యార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రికెట్‌లో, యార్కర్ అనేది బ్యాట్స్‌మన్ పాదాలకు దగ్గరలో పిచ్‌ను తాకే బంతి. యార్కరు బంతి, పిచ్‌పై పాపింగ్ క్రీజ్‌ వద్ద తాకుతుంది. బంతిని కొట్టడానికి పిచ్‌పైకి వెళ్లే బ్యాటరుకు సరిగ్గా పాదాల వద్ద బంతి పడి, పైకి లేస్తుంది.[1] యార్కరును అత్యంత కష్టమైన డెలివరీలలో ఒకటిగా పరిగణిస్తారు. [2]

వ్యుత్పత్తి[మార్చు]

ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం, ఈ పదం ప్రముఖ ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీ అయిన యార్క్‌షైర్‌లో ఉద్భవించింది. [3]

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల ప్రకారం, యార్క్‌కు చెందిన ఆటగాళ్ళు ఈ డెలివరీలను బౌలింగ్ చేయడం వల్ల ఈ పదాన్ని రూపొందించారు. మరొక సిద్ధాంతం ప్రకారం ఈ పేరు యార్కర్‌కు ఉన్న మోసం అనే అర్థం నుండి వచ్చింది.[4] అయితే, ఇతర వ్యుత్పత్తులు కూడా చెబుతారు. ఈ పదం 18వ, 19వ శతాబ్దపు యాస పదమైన "టు పుల్ యార్క్‌షైర్‌" అనే పదం నుండి (దీని అర్థం మోసం చేయడం) ఉద్భవించి ఉండవచ్చు. [5] అయితే మధ్యయుగ ఆంగ్ల పదం యుయెర్కే (మాయ చేయడం లేదా మోసం చేయడం) నుండి కూడా వచ్చి ఉండవచ్చు.

క్రిస్ స్కోఫీల్డ్ ఒక యార్కర్‌తో బౌల్డ్ అయ్యాడు

ఆట[మార్చు]

యార్కర్‌ వేసి బ్యాటరును బీట్ చేసినపుడు యార్క్ చేసినట్లు చెబుతారు. ఈ సందర్భంలో "బీట్" అంటే బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయ్యాడనో, ఎల్‌బిడబ్ల్యు అయ్యాడనో అర్థం కాదు. బ్యాట్‌తో కొట్టబోయి బంతిని మిస్ అయినట్లు. యార్కర్‌ వేయబోయి, యార్క్ చేయని బంతిని అటెంప్టెడ్ యార్కర్‌ అంటారు.

తన సాధారణ స్థితిలో నిలబడి ఉన్న ఒక బ్యాటరు, బౌలరు వేసిన బంతి వస్తున్నపుడు బ్యాటును పైకి లేపుతాడు. దాంతో బ్యాటరు పాదాల వద్ద పడే యార్కరు బంతిని ఆడటం కష్టతర మవుతుంది. ఆ బంతి యార్కరనీ, దాన్ని అడ్డుకోడానికి బ్యాటును కిందికి పెట్టాలనీ ("డిగ్ అవుట్") గ్రహించడానికి చాలా ఆలస్యమౌతుంది.[6]

వాడుక[మార్చు]

యార్కర్లు ఆడటం చాలా కష్టం. బ్యాటరు ప్రాక్టీసులో యార్కరును ఆడుతున్నాడు

యార్కరు బౌలింగ్ చెయ్యడానికి కూడా కష్టతరమైనదే. ఎందుకంటే సరైన లెంగ్తు, టైమింగూ లేని డెలివరీ ఫుల్ టాస్ గానీ, హాఫ్-వాలీ గానో పోతుంది. దానిని బ్యాటరు సులభంగా ఆడేస్తారు. యార్కర్లు వెయ్యడమనేది ఫాస్ట్ బౌలర్లు తరచుగా అనుసరించే వ్యూహం. ఫాస్ట్ యార్కర్ అనేది బ్యాటరుకు అత్యంత కష్టతరమైన డెలివరీ రకాల్లో ఒకటి, ఎందుకంటే బంతిని అడ్డగించడానికి బ్యాట్‌ను పిచ్‌కి కుడివైపుకి స్వింగ్ చేయాలి. బ్యాటుకు, పిచ్‌కూ మధ్య ఏదైనా గ్యాప్ మిగిలి ఉంటే, బంతి దూరిపోయి, వికెట్లను కొట్టే అవకాశం ఉంది. యార్కర్ బ్యాట్‌ను మిస్సై వికెట్ ముందు ప్యాడ్‌లకు తగిలి, బ్యాటరు ఎల్బీడబ్ల్యూ అవుట్ కావచ్చు. బ్యాటరు అటువంటి బంతిని అడ్డుకున్నప్పుడు, దానిని "డగ్ అవుట్" అంటారు. యార్కర్లను వేస్తూ, స్వింగ్ కూడా సాధించే బౌలరు మరింత ప్రమాదకరంగా ఉంటాడు. ఎందుకంటే బంతి బ్యాట్స్‌మన్ వైపుకు వెళ్లినప్పుడు పక్కకు మళ్లుతూ, కొట్టడం మరింత కష్టతరం చేస్తుంది.

యార్కర్‌లను నేరుగా బ్యాట్స్‌మన్ పాదాలకు గురి చేయవచ్చు. బ్యాట్స్‌మన్ బంతిని ఆడటానికి ప్రయత్నించేటప్పుడు అతని పాదాలను మార్చవలసి వస్తుంది లేదా దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఇన్‌స్వింగింగ్ యార్కర్‌లు ముఖ్యంగా డిఫెండ్ చేయడం కష్టమని, పరుగులు సాధించడం కష్టమనీ భావిస్తారు. ఇటువంటి బంతిని వాడుకలో శాండ్‌షూ క్రషర్ అనీ టో క్రషర్ అనీ అంటారు.[7] కాబ్లర్స్ డిలైట్ లేదా నెయిల్ బ్రేకర్ అని కూడా అంటారు. ఇటీవలి కాలంలో వైడ్ యార్కర్ కూడా వేస్తున్నారు. ఇది ఆఫ్ సైడ్‌లో బ్యాటరుకు దూరంగా వేస్తారు. ముఖ్యంగా బ్యాటరును ఔట్ చేయడం కంటే పరుగులను అడ్డుకునే వ్యూహం ఉండే ట్వంటీ20 క్రికెట్‌లో ఇది ఉపయోగపడుతుంది. [8]

యార్కర్లతో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా బౌలింగ్ చేయడం చాలా కష్టం. సాధారణంగా అనేక ఓవర్లలో కొన్ని సార్లు మాత్రమే ప్రయత్నిస్తారు. బ్యాట్ వేగంతో కాకుండా షార్ట్-పిచ్ బంతులను కొట్టడానికి అలవాటు పడ్డ బ్యాటరును ఆశ్చర్యపరిచేందుకు యార్కర్‌లు వేస్తారు. అందువల్ల, బ్యాట్స్‌మన్ ప్రతిస్పందించడానికి, అతని బ్యాట్‌ను అడ్డుగా ఉంచడానికీ సమయం సరిపోక తరచుగా బౌల్డ్ అవుతూంటారు.

మరీ ముఖ్యంగా బలహీనమైన చివరి వరుస బ్యాటర్లపై యార్కరు ప్రభావవంతంగా ఉంటుంది. స్వింగ్ చేయని యార్కర్‌నుండి కూడా రక్షించుకునే నైపుణ్యం ఉండని ఈ బ్యాటర్లు ఈ యార్కరుకు బలి అవుతూంటారు. వన్-డే క్రికెట్‌లో ఇన్నింగ్స్ చివరి దశలలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే యార్కరు ద్వారా వేగంగా పరుగులు సాధించడం చాలా కష్టం.

యార్కర్లను వేయడంలో పాకిస్థానీలు వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, శ్రీలంక లసిత్ మలింగ, ఆస్ట్రేలియన్లు బ్రెట్ లీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ జాన్సన్, న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, షేన్ బాండ్, టిం సౌథీ, సౌత్ ఆఫ్రికా బౌలర్లు డేల్ స్టెయిన్, అలాన్ డొనాల్డ్, వెస్ట్ ఇండియన్లు పాట్రిక్ ప్యాటర్సన్, మాల్కం మార్షల్, కోర్ట్నీ వాల్ష్, కర్ట్లీ ఆంబ్రోస్, జెరోమ్ టేలర్, భారతీయులు జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, టి. నటరాజన్, ఆంగ్లేయులు ఆండ్రూ ఫ్లింటాఫ్, క్రిస్ జోర్డాన్ లు ప్రసిద్ధి చెందారు.

రకరకాల డెలివరీలుం వాటి ఎత్తు లను చూపే చిత్రం

యార్కర్ వేయడం[మార్చు]

యార్కర్ సాధారణంగా బౌలింగ్ యాక్షనులో చాలా ఆలస్యంగా బంతిని వదులుతారు. ఫ్లైట్‌లో బ్యాటరును మోసం చేయడానికి మరింత పేస్‌ని పొందడం, తర్వాత డెలివరీ చేయడం - ఈ రెండూ లక్ష్యంగా ఉంచుకుంటారు. సాధారణంగా కొంత ఇన్‌స్వింగ్‌తో బంతిని వేయాలని భావిస్తారు గానీ, ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని దూరంగా స్వింగయ్యేలా వేసే యార్కర్ కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది. యార్కర్లు బౌలింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి నిలకడగా వెయ్యాలంటే వారికి గణనీయమైన అభ్యాసం అవసరం. [9]

మూలాలు[మార్చు]

  1. Smyth, Rob (2011-05-20). "Shane Warne's last game: Mumbai v Rajasthan – as it happened". The Guardian (in ఇంగ్లీష్). Retrieved 2020-09-09.
  2. "What is a 'Yorker'? Why is it an unplayable delivery for batsmen?". CricketAddictor (in అమెరికన్ ఇంగ్లీష్). 2 February 2019. Retrieved 2020-10-18.
  3. Shorter Oxford English dictionary. United Kingdom: Oxford University Press. 2007. p. 3804. ISBN 978-0199206872.
  4. "The origins of cricket jargon". BBC Bitesize.
  5. "The origins of cricket jargon". BBC Bitesize. Retrieved 17 November 2018.
  6. "Delivering the yorker with deadly accuracy". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-07-05. Retrieved 2020-09-09.
  7. "'You can't master it': Jasprit Bumrah on his toe-crushing yorkers". mint (in ఇంగ్లీష్). 2019-07-03. Retrieved 2020-09-09.
  8. "The Wide Yorker". The Ultimate Cricketer. Retrieved 1 April 2016.
  9. "To york or not to york in T20?". Cricinfo (in ఇంగ్లీష్). 2018-05-07. Retrieved 2020-09-09.
"https://te.wikipedia.org/w/index.php?title=యార్కర్&oldid=4192141" నుండి వెలికితీశారు