2016 సియాచెన్ హిమానీనదం హిమసంపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2016 ఫిబ్రవరి 3 న, ఉత్తర సియాచెన్ హిమానీనదం ప్రాంతం లోని భారత సైనిక స్థావరంపై ఆకస్మిక హిమసంపాతం విరుచుకుపడింది. 10 మంది సైనికులు లోతైన మంచు కింద కప్పడిపోయారు. [1]

నేపథ్యం[మార్చు]

సియాచెన్‌ హిమానీనదం వద్ద సైనిక దళాలను నిర్వహించడానికి భారతదేశం సగటున రోజుకు ₹ 5 కోట్లు ఖర్చు చేస్తుంది. సియాచిన్ హిమానీనదంలో శత్రు సైనికుల కాల్పుల కంటే అక్కడి విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది సైనికులు మరణించారు. సియాచెన్ లోని వ్యూహాత్మక ఎత్తులను ఆక్రమించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్టగా 1984 లో భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించించింది. అప్పటి నుండి 2016 వరకూ వాతావరణ పరిస్థితులు, పర్యావరణ కారకాల వలన 915 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.[2] 2003 నవంబరులో భారతదేశం, పాకిస్తాన్‌లు వాస్తవ క్షేత్రస్థితి రేఖ వెంట కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత తుపాకులు నిశ్శబ్దమై పోయాయి.

మంచు ఉప్పెన[మార్చు]

సియాచిన్ హిమానీనదం ఉత్తర భాగంలోని సైనిక శిబిరంపై పెద్ద మంచు ఉప్పెన పడడంతో పది మంది సైనికులు మంచు కింద కూరుకుపోయి మరణించారు. లేహ్ ఉధంపూర్ ల నుండి సమన్వయం చేస్తూ సైనిక, వైమానిక దళాల ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేసాయి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధభూమిలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో 21,000 అడుగుల ఎత్తులో నివాస యోగ్యం కాని భూభాగాన్ని నిర్వహించడంలో సైనికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పును ఈ సంఘటన ఎత్తి చూపింది. కొన్ని సంవత్సరాలుగా, అధిక-నాణ్యత పరికరాల సేకరణలో భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. సైనికులు ఈ ప్రాంతానికి అలవాటు పడేందుకు గాను సైన్యం, మెరుగైన విధానాలతో శిక్షణను క్రమబద్ధీకరించింది. దీంతో ప్రాణనష్టం తగ్గింది. అయితే, శిబిరాన్ని ముంచేసిన మంచు ఉప్పెనను అడ్డుకునేందుకు హామీ ఏమీ లేదు.

కాపాడే చర్యలు[మార్చు]

భారత సైన్యపు మద్రాస్ రెజిమెంటుకు చెందిన 19 వ బెటాలియన్ లోని 32 ఏళ్ల భారత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్ ఈ భారీ హిమపాతం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫిబ్రవరి 8 న భారత సైన్యం విపత్తు అనంతరం జరిపిన కాపాడే చర్యల్లో ప్రమాదం జరిగిన 6 రోజుల తరువాత అతణ్ణి కనుగొన్నారు. −45°C ఉష్ణోగ్రత వద్ద మంచు కింద 35 అడుగుల లోతున కూరుకుపోయి ఉన్న అతన్ని రక్షించారు. [3][4]

CT స్కాన్‌లో మెదడుకు ఆక్సిజన్ కొరత ఉన్నట్లు కనిపించింది. రెండు ఊపిరితిత్తులలోనూ న్యుమోనియా వచ్చింది. కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం లేదు. ఫ్రాస్ట్‌బైట్ గాని, ఎముక గాయాలుగానీ లేవు. అతన్ని వెంటిలేటర్ మీద ఉంచారు. అతని ఆరోగ్యం చాలా క్లిష్టంగా ఉంది, కానీ అతను జీవించి ఉన్నడన్న వార్త కుటుంబ సభ్యులకు కొంత సంతొషం కలిగించింది. ఈ సంఘటనలో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) తో సహా మరో 9 మంది సిబ్బంది మరణించారు. [5] బహుళ అవయవ వైఫల్యం కారణంగా హనుమంతప్ప, 2016 ఫిబ్రవరి 11 న ఉదయం11:45 గంటలకు న్యూ ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో మరణించాడు. [6]

సైనికుడి ధైర్యాన్ని వర్ణిస్తూ భారతీయ వార్తా ఛానళ్ళు ప్రసారం చేసాయి. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ అతను ప్రదర్శించిన మనోనిబ్బరాన్ని అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులూ ప్రశంసించారు. ఆయన మరణానికి రాష్ట్రపతి, [7] ఉప రాష్ట్రపతి, [8] భారత ప్రధాన మంత్రి [9] సంతాపం తెలిపారు. భారత రక్షణ మంత్రి, ముగ్గురు సాయుధ దళాధిపతులూ [10] సైనికుడి మృతదేహాన్ని తన సొంత గ్రామానికి తీసుకెళ్లేముందు నివాళులర్పించారు. హనుమంతప్పకు అతడి గ్రామంలో సైనిక గౌరవంతో అపరకర్మలు జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. "Avalanche buries 10 Army personnel in Siachen". The Hindu. 3 February 2016. Retrieved 20 February 2016.
  2. ""సియాచెన్‌ను ఖాళీ చెయ్యం, పాకిస్తాన్‌ను నమ్మలేం" - మనోహర్ పారికర్". టైమ్స్ ఆఫ్ ఇండియా. 2016-02-26. Archived from the original on 2020-10-27. Retrieved 2020-10-27.
  3. "మృత్యుంజయప్ప". వార్త (in ఇంగ్లీష్). 2016-02-10. Archived from the original on 2020-10-27. Retrieved 2020-10-27.
  4. Press Information Bureau, pib.nic.in, Release Id :136250 dated 9 February 2016
  5. KT Siachen avalanche: Siachen survivor ‘currently comatose, continues to be in shock’ – The Hindu
  6. "Siachen braveheart Lance Naik Hanamanthappa Koppad passes away, nation pays tribute; last rites today". The Indian Express. 12 February 2016. Retrieved 20 February 2016.
  7. Press Information Bureau, pib.nic.in, Release Id :136330 dated 11 February 2016
  8. Press Information Bureau, pib.nic.in, Release Id :136326 dated 11 February 2016
  9. Press Information Bureau, pib.nic.in, Release Id :136318 dated 11 February 2016
  10. http://timesofindia.indiatimes.com/india/Siachen-braveheart-goes-down-fighting/articleshow/50954084.cms