జమాబంది
జమాబందీ అనగా సాధారణంగా సంవత్సరానికొకసారి శిస్తుల నిర్ణయాల కొరకు జరిగే సమావేశం. ఈ పదం మహమ్మదీయ పరిపాలన కాలంలోనుండి వాడుకలోనుండిన అనేక పార్శీ, ఉరుదూ పదాలలో ఒకటి. తదుపరి ఆంగ్లేయ పరిపాలనలో కూడా అమలులోనుండి విశాలాంధ్రదేశములో 20 శతాబ్దములో కరణీకములు అంతరించే వరకూ అమలులో వుంది. 1772 లో మహారాష్ట్రను పరిపాలించిన పీష్వా మాధవరావు కొలువులో నున్న మంత్రి నానా ఫర్నవీసు (ఫడ్నవీస్) జమాబందీ పద్ధతిని అమలుచేసినట్లుగా చరిత్రలో కనబడుచున్నది. తరచూ ప్రతిఏటా జిల్లాలవారీగా జరిగే శిస్తు నిర్ణయాలకు చేసే సమావేశములనే కాక అరుదుగా ఎప్పుడోఒకసారి జరిగే ఇనాములు ఫైసలా సమావేశములకు కూడా జమాబంది అంటారని చరిత్రచెప్పుతున్నది.[1], [2] బ్రౌను నిఘంటువులో జమాబంది అంటే “Yearly settlement of accounts made by Revenue Department under ryotwari system” అని అర్ధము చెప్పబడియున్నది. బ్రిటీషు వారి పరిపాలనలో జమాబందీ తీరు తెన్నులు కె.ఎన్.కేసరి తన ఆత్మకథ చిన్ననాటి ముచ్చట్లలో వివరించారు.[3]
కవులు వర్ణించిన జమాబందీ చరిత్రలు
[మార్చు]కవులకు ప్రేరణ కలిగించేటంతగా చేసే ఆ జమాబందీలేమిటో తెలుసుకున్నాక, వారు రచించిన ఆ కవిత్వము కూడా తెలుసుకొనదగినదే. సా.శ. 1835 లో కాకినాడలో జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీని కుందూరి దాసన్నకవి దండకంగా వర్ణించియుండగా అంతకు పుర్వము సా.శ. 1799 లో విశాఖపట్టణం లోజరిగిన ఇనాములకు సంబంధించిన జమాబందీని సీసమాలికగా వర్ణించారు వర్దిపర్తి కొనరాట్కవి.
‘జమాబందీ దండకము’
[మార్చు]సా.శ. 1835 మే నెలలో కాకినాడలో జరిగిన జమాబందీని దండకములాగ వర్ణించుతూ చేసిన సాహిత్యంకుందూరి దాసన్న కవి రచించిన ‘జమాబందీ దండకము ’. కుందూరి దాసన్నకవి గారి జీవిత విశేషాలు, పుట్టు పూర్వోత్తరాలను గూర్చి సమాచారమేమీ లేకపోయునప్పటికీ దాసన్నకవి గారు రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అరుదుగా లభించే 19వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణగుటయే కాక ఆ కాలపు పారిభాషిక పదమైన ‘జమాబందీ’తో పరిచయంచేసి (చూడు పారిభాషిక పదకోశం), ఆ జమాబందీ ఎంత హడావుడిగా జరిగేదీ, బ్రిటిష్ వారి పరిపాలనలో రెవెన్యూ లెఖ్కలు ఏవిధంగా కట్టుదిట్టమైన సారధ్యముతో నడిచేవీ తెలియజేయు రచన. 1974 లో దిగవల్లి వేంకట శివరావుగారు సంకలనంచేసి గ్రామోద్యోగి పత్రికసంపాదకులు పసుపులేటి కృష్ణయ్యగారి ముద్రాక్షరశాలలో ముద్రించి ఈ రచనను ప్రకటించారు. శివరావు గారి చేతి వ్రాతలోనున్న అముద్రిత పీఠిక వలన కుందూరి దాసన్న కవి రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అనే రచన యొక్క చేతివ్రాత ప్రతి మహాకవి దాసు శ్రీరాములు (1848 -1908) గారి వద్ద యుండినదనియూ, వారి కుమారుడు దాసు కేశవరావు గారు 1897 లోమొట్టమొదటి సారిగా దీనిని సంకలనంచేసి వారి వాణీ ముద్రాక్షర శాల ( చూడు దాసు విష్ణు రావు గారు), బెజవాడలో ముద్రించి ప్రచురించారనియూ తెలియుచున్నది. ఈ దండకములో అనేక గ్రామాల పేర్లు, పదవులు, పదవులహోదాలు, పదవుల్లోనున్న ఉద్యోగులు అమీనులు, బంట్రోత్తులు పేర్లుతో సహా, అప్పటి స్థితిగతులు, దండక రూపంలో వర్ణించిన ఆ సాహిత్యము చరిత్రాత్మకమైనదికూడా.[1].
దండకం లోని వివరాలు
[మార్చు]“శ్రీమాన్ మహా కుక్కుటేశాంక సౌధా గపీఠస్ధితా శాంకరీ రాజ రాజేశ్వరీ దేవి హూంకారిణీ సావధానంబుగా మన్మధాబ్ధునం దావకావాసమౌ పీఠికా పట్టణరాజ్యంబునన్ శ్వేతవక్తృల్ జమాబంది సేయంగ నందౌ చమత్కారముల్ దండకంబొప్పగా జెప్పెదన్ దివ్యచిత్తంబునన్ దెచ్చినా తప్పులన్ గాచి రక్షింపవే గౌరీ నీకుం ప్రమోదంబుగా వందనం బాచరింతున్ మహా దేవీ వైశాఖమాంసాంత్య పక్షంబున్ గ్రాంటుగారొప్పగా కాకినాడం బ్రవేశించి........................” అలా మొదలుపెట్టి "......................ముంగమూరాన్వయుండైన లక్ష్మీనృసింహుండు దావచ్చి పెద్దాపురంబుం బ్రవేశించి యా నాల్గు ఠాణాల కణాలతో లేచిరమ్మంచు లక్ష్మయ్యకుం వ్రాయగావారుసంతోషిత................తత్సభామధ్యభాగోోద్భవానేక చిత్రవిచిత్ర ప్రభాయక్తనాశ్చర్యముల్ జెప్పుకొంచుం చిదానందులై యుండిరోయమ్మ నీ దాసుడైనట్టి కుందూరి దాసయ్యనుంగాంచి రక్షింపవమ్మామహాదేవి తుభ్యం నమస్తే నమస్తే నమః" అని పరిసమాప్తి చేసిన ఆ దండక రచన కామాలు తప్ప చివరదాకా ఫుల్ స్టాప్ లేక సాగిన 8 పుటల దండకం.
చరిత్రాంశములు
[మార్చు]సమాలోచన పక్షపత్రికలో దిగవల్లి వేంకట శివరావుగారు 1984 లో రచించిన వ్యాసమునందిచ్చిన చరిత్రాంశాల వివరణ ప్రకారం కుందూరి దాసన్న గారి ‘జమాబందీ దండకం’లో ఉల్లేఖించిన సంవత్సరము, మన్మధనామ సంవత్సరం. సా.శ. 1835 మార్చి30 న మన్మధనామ సంవత్సరం మొదలైనది. ఆ సంవత్సరంలో జరిగిన జమాబందీ 1835 మే నెలలో జరిగినట్లుగా అప్పటి ప్రభుత్వ రికార్టులను బట్టి తెలియుచున్నది. దండకములో వర్ణిం చిన ఠాణాలు, గ్రామాల పేర్లు, పట్టణాలు, పరిపాలనా సిబ్బందుల పదవీ హోదాలు, పేర్లు, మొదలగు వివరాలు అలనాటి కంపెనీ ప్రభుత్వ రికార్డులతో సరిపోయినవని చాలామట్టుకు గోదావరి జిల్లా మాన్యువల్ లోనూ, గుంటూరు జిల్లా మాన్యువల్లోనూ ఉల్లేఖించబడినవని ఖరారుచేశారు.[1]. దాసన్నకవి గారి దండకములో చెప్పబడిన గ్రాంటు గారు, అప్పటిరాజమండ్రీ జిల్లా (ఇప్పటి తూర్పు+ పశ్చమగోదావరి జిల్లాలు కలిపియున్నట్టి జిల్లా) కు 1835 నుండీ 1837 వరకూ జిల్లా కలెక్టరు, పాట్రిక్ గ్రాంటు (Patrik Grant) దొరగారని గోదావరి జిల్లా మాన్యువల్ వలన తెలుయుచున్నదనీనూ, దండకంలో జమాబందీ కాకినాడ పట్టణంలో జరిగినదని చెప్పబడియున్నది. 1835నాటి కాకినాడ పట్టణం ఆనాటి రాజమండ్రీజిల్లాకు కేంద్రీయపట్టణం. దండకములో ఉల్లేఖించబడిన "మహాభీమలింగేశుదేవాలయం" 1835 నాటికి కాకినాడ కలెక్టరు కచేరీలో ఇంగ్లీషు రికార్డుకీపరుగానుండిన దిగవల్లి తిమ్మరాజు గారు 1828లోనిర్మించిన దేవాలయం (చూడు దిగవల్లి తిమ్మరాజు పంతులు ) . వివరించిన గ్రామాలు ఠాణాలను బట్టి అవి పెద్దాపురం మరియూ పిఠాపురం సంస్థానంలోనివని తెలియుచున్నది. అలాగే సిరస్తదారుడని ముంగమూరి లక్ష్మీనరసింహంగారని ఉల్లేఖించబడ్డ ఉద్యోగి గుంటూరు, నెల్లూరు జిల్లాలో పనిచేసి పదోన్నతితో 1835-36 మధ్యకాలం రాజమండ్రీ జిల్లాకు హుజూరుసిరస్తదారుడైనాడని ఫ్రైకెన్ బర్గు (Freikenberg) సంకలనంచేసిన (Oxford university Press ప్రచురణ) గుంటూరు జిల్లా మాన్యువల్ లో నుండుటవలన దాసన్నకవిగారి జమాబందీ చరిత్రాధారములుకలదని చెప్పవచ్చు. ఇంకా కొన్ని నిర్వివాదక విశేషములు కనబరచవచ్చు. ఆ జమాబందీ దండకము వలన ఆంగ్లేయ కంపెనీపరిపాలనా కాలంలో రెవెన్యూ లెఖ్కలు కట్టుదిట్టములతో జరిగేదని కూడాతెలియుచున్నది.
1835కు ముందు జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీలు
[మార్చు]1984 సెప్టెంబరు 1 న వెలువడిన సమాలోచన పక్షపత్రికలో 1794- 1850 మద్యకాలంనాటి జమాబందీల గురించిన వ్యాసములో చెప్పబడియున్నవి.
'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' అనే సీసమాలిక
[మార్చు]అడిదెం రామారావు గారు రచించిన విస్మృత కళింగాంధ్ర కవులు అను పుస్తకములో వర్దపర్తి కొనరాట్కవి రచించిన 'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' లో ఇనాముల ఫైసలాకు సా.శ. 1799లో విశాఖపట్టణంలో చేసిన జమాబందీని వర్ణించిన సీసమాలిక పద్యము వున్నదని ఆంధ్రప్రభ 21-06-1987 న దిగవల్లి వేంకట శివరావు గారు ప్రచురించిన వ్యాసము వలన తెలియుచున్నది.
సీసమాలిక లోని వివరాలు
[మార్చు]ఆడిదెం రామారావుగారి కళింగాంధ్రకవులు అను పుస్తకములో ప్రచురితమైన వర్దిపర్తి కొనరాట్కవి (1754-1834) రచించిన 'కరణాలభోగట్టా-కమిటీఉత్తరం' అనే సీసమాలికలో అనేక ఉర్దూ-తెలుగు మాటలు కలిగియున్న రచనను 1987 ఆంధ్రప్రభ వ్యాసములో దిగవల్లి వేంకట శివరావుగారు కొన్ని మాటలకు అర్ధము వివిరించి ప్రచురించారు. ఆ సీసమాలిక ఇలా మొదలైంది "బారాన్ననౌఫసలీ యాదాస్తు పరగణా ఉప్పనాపక్కినాడు ఫిబరేవరి తేది భిన్నవోరోజర్సరికి కరణాల భోగట్ట వినుడి". అని మొదలు పెట్టి ".................. మీ మధురాలెన్నిమీయడ భూమెంత? మీవూరుబీడెంత? మెట్టెంత? పదునాలుగేళ్ళ కు పంటెంత ఖిర్డెంత వ్రజలెంత నాగళ్ళు నాఖిర్డు నాడెంత డవులెంత చెల్లెంత బాకెంత శిస్తెంత పల్లపుభూమెంత మెట్టఎంత".........". ".....పూర్వపుమాన్యముల్ తరువాతమాన్యముల్ కొన్న భూముల్ ప్రతిగొన్నయట్టి కరవులోగడలెఖలు పోయెమావద్ద కరువులెఖలు కానరావు రెండేండ్ల లెఖలు లేవు నాథగ్గర మూడేడ్ల లెఖలుబోయమాకు నాలుగేళ్ల జాడనాదగ్గరనులేవు కడిగి ఐదేళ్ల కాకరములేదు...................." “………..తాటియాకులువిప్పి తారుమారులచేసి దీపాలముందర తిరుగవేసి ఆరుఏడ్నేల్లు వీరు చికాకుపడిరి గాన వారిని రక్షించి కరుణజేసి శలవువేగంబొసగవే సారసాక్షవినుత గౌరీశవుపమాక వెంకటేశ” అని సమాప్తిచేసిన సీసమాలిక ద్వారా కొనరాట్కవి ఆ ఇనాముల జమాబందీకోసం కరణాలు తయారుచెయవలసిన Memorandum కోసం వారు పడేతంటాలు దయానీయకంగానుండినవని వాళ్ళను రక్షించమని పరిపాలకుడైన ఆంగ్ల కంపెనీప్రభుత్వ దొరలకమిటీకి తెలియజేసినాడట. ఇందులో కల కొన్ని క్లిష్టమైన ఉరుదు-తెలుగు మాటలు ఆ కాలంనాటివి కొన్ని మచ్చుకు మరియూ వాటి అర్ధాలు ఉదహరించబడ్డాయి.[2] బారన్ననౌ ఫసలీ 1209 ఫిబరేవరి అంటే సా.శ. 1799 ఫిబ్రవరి మాసం. యాదాస్తు అంటే Memorandum, డౌలు అంటే అంచనాలెఖ రావలసిన సిస్తు, ఖిర్డు అంటే సాగు వ్యవసాయ భూమి, నాఖిర్డు అంటే సాగులోలేని భూమి, మాన్యము అంటే ఇనాము శిస్తులేకుండా గానీ తక్కువ శిస్తు నిర్ణయించి ఇచ్చిన భూమి, మిరాసీ అంటే వంశపార పర్యంగా శిస్తు వసూలు చేసుకునే హక్కు. ఇంకా ఇలాంటి చాలమాటలు ఈరోజులలో ఎవరూవాడనవి (ప్రాకృతం, పాళీ భాషలు లాగ) చాలా ఉన్నాయి. వాటిని పోగొట్టుకోక ముందే సేకరించాలి. చరిత్ర నిలుపుకోవాలంటే వాటిని తెలుసుకోవాలసిన అవసరం ఎంతైనావున్నది.
చరిత్రాంశాలు
[మార్చు]ఆంగ్ల కంపెనీప్రభుత్వపరిపాలనలో 1786-93 మద్యకాలంలోగవర్నరు జనరల్ కారన్ వాలీసు దొరగారు వంగ రాష్ట్రములో జమీందారులు కంపెనీకి చెల్లించవలసిన పేష్కస్సును శాస్వతముగా నిర్ణయిస్తూచేసిన పర్మనెంటు సెటిల్మెంటు విధాన్నాని మద్రాసు ప్రోవిన్సు లోగూడా ప్రవేశపెట్టుటకు, రాజధాని మద్రాసులో ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీవారి ఆదేశాల ప్రకారం 1799 లో మద్రాసు ప్రోవిన్సులోని అన్ని జిల్లా కలెక్టరులు కరణాలచేత 1785-98 మధ్యకాలంనాటి గ్రామస్థితిగతుల లెఖలను తయారుచేయించి కమిటీకి పంపగా మద్రాసు రాజధానిలో 1802 లో ఉత్తర సర్కారులలో గూడా పర్మనెంటుసెటిల్మెంటు (శాస్వత పరిష్కారము) జరిగింది.[2] మద్రాసు ప్రోవిన్సలో ఉత్తర సర్కారులు ఒక ముఖ్య పరిపాలనా భూఖండము. ( చూడు ఉత్తర సర్కారులు ). 'కరణాల భోగట్టా- కమిటి ఉత్తరం' అను సీసమాలిక రచనలో కవి గారు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఉపమాకగా నివేదించినది కమిటీ ఉత్తరం అని ప్రసిధ్ది. పైన వివిరించిన చారిత్రిక వాస్తవాలను దృష్టిలోనుంచుకున్నట్లైతే కవిగారి రచనలో కరణాల భోగట్టా ఏమిటి, కమిటీకి ఉత్తరం ఎమిటి అనే సందేహమ నివృత్తి కాగలదు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 " 'జమాబందీ దండకము'-చరిత్రాంశాలు" దిగవల్లి వేంకట శివరావు.సమాలోచన 01/12/1984
- ↑ 2.0 2.1 2.2 " 'కరణాల భోగట్టా- కమిటీ ఉత్తరం' ", దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్రప్రభ 21/06/1987
- ↑ కె. ఎన్. కేసరి. " మా ఊరు". చిన్ననాటి ముచ్చట్లు. వికీసోర్స్.
- "Land records of Government of Haryana". Government of Harayana. Archived from the original on 2016-06-07. Retrieved 2016-06-09.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)