Jump to content

1879 నాటి సిడ్నీ అల్లర్లు

వికీపీడియా నుండి
సిడ్నీ అసోసియేషన్ గ్రౌండ్‌లో 1887 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న దృశ్యం, ఇదే 1879లో అల్లర్లు జరిగిన ప్రదేశం

1879 సిడ్నీ అల్లర్లు తొలినాళ్ళ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన అల్లర్లకు ఒక ఉదాహరణ. డేవ్ గ్రెగరీ కెప్టెన్‌గా ఉన్న న్యూ సౌత్ వేల్స్‌కీ, లార్డ్ హారిస్ కెప్టెన్‌గా ఉన్న పర్యాటక ఇంగ్లీషు జట్టుకీ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 1879 ఫిబ్రవరి 8న ఈనాటి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో (అప్పట్లో అసోసియేషన్ గ్రౌండ్ అని పిలిచేవారు) ఈ సంఘటన జరిగింది.

రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ బిల్లీ మర్డోక్ని విక్టోరియా రాష్ట్రానికి చెందినవాడూ, ఆంగ్లేయులు నియమించిన జార్జ్ కౌల్‌థార్డ్ ఔట్ అని ప్రకటించాడు.[1] ఈ అంపైరింగ్ నిర్ణయం వివాదాస్పదమైంది. బిల్లీని అన్యాయంగా ఔట్‌గా ప్రకటించారంటూ ప్రేక్షకులలో కోలాహలం పెరిగింది.[2] వీరిలో చాలామంది పిచ్‌పైకి దూసుకెళ్లి అంపైర్ కౌల్‌థార్డ్‌పైన, కొంతమంది ఇంగ్లీష్ ఆటగాళ్లపైన దాడి చేశారు. మైదానంలోని న్యూ సౌత్‌వేల్స్ పెవిలియన్‌లోని అక్రమ జూదగాళ్లు ఉన్నారనీ, వాళ్ళు తమ జట్టుపైన భారీగా పందెం కాశారనీ, పర్యాటక జట్టు ఆధిపత్యంలో ఉండి గెలిచే అవకాశం ఉన్నందువల్ల ఈ అల్లర్లను ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి.[3][4] ఈ వివాదాన్ని గురించి వివరించడానికి ఉన్న మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఆస్ట్రేలియాలోని కాలనీల్లో అంతర్గత స్పర్థలు. న్యూ సౌత్ వేల్స్ ప్రేక్షకులు విక్టోరియా రాష్ట్రానికి చెందిన అంపైర్ తమను చులకన చేశాడని భావించి ఈ దాడిచేశారని ఈ సిద్ధాంతం చెప్తుంది.

ప్రేక్షకులు "నాట్-అవుట్" అని అరుస్తూ ఉండగా[5], కెప్టెన్ గ్రెగరీ కూడా మర్డోక్‌ తర్వాత వెళ్ళాల్సిన వేరే బ్యాటర్‌ని పంపకుండా ఉండడంతో పిచ్ మీదకు ప్రేక్షకులు దూసుకువచ్చారు.[5][6][7] అంపైర్ కౌల్‌థార్డ్‌ను తొలగించమని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ ఇంగ్లిష్ కెప్టెన్ లార్డ్ హారిస్‌ను కోరాడు. కౌల్‌థార్డ్‌ను అతను అసమర్థుడనీ, పక్షపాతం కలవాడనీ ఆరోపించాడు. ఈ ఆరోపణలను, అభ్యర్థనను ఇంగ్లిష్ కెప్టెన్ వ్యతిరేకించాడు.[5][8] మ్యాచ్‌కు మరో అంపైర్, తర్వాతికాలంలో ప్రధానమంత్రి అయిన ఎడ్మండ్ బార్టన్ మర్డోక్‌ అవుట్ అయ్యాడని తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఇంగ్లిష్ ఆటగాళ్ళు తగిన విధంగా వ్యవహరించారని కౌల్‌థర్డ్‌ని, లార్డ్ హారిస్‌ని సమర్థించాడు.[8] చివరికి, కౌల్‌థార్డ్‌ను తొలగించకుండానే మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించడానికి గ్రెగరీ అంగీకరించాడు.[9] అయినప్పటికీ, ప్రేక్షకులు ఆటను తరచుగా అంతరాయం కలిగించడం కొనసాగించడంతో ఆరోజుకు ఆట నిలిపివేశారు.[9] ఆదివారం విశ్రాంతి దినం కావడంతో సోమవారం నాడు ఆటను తిరిగి ప్రారంభించారు.[10] ఇంగ్లండ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయాన్ని సాధించారు.[11]

అల్లర్లు కారణంగా, ఇంగ్లండ్ జట్టు సిడ్నీలో ఆడాల్సిన మిగిలిన ఆటలను రద్దు చేసింది.[12] ఈ సంఘటన గురించి ఇంగ్లండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ పత్రికలు విస్తృతంగా వ్యాఖ్యానించాయి. ఆస్ట్రేలియాలో వార్తాపత్రికలన్నీ ఆందోళనను ఖండించడంలోనూ, ఈ అల్లర్లను జాతి మర్యాదకు అవమానంగా, ప్రజా సంబంధాల వైఫల్యంగా పేర్కొన్నాయి.[13] లార్డ్ హ్యారిస్ ఈ సంఘటన గురించి రాసిన ఒక బహిరంగ లేఖ తర్వాత ఇంగ్లండ్ పత్రికల్లో ప్రచురితమైంది.[14][15] దాన్ని ఆస్ట్రేలియన్ వార్తాపత్రికలు పునర్ముద్రించినప్పుడు న్యూ సౌత్ వేల్స్‌లో ఆగ్రహం మళ్ళీ రాజుకుంది. న్యూ సౌత్ వేల్స్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిస్పందనగా సమర్థించుకుంటూ రాసిన లేఖ సంబంధాలను మరింత దెబ్బతీసింది.[16][17] ఈ వ్యవహారం ఆంగ్లో - ఆస్ట్రేలియన్ క్రికెట్ సంబంధాల భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తూ రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య సృహృద్భావాన్ని దెబ్బతీసింది. మొత్తానికి, 1880లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించడానికి లార్డ్ హ్యారిస్ అంగీకరించడంతో క్రికెట్ అధికారుల మధ్య ఘర్షణ సడలి సత్సంబంధాలకు వీలు కలిగింది[18]; ఈ మ్యాచ్ అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో నాల్గవదిగానూ, ఇంగ్లండ్లో జరిగిన మొట్టమొదటి టెస్టుగానూ చరిత్రకెక్కింది. ఇది ఆంగ్లో-ఆస్ట్రేలియన్ టెస్ట్ మ్యాచ్‌ల సంప్రదాయాన్ని సుస్థిరం చేసింది.[19][20]

మూలాలు

[మార్చు]
  1. "Lord Harris' XI in Australia, 1878/79 – New South Wales v Lord Harris' XI, Sydney Cricket Ground – 7, 8, 9, 10 February 1879". Cricinfo. Archived from the original on 27 జూలై 2011. Retrieved 21 ఆగస్టు 2009.
  2. Pollard, p. 223.
  3. Harte, pp. 109–114.
  4. Royle, p. 35.
  5. 5.0 5.1 5.2 Harte, p. 110.
  6. "Lord Harris and the Sydney Cricketers!". The Brisbane Courier. 30 May 1879. p. 3. Retrieved 12 September 2009.
  7. "The Scene on the Sydney Cricket Ground". The Argus (from the Sydney Morning Herald). 13 February 1879. p. 6. Retrieved 25 September 2009.
  8. 8.0 8.1 Pollard, p. 225.
  9. 9.0 9.1 Harte, p. 111.
  10. "Lord Harris' XI in Australia, 1878/79 – New South Wales v Lord Harris' XI, Sydney Cricket Ground – 7, 8, 9, 10 February 1879". Cricinfo. Archived from the original on 27 జూలై 2011. Retrieved 21 ఆగస్టు 2009.
  11. "Lord Harris' XI in Australia, 1878/79 – New South Wales v Lord Harris' XI, Sydney Cricket Ground – 7, 8, 9, 10 February 1879". Cricinfo. Archived from the original on 27 జూలై 2011. Retrieved 21 ఆగస్టు 2009.
  12. Harte, p. 114.
  13. Green, p. 819.
  14. Birley, p. 129.
  15. Lord Harris's letter was originally published by the British newspaper, The Daily Telegraph on 1 April 1879. It, and the NSWCA response were reprinted in the 1880 edition of Wisden Cricketers' Almanack and then in Green, pp. 819–21.
  16. Lord Harris's letter was originally published by the British newspaper, The Daily Telegraph on 1 April 1879. It, and the NSWCA response were reprinted in the 1880 edition of Wisden Cricketers' Almanack and then in Green, pp. 819–21.
  17. Lord Harris's letter was originally published by the British newspaper, The Daily Telegraph on 1 April 1879. It, and the NSWCA response were reprinted in the 1880 edition of Wisden Cricketers' Almanack and then in Green, pp. 819–21.
  18. Pollard, p. 236.
  19. Harte, pp. 117–8.
  20. Pollard, p. 238.

ప్రస్తావనలు

[మార్చు]