స్వింగ్ బౌలింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వింగ్ బౌలింగు, క్రికెట్ ఆటలో బౌలింగు చేయడానికి ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతిని వాడే బౌలర్లను స్వింగ్ బౌలర్లని పిలుస్తారు. స్వింగ్ బౌలింగు సాధారణంగా ఫాస్ట్ బౌలింగులో ఒక ఉపరకంగా వర్గీకరిస్తారు.

స్వింగ్ బౌలింగు లక్ష్యం ఏమిటంటే, బంతి గాలిలో ప్రయాణించేటపుడు పక్కకు మళ్ళేలా ('స్వింగ్' అయ్యేలా) చేయడం. వేగంగా వెళ్ళే బంతి అది వెళ్ళే మార్గంలో వచ్చే మార్పు బ్యాట్స్‌మన్‌ను మోసం చేస్తూ, వారు బంతిని కొట్టడంలో తప్పు చేసేందుకు కారణమవుతుంది. స్వింగ్ బౌలింగు, స్పిన్ బౌలింగు వేరువేరు. స్పిన్ బౌలింగులో బౌలర్లు బంతిని నెమ్మదిగా వేస్తారు. ఇది ప్రధానంగా నేలను తాకాక దిశను మార్చుకుంటుంది.

స్వింగ్ బౌలింగులో కొంచెమే అరిగిన కొత్త బంతిని ఉపయోగిస్తారు. బంతికి ఒక వైపున చెమటను ఉమ్మినీ పూయడం, అలాగే వారి దుస్తులపై రుద్దడం ద్వారా ఆ వైపున మెరుగు చేస్తూ ఉంటారు. (COVID-19 మహమ్మారి కారణంగా ఉమ్మి వాడకాన్ని ICC నిషేధించింది). అదే సమయంలో రెండవ వైపు గరుకుగానే ఉంటుంది. ఆట జరిగే కొద్దీ ఈ గరుకుదనం పెరుగుతూ ఉంటుంది. ఈ గరుకైన, మృదువైన వైపులపై వాయుప్రసరణ వేగం ఒకేలా ఉండదు. అందువలన బంతిని గరుకైన వైపుకు, మెరిసే వైపు నుండి దూరంగా వెళ్ళేలా చేస్తుంది. స్వింగ్ బౌలర్లు ఈ ప్రభావాన్ని పెంచేందుకు బంతిని పట్టుకునే పద్ధతిని కొద్దిగా మారుస్తూ ఉంటారు.

స్వింగులో రెండు ప్రధాన రూపాలున్నాయి. ఇన్‌స్వింగులో బంతి బ్యాట్స్‌మన్ నుండి దూరంగా మొదలై బ్యాట్స్‌మన్ శరీరం మీదికి ప్రయాణిస్తూ, స్టంప్‌ల వైపు వంగుతూ వస్తుంది. అవుట్‌స్వింగ్ బంతి స్టంప్‌ల లైనులోనే ప్రయాణిస్తూ బ్యాట్స్‌మన్‌ వద్దకు చేరే సమయానికి స్టంపుల నుండి ఆవలకు దూరంగా కదులుతుంది. ఆడేకొద్దీ బంతి మెరిసే వైపు కూడా అరిగిపోతూంటుంది కాబట్టి, బంతి కొత్తగా ఉన్నప్పుడే స్వింగ్ బౌలింగు ప్రభావవంతంగా ఉంటుంది. పాత బంతి స్పిన్ బౌలింగ్ లేదా ఇతర ఫాస్ట్ బౌలింగ్‌లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, రివర్స్ స్వింగ్ వంటి ఇతర రకాల స్వింగ్‌లు కూడా ఉన్నాయి, ఇందులో బాగా అరిగిపోయిన బంతినే వాడతారు.

స్వింగ్ బౌలింగ్ అనేది బంతి స్థితిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి, కొందరు బౌలర్లు బంతి స్థితిని మార్చేందుకు అక్రమమైన, నిషేధించిన పద్ధతులను ఆశ్రయిస్తూంటారు. దీనినే బాల్ టాంపరింగ్ అంటారు, ఇక్కడ జట్లు అదనపు స్వింగ్‌ను ఉత్పత్తి చేయడానికి సాండ్ పేపరు వంటి వస్తువులను ఉపయోగించి బంతిని అరగదీయడం వంటి చట్టవిరుద్ధమైన పద్ధతులను ఆశ్రయించారు.

సిద్ధాంతం

[మార్చు]
జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో స్వింగ్ బౌలరు

స్వింగ్ బౌలింగ్ ఉద్దేశ్యం ఏమిటంటే, బంతి గాలిలో ప్రయాణిస్తూండగా అది దాని మార్గం నుండి బ్యాటరు వైపుగా గానీ, లేదా బ్యాటరు నుండి దూరంగా గానీ మళ్లేలా చేయడం. దీన్ని సాధించడానికి బౌలరు ఆరు అంశాలను ఉపయోగించుకుంటాడు:

 • బంతి పైన ఎత్తుగా ఉండే సీమ్
 • ప్రయాణ దిశకు సీమ్‌కూ ఉండే కోణం [1]
 • బంతి అరుగుదల
 • బంతిపై ఉపయోగించే పాలిషింగ్ ద్రవం
 • బంతి వేగం
 • బౌలర్ యాక్షన్

ఫీల్డింగ్ టీమ్ సభ్యులు బంతికి ఒక వైపు పాలిష్ చేస్తూ రెండు వైపులా ఉపరితలం అసమానంగా ఉండేలా చేస్తారు. క్రమంగా ఇది, రెండు వైపుల ఏరోడైనమిక్ లక్షణాలలో వ్యత్యాసాన్ని ఉత్పత్తి చేస్తుంది.[2]

బంతి గాలిలో ప్రయాణించేటపుడు బంతిపై గాలి ప్రసరణలో ఉండే రకాలు - టర్బులెంటు ప్రవాహం, లామినారు ప్రవాహం రెండూ స్వింగ్‌కు దోహదం చేస్తాయి. లామినార్ ప్రవాహంలో గాలి టర్బులెంట్ ప్రవాహంలో గాలి కంటే ముందుగా బంతి ఉపరితలం నుండి వేరు చేయబడుతుంది. తద్వారా లామినార్ వైపున విభజన పాయింటు బంతి ముందు వైపుకు కదులుతుంది. టర్బులెంటు ప్రవాహం వైపు అది వెనుక వైపుకే ఉంటుంది. తద్వారా బంతికి టర్బులెంట్ వాయుప్రవాహం వైపు ఎక్కువ లిఫ్ట్ శక్తిని కలిగిస్తుంది. బంతిలో స్వింగు కలిగించేందుకు ఈ లిఫ్ట్‌ శక్తి మాత్రమే సరిపోదు. ప్రెజర్‌ గ్రేడియంట్‌ ఫోర్సు ఇందుకు అవసరమైన అదనపు బలాన్ని అందిస్తుంది.

సాంప్రదాయిక స్వింగ్

[మార్చు]

సాధారణంగా, ఒక స్వింగ్ బౌలర్ స్వింగ్ ప్రభావాన్ని బలోపేతం చేయడానికి సీమ్ బంతి వైపులా సమలేఖనం చేస్తాడు. ఇది రెండు విధాలుగా చేయవచ్చు:

 • ఔట్‌స్వింగర్: కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి అవుట్‌స్వింగర్‌ వేసేందుకు, సీమ్ స్లిప్‌ స్థానాల వైపు చూసేలా, గరుకుగా ఉండే వైపు ఎడమ వైపు ఉండేలా పట్టుకుంటారు. స్థిరమైన స్వింగ్‌ను తీయడానికి, బౌలరు తన చేతిని నిటారుగా ఉంచి, మణికట్టును స్లిప్‌ల వైపు తిప్పవచ్చు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి ఇలా బౌలింగు చేసినపుడు, గాల్లో ప్రయాణించే బంతి ఆఫ్‌సైడ్‌కి దూరంగా అవింగు అవుతూ, సాధారణంగా అతని శరీరం నుండి బయటికి పోతుంది. మాల్కం మార్షల్, రిచర్డ్ హ్యాడ్లీ, డొమినిక్ కార్క్, కోర్ట్నీ వాల్ష్, డేల్ స్టెయిన్ అవుట్‌స్వింగర్‌లలో గొప్ప ప్రతిభ చూపేవారు.
 • ఇన్‌స్వింగర్ : కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి ఇన్‌స్వింగర్‌ వేసేందుకు, సీమ్ ను కుడివైపుకు చూసేలా, గరుకుగా ఉండే వైపు కుడి వైపు ఉండేలా పట్టుకుంటారు. స్థిరమైన స్వింగ్‌ను తీయడానికి, బౌలరు తన చేతిని నిటారుగా ఉంచి, మణికట్టును కుడి వైపు తిప్పవచ్చు, లేదా "ఓపెన్ అప్" చేయవచ్చు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి, బంతి గాల్లో ఉన్నప్పుడు లెగ్ సైడ్‌ వైపుకు స్వింగు అవు తుంది,

స్వింగ్ డెలివరీల మార్గంలో ఏర్పడే వక్రత కారణంగా బ్యాట్స్‌మన్‌కి బంతిని కొట్టడం కష్టతరం అవుతుంది. సాధారణంగా, బౌలర్లు అవుట్‌స్వింగర్‌లు బౌలింగ్ చేస్తారు, ఎందుకంటే బంతి బ్యాట్స్‌మాన్ నుండి దూరంగా పోతుంది కాబట్టి, బ్యాటరు బంతిని కొట్టాలంటే దాన్ని "వెంటాడాలి". బ్యాట్‌ను శరీరం నుండి దూరంగా కొట్టడం ప్రమాదకరం, ఎందుకంటే బ్యాట్‌కూ శరీరానికీ మధ్య ఏర్పడే ఖాళీ గుండా బంతి పోయి వికెట్‌లను కొట్టేయవచ్చు. అలాగే, బ్యాట్స్‌మన్ స్వింగును తప్పుగా అంచనా వేస్తే, బంతి బ్యాట్ మధ్యలో తగలకుండా అంచుల్లో తగలవచ్చు. లోపలి అంచుకు తగిలితే, బంతి వికెట్ల పైకి దూసుకుపోయి, బ్యాటరు బౌల్డ్ అవుతాడు. బయటి అంచుకు తగిలితే, బంతి వికెట్ కీపరుకో స్లిప్ ఫీల్డర్‌లకో దొరికేసి, బ్యాటరు క్యాచ్ ఔట్ అవుతాడు.

ఆటలో ఎడమచేతి వాటం స్వింగ్ బౌలర్ల కొరత స్పష్టంగా ఉంది. [3] పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్, భారతదేశానికి చెందిన జహీర్ ఖాన్, ఆస్ట్రేలియాకు చెందిన అలన్ డేవిడ్‌సన్, శ్రీలంకకు చెందిన చమిందా వాస్‌లు అత్యంత ప్రసిద్ధ ఎడమచేతి స్వింగు బౌలర్లు.

రివర్స్ స్వింగ్

[మార్చు]
వకార్ యూనిస్ రివర్స్ స్వింగ్‌లో అగ్రగామిగా నిలిచాడు

బంతి చాలా కొత్తగా ఉన్నప్పుడు మామూలు స్వింగ్u చేస్తారు. ఇది మరింత అరిగినపుడు, అసమానత లోని ఏరోడైనమిక్స్ మారుతుంది. ఆ స్థితిలో పెద్ద మొత్తంలో స్వింగు చేయడం చాలా కష్టమౌతుంది. బంతి బాగా పాతబడినప్పుడు - దాదాపు 50 ఓవర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆడాక - దాన్ని మెరుపు ఉండే వైపుకు స్వింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ప్రధానంగా టెస్ట్ మ్యాచ్‌లలో బౌలర్లకు ఉపయోగపడుతుంది. దీనిని రివర్స్ స్వింగ్ అంటారు, అంటే సహజమైన అవుట్‌స్వింగరు ఇపుడు ఇన్‌స్వింగరుగాను, ఇన్‌స్వింగరు, అవుట్‌స్వింగరు గానూ మారతాయి. అయితే, వేగం తగినంత ఎక్కువగా ఉంటే (144 కి.మీ/గం కంటే ఎక్కువ) బంతి తన పథాన్ని వ్యతిరేకదిశలోకి మార్చుకోవచ్చు. దీనిని కాంట్రాస్ట్ స్వింగ్ లేదా రివర్స్ స్వింగ్ అని కూడా అంటారు.[4]

రివర్స్ స్వింగ్ సాధారణ స్వింగ్ కంటే బలంగా ఉంటుంది. బంతి పథంలో ఉండగా చాలా ఆలస్యంగా ఇది జరుగుతుంది. ఇది సాధారణ స్వింగ్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌లు దీనిని తక్కువ తరచుగా చూస్తారు కాబట్టి, దీన్ని ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. బంతి దాని ప్రారంభ ఫ్లైట్‌లో సాధారణంగా స్వింగ్ చేయడం, ఆపై బ్యాట్స్‌మన్‌ను సమీపిస్తున్నప్పుడు దాని స్వింగ్‌ను మార్చడం కూడా సాధ్యమే. దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు[5] ఒకటి, బంతి స్వింగ్ దిశను మార్చుకుని, 'S' ఆకారంలో ఉండే మార్గంలో ప్రయాణించడం: మరొకటి, ఇప్పటికే స్వింగ్ అవుతున్న దిశలోనే మరింత ఎక్కువ స్వింగు అవడం; ఈ రెండూ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టేవే. స్లిప్‌లలో క్యాచ్ దొరకడం, LBW, కీపరు క్యాచ్ పట్టుకోవడం, బౌల్డ్ అవడం వగైరా పద్ధతుల్లో అవుటయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1992 ప్రపంచ కప్ ఫైనల్‌లో వసీం అక్రమ్ వరుసగా రెండు డెలివరీల్లో, పై రెండు రకాలు ఒకదాని వెంట ఒకటి వేయడం, ఆ మ్యాచ్‌కి మలుపుగా పరిగణిస్తారు. [5]

రివర్స్ స్వింగుకు మార్గదర్శకులు, అభ్యాసకులు ఎక్కువగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు. రివర్స్ స్వింగ్ ప్రారంభ రోజులలో, రివర్స్ స్వింగ్‌ను అనుమతించే బాల్ పరిస్థితులను సాధించడానికి పాకిస్తాన్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. షహర్యార్ ఖాన్ ప్రకారం, లాహోర్‌లోని పంజాబ్ క్రికెట్ క్లబ్‌లో ఆడిన సలీం మీర్, రివర్స్ స్వింగ్‌ను కనుగొన్నాడు. దానిని తన సహచరుడు సర్ఫరాజ్ నవాజ్‌కు నేర్పించాడు. [6] సర్ఫరాజ్ నవాజ్ 1970ల చివరలో అంతర్జాతీయ క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ను ప్రవేశపెట్టాడు. దాన్ని తన సహచరుడు ఇమ్రాన్ ఖాన్‌కి నేర్పించగా, [7] అతను వసీం అక్రమ్, వకార్ యూనిస్ లకు బోధించాడు. ఆంగ్ల జంట ఆండ్రూ ఫ్లింటాఫ్, సైమన్ జోన్స్ లకు ట్రాయ్ కూలీ నేర్పించాడు. భారత బౌలర్లు జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ లు రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం ఉండేది.[8] బౌలర్లు రివర్స్ స్వింగ్ దిశను కనబడకుండా చేసేందుకు బంతిని వేరే చేతిలో ఉంచుకుని పరుగు మొదలుపెట్టి, కొంత దూరం తరువాత బంతిని అసల్కు చేతిలోకి మార్చుకునేవారు. బంతిని విడుదల చేయడానికి ముందు వీలైనంత ఎక్కువసేపు తమ పట్టును కనబడకుండా చేసేవారు. నీల్ వాగ్నర్ బాల్ రివర్స్ స్వింగు చేయబోతున్నట్లు చూపించడానికి ఈ పద్ధతిని వాడేవాడు. కానీ స్వింగ్ దిశను మార్చేవాడు.

ఆధునిక క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌కు సంబంధించి అనేక వివాదాలు ఏర్పడ్డాయి. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్టులో 50వ ఓవర్ తర్వాత బంతిని రివర్స్ స్వింగ్ చేయడం ప్రారంభించినప్పుడు, పాకిస్తాన్ బౌలర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆస్ట్రేలియన్ అంపైర్ డారెల్ హెయిర్ ఆరోపణలు చేసాడు.[9] అతని సహ అంపైర్ బిల్లీ డాక్ట్రోవ్ అతనికి మద్దతు ఇచ్చాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు లేవని తదుపరి విచారణలో తేలింది. [10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Penrose, J.M.T., Hose, D.R. & Trowbridge, E.A. (1996) Cricket ball swing: a preliminary analysis using computational fluid dynamics. In: S.J. Haake (Ed.)The Engineering of Sport. A.A. Balkema, Rotterdam, pp. 11–19.
 2. . "An overview of cricket ball swing".
 3. Giridhar, S; Raghunath, V. J. (2014). Mid-Wicket Tales: From Trumper to Tendulkar. SAGE Publications. p. 115. ISBN 9789351500902.
 4. "How England reversed a losing trend". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2005-08-18. ISSN 0261-3077. Retrieved 2021-01-13.{{cite news}}: CS1 maint: url-status (link)
 5. 5.0 5.1 "Short, sweet and sensational". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-01-13.
 6. Shaharyar M. Khan and Ali Khan, Cricket Cauldron, I.B. Tauris, London, 2013, p. 180.
 7. BBC SPORT – Cricket – England – What is reverse swing?
 8. Forgotten Hero Archived 16 డిసెంబరు 2008 at the Wayback Machine
 9. "As the chaos unfolded". Cricinfo (in ఇంగ్లీష్). 2006-08-20. Retrieved 2021-01-13.
 10. "I therefore conclude, (1) Mr ul-Haq is not guilty of the charge of ball-tampering..."