ఔట్‌స్వింగర్
ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
ఔట్‌స్వింగర్ అనేది క్రికెట్ క్రీడలో బౌలరు వేసే ఒక రకమైన డెలివరీ. అటువంటి డెలివరీలో బాల్ వంపు తిరుగుతూ - అంటే, "స్వింగ్" అవుతూ - బ్యాటరు శరీరం నుండి వికెట్ల నుండి దూరంగా పోతుంది. ఇన్‌స్వింగరు, దీనికి విరుద్ధంగా బ్యాటరు, వికెట్ల మీదికి స్వింగ్ అవుతుంది. ఔట్‌స్వింగర్లను స్వింగ్ బౌలర్లు వేస్తారు.
ఈ పదం ఫుట్‌బాల్ లోకి కూడా వెళ్ళింది. బంతిని క్రాస్ కిక్ చేసినపుడు అది గోల్‌పై కాకుండా గోల్ ముఖం నుండి వెలుపలికి స్వింగైనపుడు దాన్ని ఔట్‌స్వింగరు అంటారు.
పద్ధతి
[మార్చు]బంతి సీమ్‌ను ఒక కోణంలో పట్టుకుని, మొదటి రెండు వేళ్లను సీమ్‌కి ఇరువైపులా పట్టుకుని అవుట్‌స్వింగరు వేస్తారు. బంతిని 12 గంటల స్థానంలో విడుదల చేయాలి. ఫాలో త్రూ వద్ద చేతులు కొద్దిగా ఎడమ వైపుకు కదలాలి. మరింత బ్యాక్-స్పిన్ కోసం చేతులను క్రిందికి నెట్టాలి. అరిగిన బంతిని ఒకవైపే పాలిష్ చేసి, మెరిసే వైపు లెగ్ సైడుకు ఉండేలా పెట్టి, సీమ్‌ని మొదటి లేదా రెండవ స్లిప్ వైపు చూసేలా ఉంచాలి. గరుకు, మృదు ఉపరితలాలపై గాలి కదలిక వలన ఏర్పడే ఒత్తిడిలో తేడా వలన బంతి ఎడమ వైపుకు పోడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా బంతి మార్గం చాపాకారంలోకి మారుతుంది అంటే ఎడమవైపుకు స్వింగ్ అవుతుంది. కొత్త బంతి విషయంలో సీమ్‌ను స్వింగ్ అవ్వాల్సిన దిశలో ఉంచాలి. సీమ్ మీదుగా వీచే గాలి చీలిపోవడంలో ఉండే తేడా వలన, బంతి బ్యాటరు నుండి దూరంగా కదులుతుంది.
ప్రయోజనాలు
[మార్చు]కుడిచేతి వాటం బ్యాటరు దృక్కోణం నుండి చూస్తే, స్వింగ్ అతని శరీరం నుండి అతని కుడి వైపుకు, అంటే ఆఫ్ సైడ్ నుండి దూరంగా ఉంటుంది. శరీరానికి దూరంగా పోయే ఈ స్వింగే అవుట్‌స్వింగర్ అనే పేరుకు మూలం. ఎడమ చేతి బ్యాటరుకి, స్వింగ్ శరీరం వైపు, లెగ్ సైడ్ వైపు ఉంటుంది. సాంకేతికంగా చూస్తే అవుట్‌స్వింగర్ ఇప్పుడు ఇన్‌స్వింగర్‌గా మారుతుంది.
కుడిచేతి వాటం బ్యాటర్ ఆడటానికి అవుట్‌స్వింగర్‌లు చాలా కష్టతరమైన ఫాస్ట్ డెలివరీలలో ఒకటిగా పరిగణిస్తారు. బంతి అతని శరీరం నుండి దూరంగా వెళ్లడమే దీనికి కారణం. బ్యాటరు అంచనా తప్పితే, బంతి బ్యాట్ వెలుపలి అంచుకు తగిలి వికెట్ కీపరుకో స్లిప్స్ ఫీల్డర్‌లకో క్యాచ్ వెళ్తుంది.
వ్యూహాత్మక ఉపయోగం
[మార్చు]ఫాస్ట్ బౌలర్ సాధారణంగా కుడిచేతి వాటం బ్యాటర్‌కి పదే పదే అవుట్‌స్వింగర్‌లు వేస్తారు. బ్యాటర్‌ను అతని శరీరం నుండి దూరంగా ఆడేలా చేసి, పైన వివరించిన మార్గాలలో ఒకదానిలో బ్యాటరును ఔట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే, కొన్నిసార్లు బౌలరు మామూలు అవుట్‌స్వింగర్‌కు బదులుగా ఆఫ్ కట్టర్ వేసి బ్యాటర్‌ను మోసగించడానికి ప్రయత్నించవచ్చు. ఆ విధంగా బ్యాటర్‌ను బౌల్డ్ లేదా ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేయాలని చూస్తారు. చాలా సాధారణంగా, యార్కర్లు, బౌన్సర్లు వేసి బంతి లెంగ్తులో వైవిధ్యం సాధిస్తారు. మంచి డెలివరీ లెంగ్తు అంటే, స్టంప్‌ల పైభాగానికి చేరుకునేలా బంతిని వెయ్యడం. ఇది సాధారణంగా పిచ్ పొడవులో మూడింట రెండు వంతుల నుండి నాలుగింట మూడు వంతుల వరకు ఉంటుంది.