బ్యాటింగ్ (క్రికెట్)

వికీపీడియా నుండి
(Batsman (cricket) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆండ్రూ స్ట్రాస్ 2005 నాట్ వెస్ట్ సీరీస్ సమయంలో ఇంగ్లాండ్ కొరకు బ్యాటింగు చేశారు.

క్రికెట్ ఆటలో బంతిని బ్యాటుతో కొట్టటాన్ని బ్యాటింగు అని అంటారు. బ్యాటింగు చేసే ఆటగాణ్ణి బ్యాట్స్‌మన్ అంటారు. బ్యాట్స్‌మన్ తనను తాను అవుటవకుండా కాపాడుకుంటూ పరుగులు తీస్తారు. బంతిని కొట్టే చర్యను షాట్ లేక స్ట్రోక్ అంటారు. బ్యాట్స్‌మన్ అనే పదం సాధారణంగా బ్యాటింగు లో నిపుణత సాధించిన ఆటగాళ్లను నిర్వచించడానికి ఉపయోగిస్తారు. (దీనికి వ్యతిరేకంగా బౌలర్లు అంటే బౌలింగ్ లో నిపుణత సాధించినవారు.)

ఇన్నింగ్స్ సమయంలో జట్టు నుంచి ఇద్దరు బ్యాట్స్‌మన్లు ఏకకాలంలో బ్యాటింగు చేస్తారు: బౌలరు విసిరే బంతిని ఎదుర్కొంటున్న బ్యాట్స్‌మన్ను స్ట్రైకర్ అంటారు, రెండవ బ్యాట్స్‌మన్‌ను నాన్-స్ట్రైకర్ అంటారు. బ్యాట్స్‌మన్ అవుట్ అయితే, జట్టు నుండి ఇంకొక బ్యాట్స్‌మన్ ఆ స్థానంలో వస్తారు. ఈ ప్రక్రియ ఇన్నింగ్స్ ముగింపు వరకు కొనసాగుతుంది. జట్టు లోని బ్యాట్స్‌మన్‌లలో ఒకరు తప్ప మిగతా పదిమందీ ఔటైనపుడు ప్రత్యర్థి జట్టు బ్యాటింగు చేయటం ప్రారంభిస్తుంది.

మ్యాచ్ రకము (ఐదు రోజులు/రోజు/టి20 మొదలైనవి), ఆట ఏ స్థితిలో ఉంది అనే వాటిపై ఆధారపడి బ్యాటింగు యుక్తులు, ఎత్తుగడలు ఉంటాయి. తమ వికెట్ కోల్పోకుండా చూసుకుంటూ, వీలైనన్ని ఎక్కువ పరుగులు తీయడం బ్యాట్స్‌మన్ ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఈ రెండు లక్ష్యాలు సాధారణంగా దానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకటే ఎక్కువ పరుగులు తీసి త్వరగా స్కోరు చేసేందుకు కొన్ని ప్రమాదకరమైన షాట్లు ఆడవలసి వస్తుంది. దీనివలన బ్యాట్స్‌మన్ అవుటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆట ఉన్న స్థితిపై ఆధారపడి, బ్యాట్స్‌మన్లు తమ వికెట్టు కోల్పోకుండా ఉండేందుకు, పరుగులు తీసే ప్రయత్నాలు కొన్నింటిని వదులుకోవలసి వస్తుంది. లేకపోతే తాము అవుట్ అవుతామనే విషయాన్ని పట్టించు కోకుండా ఎక్కువ పరుగులు తీసే ప్రయత్నాలు చేస్తారు.

క్రికెట్ గణాంకాలన్నిటి లాగానే, బ్యాటింగు గణాంకాలు, రికార్డులు కూడా ఆటలో ముఖ్యమైన భాగం. అవి ఆటగాళ్ళ ప్రతిభను కొలిచే సాధనాలు. బ్యాటింగుకు ముఖ్యమైన గణాంకం బ్యాటింగు సగటు. ఇది బ్యాట్స్‌మన్ తన కెరీరులో సాధించిన సగటు స్కోరు. ఆటగాడు సాధించిన మొత్తం పరుగులను ఆడిన ఇన్నింగ్స్ సంఖ్యతో కాకుండా ఎన్ని సార్లు అవుట్ అయ్యాడనే సంఖ్యతో భాగించి లెక్కిస్తారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముఖ్యమైన ఇంకొక గణాంకం స్ట్రైక్ రేట్. ఇది బ్యాట్స్‌మన్ తాను ఎదుర్కొన్న బంతులు సాధించిన పరుగులకు ఉన్న నిష్పత్తిని స్ట్రైక్ రేట్ అంటారు.

1930ల నుండి ప్రస్తుతం వరకు కూడా చెక్కుచెదరకుండా నిలిచిన కొన్ని రికార్డులను నెలకొల్పిన సర్ డోనాల్డ్ బ్రాడ్మన్‌ను సార్వకాలిక అత్యుత్తమ బ్యాట్స్‌మన్ గా పరిగణిస్తారు. ఆధునిక యుగంలో, సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ గా పరిగణిస్తారు. ఈయన టెస్ట్ మ్యాచులు, పరిమిత ఓవర్ల మ్యాచులు రెండింటినీ కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఘనత సాధించారు. ఇతర రికార్డులలో ఒక రోజు క్రికెట్ మ్యాచ్ లో అత్యధిక స్కోరు 200 నాట్ అవుట్ అనేది అతని పేరిట ఉంది.

సాంప్రదాయిక బ్యాటింగు ప్రక్రియ, స్ట్రోక్ ప్లే

[మార్చు]
సాంప్రదాయకమైన క్రికెట్ షాట్ల పేర్లు. కుడి-చేతి బ్యాట్స్ మన్ కొట్టే దిశలు. బ్యాట్స్ మన్ దక్షిణ ముఖముగా మధ్యలో నిలబడి ఉన్నారు.స్థానాలు ఎడమ-చేతి వాటము వాళ్లకు వ్యతిరేక దిశలో ఉన్నాయి.

క్రికెట్ పుట్టాక, కాలక్రమేణా ఒక ప్రామాణికమైన బ్యాటింగు ప్రక్రియ అభివృధ్ది చెందింది. బౌలరు బంతి వేసే ముందు బ్యాట్స్‌మన్ నిలబడే విధానం (స్టాన్స్), స్ట్రోక్ కొట్టే సమయంలో చేతులు, కాళ్ళు, తల, శరీరం మొదలైనవాటి కదలికలు అన్నీ కలిపి బ్యాటింగు ప్రక్రియ అనవచ్చు. షాట్ ఆడేందుకు వీలైన స్థానానికి త్వరితగతిన రావడం, బంతి పథం లోకి బ్యాట్స్‌మన్ తన తలను, శరీరాన్నీ తీసుకొని రావడము, బంతి బౌన్స్ అయ్యే ప్రదేశములో పాదాలు ఉంచడం, ఆడుతున్న ఆ స్ట్రోక్ కు అవసరమైన విధంగా బ్యాటు ను బంతి వద్దకు ఊపి సరిగ్గా సరైన సమయానికి బంతిని బ్యాటుతో కొట్టడం వగైరాలన్నీ మంచి ప్రక్రియలో భాగాలే.

బంతిని ఏ షాట్ కొట్టాలనేదానిపై బ్యాట్స్‌మన్ కదలిక ఉంటుంది. ముంగాలి షాట్లు కొట్టేందుకు శరీరపు బరువునంతా ముందరి కాలిపై ( కుడిచేతి వాటము అతనికి ఎడమ కాలు) వేసి కొడతారు. బ్యాట్స్‌మన్‌కు సమీపంలో బంతిని పిచ్ చేసినపుడు సాధారణంగా ముంగాలి షాట్లు ఆడతారు. వెనుక కాలి షాట్లు కొట్టేందుకు బరువును వెనుక కాలిపై మోపి ఆడతారు. సాధారణంగా షార్ట్ పిచ్ బంతులను ఈ షాట్లు కొడతారు. కొట్టేటపుడు బ్యాటును ఏ స్థితిలో ఉంచారన్న దానిని బట్టి, షాట్లను నిలువుబ్యాటు షాట్లు, అడ్డబ్యాటు షాట్లు అని కూడా వర్గీకరించవచ్చు. బ్యాటు బంతి వచ్చే మార్గానికి సమాంతరంగా బ్యాటును ఊపితే అది నిలువుబ్యాటు షాటు, అడ్డంగా ఊపితే అడ్డబ్యాటు షాటు. డ్రైవ్, లెగ్ గ్లాన్స్‌లు నిలువుబ్యాటు షాట్లు. పుల్, కట్ షాట్లు అడ్డబ్యాటు షాట్లు.

బ్యాట్స్‌మన్ కు బంతిని ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అనే విషయంలో పరిమితి లేదు. దీంతో బ్యాట్స్‌మన్‌లు రకరకాల షాట్లు కొట్టే క్రమంలో మంచి ప్రక్రియల అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఈ విధంగా కొన్ని "పాఠ్య పుస్తక" (టెక్స్ట్‌బుక్) షాట్లు బ్యాటింగు శిక్షణ మాన్యువళ్ళలో చోటుచేసుకున్నాయి.

వేగంగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉన్న పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రవేశం చెయ్యడంతో, ఫీల్డర్లు లేని చోట్లకు బంతిని కొట్టడం అనే లక్ష్యంతో సాంప్రదాయేతర షాట్లు కొట్టడం పెరిగింది. మంచి బ్యాటింగు ప్రక్రియలోని కిటుకులను విస్మరిస్తారు కాబట్టి, సాధారణంగా - అన్ని వేళలా కాదు - సంప్రదాయేతర షాట్లు సాంప్రదాయికమైన వాటికంటే ఎక్కువ ప్రమాద భరితమైనవి.

బిల్ వుడ్ ఫూల్స్ స్టాన్స్

స్టాన్స్

[మార్చు]

స్టాన్స్ అంటే బ్యాట్స్‌మన్ బంతిని తనకు బౌల్ చేసేందుకు వీలుగా నిలుచునే స్థానము. సరైన స్టాన్స్ అంటే కాళ్ళు రెండు 40 సెం.మీ.ఎడంతో, క్రీజుకు సమాంతరంగా ఉంటూ, "సౌకర్యవంతంగాను, సడలింపుగాను, సమతౌల్యంగానూ" ఉండేది. ముందరి భుజము వికెట్ ను చూడాలి, తల బౌలరుకు అభిముఖంగా ఉండాలి, బరువు రెండుకాళ్ళపై సమానంగానూ ఉండాలి. బ్యాటు, వెనకకాలి వేళ్ళ దగ్గర ఉండాలి.[1] బౌలరు బంతిని వెయ్యబోతూండగా, బ్యాట్స్‌మన్ బ్యాటును లేపి, బరువును మునిగాళ్ళ పైకి మారుస్తాడు. బంతిని వేసీ వెయ్యగానే షాటు ఆడేందుకు అవసరమైన కదలికలకు బ్యాట్స్‌మన్ సిద్ధంగా ఉంటారు.

సైడ్-ఆన్ స్టాన్స్ అనే ఈ భంగిమకు ఎంతో ప్రాచుర్యం ఉన్నప్పటికీ, శివనారాయణ్ చందర్ పాల్ వంటి కొంతమంది అంతర్జాతీయ బ్యాట్స్‌మన్లు "ఓపెన్" లేక "స్క్వేర్ ఆన్" స్టాండ్ ఉపయోగిస్తారు.

బ్యాక్‌లిఫ్ట్

[మార్చు]

బంతిని కొట్టేందుకు బ్యాట్స్‌మన్ బ్యాటును ఎలా లేపుతారనే దానిని బట్టి ఈ పేరు వచ్చింది.[2] బ్యాటును భూమికి వీలైనంత లంబంగా ఎత్తాల్సి ఉన్నప్పటికీ, కోచింగు మాన్యువళ్ళు మాత్రం బ్యాటు బ్య్టు లంబం నుండి కొంత కోణంలో వంగి ఉండాలని చెబుతాయి. బ్యాటు ముఖం మొదటి, రెండవ స్లిప్పు స్థానాల వైపు వంచి ఉంచాలని చెబుతాయి.[2] ఇటీవలి కాలంలో బ్రయాన్ లారా, వీరేందర్ షవాగ్ వంటి వారు కొంచెం ఎక్కువ బ్యాక్‌లిఫ్టును వాడుతూంటారు.[3]

లీవ్

[మార్చు]

బ్యాట్స్‌మన్ బంతిని కొట్టకుండా వదిలెయ్యడాన్ని (లీవ్) కూడా కొన్నిసార్లు క్రికెట్ షాట్ గా పరిగణిస్తారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోని బంతులను ఎదుర్కొనేందుకు లీవ్ ను బ్యాట్స్‌మన్ ఎంచుకుంటారు. దీనిని వారు పిచ్ పరిస్థితి, బౌలింగ్ పరిస్థితులను అంచనా వేసుకునేందుకు వాడుకొంటారు. బంతిని వదిలివేయడమనేది ఎత్తుగడకు సంబంధించిన విషయం. అయినా బ్యాట్స్‌మన్ బంతి తనని గాని, వికెట్టును గానీ కొట్టకుండా చాలా జాగ్రత్తగా గమనించాలి. బంతి పథంలో తన బ్యాటు, చేతులూ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పొరపాటున అది తగిలితే ఆటగాడు క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.

పెద్ద అడుగు తీసుకొని, బ్యాట్స్ మన్ బంతిని ముందరి డిఫెన్సివ్ షాట్ తో అడ్డుకున్నారు.

నిలువు బ్యాట్ షాట్లు

[మార్చు]

బంతి ఎంత ఎత్తులో వస్తోందనే దాన్ని బట్టి నిలువుబ్యాటు షాట్లను ముంగాలి మీదనైనా, వెనుకకాలి మీదనైనా ఆడవచ్చు. బ్యాటు బంతిని తాకే సమయంలో బ్యాటు భూమికి లంబంగా ఉండటం ఈ షాటు లక్షణం. బ్యాటు బంతిని తాకే చోటుకు సరిగ్గా పైన బ్యాట్స్‌మన్ తల ఉంటుంది. దీంతో బ్యాట్స్‌మన్ బంతి పథాన్ని స్పష్టంగా చూడగలడు. ఈ సమయంలో బ్యాటు కదలకుండా ఉండి, ముఖం నేరుగా పిచ్ వైపు చూస్తూ ఉంటే ఆ షాటును బ్లాక్ అని, బ్యాటు ముఖం ఒకవైపుకు వంచి ఉంటే దాన్ని గ్లాన్స్ అనీ అంటారు. ఒకవేళ బ్యాటు కదులుతూ బౌలరు వైపూ ఊపితే దాన్ని డ్రైవ్ అని అంటారు.

రక్షణాత్మక షాట్లు

[మార్చు]

బ్లాక్ స్ట్రోక్, బంతి వికెట్టును గాని బ్యాట్స్‌మన్ శరీరాన్ని గానీ తగలకుండా అడ్డుకునే రక్షణాత్మక స్ట్రోక్. ఈ షాట్ లో ఎక్కువ బలం ఉండదు. చాలా తేలికగా, "మృదువుగా" చేతి అడుగు భాగపు పట్టుతో ఆడుతారు. బంతిని వికెట్ల మీదకు వెళ్ళకుండా ఆపుతుంది. ముందరి పాదంపై ఆడిన బ్లాక్ ను ఫార్వార్డ్ డిఫెన్సివ్ అంటారు. వెనుక పాదం పై ఆడిన దానిని బ్యాక్వర్డ్ డిఫెన్సివ్ అంటారు. ఇటువంటి స్ట్రోకులు పరుగులు సాధించేందుకు కూడా ఉపయోగించవచ్చు. బంతిని లోపలి ఫీల్డ్ లో ఖాళీ భాగాలలోకి నెట్టవచ్చు. ఇలా నెట్టినపుడు బ్లాక్‌ను, పుష్ అంటారు. బంతిని నెట్టడం అనేది బ్యాట్స్‌మన్ ఎక్కువగా స్ట్రైక్ ను ఉపాయంగా ఉపయోగించే విధానము.

లీవ్, బ్లాక్ రెండూ మొదటి-తరగతి క్రికెట్‌లో, టెస్టు మాచిల్లో ఎక్కువగా ఉపయోగించబడతాయి. ఎందుకంటే ఈ రకమైన ఆటలో ఎంత త్వరగా వీలయితే అంత తొందరగా పరుగులు తీయవలసిన అవసరము ఉండదు. దీనితో బ్యాట్స్‌మన్ ఏ బంతులను ఆడాలో ఎంచుకునే వీలు ఉంటుంది.

లెగ్ గ్లాన్స్

[మార్చు]

లెగ్ గ్లాన్స్ అనేది స్ట్రెయిట్-బ్యాట్‌తో సున్నితంగా కొట్టే షాట్. ఇది లెగ్ సైడుకు వెళ్ళే బంతిపై ఆడుతారు. బంతి తనను దాటి వెళ్ళేప్పుడు బ్యాట్స్‌మన్ బ్యాటు తో దాన్ని తాటిస్తారు. దీనికి మణికట్టు పనితనం కావాలి. ఈ షాట్ కొట్టడంతో బంతి స్క్వేర్ లెగ్ లేక ఫైన్ లెగ్ ప్రాంతానికి వెళ్తుంది. ఈ స్ట్రోక్ లో బ్యాటు ముఖమును చివరి క్షణంలో లెగ్ సైడ్ వైపుకు మళ్ళించడము ఉంటుంది. తల, శరీరమూ బంతి పథంలోకి జరుగుతాయి. ఈ షాట్ 'కాలివేళ్ళపైన, కాలి ముందరి భాగం లేక హిప్ పైన" ఆడుతారు. బంతి కాలివేళ్లపైకి కాని బ్యాట్స్‌మన్ కాలి ముందరి భాగం పైకి కానీ వేయబడితే అది ముందరి కాలిపై ఆడుతారు. ఒకవేళ బంతి నడుము/తుంటి ఎత్తుకు బ్యాట్స్‌మన్ వైపుకు బౌన్స్ చేయబడితే దాన్ని వెనుక కాలిపై ఆడుతారు.

డ్రైవ్

[మార్చు]

డ్రైవ్ అంటే నేరుగా కొట్టిన షాట్. ఇది బ్యాటు ను నిలువు చాపముగా బంతి పథం గుండా ఊపడముతో, బంతిని బ్యాట్స్‌మన్ ఎదురుగా మైదానము లోకి కొట్టడముతో ఆడుతారు. బంతి పయనించే దిశననుసరించి, డ్రైవ్ ఈ విధముగా ఉండవచ్చు: కవర్ డ్రైవ్ (కవర్ ఫీల్డింగ్ స్థానము వైపుకు కొట్టబడింది), ఆఫ్ డ్రైవ్ (మిడ్-ఆఫ్ వైపుకు), స్ట్రైట్ డ్రైవ్ (బౌలరును దాటుకొని, కొన్ని సార్లు మిడ్ ఆన్ వైపుకు), ఆన్ డ్రైవ్ (వైడ్ మిడ్ ఆన్, మిడ్ వికెట్ వైపుకు) లేక స్క్వేర్ డ్రైవ్ (పాయింట్ వైపుకు). డ్రైవ్స్ ముందువైపు కాని వెనుక పాదంవైపు కాని ఆడవచ్చు కాని వెనుక పాదం డ్రైవ్ లు బంతి పథంపై బలంగా కొట్టుటం కొంచెం కష్టంగా ఉంటుంది.

ఫ్లిక్

[మార్చు]
ఫ్లిక్ షాటు ఆడుతున్న విరాట్ కొహ్లి

ఫుల్ లెంగ్త్ బంతిని నిలువుబ్యాటుతో మణికట్టును వాడి లెగ్ సైడుకు కొట్టే షాటును ఫ్లిక్ అంటారు. డ్రైవులో లాగా బ్యాటును ముందుకు ఊపుతారు. కానీ, బ్యాటు ముఖం లెగ్ సైడుకు వంచి ఉంచుతారు. దీన్ని ముంగాలి మీద, వెనుకకాలిమీద కూడా ఆడవచ్చు. బంతి మిడాన్, స్క్వేర్‌లెగ్‌ల మధ్య ప్రాంతంలోకి పోతుంది. సాధారణంగా నేలబారుగా కొడతారు. అయితే, లోపలి ఫీల్డర్ల మీదుగా లేపి కూడా కొట్టవచ్చు.

బ్యాట్స్ మన్ వెనుక పాదం నుండి దూరంగా కట్ ఆడతారు.బ్యాట్స్‌మన్ బరువు ఆతని వెనుక (కుడి) పాదంపై ఉంది.

అడ్డబ్యాటు షాట్లు

[మార్చు]

కట్ అంటే క్రాస్-బ్యాటు చేయబడిన షాట్. దీన్ని షార్ట్-పిచ్ బంతిపై ఆడుతారు. ఆఫ్‌సైడ్‌లో వైడ్‌గా వచ్చిన బంతిని బ్యాట్స్‌మన్ బ్యాటుతో కేవలం తాకిస్తారు. బంతిని కొట్టేందుకు బలాన్ని ఉపయోగించడు, వేగంగా వచ్చే బంతిని దారిమళ్ళిస్తాడంతే. స్క్వేర్ కట్ అంటే వికెట్ నుండి (పాయింట్ వైపుకు) సుమారుగా 90 డిగ్రీల కోణంలో ఆఫ్ సైడ్ లోకి కొట్టడం. లేట్ కట్ అనేది బంతి బ్యాట్స్‌మన్ శరీరమును దాటి వెళ్ళిన తరువాత థర్డ్‌మ్యాన్ స్థానం వైపుకు కొట్టే షాట్. కట్ షాట్ సాంప్రదాయికంగా వెనుక పాదమ్మీద నిలబడి ఆడుతారు. కాని కొన్ని సార్లు తక్కువ వేగపు బౌలింగులో ముందరి పాదంపై కూడా ఆడుతారు. రక్షణాత్మక ఎత్తుగడ తరువాత, కట్ అనేది బ్యాట్స్‌మన్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన స్ట్రోక్ గా పరిగణింపబడుతుంది. కట్ అనేది బ్యాటు ముఖము వైపు బంతి దొర్లే విధంగా మైదానమునకు అభిముఖముగా బంతిని క్రిందికి నేట్టుతూ ఆడాలి. తెరచిన ముఖము ఉన్న బ్యాటు తో తప్పు సమయంలో కొట్టబడిన కట్ (బ్యాటు ముఖము భౌలర్ వైపుకు ఉండేవిధంగా) బంతి గాలిలోకి ఎగిరేట్టు చేస్తుంది. దీని వలన బ్యాట్స్‌మన్ ఔటయ్యే అవకాశం ఉంది. ఛాందసులు ఎక్కువగా డ్రైవ్‌ను అభిమానిస్తారు. అయితే, సరిగ్గా కొట్టిన స్క్వేర్ కట్, క్రికెట్ లో అత్యంత సుందరమైన షాట్.

పుల్, హుక్

[మార్చు]
రికీ పాంటింగ్ పుల్ షాట్ ఆడుట.

పుల్ అనేది అడ్డంగా కొట్టే షాట్. నడుము ఎత్తుకు బౌన్స్ చేసిన బంతిని, బ్యాటు ను శరీరము ముందు అడ్డంగా ఊపుతూ లెగ్ సైడ్ చుట్టూ మిడ్-వికెట్ లేక స్క్వేర్ లెగ్ వైపుకు లాగుతూ ఆడుతారు. హుక్ షాట్ అనే పదం ఈ క్రింది సందర్భములో వాడతారు: బ్యాట్స్‌మన్ కు ఛాతి ఎత్తులో కాని లేక అంతకంటే పై ఎత్తులో కాని వచ్చిన బంతిని కొట్టే షాట్ గా, ఈ విధంగా వచ్చిన బంతిని బ్యాట్స్‌మన్ మైదానం మీదుగా గాలిలో కాని స్క్వేర్ లెగ్ వెనుక వైపుగా గానీ హుక్ చేసినపురు. పుల్, హుక్ షాట్ లు ముందరి, వెనుక పాదాలు రెంటిపై ఆడవచ్చు. వెనుక పాదం సాంప్రదాయికమైనది.

స్వీప్

[మార్చు]

స్వీప్ అంటే క్రాస్-బ్యాటు చేయబడిన ఫ్రంట్ ఫుట్ షాట్. ఇది సాధారణంగా స్లో బౌలర్ నుండి వచ్చిన తక్కువ బౌన్సింగ్ ఉన్న బంతికి ఆడుతారు. ఇది మోకాలిపై కూచుని, తలను బంతి పథం లోకి తెచ్చి, బ్యాటును పిచ్ వద్ద అడ్డంగా ఉన్న చాపము లాగా, బంతి వస్తున్నప్పుడు దానిని లెగ్ సైడ్ వైపుకు స్వీప్ చేసి ఊపి, సాంప్రదాయికంగా స్క్వేర్ లెగ్ కాని ఫైన్ లెగ్ వైపుకు కాని ఆడుతారు.

బ్యాట్స్‌మన్ తనకు నచ్చిన విధంగా ఏవిధమైన డెలివరీకైనా ఏ షాట్ నైనా ఆడుటకు స్వేచ్ఛ ఉంది కాబట్టి పైన చెప్పబడిన స్ట్రోక్ లు మాత్రమే బ్యాట్స్‌మన్ కు ఉన్న ఎంపిక కాదు. సంప్రదాయికమైనవి కాని, ఎక్కువ ప్రమాదము ఉన్నవి అయినటువంటి షాట్లు ఆట చరిత్రలో ఉపయోగింపబడ్డాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రవేశంతో ఇటువంటి సాంప్రదాయికేతర షాట్లను ఉపయోగించి ఫీల్డర్లు లేని ఖాళీ స్థలాలలోకి బంతిని కొట్టడము ఎక్కువ అయ్యింది. సాంప్రదాయికేతర షాట్లు మొదటి-తరగతి క్రికెట్ లో చాలా అరుదుగా ఉపయోగింపబడతాయి. ఎందుకంటే ఎక్కువ పరుగులు వేగవంతంగా సాధించవలసిన అవసరము లేదు.

ఎడమ-చేతి వాటము బ్యాట్స్ మన్ స్వీప్ షాట్ ఆడతారు.

కొన్ని సాంప్రదాయికేతర షాట్లు చాల ప్రాముఖ్యతను లేక ఖ్యాతిని గడించాయి. వాటికి తమ సొంత పేర్లు కూడా ఇవ్వబడి సాధారణ వాడకములోకి వచ్చాయి.

సాంప్రదాయేతర షాట్లు

[మార్చు]

రివర్స్ స్వీప్

[మార్చు]

స్టాండర్డ్ స్వీప్ షాట్ ఆడే దిశకు వ్యతిరేక దిశలో ఆడే క్రాస్-బ్యాటు స్వీప్ షాట్ ను రివర్స్ స్వీప్ అంటారు. కాబట్టి, బంతిని లెగ్ సైడ్ వైపుకు స్వీప్ చేయకుండా, ఆఫ్ సైడ్ కు థర్డ్ మ్యాన్ లేక బ్యాక్వర్డ్ పాయింట్ వద్దకు స్వీప్ చేస్తారు. బ్యాట్స్‌మన్ బ్యాటు పై తన చేతులను కూడా స్వాప్ చేయచ్చు. దీని వల్ల ఈ షాట్ ఆడటం సులభతరం అవుతుంది. బ్యాట్స్‌మన్ తన కాలుని వెనుకనుండి ముందుకు తేవచ్చు, దీని వల్ల ఇది సంప్రదాయిక స్వీప్ ను తలపిస్తుంది. రివర్స్ స్వీప్ లోని ప్రయోజకత్వం ఏంటంటే అది ఫీల్డింగ్ స్థానాలను రివర్స్ చేయగలదు, తద్వారా ఈ షాట్ కు ఫీల్డ్ సమకూర్చడం కూడా కష్టమే.

1970లలో దీనిని తరచుగా పాకిస్తానీ ఆటగాడు ముస్తాక్ మొహమ్మద్ మొదటి సారిగా ప్రయత్నించారు. కాని, ముస్తాక్ తమ్ముడు హనీఫ్ మొహమ్మద్ ను ఈ షాట్ రూపకర్తగా కొన్నిసార్లు అభివర్ణిస్తారు. క్రికెట్ కోచ్ బాబ్ వూమర్ ఈ షాట్ ను ప్రచారం కల్పించినవానిగా ప్రఖ్యాతి గడించారు.[4][5]

జింబాబ్వేకు చెందిన ఆటగాడు, అండి ఫ్లవర్ ఈ షాట్ ఆడటంలో నేర్పును సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన డామేయిన్ మార్టిన్ 'ఆటలో అత్యంత విధ్వంసకరమైన రివర్స్ స్వీప్' ఆడగలిగే ఆటగాడిగా ఖ్యాతిగాంచారు. అయినప్పటికీ, రివర్స్ స్వీప్‌లో ఫైనెస్ట్ స్ట్రోక్ మేకర్ గా న్యూ జీల్యాండ్ కు చెందిన వికెట్ కీపర్ బ్రెండన్ మెక్ కులూం పేరుపొందారు.[6]

రివర్స్ స్వీప్ బ్యాక్ ఫైరింగుకు ప్రముఖ ఉదాహరణ: ఇంగ్లాండ్ కు చెందిన మైక్ గ్యాటింగ్ 1987 క్రికెట్ వరల్డ్ కప్ అంతిమ పోరులో ఆస్ట్రేలియా ఆటగాడైన అలన్ బార్డర్ పై ఈ షాట్ ను ప్రయోగించిన సందర్భం. విజయం కోసం ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్ తరుఫున ఆడుతున్న గ్యాటింగ్, బార్డర్ సంధించిన బంతి పై రివర్స్ స్వీప్ ప్రయోగించి, బంతిని టాప్ ఎడ్జ్ తో కొట్టి, వికెట్ కీపర్ అయిన గ్రెగ్ డయర్ కు క్యాచ్ రూపంలో దొరికి పోయారు. ఇంగ్లాండ్ ఆ తరువాత వేగము కోల్పోయింది. మ్యాచ్ కూడా ఓడిపోయింది.

రివర్స్ స్వీప్‌లో చెయ్యి ఉండే స్థితి, శరీర స్థితులు సాంప్రదాయికంగా ఉండవు. ఈ కారణంగా ఈ షాటును బలంగా కొట్టడం కష్టం; చాల సందర్భాలలో, ఈ షాటు ఉద్దేశం బంతిని వెనుక లెగ్ ప్రాంతానికి గ్లాన్స్ లేక కట్ చేయడం. అయినప్పటికీ, కొన్ని అరుదైన సందర్భాలలో, రివర్స్ స్వీప్‌లో కూడా సిక్సరు కొట్టిన ఆటగాళ్ళున్నారు. స్విచ్ హిట్టింగ్ మొదలు పెట్టిన కెవిన్ పీటర్సన్, దీనిలో ప్రవీణురు. కాని కొంతమంది ఇతడి షాట్ ప్రాథమికంగా స్వీపే గాని, రివర్స్ స్వీప్ కాదని వాదిస్తారు. ఇటువంటి షాట్ కు 'క్లాసిక్ ఉదాహరణ' రాబిన్ పీటర్సన్ బంతికి యూసుఫ్ పఠాన్ కొట్టిన సిక్సరు.[7]

స్లాగ్, స్లాగ్ స్వీప్

[మార్చు]

స్లాగ్ అంటే శక్తివంతమైన పుల్ షాట్. దీన్ని మిడ్-వికెట్ మీదుగా ఆడుతారు. సాధారణంగా సిక్సరు సాధించేందుకు ఈ షాట్‌ను కొడతారు. స్లాగ్ ను కౌ షాట్ లేక "కౌ కార్నర్" అని కూడా అంటారు. స్లాగ్ ప్రభావవంతమైన షాట్. ఎందుకంటే బ్యాట్స్‌మన్ శక్తి, శరీర బరువు రెండూ బ్యాటును బంతి వైపు ఊపటానికి ఉపయోగిస్తారు.

స్లాగ్ స్వీప్ అంటే స్వీప్ చేసేందుకు మోకాళ్ళపై కూచ్చుని ఆడే స్లాగ్. స్లాగ్ స్వీప్ లు సాధారణంగా మిడ్ వికెట్ వద్దకు కాకుండా స్క్వేర్-లెగ్ పైకి ఉద్దేశింప బడతాయి. ఇది ప్రత్యేకముగా స్లో బౌలర్ల నుండి వచ్చే పూర్తి పిచ్ ఉన్న బంతులను ఎదుర్కొనేందుకు ఉపయోగించబడుతుంది. ఎందుకంటే అటువంటి సమయంలోనే బ్యాట్స్‌మన్ కు పొడవును గమనించి స్లాగ్ స్వీప్ కు అవసరమైన మోకాళ్ళ స్థానమును అనువర్తించేందుకు సమయం దొరుకుతుంది. సామాన్యంగా ముందరి కాలు వెడల్పుగా లెగ్ స్టంప్ బయటికి ఉంచబడి బ్యాటును పూర్తిగా స్వింగ్ చేసేందుకు అవకాశం ఇస్తుంది.

స్విచ్ హిట్

[మార్చు]

స్విచ్ హిట్ 2008లో కెవిన్ పీటర్సేన్ చే మొదలు పెట్టబడిన షాట్. దీనిని మొదటిసారిగా ఇంగ్లాండ్ లో 2008లో జరిగిన న్యూజీలాండ్ సీరీస్ లో ఆడారు. ఈ షాట్ లో బౌలరు బంతిని వేయడానికి పరుగు తీస్తూండగా బ్యాట్స్‌మన్ తన సాంప్రదాయికమైన చేతివాటానికి, ప్రతిబింబంగా ఉండేలా భంగిమను మార్చుకుంటారు. బౌలరు బంతి వేయుటకు పరుగెత్తే సమయంలో ఫీల్డింగ్ జట్టు తన ఫీల్దరుల స్థానాలను మార్చలేదు. కాబట్టి ఫీల్డింగ్ జట్టు ఆటగాళ్ళు తప్పు స్థానాలలో ఉంటారు. ఈ ఉపాయపు చట్టబద్దతను సీరీస్ సమయంలోనే ప్రశ్నించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ షాట్ చట్టబద్డమేనని తేల్చింది. ఈ షాట్ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే బ్యాట్స్‌మన్ ఎప్పుడు ఆడే చేతివాటం కాక కొత్త చేతివాటంతో తక్కువ నైపుణ్యం కలిగి ఉంటారు. అందువలన ఈ షాట్ ఆడేటప్పుడు తప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్కూప్

[మార్చు]

స్కూప్ షాట్ (ప్యాడిల్ స్కూప్ లేక మారిలర్ షాట్ లేక దిల్స్కూప్ అని కూడా అంటారు) ను చాలామంది ఫస్ట్-క్లాస్ బ్యాట్స్‌మన్ వాడారు. మొదటి సారిగా డగ్లస్ మారిలర్ ఈ షాట్ ప్రయోగించారు. అంతర్జాతీయ మ్యాచ్ లలో మొదటి సారిగా శ్రీలంక బ్యాట్స్‌మన్ తిలకరత్నే దిల్షాన్ విజయవంతంగా ప్రయోగించారు. పళ్ళూ స్కూప్ పేరుతో ఈ షాట్ భారతదేశంలో ఖ్యాతి గాంచింది.స్కూప్‌కు మరొక రూపం సూపర్ స్కూప్. దీనికి బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ ప్రఖ్యాతి తెచ్చాడు.

దీనిని షార్ట్ పిచ్ బంతిపై ఆడతారు. మామూలుగా ఇలాంటి బంతులను డిఫెండ్ చేయడమో, లేక వేగంగా లెగ్ సైడ్ కు లాగడమో జరుగుతుంది - ఈ రెండు షాట్స్ కూడా 'ఆఫ్ ది బ్యాక్ ఫుట్' షాట్స్. స్కూప్ షాట్ ఆడటానికి, బ్యాట్స్‌మన్ ఫ్రంట్ ఫుట్ పై ఉండి, ఒక మోకాలిపై కూచుని బంతి బౌన్స్ కంటే కిందకు రావడానికి ప్రయత్నిస్తారు. బంతిని స్టంప్స్ వెనుకకు, వికెట్ కీపర్ పై నుండి కొడతారు. ఈ షాట్ ఆడే ప్రదేశంలో సాధారణంగా ఫీల్డర్లను ఉంచరు కాబట్టి ఇది ఆడటం ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా, ట్వెంటీ 20, ODI క్రికెట్ లో అవుట్ ఫీల్డర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఈ షాట్ కార్యాచరణలో ప్రమాదకరమైనది; సరిగ్గా కొట్టకపోతే ఔటయ్యే అవకాశాలు ఎక్కువ. 2007 ఐసీసీ ప్రపంచ కప్పు పోటీ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా వుల్ హక్ కొట్టిన షాట్ దీనికి ఉదాహరణ. భారత్‌తో ఆడిన ఈ ఆటలో పాకిస్తాన్ 152/9 వద్ద ఉంది, విజయానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి ఉండగా జోగీందర్ శర్మ వేసిన బంతిని మిస్బా స్కూప్ చేయబోయి శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.

నేరు బ్యాట్

[మార్చు]

నేరు బ్యాటు అంటే బ్యాటు స్థానాలలో ఒకటి. బ్యాటును డ్రైవ్ చేసిన తరువాత, బ్యాటు మైదానానికి లంబంగా ఉన్నప్పుడు, బంతి ప్రభావం ఉన్న ప్రాంతంలో బ్యాట్స్‌మన్ బంతిని మైదానం గుండా ఆడగాలిగేలా చేసే స్థానము. దీనిని సాధించిన వారిది పై చేయి అవుతుంది.[8]

బ్యాటింగు వ్యూహం

[మార్చు]

బ్యాట్స్‌మన్ ప్రధానమైన యుక్తి తాను ఎదుర్కొన్న ప్రతి బంతినీ ఔటవకుండా జాగ్రత్తగా పరుగులు తీయడం. ఇందుకోసం బౌలరు వ్యూహం, ఫీల్డర్ల స్థానాలు, పిచ్ పరిస్థితి, తన శక్తియుక్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు. మూడు రకాల అంతర్జాతీయ క్రికెట్ లైన T20, టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ లలో అవలంబించే వ్యూహాల మధ్య భేదాలు ఉన్నాయి.

వన్డే క్రికెట్

[మార్చు]

అంతర్జాతీయ వన్డే మ్యాచులలో పరిమితమైన ఓవర్లు ఉంటాయి కాబట్టి బ్యాట్స్‌మన్ వేగవంతంగా స్కోరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వేగవంతంగా స్కోరు చేయడం అంటే వేసిన ప్రతి బంతికీ కనీసం ఒక పరుగు సాధించడం. చాలామంది బ్యాట్స్‌మన్ సగటున ప్రతి ఓవరుకు నాలుగు పరుగుల స్కోరు ఉండేలా చూసుకుంటారు (అంటే ఆరు బంతుల ఓవరులో నాలుగు పరుగులు)

జట్టు బ్యాటింగు విషయానికి వస్తే, ముందుగా మంచి ఆటగాళ్ళు బ్యాటింగుకు వస్తారు. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మన్లను (సంఖ్యలు 1, 2, 3) టాప్ ఆర్డర్ (పై వరుస) అంటారు; తరువాతి నలుగురిని (సంఖ్యలు 4, 5, 6, బహుశ 7 కూడా) మిడిల్ ఆర్డర్ (మధ్య వరుస) అంటారు. చివరి నలుగురిని (సంఖ్యలు 8, 9, 10, 11) లోవర్ ఆర్డర్ (కింది వరుస) లేక టెయిల్ అంటారు.

జట్టులో టాప్ ఆర్డరులో ఉన్న నిపుణులైన బ్యాట్స్‌మన్ ఎక్కువ పరుగులు తీసే ఉద్దేశంతో ముందుగా బ్యాటింగు చేస్తారు. బరిలోకి వచ్చే మొదటి ఇద్దరు బ్యాట్స్‌మన్లను ప్రారంభ బ్యాట్స్‌మన్లు అంటారు. వారు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కానవసరము లేదు కాని వారు కొత్త బంతి దూకుడును తట్టుకుని, దాని మెరుపు తగ్గేవరకు వికెట్ కోల్పోకుండా చూస్తారు (గట్టిగా, మెరుస్తూ ఉన్న బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. ఎక్కువగా స్వింగు అవుతుంది. బ్యాట్స్‌మన్‌కు దానిని ఎదుర్కోవడం చాలా కష్టం). దీనికి తోడు, వారు వేగంగా పరుగులు తీయాలి (తక్కువ బంతులలో ఎక్కువ పరుగులు). ఫీల్డింగ్ చేసేజట్టుకు మొదటి 15 ఓవర్లలో ఫీల్డర్లను ఉంచే విషయంలో కొన్ని ప్రతిబంధకాలుంటాయి కాబట్టి, ఎక్కువ పరుగులు స్కోరు చేసుకునే అవకాశం ఉంటుంది. ODI క్రికెట్ నియమాలకు ఇటీవల చేసిన సవరణలలో [1], ఫీల్డింగ్ చేసే జట్టు మొదటి 10 ఓవర్లు తప్పనిసరిగాను, తరువాత రెండు సార్లు ఐదేసి ఓవర్ల చొప్పున, తమకు ఇష్టం వచ్చిన సమయంలోనూ ఫీల్డింగు ప్రతిబంధకాలను అనుసరించాలి. వీటిని పవర్-ప్లే ఓవర్లు అంటారు. వీటిని వారు నిర్దేశించిన 50 ఓవర్లలో వారి ఇష్ట ప్రకారము ఎప్పుడైనా విధించవచ్చు.

ఓపెనర్ల తరువాత నెం. 3 లేక వన్-డౌన్ బ్యాట్స్‌మన్ వస్తారు. ఓపెనర్ల నుండి అంది పుచ్చుకోవడం ఆతని పని. సాంప్రదాయకంగా జాగ్రత్తతో కూడిన ఆటను ఆడాలి. ఇతను బ్యాటింగును సరిగ్గా నిర్వహించాలి. దీనితో బ్యాటింగులో కొంత స్థిరత్వము వస్తుంది. ఎందుకంటే కొత్త బ్యాట్స్‌మన్ ఆటలో స్థిరపడేందుకు కష్టపడతారు. రెండవ వైపు స్థిరపడిన బ్యాట్స్‌మన్ ఉండటం కొంత ఉపయోగ పడుతుంది. జట్టులో ఉన్న ఉత్తమ బ్యాట్స్‌మన్ 3 లేదా 4 స్థానాల్లో వస్తారు. కొత్త పిచ్ పై అత్యుత్తమ బౌలర్ల నుండి ఎదురయ్యే సవాళ్ళ నుండి అతడిని రక్షించి, అతనికి పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఇచ్చేందుకు ఇది అవసరం.

అంతర్జాతీయ వన్డేలలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించబడతారు. దీనికి కారణం వీరు 50 ఓవర్ల మధ్య భాగంలో జట్టు స్థితిని బలోపేతం చేసే బాధ్యత కలిగి ఉంటారు. మిడిల్-ఆర్డర్ బ్యాటింగు లక్షణం -ఎక్కువగా ఒకట్లు, రెండు పరుగులు తీయడం, అప్పుడప్పుడు బౌండరీ (నాలుగు లేక ఆరు) చేయడం. ఓపెనర్లు మాత్రం ఎక్కువగా బౌండరీలు చేస్తూ మెరుపులాగా స్కోరు చేస్తారు. దీనికి కారణ మేంటంటే, ప్రత్యర్థి జట్టు మధ్య ఓవర్లలో ఫీల్డింగ్ ప్రతిబంధకాలను ఎత్తివేస్తుంది కాబట్టి బౌండరీల శాతం తగ్గుతుంది. మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ తరచుగా వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తగల సామర్ద్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. వారు సహనంగా ఆడి, పరుగులు సాధిస్తూ, మ్యాచ్ చివరి 10 ఓవర్లలో బౌలింగ్ పై దూకుడైన దాడికి రంగం సిద్ధం చేస్తారు. ఈ దాడిని సాధించేందుకు, రెండు విషయాలు అవసరము - గట్టిగా కొట్టగలిగే బ్యాట్స్‌మన్ ఉండటం, చేతిలో ఎక్కువ సంఖ్యలో వికెట్లు (ఎందుకంటే దూకుడు ఆడేటపుడు వికెట్లు కోల్పోయే అవకాశం ఎక్కువ). వన్డే క్రికెట్ మ్యాచ్ ఇన్నింగ్స్ చివరి 10 ఓవర్లు ఇన్నింగ్స్ మొత్తానికీ చాలా ఉత్కంఠభరితమైన భాగం. ఈ భాగంలో ఎక్కువ బౌండరీలు వస్తాయి. వికెట్లు పడటం కూడా ఎక్కువే. బ్యాట్స్‌మన్ సాధారణంగా ODI ఇన్నింగ్స్ మొదట్లో ఆడిన షాట్ల కంటే చివరి పది ఓవర్లలో ప్రమాదకరమైన షాట్లు ఆడతారు.

ప్రమాదకరమైన షాట్లలో రివర్స్ స్వీప్, ప్యాడిల్-స్కూప్‌లు రెండు ఉదాహరణలు. ఈ షాట్లన్ని బౌండరీలు సాధించేందుకు వినియోగిస్తారు. ఇవి రక్షిత, సంప్రదాయిక బ్యాటింగు చేసేటపుడు కుదరవు. అంతిమంగా, లోవర్ ఆర్డర్ జట్టులోని బౌలర్లతో కూడుకుని ఉంటుంది. వీరికి బ్యాటింగు నైపుణ్యం అంతగా ఉండదు. అందుకే వీలైనత చివరిలో బ్యాటింగు చేస్తారు.

అయినప్పటికీ, బ్యాటింగు స్థానాలకు ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. నాయకులు బ్యాటింగు లైన్-అప్ తో ప్రయోగాలు చేసి ప్రత్యేకమైన లాభాలను పొందాలని ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, లోవర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ కొన్ని సార్లు 3వ స్థానంలో పంపించబడతారు. ఇతనికి పించ్-హిట్టింగు (పిచ్చకొట్టుడు - దూకుడుగా ఆది తక్కువ బంతులలో ఎక్కువ పరుగులు సాధించడము. బేస్ బాల్ ఆట నుండి ఈ పదాన్ని తీసుకున్నారు) చెయ్యాలని, ఎక్కువ పరుగులు సాధించాలని, మంచి ఆటగాళ్ళను కాపాడాలనీ సూచనలు ఇస్తారు. ఎందుకంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా అతని వికెట్ ఎలాగైనా, తక్కువ విలువ కలిగినది; కోల్పోయినా పరవాలేదు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

టెస్ట్ క్రికెట్ లో మామూలుగా వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఓవర్లు అపరిమితంగా ఉంటాయి కాబట్టి, బ్యాట్స్‌మన్ పరుగులు సాధించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. మామూలుగా, టెస్ట్ మ్యాచిలలో రోజుకు 90 ఓవర్లు బౌలింగు చేయవలసి ఉంటుంది. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్లను వారి వికెట్ కాపాడుకునే నేర్పు, మెలకువల బట్టి ఎంపిక చేస్తారు. ఎందుకంటే, ఇన్నింగ్స్ లోని మొదటి రెండు మూడు గంటల సమయం బౌలింగ్ కు పేస్, పిచ్ బౌన్స్, గాలిలో బంతి గమనం, తదితర అంశాలు అనుకూలిస్తాయి.

ఓపెనర్ అవుట్ అయిన సందర్భంలో తన స్థానాన్ని పదిలపరిచేందుకు వన్ డౌన్ బ్యాట్స్‌మన్ తన నేర్పును బట్టి ఎంపికవుతారు. టెస్ట్ మ్యాచులలో సాధారణంగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బంతిని కొట్టే నేర్పును బట్టి ఎంపికచేయబడతారు, ఎందుకంటే ఇన్నింగ్స్ మొదట్లో కంటే మధ్య ఓవర్లలో బ్యాటింగు కాస్త సులభతరం అవుతుంది కాబట్టి. ఒకవేళ రోజు ఆఖరు అరగంట తరువాత జట్టు బ్యాటింగు ఇన్నింగ్స్ మొదలవుతే, బ్యాట్స్‌మన్ అవుట్ అయితే ఆ జట్టు రాత్రి కాపలాదారుని ఉపయోగించుకుంటారు.

మామూలుగా, రాత్రి కాపలాదారునిగా కింది వరుస బ్యాట్స్‌మన్ ను ఎన్నుకుంటారు. ఇతను క్లిష్టమైన బంతులను వదిలేస్తూ, సులువైన బంతులను ఎదుర్కొంటూ, ఇతర బ్యాట్స్‌మన్ ఆ రోజు ఆఖరున వచ్చే అవసరం లేకుండా చూస్తారు. అలా అని, అతను పూర్తిగా కుందేలు కూడా అయ్యుండరు. ఈ చర్య ద్వారా, సాధారణ బ్యాట్స్‌మన్ ఆనాటి ఆఖరు ఓవర్లు, మరుసటి రోజు నాటి మొదటి ఓవర్లు ఎదుర్కొనే అవసరం ఉండదు. కాని కొన్ని జట్లు రాత్రి కాపలాదారుని ఉపయోగించుకోవు. అందుకు ఈ కింది వాటితో సహా వివిధ రకాల నమ్మకాలు కారణం కావచ్చు: మిడిల్ ఓవర్ బ్యాట్స్‌మన్ అనుకూల, ప్రతికూల పరిస్థితులలో కూడా తన వికెట్ ను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండగలగాలి, డిఫెన్స్ ఆడగలిగే కింది వరుస బ్యాట్స్‌మన్ లేకపోవడం.

మూడవ ఇన్నింగ్స్ లో, బ్యాటింగు జట్టు వేగంగా పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుకి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంది. ఈ దృశ్యము, సాధారణంగా ఆట నాల్గవ రోజున సంభవిస్తుంది. బ్యాటింగు జట్టు నాయకుడు ప్రత్యర్థి జట్టుకు లక్ష్య ఛేదన కొరకు అవసరమైన ఓవర్లను ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాడో నిర్దేశించగలరు. సాధారణంగా అతను తన జట్టు ఇన్నింగ్స్ ను ముందే నిర్దేశించుకున్నసమయానికి నాల్గవ రోజున డిక్లేర్ చేస్తారు. దీని ద్వారా, ఆ రోజు ఇరవై ఓవర్లు, మరుసటి రోజు తొంభై ఓవర్లూ బౌల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. నాల్గవ ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి జట్టుకు బౌల్ చేయడానికి సరిపడినన్ని ఓవర్లు ఉండడం అవశ్యం, ఎందుకంటే మామూలుగా టెస్ట్ క్రికెట్ లో నాలుగవ, ఐదవ రోజులలో పిచ్ సరిపడేంత దృఢంగా మారుతుంది కాబట్టి బౌలింగ్ కు సహకరిస్తుంది (ప్రత్యేకంగా స్లో బౌలింగ్ కు). కాబట్టి, లక్ష్యాన్ని మరింత కష్టతరం చేసేందుకు బ్యాటింగు చేస్తున్న జట్టు తమ నాయకుడు డిక్లేర్ చేసే వరకు వేగంగా పరుగులు సాధించి, రన్ రేట్ ( ఓవరుకు సాధించే పరుగులు) పెంచుతుంది.

కాని, ఒకవేళ టెస్ట్ మ్యాచ్ లోని నాల్గవ రోజులో బ్యాట్టింగ్ చేస్తున్న జట్టు ప్రత్యర్థి జట్టు కన్నా పరుగులలో వెనుకబడి ఉంటే, ఆ జట్టు మెల్లగా ఆడి తమ వికెట్లను నష్టపోకుండా ఉండేదుకు ప్రయత్నిస్తుంది. దీని వల్ల వారు ఐదవ రోజు మ్యాచ్ పూర్తయ్యే వరకు సమయాన్ని మొత్తం ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఒకవేళ జట్టు ఇన్నింగ్స్ అయిదవ రోజుకు కూడా ముగిసిపోకపోతే ఆ మ్యాచును డ్రాగా పరిగణిస్తారు లేక స్టేల్మేట్ అందుకుందని పరిగణిస్తారు. అయినప్పటికీ, ఈ ప్రయత్నంలో, బ్యాటింగు చేస్తున్న జట్టు తన నష్టాన్ని పూడ్చుకోగలిగితేను, ప్రత్యర్థిపై ఆధిక్యతను సాధిస్తేనూ (అధిక పరుగులు), ఆ జట్టు నాయకుడు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి విజయాన్ని సాధించగలరు. దీనికి తన జట్టు కూర్పు, బౌలర్ల సంసిద్ధతను బట్టి, పిచ్ పరిస్థితిని బట్టీ నిర్ణయించుకుంటారు.

వీటిని కూడా చూడండి

[మార్చు]
  • బౌలింగ్
  • ఫీల్డింగ్
  • క్రికెట్ పదజాలం

సూచనలు

[మార్చు]
  1. క్రికెట్: అధ్యాపకులకు, కోచ్ లకు, ఆటగాళ్లకు ఒక మార్గదర్శకమైన పుస్తకము (వెల్లింగ్టన్: న్యూజీలాండ్ ప్రభుత్వ ముద్రణా యంత్రం, 1984), p. 8.
  2. 2.0 2.1 "Backlift and step". 6 September 2005 – via news.bbc.co.uk.
  3. "Sport". 4 February 2016. Archived from the original on 5 మార్చి 2013. Retrieved 23 ఆగస్టు 2018 – via www.telegraph.co.uk.
  4. బాబ్ వూల్మర్ర్ | ఆబిట్యుయరీస్ | గార్డియన్ అన్లిమిటెడ్ .
  5. "తాజా క్రికీట్ వార్తలు > బాబ్ వూల్మర్, 'కంప్యూటర్ కోచ్'". Archived from the original on 2016-01-10. Retrieved 2011-05-25.
  6. క్రిక్ ఇన్ఫో - ఆటగాళ్ళు, అధికారులు - డమీన్ మార్టిన్
  7. యూసుఫ్ పఠాన్ ఆరు పరుగులు కొట్టాడు
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-15. Retrieved 2011-05-25.