ఆఫ్ కట్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

కుడిచేతి వాటం బౌలర్‌కు ఆఫ్-కట్టర్ గ్రిప్ (బ్యాటరు దృష్టికోణంలో).

ఆఫ్ కట్టర్ అనేది క్రికెట్ ఆటలో ఒక రకమైన డెలివరీ. దీన్ని ఫాస్ట్ బౌలర్లు వేస్తారు.

సాధారణ స్పిన్ డెలివరీలో బౌలరు, మణికట్టును కదల్చకుండా పెట్టి, మొదటి రెండు వేళ్లను బంతిపై ఉంచి, పిచ్ లెంగ్తుకు లంబంగా ఉండే అక్షం చుట్టూ తిప్పుతూ దానిని విడుదల చేస్తాడు. ఆఫ్ కట్టర్ వేసేందుకు, కుడిచేతి వాటం బౌలరైతే తన వేళ్లను బంతి కుడి వైపున లాగి (తన దృక్కోణం నుండి) చేతిలోంచి వదులుతారు. ఇది ఆఫ్ బ్రేక్ బౌలింగు లాంటిదే, కానీ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బంతి స్పిన్నయ్యే అక్షాన్ని మార్చి ఆఫ్ బ్రేక్ డెలివరీ లాగా మారుస్తుంది. బంతి పిచ్‌పై బౌన్స్ అయ్యాక, బంతి కుడి వైపుకు టర్నవుతుంది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ దృష్టికోణంలో, ఈ విచలనం ఎడమవైపుకు అంటే, ఆఫ్ సైడ్ నుండి లెగ్ సైడ్ వైపు ఉంటుంది. ఈ విచలనాన్ని కట్ అని, ఈ డెలివరీని ఆఫ్ కట్టర్ అనీ అంటారు. ఎందుకంటే ఇది ఆఫ్ సైడ్ నుండి దూరంగా పోతుంది.

సీమ్‌పై పడి టర్నయ్యే డెలివరీకి, అసలైన ఆఫ్ కట్టరుకూ తేడా ఏమిటంటే, ఆఫ్ కట్టరు ఉద్దేశపూర్వకంగా వేస్తారు. చూపుడు వేలు, మధ్య వేళ్లను నిలువు సీమ్‌కి ఒక వైపున పెట్టి కూడా ఒక ఫాస్ట్ ఆఫ్ కట్టర్‌ను వేయవచ్చు. బ్రియాన్ స్టాథమ్,[1] రే లిండ్‌వాల్‌లు[2] ఇలా వేస్తారు.

ఆఫ్ కట్టర్లు ఆఫ్ స్పిన్ బౌలర్ వేసే ఆఫ్ బ్రేక్‌లంత ఎక్కువగా టర్నవవు. కానీ ఫాస్ట్ బౌలరు వేసే వేగం కారణంగా చిన్నపాటి విచలనం కూడా బ్యాటరుకు పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది. బంతి కదలికకు అనుగుణంగా వేగంగా స్పందించకపోతే, బ్యాటరు బంతిని మిస్ అవ్వవచ్చు. అది ప్యాడ్‌లపై తగిలి బ్యాట్ - ప్యాడ్ క్యాచ్ అవుటవడమో, లెగ్ బిఫోర్ వికెట్ అవడమో, బౌల్డ్ అవడమో జరగొచ్చు.

ఫాస్ట్ బౌలర్లు, ఆఫ్ కట్టర్‌ను వైవిధ్యం కోసం ఉపయోగిస్తారు. బ్యాటరును ఆశ్చర్యపరిచినప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వకార్ యూనిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గ్లెన్ మెక్‌గ్రాత్, రిచర్డ్ హ్యాడ్లీ, ఫ్రెడ్ ట్రూమన్‌లు ఆఫ్ స్టంప్ లైన్‌కు దగ్గరగా, బ్యాటరుకు 2 నుండి 3 అంగల ముందు బంతి నేలను తాకే ఖచ్చితమైన లెంగ్తులో వేయగల సామర్థ్యం కారణంగా పుంజీడు వికెట్లు సాధించారు.

ఈ డెలివరీలో బంతి విడుదలైన తర్వాత సీమ్‌ బ్యాటరు వైపు వంగి ఉండి, ఊగుతూ ఉండే విలక్షణమైన చలనాన్ని బట్టి ఇది ఆఫ్ కట్టరని బ్యాటర్లు గ్రహిస్తారు. కొత్తవాళ్ళు కట్టర్‌లను బౌల్ చేయడం నేర్చుకోవడానికి ఒక సాధారణ మార్గం ఏమిటంటే, సీమ్‌ను నిట్ట నిలువుగా ఉంచుతూ, విడుదల సమయంలో సీమ్‌ను కింది లాగడం ద్వారా బంతికి బలమైన బ్యాక్-స్పిన్ ఇవ్వడం.

ముఖ్యంగా గరుకుగా ఉండే పిచ్‌లపైన లేదా పైచ్‌పై ఏర్పడిన పగుళ్లపై బంతి పడినప్పుడూ కట్టర్లు బాగా పని చేస్తాయి. ఇటువంటి ఉపరితలాలు సీమ్‌ను పట్టేసి, రివర్స్ రొటేషన్‌ను ఆపేస్తాయి. ఇది గణనీయమైన విచలనానికి దారి తీస్తుంది. అలాగే నేలను తాకాక బంతి లేచే ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇలాంటి తక్కువ ఎత్తుకు లేచే బంతులను 'షూటర్లు' అని కూడా పిలుస్తారు. వెస్టిండీస్, భారత ఉపఖండంలో జరిగిన మ్యాచ్‌లలో లాన్స్ క్లూసెనర్ ఈ వ్యూహాన్ని ఉపయోగించాడు. ముఖ్యంగా తన కెరీర్ చివరిలో వేగం కొంత తగ్గిన సమయంలో, కలకత్తాలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ పద్ధతి వాడాడు.

టెస్ట్ మ్యాచ్‌లలో బౌలర్లు, నెర్రెలిచ్చిన పిచ్‌పై సరిగ్గా పగులు మీద పడేలా బంతిని వేసి అనూహ్యమైన టర్నును పొందే ప్రయత్నం చేస్తారు. కచ్చితంగా పగులుపై పడిన బంతులు, బాగా ఆడుతూ పాతుకుపోయి ఉన్న బ్యాటర్లను కూడా కలవరపరుస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

  • లెగ్ కట్టర్

మూలాలు[మార్చు]

  1. "Brian Statham: A great fast bowler who was once the highest wicket-taker in Tests". 16 June 2013. Retrieved 21 May 2016.
  2. "Australian Bowling Greats: A Bat, A Ball and A Boy - Part 3 - Cricket History". YouTube. Archived from the original on 2022-02-08. Retrieved 21 May 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)