Jump to content

హాలికుడు (నాటకం)

వికీపీడియా నుండి

హాలికుడు చెలమచెర్ల రంగాచార్యులు రచించిన తెలుగు నాటకం. ఇది 1940 సంవత్సరంలో మొదటి ముద్రణ పొంది; 1946 లో రెండవసారి ముద్రించబడినది.

సత్కవుల్ హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమీ అంటూ సగర్వంగా హాలిక వృత్తిని అవలంబించిన కవి- పోతన. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం ఎంత ప్రఖ్యాతమో, తన కృతిని భగవంతునికి తప్ప మనుజేశ్వరాధములకు ఇవ్వనని పట్టిన పట్టూ అంతే ప్రసిద్ధము. పోతన జీవితాన్ని అల్లుకుని పాఠకుల్లో ఎన్నెన్నో కథలు ఉన్నాయి. వాటికి మూలసూత్రం పోతన, శ్రీనాథుడు బావ బావమరుదులు కావడం. ఇవన్నీ సాహిత్యలోకంలో పోతన, శ్రీనాథుల సాహిత్యాన్ని ఎలా చూస్తారన్న దానికి గీటురాయి. ఈ నాటక ఇతివృత్తం అటువంటి కథలతోనే అల్లుకుంది.

హైదరాబాదు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయం వారు నిర్వహించ తలపెట్టిన ' పోతన సప్తాహము ' లో ప్రదర్శించుటకు మిత్రులు కోరగా ఈ నాటకాన్ని కవి రచించారు. ఇది రెడ్డి విద్యార్థి వసతిగృహంలో ప్రదర్శించినపుడు చూచిన శ్రీ చెన్నకేశవుల హనుమంతరావు నాయుడు గారు స్వయంప్రేరితులై నాటకాన్ని ముద్రించడానికి ఉత్సాహాన్ని చూపారు. కవి ఈ గ్రంథాన్ని స్వతంత్రులై సత్సంకల్పం కోసం తమ సర్వస్వాన్ని సమర్పించే సాహసం గల సరసమైన కవులకు అంకితం చేశారు.

ఇది మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వాన్ పరీక్షకు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారి ఇంటర్నీడియన్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించబడినది.

నాటకంలోని పాత్రలు

[మార్చు]
పురుషులు
  • పోతన - కథానాయకుడు
  • శ్రీనాధుడు - కథానాయకుని బావమరది
  • సింగభూపాలుడు - రాచకొండ ప్రభువు
  • ఆస్థానకవి
  • విదూషకుడు
  • మంత్రి
  • పేరావధాని - పురోహితుడు - పోతన ద్వేషి
  • పుల్లన్న - పేరావధాని బావమరది
  • గంగన, సింగన, నారయ - పోతన శిష్యులు
  • మల్లన్న - పోతన కుమారుడు
  • చిదానందయోగి - పోతనకు మంత్రోపదేశము చేసిన యోగి
  • సుబ్బయ్య, వెంకటరెడ్డి - బమ్మెరవాసులు, పోతన శిష్యులు
  • సేవకుడు, పౌరులు, గ్రామాధికరి, కరణము మొన్నగువారు
స్త్రీలు
  • శారద - పోతన భార్య
  • భోగిని - సింగభూపాలుని ఉంపుడుకత్తె

అభిప్రాయాలు

[మార్చు]
  • ప్రజామిత్ర : ...పోతన మహోద్దేశములు ఆదర్శప్రాయములు. అటువంటి కవిజీవితాన్ని కథావస్తువుగా తీసుకొని పాత్రోచిత భాషావిశేషాలతో హృదయరంజకంగా ఈకృతిని రచించిన కవిగారు అభినందనీయులు.. . . . .ఈ రసవద్రచనను విశ్వవిద్యాలయ విద్యార్థుల కరకమలాలకు అందిచ్చి తదధికారులు కవి కృషిని సార్థకపర్చదగుదు రని విశ్వసించుచున్నాము.
  • గోలకొండ : ...ఆంధ్రమహాకవీంద్రుల జీవితచరిత్రము దృశ్యకావ్యముగ వెలువడుట ఇదియే తొలిసారి యనవచ్చును. సంభాషణలు రసవంతములు. పద్యశైలి మృదుమధురము. రసికలోకము దృష్టియందీనాటకము నిర్దుష్టమై, ప్రయోక్తల కానుకూల్యసంధాయకమై, ప్రేక్షకుల కాహ్లాదదాయకమై యున్న దనుట కెట్టి సందియమును లెదు. ప్రతివారును చదివి యానందించ దగినది.
  • విభూతి : ...కవిజీవితమును వస్తువుగా స్వీకరించి వ్రాసిన నాటకములలో ఇదియే మొట్టమొదటిది. . . . . ' హాలికుడు ' అను పేరులోనే నాటక ప్రధానలక్ష్యము ద్వనించుచున్నది. . కవిగారి విద్వత్కవిత ప్రశంసనీయముగా నున్నది.
  • దివ్యవాణి : ...ఈ నాటకములో ఒక కవి జీవితమును ఉపనిబద్ధించి కవిగారు గనబరచిన నూతనపద్ధతికి మే మెంతయు నానందించుచున్నాము. ఆంధ్రవాజ్మయము లో నిట్టి యుత్తమరచనను చేర్చిన కవిని మే మభినందించుచున్నాము.
  • విక్రమదేవవర్మ : ...ఈ పొత్తమును సొంతముగా చదివి ముద మొందితిని. ఇది సమంజసముగా రచింపబడినది.
  • చిలుకూరి నారాయణరావు : ...తదేకదీక్షతో నాటకమును సంపూర్ణముగా చదివినాను. పోతన శ్రీనాధుల శీలములను తుదివరకు చక్కగా పోషించినారు.
  • కురుగంటి సీతారామయ్య : ...రసవద్ఘట్టములను కల్పించి, పాత్రలను సమంజసముగా పోషించి, పాత్రోచిత భాషతో ఈ నాటకమును ఇంత రసవంతముగ నిర్వహించిన తమకు ధన్యవాదములు.

మూలాలు

[మార్చు]