Jump to content

కానోపస్ నక్షత్రం

వికీపీడియా నుండి
Canopus

An image of Canopus by Expedition 6
Observation data
Epoch J2000      Equinox J2000
Constellation Carina
Pronunciation /kəˈnpəs/
Right ascension  06h 23m 57.10988s[1]
Declination −52° 41′ 44.3810″[1]
Apparent magnitude (V) −0.74[2]
Characteristics
Spectral type A9 II[3][4]
U−B color index +0.10[2]
B−V color index +0.15[2]
Astrometry
కోణీయ వేగం (Rv)20.3[5] km/s
Proper motion (μ) RA: 19.93[1] mas/yr
Dec.: 23.24[1] mas/yr
Parallax (π)10.55 ± 0.56[1] mas
ఖగోళ దూరం310 ± 20 ly
(95 ± 5 pc)
Absolute magnitude (MV)–5.71[6]
Details
Mass8.0±0.3[7] M
Radius71±4[7] R
Luminosity10,700[7] L
Surface gravity (log g)1.64±0.05[7] cgs
Temperature6,998[7] K
Metallicity [Fe/H]–0.07[6] dex
Rotational velocity (v sin i)8.0[6] km/s
Other designations
Suhayl, Suhel, Suhail, Alpha Carinae, CPD−52°1941, FK5 245, GC 8302, HD 45348, HIP 30438, HR 2326, SAO 234480
Database references
SIMBADdata
35°38′N అక్షాంశం వద్ద వున్న టోక్యో నగరంలో కానోపస్ నక్షత్రం క్షితిజానికి దగ్గరలో మాత్రమే కనిపిస్తుంది.

కెరీనా (Carena) అనే నక్షత్రరాశిలో కనిపించే ఉజ్వలమైన నక్షత్రం కానోపస్. ఇది దక్షిణార్ద గోళానికి సంబంధించిన నక్షత్రాలలో అతి ప్రకాశవంతమైనది. లేత పసుపు-తెలుపు రంగులో ప్రకాశించే దీని దృశ్య ప్రకాశ పరిమాణం – 0.74. నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -5.71. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలలో రెండవది కానోపస్ నక్షత్రం. (మొదటిది సిరియస్). ఇది మనకు 313 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కెరీనా నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్ధతిలో ‘Alpha Carinae’ (α Car) గా సూచిస్తారు. తెలుగులో దీనిని ‘అగస్త్య’ నక్షత్రంగాగా వ్యవహరిస్తారు. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్, డీప్ స్పేస్ ప్రోబ్ ల స్థానాన్ని సర్దుబాటు చేయడానికి ఈ నక్షత్రం నుండి వెలువడే కాంతిని ఉపయోగిస్తారు.

ఉజ్వలంగా మెరిసే కానోపస్ నక్షత్రం F సూపర్ జెయంట్ తరగతికి చెందిన ‘ప్రధాన క్రమ’ (Main Sequence) దశలో వున్న నక్షత్రం. వర్ణపటరీత్యా A9II వర్ణపట తరగతికి చెందిన నీలి-తెలుపు (Blue- White) వర్ణనక్షత్రం. అయినప్పటికీ లేత పసుపు-తెలుపు రంగులో కనిపించే దీనిని F0Ib తో సూచిస్తారు. Ib అనేది సూపర్ జెయంట్ స్టార్ కేటగిరిలో తక్కువ తేజస్సుతో వున్నదని సూచిస్తుంది. ఇది సూర్యునికంటే వ్యాసంలో 71 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 13,600 రెట్లు పెద్దది.

నక్షత్ర పరిశీలన

[మార్చు]

కరీనా అనే నక్షత్రరాశిలో అతి ప్రకాశవంతంగా కనిపించే కానోపస్ నక్షత్రాన్ని, సిరియస్ నక్షత్రానికి దక్షిణంగా సులభంగా గుర్తించవచ్చు. మహోజ్వల నక్షత్రం సిరియస్ కు మరింత దిగువన అంటే దక్షిణంగా కానోపస్ నక్షత్రం (సిరియస్ నక్షత్రానికి 36 డిగ్రీల దిగువన) కనిపిస్తుంది. దక్షిణార్ధ గోళంలో ఈ రెండు నక్షత్రాలు జంటగా వేసవి కాలంలో రాత్రిపూట ఆకాశంలో నడి నెత్తిన కనిపిస్తాయి. మామూలు కంటికి కూడా స్పష్టంగా ప్రకాశవంతంగా జంట కాంతిపుంజాల వలె మెరుస్తూ కనిపిస్తాయి. ఈ విధంగా ఉత్తరార్ధగోళంలో వున్న వారికి కనిపించదు.

దృశ్యత

[మార్చు]

కానోపస్ నక్షత్రం వాస్తవానికి దక్షిణార్ధ గోళంలో కనిపించే నక్షత్రం. కనుక ఉత్తరార్ధ గోళంలో వున్న వారికి ఆకాశంలో ఇది దక్షిణ కొసన చివరలో మాత్రమే కనిపిస్తుంది. దక్షిణార్ధ గోళంలోని ప్రాంతాలలో స్పష్టంగా కనిపించే ఈ నక్షత్రం, భూమధ్యరేఖకు మరింత ఉత్తరంగా పోయే కొలదీ ఈ నక్షత్రం కనిపించడం తగ్గిపోతుంది. భూమధ్యరేఖకు కొద్దిగా సమీపంలోనే వున్న భారతదేశంలో క్షితిజానికి (horizon) సమీపంలో కనిపిస్తుంది. భారతదేశ ప్రధాన భూభాగంలో ఏ ప్రాంతంలో నుండి చూసినా కానోపస్ నక్షత్రం క్షితిజానికి గరిష్ఠంగా 30° ఎత్తుకు మించి కనపడదు. ఉదాహరణకు కన్యాకుమారి అగ్రంలో క్షితిజానికి 29.2° ఎత్తులో కనిపించే ఈ నక్షత్రం శ్రీనగర్లో క్షితిజానికి మరింత దగ్గరగా అంటే కేవలం 3.22° ఎత్తులోనే కనిపిస్తుంది. భారతదేశంలో ఈ నక్షత్రం చెన్నై నగరంలో క్షితిజానికి 24.2° ఎత్తు లోను, విజయవాడలో 20.8° ఎత్తులోను, ముంబైలో 18.2° ఎత్తులో, కొలకత్తాలో 14.7° ఎత్తులోను, న్యూ ఢిల్లీలో క్షితిజానికి 8.69° ఎత్తులో మాత్రమే కనిపిస్తుంది. టోక్యో (జపాన్) నగరంలో ఈ నక్షత్రం క్షితిజానికి కేవలం 1.65° ఎత్తులో మాత్రమే కనిపిస్తుంది. 37.30° ఉత్తర అక్షాంశ ప్రాంతం నుండి చూస్తే ఇది క్షితిజం మీద ఉంటుంది. సిద్ధాంతపరంగా కానోపస్ నక్షత్రాన్ని చూడడానికి దృశ్య అక్షాంశ పరిమితి 37° 18' 15.62" N. అందువలన 37° 18' 15.62" N కు ఉత్తరంగా వున్నఅక్షాంశ ప్రాంతాల వారికి ఆకాశంలో కానోపస్ నక్షత్రం కనిపించదు. 37° 18' 15.62" N కు దక్షిణంగా వున్న అక్షాంశ ప్రాంతాల వారికి మాత్రమే ఆకాశంలో కానోపస్ నక్షత్రం కనిపిస్తుంది.

జనవరి - ఏప్రిల్ నెలల మధ్య కాలంలో ఆకాశంలో కనిపించే కానోపస్ ఉత్తరార్ధ గోళంలో శీతాకాలంలో కనిపించే నక్షత్రం కాగా దక్షిణార్ధ గోళంలో వేసవికాలంలో కనిపించే నక్షత్రం అవుతుంది.

37° 18' 15.62" S కు దక్షిణాన్న కానోపస్ నక్షత్రం ధ్రువ పరిభ్రమణ తారగా వుంటుంది. దీని దిక్పాతం సుమారుగా 52° 41' 44.38" S. అందువల్ల 37° 18' 15.62" S కు దక్షిణంగా వున్న అక్షాంశ ప్రాంతాలపై నుండి ఆకాశంలో చూస్తే కానోపస్ నక్షత్రం ఖగోళ దక్షిణ ధ్రువం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు వుంటుంది. ఉదాహరణకు విక్టోరియా, టాస్మానియా, (ఆస్ట్రేలియా), ఆక్లాండ్, దాని దక్షిణ ప్రాంతం (న్యూజిలాండ్), బహియా బ్లాంకా, (అర్జెంటీనా),, వాల్డివియా (చిలీ) నకు దక్షిణంగా వున్న నగరాల నుండి చూసినపుడు ఈ నక్షత్రం ఖగోళ దక్షిణ ధ్రువం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు వుంటుంది.

దూరం

[మార్చు]

మన సౌర వ్యవస్థ నుండి కానోపస్ నక్షత్రంనకు గల దూరాన్ని 1990 వరకూ సరిగా నిర్ధారించలేక పోయారు. హిప్పార్కస్ శాటిలైట్ టెలీస్కోప్ను ప్రయోగించక మునుపు ఈ దూరం 96 నుండి 1200 కాంతి సంవత్సరాల వరకు ఉండవచ్చని స్థూలంగా అంచనా వేసేవారు. హిప్పార్కస్ ప్రయోగం తరువాత కానోపస్ నక్షత్రం మనకు 313 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నిర్ధారించారు. ఈ సూపర్ జెయింట్ నక్షత్రం 20.5 కి.మీ./సె. రేడియల్ వేగంతో మన సౌర వ్యవస్థ నుండి బయటకి దూరంగా వెళ్లిపోతున్నది.

భ్రమణ వేగం

[మార్చు]

కానోపస్ నక్షత్రం కూడా సూర్యుని మాదిరిగా తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ వుంటుంది. దీని భ్రమణ వేగం (Rotational Velocity) 8 కి.మీ./సెగా అంచనా వేయబడింది. సాపేక్షకంగా ఇంత తక్కువ భ్రమణ వేగం వుండటం వల్ల ఈ నక్షత్రం యొక్క మధ్య రేఖ అంచులు బల్లపరుపు (flat) గా అయ్యే అవకాశం ఎక్కువగా వుండదు.

పరిమాణం - ద్రవ్యరాశి

[మార్చు]

కానోపస్ నక్షత్రం సూర్యుని కంటే వ్యాసంలో 71 రెట్లు పెద్దది. (71 D☉). మన సౌర వ్యవస్థలో సూర్యుని స్థానంలో ఈ జెయింట్ నక్షత్రాన్ని ఉంచినట్లయితే, అది సుమారుగా బుధ గ్రహం కక్ష్యను తాకుతున్నట్లుగా విస్తరిస్తుంది. అంటే సూర్యుడు-బుధుడుకు గల దూరంలో 90% దూరం వరకూ చొచ్చుకొనివస్తుంది. ఇంత సూపర్ జెయింట్ స్టార్ అయినప్పటికి కానోపస్ సూర్యుని కంటే ద్రవ్యరాశిలో సుమారు 8 రెట్లు మాత్రమే పెద్దది. (8.0 M☉).

ప్రకాశం

[మార్చు]

సిరియస్ నక్షత్రం తరువాత భూమిపై నుంచి చూస్తే ఆకాశంలో కనిపించే రెండవ ఉజ్వలమైన నక్షత్రం కానోపాస్. నిజానికి మన గెలాక్షీ విభాగంలో అత్యంత ప్రకాశవంతమైన ఎఫ్ (F) తరగతి సూపర్ జెయింట్ స్టార్ కూడా ఇదే.[8] ఎక్స్ రే లలో గమనిస్తే అత్యంత ప్రకాశవంతమైన సూపర్ జెయింట్ స్టార్ కూడా ఇదే.[9]

కానోపస్ నక్షత్రం యొక్క దృశ్య ప్రకాశ పరిమాణం విలువ -0.74. సూర్యుని మినహాయిస్తే ఈ విధంగా ఋణాత్మక (దృశ్య పరిమాణ) విలువలు గలవి కేవలం నాలుగు నక్షత్రాలు మాత్రమే (సిరియస్ A, కానోపస్, ఆల్ఫా సెంచూరి, స్వాతి) ఉన్నాయి. దీని నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -5.71. అంటే కానోపస్ నక్షత్రాన్ని భూమి నుంచి 10 parsec నియమిత దూరంలో వుంచినపుడు దాని ప్రకాశ పరిమాణం విలువ -5.71.

సిరియస్ A, కానోపస్ - ఈ రెండు నక్షత్రాల ప్రకాశాలను తులనాత్మకంగా పరిశిలిస్తే సిరియస్ A, కానోపస్ నక్షత్రాల దృశ్య ప్రకాశ పరిమాణం విలువలు వరుసగా -1.47, -0.74. నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువలు వరుసగా +1.45, -5.53. అవి మనకు 8.6, 313 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. రెండు నక్షత్రాలు ఉజ్వలమైనవే అయినప్పటికీ, సిరియస్ కు తక్కువ దృశ్య ప్రకాశ పరిమాణం కలిగి వున్నందున సాధారణ కంటికి కానోపస్ కన్నా సిరియస్ నక్షత్రమే ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే కానోపస్ కు తక్కువ నిరాపేక్ష ప్రకాశ పరిమాణం కలిగి వుండటం వల్ల నిజానికి కానోపస్ నక్షత్రమే ఎక్కువ ప్రకాశవంతమైనది. దీనికి కారణం మనకు సిరియస్ A తో గల దూరం (8.6 కాంతి సంవత్సరాలు) తో పోలిస్తే కానోపస్ నక్షత్రం అత్యంత దూరంలో (313 కాంతి సంవత్సరాలు) ఉంది. అంటే మనకు వేర్వేరు దూరాలలో వున్న సిరియస్ నక్షత్రం (8.6 కాంతి సంవత్సరాలు), కానోపస్ నక్షత్రం (313 కాంతి సంవత్సరాలు) లను ఒకే నియమిత దూరంలో వుంచి పరిశీలిస్తే మాత్రం కానోపస్ నక్షత్రమే అత్యంత ప్రకాశవంతంగా వుంటుంది.

ఉష్ణోగ్రత

[మార్చు]

కానోపస్ ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా 7,000°K. అయితే దీని కరోనా అంతర్భాగంలో ఉష్ణోగ్రత అనేక మిలియన్ల డిగ్రీల వరకు ఉంది. ఈ నక్షత్రం యొక్క బాహ్య పొరలలో జరుగుతున్న ఉష్ణ సంవాహనాలకు, దీని వేగవంతమైన భ్రమణం కూడా తోడవడం వల్ల ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రజ్వరిల్లుతున్నాయి. కానోపస్ నక్షత్రం ఎక్స్ రే మూలాలు కలిగివుండానికి కారణం దాని కరోనా అంతర్భాగంలో జ్వలించే అత్యధిక ఉష్ణోగ్రతలేనని భావిస్తున్నారు.

దీప్యత (Luminosity)

[మార్చు]

ఇది సూర్యునితో పోలిస్తే 13,600 రెట్లు ఎక్కువ దేదీప్యమానం (తేజోమానం) గా ఉంటుంది. అంటే 1 సెకండ్ లో కానోపస్ నక్షత్రం సూర్యుని కంటే 13,600 రెట్లు అధికంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనకు 700 కాంతి సంవత్సరాల సుదూర పరిధిలో వున్న నక్షత్రాలన్నింటిలోను అత్యంత దీప్తి గల తార ఇదే. ఇంతటి అపారమైన తేజస్సు వుండటం వలనే సిరియస్ నక్షత్రంతో పోలిస్తే చాలా దూరంలో (313 కాంతి సంవత్సరాల దూరంలో) ఉన్నప్పటికీ కానోపస్ నక్షత్రం రాతిపూట కనిపించే రెండవ అతి ఉజ్వల నక్షత్రంగా (సిరియస్ తరువాత స్థానం) స్థానం పొందగలిగింది. ఇంతటి తేజస్సు గల కానోపస్ నక్షత్రాన్ని సిరియస్ నక్షత్ర స్థానంలో ఉంచినట్లయితే, అది ఆకాశంలో అతి మహోజ్వలంగా ప్రకాశిస్తూ మిగిలిన నక్షత్రాలన్నింటినీ సులభంగా మించిపోతుంది. అయితే ఇంత తేజస్సు (దీప్తి) కలిగి ఉన్నప్పటికీ, ఇతర సూపర్ జెయంట్ స్టార్ లకు వున్న తేజస్సులతో పోలిస్తే తక్కువగా తేజస్సుగా ఉండటం వలన కానోపస్ నక్షత్రాన్ని సూపర్ జెయంట్ స్టార్ కేటగిరిలో తక్కువ దీప్తి వున్న నక్షత్రంగా (Ib) పరిగణించి F0Ib తో సూచిస్తారు.

గత నాలుగు మిలియన్ సంవత్సరాలలో మూడు వేర్వేరు శకాలలో కానోపస్ నక్షత్రమే ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రంగా మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని సమయాలలో కానోపస్ కన్నా ఇతర నక్షత్రాలు మన సౌరవ్యవస్థకు దగ్గరగా వచ్చినపుడు ఆయా ప్రత్యేక కాలాల్లో మాత్రమే అవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ విధంగానే 90,000 సంవత్సరాల క్రితం సిరియస్ నక్షత్రం మన సౌర కుటుంబానికి సమీపంగా కదులుతున్నప్పుడు సిరియస్ నక్షత్రం కానోపస్ కన్నా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. ఈ స్థితి ఇప్పుడు కొనసాగుతున్నది. రాబోయే మరో 2,10,000 సంవత్సరాల వరకు సిరియస్ నక్షత్రమే మనకు కనిపించే అత్యంత ప్రకాశమైన నక్షత్రంగా వుంటుంది. అయితే రాబోయే 4,84,000 సంవత్సరాలలో కానోపస్ నక్షత్రం తిరిగి మనకు అత్యంత మహోజ్వలమైన నక్షత్రంగా కనిపించడం మొదలెడుతుంది. ఆ స్థితి 5,10,000 సంవత్సరాల కాలం వరకూ కొనసాగుతుంది.

కాలానుగుణంగా దృశ్య ప్రకాశంలో మార్పులు

[మార్చు]

గత 90 వేల సంవత్సరాల క్రితం నుండి నేటివరకు భూమిపై నుంచి చూస్తే, మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలలో మొదటి స్థానం సిరియస్ నక్షత్రానిది కాగా, రెండవ స్థానం కానోపస్ నక్షత్రానిది. ఈ స్థితి రాబోయే 2.1 లక్షల సంవత్సరాల వరకూ కొనసాగుతుంది. అయితే గతంలో వివిధ భౌమ కాలాల్లో కానోపస్ తార మూడు సార్లు అత్యంత ఉజ్వల తారగా ప్రథమ స్థానంలో నిలవడం (తరువాత కొంతకాలానికి ఆ స్థానాన్ని కోల్పోవడం) జరిగింది. ప్రస్తుతం రెండవ అత్యంత ప్రకాశవంతమైన తారగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరోసారి కానోపస్ నక్షత్రం ఆకాశంలో అత్యంత ఉజ్వల తారగా మొదటి స్థానం పొందగలదు.

37 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి చూస్తే తొలిసారిగా కానోపస్ నక్షత్రం ఆకాశంలో అతి ఉజ్వల తార అయ్యింది. ఆ స్థితిలో కానోపస్ గత 13.7 లక్షల సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. ఈ కాల వ్యవధిలో దీని దృశ్య ప్రకాశ పరిమాణం గరిష్ఠంగా -1.86 ఉండేది. సుమారు 31 లక్షల సంవత్సరాల క్రితం సూర్యునికి అతి సమీపంగా 177 కాంతి సంవత్సరాల దూరంలో కానోపస్ నక్షత్రం వచ్చినపుడు, ఆ సమయంలో ఇది గరిష్ఠంగా -1.86 దృశ్య పరిమాణంతో ఉజ్వలంగా ప్రకాశించడం జరిగింది.

తిరిగి రెండవసారి కానోపాస్ నక్షత్రం ఆకాశంలో అతి ఉజ్వల తారగా 9.5 లక్షల సంవత్సరాల క్రితం కనిపించడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఈ నక్షత్రం సూర్యునికి అతి చేరువుగా 252 కాంతి సంవత్సరాల దూరంలోకి రావడం వలన, గరిష్ఠంగా -1.09 దృశ్య పరిమాణంతో ఆకాశంలో అతి ప్రకాశవంతంగా కనిపించింది. ఈ స్థితి 4.2 లక్షల సంవత్సరాల వరకూ కొనసాగింది. ఆ తరువాత కానోపస్ స్థానాన్ని పక్కకు నెట్టి రోహిణి (ఆల్డిబెరాన్) నక్షత్రం ఆకాశంలో అతి ఉజ్వల తారగా నిలిచింది.

తిరిగి మూడవసారి కానోపాస్ నక్షత్రం 1.6 లక్షల సంవత్సరాల క్రితం ఆకాశంలో అతి ఉజ్వల తారగా కనిపించడం ప్రారంభమైంది. అప్పటి వరకూ భూమి నుంచి అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న కాపెల్ల నక్షత్రాన్ని తోసిరాజని మళ్ళీ కానోపస్ అతి ఉజ్వల తార స్థానంలోకి వచ్చింది. కానోపస్ నక్షత్రం సూర్యునికి అతి సమీపంగా 302 కాంతి సంవత్సరాల దూరంలోకి రావడం, ఆ స్థితిలో -0. 72 గరిష్ఠ దృశ్య ప్రకాశ పరిమాణంతో (ఇప్పుడు కనిపిస్తున్నట్లు) ఉజ్వలంగా ప్రకాశించేది. అప్పటినుండి గత 90 వేల సంవత్సరాల క్రితం వరకూ ఈ నక్షత్రం ఆకాశంలో అతి ఉజ్వలతారగా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకొంది. గత 90 వేల సంవత్సరాల క్రితం కానోపస్ స్థానాన్ని పక్కకు నెట్టి సిరియస్ నక్షత్రం -1.64 గరిష్ఠ దృశ్య పరిమాణంతో ఆకాశంలో అతి ఉజ్వల తారగా నిలిచింది. కానోపాస్ రెండవ స్థానంలో మిగిలిపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ స్థితి రాబోయే 2.1 లక్షల సంవత్సరాల వరకూ కొనసాగుతుంది.

సూర్యుని సమీపిస్తూ వున్న వేగా నక్షత్రం యొక్క దృశ్య ప్రకాశం క్రమేణా పెరుగుతూ ఉండటంతో వేగా నక్షత్ర ప్రకాశం, 2.1 లక్షల సంవత్సరాల నాటికి సిరియస్ దృశ్య ప్రకాశాన్ని దాటిపోతుంది. అంటే భవిష్యత్తులో 2.1 లక్షల సంవత్సరాల తరువాత భూమిపై నుంచి చూస్తే, ఆకాశంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రంగా సిరియస్ స్థానాన్ని వేగా నక్షత్రం ఆక్రమిస్తుంది. అత్యంత ప్రకాశవంతమైన తారగా వేగా నక్షత్రం తన స్థితిని రాబోయే 4.8 లక్షల సంవత్సరాల వరకు కొనసాగించగలదు.

రాబోయే 4.8 లక్షల సంవత్సరాలకు వేగా నక్షత్రం మనకు దూరంగా జరిగిపోయినపుడు, కానోపస్ నక్షత్రం మళ్ళీ (నాలుగవ సారి) మనకు అతి ఉజ్వల నక్షత్రంగా కనిపించడం మొదలవుతుంది. ఆ సమయంలో ఈ కానోపస్ నక్షత్రం సూర్యునికి అతి చేరువుగా 346 కాంతి సంవత్సరాల దూరంలోకి రావడం వలన, గరిష్ఠంగా -0.40 పరిమాణంతో ఉజ్వలంగా ప్రకాశించడం జరుగుతుంది. ఈ స్థితి 9.9 లక్షల సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు. భవిష్యత్తులో 9.9 లక్షల సంవత్సరాల అనంతరం అతి ప్రకాశవంతమైన నక్షత్రంగా కానోపస్ స్థానాన్ని పక్కకు నెట్టి బీటా ఆరిగా అనే నక్షత్రం ఆక్రమిస్తుంది.

పరిశీలనా చరిత్ర

[మార్చు]
కెరీనా నక్షత్రరాశి-ప్రకాశవంతంగా కనిపించేది కానోపస్ నక్షత్రం

భారతీయ వేద సాహిత్యంలో కానోపస్ నక్షత్రం ప్రాచీన ఋషులలో ఒకడైన అగస్త్య మహర్షికి ఆపాదించబడింది.[10] జల ప్రక్షాళనకు ప్రతీకగా భావించబడే ఈ నక్షత్రోదయ సమయం హిందూ మహా సముద్రపు ప్రశాంత జలాలకు సరిపోతున్నట్లు ఉంటుంది.

ఉత్తరార్ధగోళంలో క్షితిజానికి బాగా దిగువన మాత్రమే దర్శనమిచ్చే ఈ నక్షత్రం గ్రీసు, రోమ్ ప్రధాన భూభాగాలలో నివసించే ప్రాచీన గ్రీకులు, రోమన్లకు కనిపించలేదు.[11] అందువలనే ప్రాచీన గ్రీకు తాత్వికుడు ఎరొటస్ (Aratus) ఈ నక్షత్రం గురించి పేర్కొనలేదు.అయితే ప్రాచీన ఈజిప్షియన్లకు మాత్రం ఇది కనిపించేది.[11] అలెగ్జాండ్రియా రేవుపట్టణం (ఈజిప్టు) నుండి ఎరాటోథెన్స్, టోలెమిలు ఈ నక్షత్రాన్ని పరిశీలించి దీనిని కానోబస్ అని పిలిచారు.[12]

నైఋతి అమెరికా లోని నవాజో ఆదిమ తెగ జాతి ప్రజలు ఈ నక్షత్రాన్ని మాయీ బిజో అని పిలిచేవారు.[13] టెనెరిఫే ద్వీపవాసులకు (కేనరీ దీవులు) సంబంధించిన 'గుంచే' పురాణంలో వర్ణించబడిన ఛక్సీరాక్సీ అనే దేవతతో ఈ కానోపస్ నక్షత్రం సంబంధం కలిగి ఉంది.[14]

ఇజ్రాయిల్ లోని నెగేవ్, సినాయ్ ప్రాంతాలలో నివసించే బదౌన్ అరబ్ సంచార తెగ ప్రజలకు కూడా ఈ నక్షత్రం గురించి తెలుసు. వారు కానోపస్ నక్షత్రాన్ని సుహైల్ గా గుర్తించారు. పొలారిస్ (ధ్రువ నక్షత్రం) తో పాటు కానోపస్ నక్షత్రాన్ని కూడా వారు రాత్రివేళలలో దిక్కులను సూచించే నక్షత్ర సూచికగా ఉపయోగించారు. ఆయా ప్రాంతాల్లో ఈ నక్షత్రం క్షితిజానికి క్రింద అదృశ్యమవుతూ వస్తూ ఉండడం వలన, ఇది ఎల్లప్పుడూ స్థిరంగా కనిపించే పోలారిస్ నక్షత్రానికి తద్విరుద్ధంగా ఒక క్రమం తప్పకుండా మారుతూ వున్న నక్షత్రంగా ఉండేది.[15] సా.శ.. 7 వ శతాబ్దంలో ఇస్లామిక్ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని అరబిక్ భాషలో 'సుహైల్' (سهيل) నక్షత్రంగా వ్యవహరించారు. సుహైల్ అంటే అద్భుతమైనదని అర్ధం.

ప్రాచీన చైనాలో పోరాట రాజ్య యుగం (క్రీ.పూ. 475) నాటి మూలాలను ఆధారంగా చేసుకొని, క్రీ.పూ. 2 వ శతాబ్దంలో హాన్ రాజవంశానికి చెందిన చైనీయ చరిత్రకారుడు "సేమా కియాన్" కానోపస్ నక్షత్రాన్ని పేర్కొనడం జరిగింది.[16] చైనీయులకు వారి రాజధాని చాంగైన్ నగరం నుంచి ఈ కానోపస్ నక్షత్రం కనపడదు. అయినప్పటికీ మధ్యయుగంలో వారు తమ రాతప్రతి "దుంహుయాంగ్ నక్షత్ర పటం"లో ఈ నక్షత్రాన్ని దక్షిణ ధృవ వృద్ధునిగా (ఓల్డ్ మాన్ ఆఫ్ ది సౌత్ పోల్) పేర్కొనడం జరిగింది.[16] సా.శ.. 724 లో తాంగ్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ చైనీయ ఖగోళ శాస్త్రవేత్త, బౌద్ధ సన్యాసి అయిన "యి జింగ్" (Yi Xing) కానోపస్ నక్షత్రంతో పాటు ఇతర సుదూర దక్షిణాది తారలను పరిశీలించేందుకు దక్షిణం వైపుగా ప్రయాణించాడు.[17]

పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన అనేక దీవులు, పగడపు దీవుల మధ్య నౌకాయానం చేసే పోలినేసియన్లకు రాత్రి వేళల దీవులను గుర్తించడానికి ప్రకాశవంతమైన నక్షత్రాలవసరం. ప్రాచీనకాలంలో రాత్రివేళలలో పసిఫిక్ దీవుల మధ్య పోలినేసియన్లు ప్రయాణించేటప్పుడు, ఆయా దీవుల మధ్య దూరాలను, ప్రత్యేక గమ్య స్థానాలను గుర్తించడానికి వారికి ఉజ్వలమైన సిరియస్ మరియి కానోపస్ నక్షత్రాలు నక్షత్ర దిక్సూచిలుగా ఉపయోగపడేవి. గ్రేట్ బర్డ్ లేదా మను అనే నక్షత్రరాశి ప్రాచీన పోలినేసియన్లకు బాగా సుపరిచితమైనది. ఇది రాత్రివేళ వారి వినీల ఆకాశాన్ని రెండు అర్ధ గోళాలుగా విభజిస్తున్నట్లు ఉండేది. ఈ గ్రేట్ బర్డ్ నక్షత్రరాశికి చెందిన దక్షిణ రెక్క అగ్రంలో కానోపస్ నక్షత్రం, శరీరభాగంలో సిరియస్ నక్షత్రం, ఉత్తర రెక్క అగ్రంలో ప్రోసియన్ నక్షత్రాలు ఉండేవి.[18]

ప్రాచీన కాలంలో హావాయి ద్వీపవాసులు కానోపస్ నక్షత్రాన్ని అలీ-ఓ-కోనా-ఐ-కా-లెవా (దక్షిణ విస్తారానికి అధిపతి) అని పిలిచేవారు. 'హవాయిలోవా', 'హవాయికి' ప్రజలు దక్షిణ-పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించినప్పుడు నావిగేషన్ కోసం వారికి అవసరమయ్యే నక్షత్రాలలో కానోపస్ కూడా ఒకటిగా వుండేది.[19]

న్యూజీలాండ్ కు చెందిన మావోరీ ప్రజలు కానోపస్ నక్షత్రాన్ని అనేక పేర్లతో పిలిచేవారు. తూర్పున కనిపించే ఒంటరి నక్షత్రంగా దీనిని అరికీ పేరుతొ వ్యవహరించారు. ఇది మావోరీ ప్రజలను రోదింపచేయడానికి,మంత్రోచ్ఛారణకు వారిని సమయాత్తం చేసే నక్షత్రంగా ఉండేది.[20] వారు దీనికి అతుతహి, అతోహి, ఒంటరి నక్షత్రం మొదలైన పేర్లతో పిలిచేవారు.[21] తరుచుగా ఏకాంతవాసం గడిపే తాపు ప్రజలలాగే ఈ నక్షత్రం కూడా ఆకాశంలో ఒంటరిగా వుండటం వల్ల వారి సంస్కృతిలో ఇది తాపు నక్షత్రం (పవిత్ర ఏకాంత నక్షత్రం) గా భావించబడింది.

మావోరీ ప్రజల సాంప్రదాయిక ఋతువు మరుఅరోవా ఆరంభంలో కనిపించే కానోపస్ నక్షత్రం, వారికి రాబోయే శీతాకాలాన్ని ముందుగానే తెలియజేస్తుంది. దక్షిణాన కాంతి కిరణాలు చల్లటి తేమతో కూడిన శీతాకాలాన్ని సూచిస్తే, ఉత్తరాన తేలికపాటి చలికాలం గురించి ముందుగా తెలియచేస్తాయి. వారు ఈ నక్షత్రోదయ సమయంలో నైవేద్యం కూడా అర్పిస్తారు.[22] మావోరీ పురాణాలలో ఈ నక్షత్రం అనేకసార్లు ప్రస్తావించబడింది. ఒక పురాణ కథ తాన్ దేవుడు ఆకాశంలో పాలపుంతను బుట్ట రూపంలో అల్లుతున్నప్పుడు, ఆ బుట్ట వెలుపల 'అతుతహీ' (కానోపస్ నక్షత్రం) ఎలా ఒంటరిగా మిగిలి పోయిందో తెలియచేస్తుంది. మరో పురాణం ప్రకారం ఆది దేవతలైన పాపా, రంగి ల యొక్క తొలి సంతానం అతుతహి. ఇతను మిల్కి వే లోకి అడుగుపెట్టటానికి నిరాకరించి దాని ప్రక్కలనే ఏకాంతంగా పెరగడం జరిగింది. పాలినేషియా అంతటా ఇతర నక్షత్రాలు, నక్షత్రరాశులకి కూడా ఇదే పేరు ఉపయోగించబడింది.[23] న్యూజిలాండ్ దీవుల నుంచి చూస్తే దీని అస్తమయం క్షితిజానికి దిగువన అరుదుగా ఉండటంతో కాపి-పొటో (short horizon) అనే పేరుతో సూచించబడింది.[24] సూర్యోదయానికి ముందు కనిపించే ఆఖరి నక్షత్రం కానోపస్ కావడంతో, దీనికి కౌవాంగ ("ఏకాంతం") అనే పేరు కూడా వచ్చింది.[25]

బోట్సువానా లోని స్వానా ప్రజలకు ఈ కానోపస్ నక్షత్రం "నాకా"గా పరిచితం. శీతాకాలం చివరలో కనిపించే ఈ తార వారికి పవన ఉధృతిని, చెట్లకు ఆకురాలు సమయం ఆసన్నమైనదని సూచిస్తుంది. అక్కడి గొర్రెల కాపర్లకు గొర్రెలకు, పొట్టేళ్లతో జత కలపాల్సిన సమయం ఆసన్నమైనదని తెలియ చేస్తుంది.[26] దక్షిణాఫ్రికాలోని సోతో, స్వానా, వెండా ప్రజలు కనోపస్ నక్షత్రాన్ని నాకా లేదా నంగ (హార్న్ స్టార్) అని పిలుస్తారు. జులు, స్వాజి తెగలు దీనిని ఖ్వెన్ క్వెజి (బ్రిలియంట్ స్టార్) అని పిలిచేవారు. వారికి ఈ నక్షత్రం మే నెల మూడవ వారంలో వేకువజామునే ఆకాశంలో దర్శనమిచ్చేది.

దక్షిణాఫ్రికా లోని వెండా ప్రజలలో కానోపస్ నక్షత్రాన్ని మొదటిసారిగా చూసిన వ్యక్తి ఒక కొండపై నుంచి ఫలాఫల కొమ్ము బూరను ఊదడం ద్వారా ఒక ఆవును బహుమతిగా పొందే ఆచారం ఉంది. సోతో తెగ పెద్దలు కూడా ఆవును బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి భూత వైద్యులచే ఎముకలతో చేసిన పాచికలను వేయించి, తద్వారా రాబోయే సంవత్సరంలో రాగల అదృష్టాన్ని ముందుగా పరీక్షించుకొనేవారు.[27] దక్షిణాఫ్రికా లోని బుష్ మెన్ ఆటవికులకు చెదపురుగులు, ఎగిరే చీమలు కనిపించడానికి సిరియస్, కానోపస్ నక్షత్రాలు ఒక సంకేతంగా ఉండేవి. అంతేకాక వారు ఈ నక్షత్రాలకు చావు, దురదృష్టం కలిగించగల శక్తులున్నాయని నమ్మేవారు. ఆ కారణంగా మంచి అదృష్టాన్ని, నైపుణ్యాన్ని కోరుకుంటూ దానికోసం ప్రత్యేకంగా సిరియస్, కానోపస్ నక్షత్రాలను ప్రార్థించేవారు.[28]

బ్రెజిల్ లోని మాటో గ్రోస్సో రాష్ట్రంలో గల 'కాలాపాలో' మూలజాతి ప్రజలు కానోపస్, ప్రోసియన్ నక్షత్రాలను కోఫాంగో "బాతు" గాను, కాస్టర్, పొలాక్స్ నక్షత్రాలను దాని చేతులుగాను భావించేవారు. ఈ రకమైన నక్షత్ర సమూహ ప్రదర్శన వారికి రాబోయే వర్షాకాలాన్ని, వారి ప్రధాన ఆహారం 'మేనియాక్' లో రాగల వృద్హిని సూచించేది.[29]

అర్గోనావిస్ అనే ఓడ ఆకారంలో కనిపించే ఒక సాంప్రదాయిక నక్షత్రరాశి యొక్క చుక్కానిగా కానోపస్ నక్షత్రాన్ని గుర్తించారు.[30] ఈ విషయాన్ని సా.శ.. 1592 లో ఒక ఇంగ్లీష్ అన్వేషకుడు రాబర్ట్ హ్యూస్ తన రచన 'ట్రాక్టటస్ డి గ్లోబిస్' ద్వారా యూరోపియన్ పరిశీలకుల దృష్టికి తీసుకొనిరావడం జరిగింది.

కానోపస్ శబ్దవ్యుత్పత్తి - చరిత్ర

[మార్చు]

పురాతన గ్రీకు పదం కానోబస్ (Κάνωβος/Kanôbos) యొక్క లాటినీకరణం నుంచి కానోపస్ పదం వచ్చింది. ఈ విషయం క్లాడియస్ టోలెమి రచించిన అల్మగేస్ట్ (సుమారు సా.శ.. 150) పుస్తకంలో నమోదు చేయబడింది. ఎరాటోస్థేన్స్ కూడా అదే అక్షరక్రమాన్ని ఉపయోగించాడు.[12] గ్రీకు శాస్త్రవేత్త హిప్పార్కస్ కూడా దీనిని Κάνωπος అని వ్రాశాడు. 18 వ శతాబ్దానికి చెందిన ఇంగ్లీష్ ఖగోళశాస్త్రజ్ఞుడు జాన్ ఫ్లామ్ స్టీడ్ దీనిని కానోబస్ (Canobus) గా రాశాడు.[31] అదేవిధంగా ఇంగ్లీష్ ఖగోళశాస్త్రజ్ఞుడు ఎడ్మన్డ్ హేలీ కూడా తన గ్రంథం '1679 కేటలాగ్స్ స్టెల్లారమ్ ఆస్ట్రాలియం' లో రాశాడు.[32] కానోపస్ నక్షత్రానికి ఆ పేరు రావడం వెనుక రెండు సాధారణ కథనాలు ప్రచారంలో ఉంన్నాయి. ఈ రెండు కథనాలను రిచర్డ్ హింక్లీ అలెన్ 1899 లో తన 'స్టార్ నేమ్స్: దెయిర్ లోర్ అండ్ మీనింగ్' (Star Names: Their Lore and Meaning) అనే పుస్తకంలో పేర్కొన్నాడు.[33] ఆయితే ఈ కథనాలన్నీ ఊహాజనిత అంశాలతో ముడిపడి ఉన్నాయి.

మొదటి కథనం ప్రకారం కానోపస్ అనేది ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న ఒక ఓడ యొక్క కెప్టెన్ పేరు. ట్రోజన్ యుద్ధ పురాణం ప్రకారం ట్రాయ్ యువరాజు ప్యారిస్, స్పార్టా రాజు భార్య అయిన హెలెన్ రాణిని లేవదీసుకొనిపోతాడు. ఆమెను తిరిగి పొందేందుకు స్పార్టా రాజు మెనిలస్, ట్రాయ్ నగరం పై నౌకాబలంతో దండయాత్ర చేస్తాడు. అతని నౌకాదళంలో ఒకానొక ఓడ యొక్క కెప్టెన్ పేరు కానోపస్. ట్రాయ్ నుండి విజయంతో మెనిలస్ రాజు తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో తుఫాన్ కారణంగా అతని నౌకాదళం ఈజిప్ట్ లో విడిది చేయడం, అక్కడ ఒక పాము కాటు వల్ల ఓడ కెప్టెన్ చనిపోవడం జరుగుతుంది. మరణించిన ఓడ కెప్టెన్ కు మెనిలస్ రాజు పూర్తి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి, అతని స్మృత్యర్థం అప్పుడే దర్శనమిచ్చిన నక్షత్రానికి అతని పేరుతొ నామకరణం చేస్తాడు.

రెండవ కథనం ప్రకారం 'కాప్టిక్ కహి నుబ్' ("గోల్డెన్ ఎర్త్") అనే ఈజిప్షియన్ పదం నుంచి ఈ నక్షత్రానికి ఆ పేరు వచ్చింది. ఈ కథనం ప్రాచీన ఈజిప్టులో క్షితిజానికి దగ్గరలో కానోపస్ నక్షత్రం ఎలా కనిపించి వుంటుందనే దానిని సూచిస్తుంది. క్షితిజానికి దగ్గరలో నేలబారుగా వున్న ఈ నక్షత్రం దట్టమైన వాతావరణం గుండా చూడటం వలన ఎరుపు తదితర చిత్ర చిత్రమైన రంగులతో అద్భుతంగా కనిపిస్తుంది.[33] నైలూ నదీ ముఖద్వార సమీపంలో ఒక శిథిలమైన ప్రాచీన ఈజిప్టు ఓడరేవు కానోపస్ ఉంది.

వివిధ పేర్లు

[మార్చు]

నక్షత్రాల జాబితాను ప్రామాణీకరించడం కోసం, నక్షత్రాలకు సరైన పేర్లను పెట్టడంకోసం 2016 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) నక్షత్రాల పేర్ల పై ఒక వర్కింగ్ గ్రూప్ (WGSN) ను నిర్వహించింది.[34] ఈ వర్కింగ్ గ్రూప్ ఆమోదించిన జాబితాలో కానోపస్ నక్షత్రం పేరు ఉంది.[35] ఈ పేరు ఇప్పుడు ఐ.ఏ.యు కేటలాగ్ లో కూడా చేరింది.[36]

అనేక మంది ఖగోళ శాస్త్రజ్ఞులు తమ తమ నక్షత్రాల వర్గీకరణ జాబితాలో కానోపస్ నక్షత్రాన్ని విభిన్న హోదాలతో గుర్తించడం జరిగింది. కానోపస్ నక్షత్రం బేయర్స్ వర్గీకరణలో α Carinae గాను, బ్రైట్ స్టార్ జాబితాలో (Bright Star Catalogue) HR 2326 గాను, హెన్రీ డ్రేపర్ జాబితాలో HD 45348 గాను, హిప్పార్కస్ జాబితాలో HIP 30438 గాను వర్గీకరించబడింది. ఇంగ్లీష్ ఖగోళశాస్త్రవేత్త ఫ్లేమ్ స్టీడ్ ఈ దక్షిణార్ధగోళపు నక్షత్రాన్ని లెక్కించలేదు కానీ అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త గౌల్డ్ తన 'యురానోమెట్రియా అర్జెంటీనా' (1874) గ్రంథంలో కానోపస్ నక్షత్రాన్ని 7 G. కెరినాగా గుర్తించాడు.

చారిత్రిక సాంస్కృతిక ప్రాముఖ్యత

[మార్చు]

ప్రాచీన కాలంలో భూమధ్య రేఖకు సమీపంలో వున్న ఉత్తరార్థగోళం లోని నావికులకు, దక్షిణార్ధ గోళంలో నౌకాయానం చేసే నావికులకు దిక్కులను సూచించే నక్షత్ర సూచిగా కానోపస్ నక్షత్రం ఎంతోగానో ఉపయోగపడింది. ముఖ్యంగా పోలినేషియన్లకు నౌకాయానంలో సిరియస్ తోపాటు కానోపస్ నక్షత్రం ఎక్కువగా ఉపయోగపడేది. చుట్టూ ఇసుక మేటలు తప్ప మరేమీ కనిపించని నెగేవ్, సినాయ్ లాంటి ఎడార్లలో నిత్యం సంచరించే బిదోయిన్ అరబ్ తెగల ప్రజలు, రాత్రివేళలలో పొలారిస్, కానోపస్ నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ఆయా ఎడారులలో ప్రయాణించేవారు. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) నక్షత్రరాశికి సిరియస్ నక్షత్రం వలె, ఉర్సా మైనర్ (చిన్న ఎలుగుబంటి) నక్షత్రరాశికి పొలారిస్ (ధ్రువ నక్షత్రం) వలె, ఆర్గో నావిస్ సాంప్రదాయిక నక్షత్రరాశికి కానోపస్ నక్షత్రం, సముద్ర నావికులకు దారి చూపించే నక్షత్రంగా పేరు గాంచింది.

ప్రిసెషన్ చలనం వలన నక్షత్రాల నేపథ్యంలో దక్షిణ ఖగోళ ధ్రువం యొక్క మార్గం - చిత్రంలో ఎగువన ప్రకాశవంతంగా కనిపిస్తున్న నక్షత్రం కానోపస్

రాత్రివేళలలో దిక్కులను సూచించే నక్షత్రంగానే కాక ఈ నక్షత్రం కూడా సిరియస్ మాదిరిగానే ఆయా ప్రాంతాలలో ఋతువుల ఆగమనానికి ఒక సూచికగా ఉపయోగపడింది. ప్రాచీనకాలంలో వివిధ ప్రాంతాలలో ఈ నక్షత్ర దర్శనం అనేక విశ్వాసాలతో ముడిపడి ఉంది. వాటిని అనుసరించి ఆయా ప్రాంతాలలోని ప్రజలలో మూడాచారాలు, వారి పురాణాలలో చిత్ర విచిత్రమైన కథనాలు రూపుదిద్దుకున్నాయి. ఉదాహరణకు న్యూజీలాండ్ లోని మావోరీ తెగ ప్రజలకు కానోపాస్ దర్శనం రాబోయే శీతాకాలాన్ని గుర్తుచేస్తుంది. వారి పురాణాలలో అనేక కథలు ఈ ఒంటరి నక్షత్రం (అతుతహి) చుట్టూ అల్లుకొన్నాయి.

ఆధునిక కాలంలో అంతరిక్షయానంలో నావిగేషన్ కొరకు ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అనుకూలమైన కోణీయదూరం, ఉజ్వలమైన కాంతి కలిగి ఉండటం వలన ఈ నక్షత్రం స్పేస్ నావిగేషన్ కు బాగా ప్రసిద్ధి పొందింది. సూర్యుడి నుండి అనుకూలమైన కోణీయ దూరంలో కానోపస్ ఉండటం వల్ల, దీని స్థానాన్ని ఆధారం చేసుకొని స్పేస్ క్రాఫ్ట్ ల ఉన్నతి (altitude) ని నియంత్రిస్తున్నారు. మనకు 700 కాంతి సంవత్సరాల సుదూర పరిధిలో వున్న నక్షత్రాలన్నింటిలోను అత్యంత దీప్తి గల తార ఇదే కావడంతో దీని ఉజ్వలమైన కాంతి స్పేస్ నావిగేషన్ కు అనుకూలంగా ఉంది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న స్పేస్ షిప్స్, స్పేస్ ప్రోబ్స్ ల స్థానాన్ని సర్దుబాటు చేయడానికి ఈ నక్షత్రం నుండి వెలువడే కాంతిని గ్రహిస్తారు. దీనికోసం అంతరిక్ష నౌకలలో సన్ ట్రాకర్ కెమెరాతో పాటు'కానోపస్ స్టార్ ట్రాకర్' అనే ఒక ప్రత్యేక కెమెరాను అమర్చుతారు. అంగారక యాత్ర కోసం 1964 లో నాసా ప్రయోగించిన మారినర్ IV లో కానోపస్ నక్షత్రాన్ని రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. ప్రోబ్ ను సరైన మార్గంలో వుంచడంకోసం రెండు సెన్సర్ లను ఒకటి సూర్యుడివైపు, మరొకటి కానోపాస్ నక్షత్రం వైపు ఉండేటట్లు ఉపయోగించారు.

దక్షిణార్ధగోళంలో ధ్రువ స్థానం ఖాళీగా ఉంది. ఉత్తరార్థగోళంలో పొలారిస్ ఉన్నట్లు దక్షిణార్ధగోళంలో ఏ నక్షత్రం లేదు. అయితే భూమి యొక్క ప్రెసిషన్ చలనం వల్ల సా.శ.. 14,000 నాటికి కానోపస్ నక్షత్రం దక్షిణ ధ్రువానికి 10° సమీపంలోని చేరుకొంటుంది.[37]

వారసత్వం

[మార్చు]

బ్రెజిల్ దేశపు జెండాపై కనిపించే 27 నక్షత్రాలలో కానోపస్ కూడా ఒకటి, ఇది ఆ దేశం లోని గోయస్ రాష్ట్రానికి ప్రతీకగా ఉంది.[38] ఈ నక్షత్రం పేరుతో రెండు పర్వతాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జియోలాజికల్ సర్వే అంటార్కిటిక్ ఎక్స్పిడిషన్ వారు అంటార్కిటికాలో వున్న ఒక మంచు పర్వతానికి (1710 మీ.) మౌంట్ కానోపస్ పేరు పెట్టడం జరిగింది. టాస్మానియా (ఆస్ట్రేలియా) లోని హోబర్ట్ సమీపంలో కానోపస్ హిల్ మీద 'కానోపస్ హిల్ అబ్సర్వేటరీ'ని నెలకొల్పారు.

రిఫరెన్సులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 van Leeuwen, F. (2007). "Validation of the new Hipparcos reduction". Astronomy and Astrophysics. 474 (2): 653–664. arXiv:0708.1752. Bibcode:2007A&A...474..653V. doi:10.1051/0004-6361:20078357. Vizier catalog entry
  2. 2.0 2.1 2.2 Ducati, J. R. (2002). "Catalogue of Stellar Photometry in Johnson's 11-color system". CDS/ADC Collection of Electronic Catalogues. 2237: 0. Bibcode:2002yCat.2237....0D. Vizier catalog entry
  3. Gray, R. O.; Garrison, R. F. (1989). "The early F-type stars – Refined classification, confrontation with Stromgren photometry, and the effects of rotation". Astrophysical Journal Supplement Series. 69: 301. Bibcode:1989ApJS...69..301G. doi:10.1086/191315.
  4. Lopez-Cruz, O.; Garrison, R. F. (1993). "A Spectroscopic Study of High Galactic Latitude F Supergiant Stars". Luminous High-Latitude Stars. the International Workshop on Luminous High-Latitude Stars. 45: 59. Bibcode:1993ASPC...45...59L.
  5. Gontcharov, G. A. (2007). "Pullkovo Compilation of Radial Velocities for 39495 Hipparcos stars in a common system". Astronomy Letters. 32 (1): 759–771. arXiv:1606.08053. Bibcode:2006AstL...32..759G. doi:10.1134/S1063773706110065. Vizier catalog entry
  6. 6.0 6.1 6.2 Smiljanic, R.; et al. (April 2006). "CNO in evolved intermediate mass stars". Astronomy and Astrophysics. 449 (2): 655–671. arXiv:astro-ph/0511329. Bibcode:2006A&A...449..655S. doi:10.1051/0004-6361:20054377.{{cite journal}}: CS1 maint: postscript (link)
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Cruzalèbes, P.; Jorissen, A.; Rabbia, Y.; Sacuto, S.; Chiavassa, A.; Pasquato, E.; Plez, B.; Eriksson, K.; Spang, A.; Chesneau, O. (2013). "Fundamental parameters of 16 late-type stars derived from their angular diameter measured with VLTI/AMBER". Monthly Notices of the Royal Astronomical Society. 434: 437. arXiv:1306.3288. Bibcode:2013MNRAS.434..437C. doi:10.1093/mnras/stt1037.
  8. J. B., Hearnshaw; K, Desikachary (1982). The spectrum of Canopus (1982 ed.). Monthly Notices of the Royal Astronomical Society, vol. 198. pp. 311–320. Retrieved 8 April 2019.
  9. Alexander, Brown (1999). Coronal Spectroscopy of the f0 Supergiant Canopus: Properties of Intermediate Mass Star Coronae after the he Flash (1999 ed.). Chandra Proposal ID 01200720. Retrieved 8 April 2019.
  10. Frawley, David (1993). Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization. New Delhi, India: Motilal Banarsidass.
  11. 11.0 11.1 Schaaf, p. 107.
  12. 12.0 12.1 Ridpath, Ian. "Carina". Star Tales. self-published. Archived from the original on 30 సెప్టెంబరు 2015. Retrieved 10 December 2015.
  13. Maryboy, Nancy D. (2004). A Guide to Navajo Astronomy. Indigenous Education Institute : Bluff, Utah.
  14. Antonio Rumeu de Armas (1975). La conquista de Tenerife, 1494–1496. Aula de Cultura de Tenerife.
  15. Bailey, Clinton (1974). "Bedouin Star-Lore in Sinai and the Negev". Bulletin of the School of Oriental and African Studies, University of London (abstract). 37 (3): 580–96. doi:10.1017/S0041977X00127491. JSTOR 613801.
  16. 16.0 16.1 Bonnet-Bidaud, Jean-Marc; Praderie, Françoise; Whitfield, Susan (2009). "The Dunhuang Sky: A Comprehensive Study of the Oldest Known Star Atlas". The International Dunhuang Project: The Silk Road Online. 12: 39. arXiv:0906.3034. Bibcode:2009JAHH...12...39B.
  17. Needham, Joseph (1959). Science and Civilisation in China: Volume 3, Mathematics and the Sciences of the Heavens and the Earth. Cambridge, United Kingdom: Cambridge University Press. p. 274. ISBN 0521058015.
  18. Holberg, J.B. (2007). Sirius: Brightest Diamond in the Night Sky. Chichester, UK: Praxis Publishing. pp. 25–26. ISBN 0-387-48941-X.
  19. Makemson 1941, p. 198.
  20. Makemson 1941, p. 201.
  21. p. 419, Mythology: Myths, Legends and Fantasies[permanent dead link], Janet Parker, Alice Mills, Julie Stanton, Durban, Struik Publishers, 2007.
  22. Best, Elsdon (1922). Astronomical Knowledge of the Maori: Genuine and Empirical. Wellington, New Zealand: Dominion Museum. pp. 34–35.
  23. Makemson 1941, pp. 200–202.
  24. Makemson 1941, p. 217.
  25. Makemson 1941, p. 218.
  26. Clegg, Andrew (1986). "Some Aspects of Tswana Cosmology". Botswana Notes and Records. 18: 33–37. JSTOR 40979758.
  27. Snedegar, K.V. (1995). "Stars and seasons in Southern Africa". Vistas in Astronomy. 39 (4): 529–38. doi:10.1016/0083-6656(95)00008-9.
  28. Hollman, J. C. (2007). ""The Sky's Things", |xam Bushman 'Astrological Mythology' as recorded in the Bleek and Lloyd Manuscripts". African Sky. 11: 8. Bibcode:2007AfrSk..11....8H.
  29. Basso, Ellen B. (1987). In Favor of Deceit: A Study of Tricksters in an Amazonian Society. Tucson, Arizona: University of Arizona Press. p. 360. ISBN 0816510229.
  30. Knobel, E. B. (1917). "On Frederick de Houtman's Catalogue of Southern Stars, and the Origin of the Southern Constellations". Monthly Notices of the Royal Astronomical Society. 77 (5): 414–32 [422]. Bibcode:1917MNRAS..77..414K. doi:10.1093/mnras/77.5.414.
  31. Flamsteed, John (1729). Atlas coelestis. London, United Kingdom. pp. Constellation Map of Southern Hemisphere.[permanent dead link]
  32. Halley, Edmond (1679). Catalogus stellarum australium; sive, Supplementum catalogi Tychenici, exhibens longitudines et latitudines stellarum fixarum, quae, prope polum Antarcticum sitae, in horizonte Uraniburgico Tychoni inconspicuae fuere, accurato calculo ex distantiis supputatas, & ad annum 1677 completum correctas...Accedit appendicula de rebus quibusdam astronomicis. London: T. James. p. 30.
  33. 33.0 33.1 Allen, Richard Hinckley (1963) [1899]. Star Names: Their Lore and Meaning (Revised ed.). New York: Dover Publications. pp. 67–72. ISBN 0-486-21079-0.
  34. "IAU Working Group on Star Names (WGSN)". Retrieved 22 May 2016.
  35. "Bulletin of the IAU Working Group on Star Names, No. 1" (PDF). Retrieved 28 July 2016.
  36. "IAU Catalog of Star Names". Retrieved 28 July 2016.
  37. Taylor, Kieron (1 March 1994). "Precession". myweb.tiscali.co.uk. Archived from the original on 23 జూలై 2018. Retrieved 2012-02-25.
  38. "Astronomy of the Brazilian Flag". FOTW Flags Of The World website.