లెగ్ కట్టర్
ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
లెగ్ కట్టర్ అనేది క్రికెట్‌లో బౌలింగులో వేసే ఒక రకమైన డెలివరీ. ఇది ఫాస్ట్ బౌలర్లు వేస్తారు.
సాధారణ స్పిన్ డెలివరీలో బౌలరు, మణికట్టును కదల్చకుండా పెట్టి, మొదటి రెండు వేళ్లను బంతిపై ఉంచి, పిచ్ లెంగ్తుకు లంబంగా ఉండే అక్షం చుట్టూ తిప్పుతూ దానిని విడుదల చేస్తాడు. లెగ్ కట్టర్ వేసేందుకు, కుడిచేతి వాటం బౌలరైతే తన వేళ్లను బంతి ఎడమ వైపుకు లాగి (తన దృక్కోణం నుండి), చిటికెన వేలితో తిప్పుతూ చేతిలోంచి వదులుతారు. ఇది లెగ్ బ్రేక్ బౌలింగు లాంటిదే, కానీ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బంతి స్పిన్నయ్యే అక్షాన్ని మార్చి లెగ్ బ్రేక్ బంతి లాగా మారుస్తుంది. బంతి పిచ్‌పై బౌన్స్ అయ్యాక, బంతి ఎడమ వైపుకు టర్నవుతుంది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ దృష్టికోణంలో, ఈ విచలనం కుడివైపు లేదా లెగ్ సైడ్ నుండి ఆఫ్ సైడ్ వైపు ఉంటుంది. ఈ విచలనాన్ని కట్ అని, ఈ డెలివరీని లెగ్ కట్టర్ అనీ అంటారు. ఎందుకంటే ఇది లెగ్ సైడ్ నుండి దూరంగా పోతుంది.
సీమ్ నేలపై తాకి తద్వారా దూరంగా వెళ్లే సీమ్-అప్ డెలివరీకి, నిజమైన లెగ్ కట్టరుకూ తేడా ఏంటంటే లెగ్ కట్టరును ఉద్దేశపూర్వకంగా వేస్తారు.
లెగ్ కట్టర్లు లెగ్ స్పిన్ బౌలర్ బౌలింగ్ చేసిన లెగ్ బ్రేక్ లంత ఎక్కువగా టర్బ్ అవ్వవు. కానీ ఫాస్ట్ బౌలర్లు వేస్తారు కాబట్టి ఆ వేగం కారణంగా ఒక చిన్నపాటి విచలనం కూడా బ్యాటరుకు ఇబ్బంది కలిగిస్తుంది. బంతి కదలికకు త్వరగా స్పందించకపోతే, బంతి బ్యాట్ వెలుపలి అంచుకు తగిలి క్యాచ్‌కు పోవచ్చు.
ఫాస్ట్ బౌలర్లు సాధారణంగా లెగ్ కట్టర్‌ను వేరియేషన్ బాల్‌గా ఉపయోగిస్తారు. ఎందుకంటే బ్యాటరును ఆశ్చర్యపరిచినప్పుడే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లెగ్ కట్టర్ చర్యతో, బౌలర్ చేతి వేగంలో పెద్దగా మార్పేమీ లేకుండానే, మందకొడి బంతిని వేయవచ్చు. అలాంటి బంతి బ్యాటరు ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తుంది. మరోవైపు, డెలివరీలో వేగం లేకపోవడం ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ జెఫ్ థామ్సన్ వేసే లెగ్ కట్టర్ గురించి ఇలా వివరించాడు: "అతను ఈ లెగ్ కట్టర్ వేస్తాడు. అది వేసినపుడు మనకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బంతి మన తల మీదికి గంటకు 95 మైళ్ల వేగంతో రాదు కదా"
లెగ్ కట్టర్ వేసే అత్యంత ప్రముఖ బౌలర్లలో అలెక్ బెడ్సర్, ఫజల్ మహమూద్, దివంగత టెర్రీ ఆల్డెర్మాన్, కార్ల్ రాకేమాన్, వెంకటేష్ ప్రసాద్‌లు ఉన్నారు.
ఇండోర్ క్రికెట్‌లో లెగ్ కట్టర్లు చాలా తరచుగా కనిపిస్తాయి, ఎందుకంటే ఆట ఆడే మైదాన విస్తీర్ణం తక్కువగా ఉండడాన బౌలర్లు బౌలింగ్ చేయగల వేగం పరిమితం గానే ఉంటుంది. బ్యాటర్లు స్కోర్ చేయకుండా నిరోధించాలంటే వారు ఇలాంటి ఇతర పద్ధతులను ఉపయోగించాలి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆఫ్ కట్టర్