుగు నుడికట్టు
- తొండనాడు కతలు
- 13 భారతీయ భాషల తొలికతలు
- కడప నారాయణదాసు కీర్తనలు
- పల్లె కళల పరస
- తెన్నాటి తెమ్మెర