స్పిన్ బౌలింగు

వికీపీడియా నుండి
(స్పిన్ బౌలింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

స్పిన్ బౌలింగు అనేది క్రికెట్‌లో ఒక బౌలింగు పద్ధతి. దీనిలో బంతిని నెమ్మదిగా వేస్తారు. అయితే అది నేలను తాకిన తర్వాత చాలా వేగంగా పక్కకు మళ్ళుతుంది. బ్యాటరుకు షాటు కొట్టేందుకు కష్టమౌతుంది. స్పిన్‌ బౌలరును స్పిన్నరు అని కూడా అంటారు.

ప్రయోజనం

[మార్చు]

స్పిన్ బౌలింగు ప్రధాన లక్ష్యం క్రికెట్ బంతికి వేగంగా భ్రమణాన్ని ఇస్తూ బౌలింగు చేయడం. తద్వారా అది పిచ్‌పై బౌన్స్ అయినప్పుడు అప్పటివరకూ ప్రయాణించిన మార్గం నుండి తప్పుకుని పక్కకు మళ్ళి, బ్యాట్స్‌మన్‌కు దాన్ని కొట్టడం కష్టమవుతుంది.[1] బంతి ప్రయాణించే వేగం క్లిష్టమైనది కాదు, అది ఫాస్ట్ బౌలింగు కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. సాధారణంగా స్పిన్ డెలివరీ వేగం 70–90 కిమీ/గం పరిధిలో ఉంటుంది.

సాంకేతికతలు

[మార్చు]
వికెట్ మీదుగా కుడి చేతి వాటం బౌలరు వేసిన ఆఫ్-స్పిన్ డెలివరీ
వికెట్ మీదుగా కుడి చేతి వాటం బౌలరు వేసిన లెగ్-స్పిన్ డెలివరీ

స్పిన్ బౌలింగు, దానికి ఉపయోగించిన భౌతిక సాంకేతికతను బట్టి, నాలుగు రకాలుగా విభజించారు. రిస్ట్ స్పిన్, ఫింగర్ స్పిన్ అనే రెండు ప్రాథమిక బయోమెకానికల్ టెక్నిక్‌ల మధ్య అతివ్యాప్తి లేదు. [2]

వర్గం ఎడమ చేయి లేదా కుడి చేయి ఫింగర్ స్పిన్ లేదా రిస్ట్ స్పిన్ సాధారణ డెలివరీ యొక్క స్పిన్ దిశ ప్రముఖ బౌలర్లు
ఆఫ్ స్పిన్ కుడి వేలు ఎడమ నుండి కుడికి జిమ్ లేకర్, ముత్తయ్య మురళీధరన్, సక్లైన్ ముస్తాక్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ లియోన్, సయీద్ అజ్మల్
ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ ఎడమ వేలు కుడి నుండి ఎడమకు ఫిల్ టఫ్నెల్, రవీంద్ర జడేజా, డేనియల్ వెట్టోరి, రంగనా హెరాత్, షకీబ్ అల్ హసన్, డెరెక్ అండర్‌వుడ్
లెగ్ స్పిన్ కుడి మణికట్టు కుడి నుండి ఎడమకు అబ్దుల్ ఖాదిర్, అనిల్ కుంబ్లే, షేన్ వార్న్, ముస్తాక్ అహ్మద్, షాహిద్ అఫ్రిది, ఆదిల్ రషీద్, యుజువేంద్ర చాహల్
ఎడమ చేతి అనార్థడాక్స్ స్పిన్ ఎడమ మణికట్టు ఎడమ నుండి కుడికి కుల్దీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, పాల్ ఆడమ్స్, చక్ ఫ్లీట్‌వుడ్-స్మిత్, తబ్రైజ్ షమ్సీ

సాంకేతికతపై ఆధారపడి, స్పిన్ బౌలరు క్షితిజ సమాంతర అక్షం చుట్టూ బంతిని తిప్పుతూ బౌలింగు చేస్తాడు. బంతిని స్పిన్‌ చేసేందుకు ప్రధానంగా మణికట్టును గానీ, వేళ్ళను గానీ ఉపయోగిస్తాడు. బంతి భ్రమణాక్షం పిచ్ పొడవుకు కొంత కోణంలో ఉంటుంది. ఈ విధంగా స్పిన్ అవుతున్న బంతి, మాగ్నస్ ప్రభావం వల్ల గాలిలో ఉండగానే పక్కకు మళ్ళడం కూడా సాధ్యమే. ఇటువంటి విచలనాన్ని డ్రిఫ్ట్ అంటారు. [3] డ్రిఫ్ట్, స్పిన్‌ల కలయికతో బంతి నేలను తాకాక దాని దిశ మారి, బంతి పథాన్ని సంక్లిష్టంగా చేస్తుంది.

స్పిన్ బౌలర్లు సాధారణంగా పాతబడి, అరిగిపోయిన బంతితో బౌలింగు చేస్తారు. కొత్త బంతి స్పిన్ బౌలింగు కంటే ఫాస్ట్ బౌలింగుకు బాగా సరిపోతుంది. కొంత అరిగిన బంతి పిచ్‌ను బాగా పట్టుకుని, ఎక్కువ స్పిన్ సాధిస్తుంది.[1] కొంత ఆట జరిగాక పిచ్ కూడా ఎండిపోయి, బీటలు వారుతుంది కాబట్టి, అప్పుడు స్పిన్ బౌలర్లు మరింత ప్రభావవంతంగా ఉంటారు. ఇలాంటి పిచ్‌పై పడే స్పిన్నవుతున్న బంతి మరింత ఎక్కువ విచలనాన్ని ఉత్పత్తి చేస్తుంది. కొత్తబంతితో బౌలింగును ప్రారంభించే స్పిన్ బౌలర్లు చాలా అరుదు. కానీ ట్వంటీ20 క్రికెట్‌ ప్రవేశంతో పిచ్ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు స్పిన్ బౌలింగు చెయ్యడం కూడా జరుగుతోంది. బంతి గాలిలో ఎక్కువగా తిరుగుతుంది కూడా. 'బంతిలో పేస్‌ను లేకుండా చెయ్యడానికి' ఆట చిన్న రూపాలలో కూడా స్పిన్ బౌలర్‌లను వ్యూహాత్మకంగా ఉపయోగించవచ్చు. ఫాస్ట్ బౌలర్లు వేసే బంతుల వేగాన్ని ఉపయోగించుకుని వేగంగా స్కోర్లు చేసే నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్ల స్కోరింగ్ వేగాన్ని తగ్గించడానికి ఈ వ్యూహం ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. స్వాభావికంగా స్పిన్ బౌలరు వేసే బంతికి ఉండే తక్కువ ఊపు కారణంగా పరుగులు సాధించడానికి బ్యాట్స్‌మన్లు, మరింత శక్తిని ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది.

సమానత్వాలు

[మార్చు]

ఫింగర్ స్పిన్, రిస్ట్ స్పిన్ బౌలర్లు ఇద్దరూ బ్యాట్స్‌మన్‌ను గందరగోళానికి గురిచేయడానికీ, వారిని అవుట్ చేయడానికీ స్పిన్ లోని విభిన్న కోణాల పరిధిని ఉపయోగిస్తారు. వీటిలో చాలా వరకు రెండు విభాగాల్లోనూ నేరుగా సమానమైనవి ఉన్నాయి గానీ వివిధ డెలివరీలకు ఉపయోగించే పేర్లు భిన్నంగా ఉండవచ్చు.

సారూప్య భావనలు, పరిభాష [4]
వివరణ ఫింగర్ స్పిన్ మణికట్టు స్పిన్
డిప్, బౌన్స్‌లను ఉత్పత్తి చేస్తూ బంతి, బ్యాట్స్‌మన్ వైపు తిరుగుతుంది. టాప్ స్పిన్నర్ టాప్ స్పిన్నర్
మామూలుగా వేసే డెలివరీకి వ్యతిరేక దిశలో తిరిగే డెలివరీ. దూస్రా గూగ్లీ
ఈ డెలివరీలో బంతి బ్యాట్స్‌మెన్ నుండి దూరంగా తిరుగుతుంది. స్లయిడర్ స్లయిడర్
ఈ డెలివరీలో బంతి బ్యాట్స్‌మెన్ నుండి దూరంగా తిరుగుతుంది. స్వింగ్‌ అయ్యేలా సీమ్ నిటారుగా ఉంటుంది చేతి బంతి స్లయిడర్ కూడా - అరుదుగా ఉపయోగించబడుతుంది
బ్యాక్‌స్పిన్‌ చేస్తూ బంతిని వేళ్ల నుండి బయటకు తోస్తారు సమానమైనది లేదు ఫ్లిప్పర్
ఈ డెలివరీలో బంతి దాని క్షితిజ సమాంతర అక్షంపై తిరుగుతూ, నేలను తాకాక డ్రిఫ్ట్‌ అవుతుంది, కానీ పక్కకు పోదు. అండర్ కట్టర్ సమానమైనది లేదు

పరిస్థితులు

[మార్చు]

స్పిన్ బౌలింగుకు దక్షిణాసియా బౌలర్లు కంచుకోట. ఉపఖండంలోని పిచ్‌లు స్పిన్ బౌలర్లకు మరింత సహాయం అందించడమే దీనికి ప్రధాన కారణం. పిచ్ పరిస్థితి ఎంత వేగంగా క్షీణిస్తే అంత త్వరగా స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లు సాధారణంగా చాలా గట్టిగా ఉండి, బంతికి మంచి బౌన్సు లభిస్తుంది. ఫాస్ట్ బౌలర్‌లకు ఇచి అనువుగా ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఆ పిచ్‌లు పెద్దగా బీటలు వారవు. దీనికి విరుద్ధంగా, ఉపఖండంలో పిచ్‌లు అంత గట్టిగా ఉండవు. వాటిపై సాధారణంగా పచ్చిక ఉండదు; అందువల్ల అవి త్వరగా బీటలు వారి స్పిన్ బౌలర్లకు సహాయ పడతాయి.

దీనికి తోడు స్పిన్ బౌలర్లు సాధారణంగా పొడవాటి రన్ అప్‌ని ఉపయోగించరు కాబట్టి పేస్ బౌలర్ల కంటే తక్కువగా అసిలిపోతారు. అందువల్ల, ఉప-ఖండంలోని వేడి, తేమతో కూడిన పరిస్థితులలో వంట్లో శక్తిని పరిరక్షించుకుంటూ, ముఖ్యంగా బహుళ-రోజుల పోటీలలో ఎక్కువ సేపు బౌలింగు చేసేందుకు స్పిన్ బౌలింగు అనువుగా ఉంటుంది.

సాధారణంగా, బంతిని నియంత్రించడంలో బాగా ఇబ్బంది పెట్టే కఠినమైన బౌలింగ్‌లలో ఒకటిగా లెగ్‌స్పిన్‌ను పరిగణిస్తారు. అయితే ఇది వికెట్లు తీయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. [5]

ఫ్లైట్, టర్న్, బౌన్స్, డ్రిఫ్ట్, డిప్

[మార్చు]
డ్రిఫ్ట్
బౌన్స్
డిప్
ఫ్లైట్

ఫ్లైట్, టర్న్, బౌన్స్, డ్రిఫ్ట్, డిప్ వంటి లక్షణాల పరంగా స్పిన్ బౌలింగు నాణ్యతను వివరించడం, నిర్ధారించడం క్రికెట్ వ్యాఖ్యాతలు చేస్తూంటారు. ఇవన్నీ బ్యాట్స్‌మన్‌ను మోసం చేసే కళలు. వీటికి చాలా సాధన అవసరం. స్పిన్ బౌలరు వేసే బంతి ప్రాథమిక పథం ఒక కోణంలో ఉండే రెండు లైన్లు. కానీ పై లక్షణాలు ఈ 'సాధారణ' పథాన్ని మరింత సంక్లిష్టమైన పథాలుగా మారుస్తాయి.

టర్న్ : నేలను తాకాక బంతి ఎంత పక్కకు మళ్ళుతుంది (ఉదా. 5 డిగ్రీల విచలనం) అనేదాన్ని టర్న్ అంటారు. ఇది బంతి తిరుగుతున్న భ్రమణాల సంఖ్య, దిశపై ఆధారపడి ఉంటుంది. మణికట్టు, బంతిపై వేలు ఉంచిన స్థానం ఆధారంగా బంతి కదలిక, భ్రమణం మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు స్ట్రెయిట్ బాల్‌ వేస్తూ దాడిని వైవిధ్యంగా మార్చవచ్చు. అయితే స్పిన్‌లో వైవిధ్యాన్ని ఉపయోగించుకుంటూ బ్యాట్స్‌మన్‌ను మోసగించడం, వికెట్లు తీయడం ప్రధానంగా చేస్తారు. అత్యధికంగా తిరిగే రేటు 33 rev/second లేదా 2000 rpm పైచిలుకు ఉంటుంది. గ్రేమ్ స్వాన్ స్థిరంగా 2000 rpm కంటే ఎక్కువ తిప్పుతూ వేసేవాడు. లియామ్ డాసన్ కూడా 35 rev/second లేదా 2100 rpmలో వేస్తాడు. అలాగే, బంతి వేగం ఎంత తక్కువగా ఉంటే, అంత ఎక్కువగా అది పక్కకు మళ్ళుతుంది. ఆఫ్‌స్పిన్నరు, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు బౌలింగు చేసేటపుడు, ఆఫ్-స్టంపుకు బాగా వెలుపల వేసి బ్యాటరు వైపులు లోపలికి టర్ను చేయాల్సి ఉంటుంది. అలా చెయ్యడంలో బ్యాటు అంచు బంతికి తాకి, ఫీల్డరుకు క్యాచ్వెళ్ళడమో, ఆఫ్ స్టంప్ పైభాగానికి తగలడమో జరుగుతుంది.

బౌన్స్ : బంతిని మామూలుగా కంటే ఎక్కువ బౌన్స్ చేయడం. తద్వారా బంతి నేలను తాకాక, బ్యాటరు ఊహించిన దాని కంటే ఎక్కువ ఎత్తుకు లేస్తుంది. కొన్నిసార్లు, బంతి అడ్డంగా స్పిన్నవుతూంటే (ఉదా. స్లయిడర్), బ్యాట్స్‌మన్ బంతిని కొట్టలేక పోవచ్చు, అది రెండో బౌన్స్‌ పడే ముందు స్టంప్‌లను తాకవచ్చు.

డ్రిఫ్ట్ : గాలిలో ఉన్నప్పుడే బంతి పక్కకు మళ్ళేలా చేయడం. డ్రిఫ్ట్ ఆలస్యంగా జరిగితే, బ్యాట్స్‌మన్ తప్పు లైన్‌లో ఉండే అవకాశం ఉంటుంది. దీనివలన బంతి బ్యాట్ అంచుకు తగిలి క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది.

డిప్ (దిగడం) : బంతిని మామూలు కంటే కాస్త తక్కువ దూరంలోనే నేలను తాకేలా వేయడం. డిప్ కొంచెం ఆలస్యంగా జరిగేలా ఉంటే, బ్యాట్స్‌మన్ బంతి లెంగ్తును తప్పుగా అంచనా వేసే అవకాశం ఉంటుంది.

ఫ్లైట్: బంతిని మామూలు కంటే కొంచెం ఎత్తుగా వేయడం. తద్వారా నేలను తాకడానికి ముందు గాలిలో ఎక్కువ సేపు ఉంటుంది. ఇలా ఎక్కువ ఫ్లైట్‌తో కూడిన స్లో బాల్, నిజంగా అది వస్తున్న వేగం కంటే నెమ్మదిగా వస్తున్నట్లు కనబడుతూ, బ్యాటరు తప్పు షాట్‌ కొట్టేలా మోసగించవచ్చు. ఆఫ్‌స్పిన్నర్లకు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సాధారణంగా ఒక స్పిన్ బౌలరు టర్న్, బౌన్స్, డ్రిఫ్ట్, డిప్ లేదా వాటన్నిటి కలయికలనూ ఉత్పత్తి చేయడానికి ఫ్లైట్‌లో వేసే ఎత్తులపైనే ఆధారపడతాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Knight, pp.122–123.
  2. "Spin Bowling Tips". CricketSecrets.com. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 4 February 2015.
  3. "Drift". SpinBowlingTips.com. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 4 February 2015.
  4. Brian Wilkins "The Bowler's Art"
  5. Bob Woolmer "The Art and Science of Cricket"