ఫ్యూచరిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1913 లో ఉంబర్టో బొస్సియోని అనే ఫ్యూచరిస్టు చెక్కిన శిల్పం Unique Forms of Continuity in Space. ఈ శిల్పం గమనం, చలనం, వేగం, నిరాటంకాలని సూచిస్తుంది. గాలిని చీల్చుకొంటూ (ఏరో డయినమిజం), చాకచక్యంగా ముందుకు సాగిపోతోన్న ఒక మనిషిని ఈ శిల్పం లో చూడవచ్చు. అతని ముఖం లో స్పష్టత లేకపోవటం, చేతులు లేక పోవటం గమనార్హాలు. ఈ శిల్పాన్ని చూసి ఇతర కళాకారులు బోసియోని కళ లోని గాంభీర్యాన్ని, ఇంద్రియతత్త్వ్వాన్ని, తాత్త్వికతని, ఆలోచనాత్మకతని కొనియాడారు.[1].[2]

ఫ్యూచరిజం (ఆంగ్లం: Futurism) అనేది 1909 లో ఇటలీ లో పుట్టిన ఒక కళా ఉద్యమం. భూత, వర్తమాన కాలాలను ప్రక్కన పెట్టి, భవిష్యత్తు యొక్క అర్థానికి, కలల సాకారం కావటానికి. తక్షణ శక్తికి, యాంత్రిక ప్రక్రియలకు ఫ్యూచరిజం పెద్దపీట వేసింది.[3] వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని చిత్రాలను వేసే సాంప్రదాయిక పద్ధతికి స్వస్తి పలికి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ ఆధునిక ప్రపంచం, ఆధునిక యంత్రాల వంటి వాటిని చిత్రీకరించి, చిత్రకళ ను క్రొత్త పుంతలు త్రొక్కించింది.[4]

వ్యుత్పత్తి

[మార్చు]
ఫ్యూచరిస్టులు: లుయిగి రుస్సోలో, కార్లో కారా, ఫిలిప్పో టోమసో మారినెట్టి, ఉంబర్టో బోసియోని, గీనో సెవెరినీ

ఈ ప్రపంచం గతం గురించి తెలుసుకొంటూ, ఎక్కడ వేసిన గొంగళి వలె అక్కడే ఉన్నట్లు ప్రగతి లేకుండా ఉండిపోయింది అని, దీనిని ముందుకు తీసుకెళ్ళాలంటే గతం మరచి భవిష్యత్తు గురించి అలోచించాలనే కొందరి ఆలోచన నుంచే ఫ్యూచరిజం ఉద్భవించింది.[5]

1908 లో ఇటాలియన్ కవి అయిన ఫిలిప్పో తొమాస్సో మారినెట్టి అనే కవి/సంపాదకుడు, సైకిలు/కార్ల ను పోలుస్తూ, పాత తరం/కొత్త తరం వాహనాల పోలిక చేస్తూ వ్యూచరిజం అనే పదాన్ని ముందుకు తీసుకువచ్చాడు.[5]

పుట్టుక

[మార్చు]

20 ఫిబ్రవరి 1909 లో మొట్టమొదట పారిస్ కు చెందిన లే ఫిగారో అనే వార్తాపత్రిక లో ఫిలిప్పో తొమాస్సో మారినెట్టి ఫ్యూచరిజం పై ఒక మానిఫెస్టో ప్రచురించాడు. [6] పాత చింతకాయ పచ్చడిని ప్రక్కన పెట్టి సంస్కృతి/సంఘాలలో మార్పు, వాస్తవికత, ఆవిష్కరణ లకు ప్రాముఖ్యతనిచ్చే ఉద్దేశ్యం తో మారినెట్టి ఈ పదాన్ని వాడాడు. మారినెట్టి ప్రచురించిన ఈ వ్యాసం ఆటోమొబైల్ రంగం లోని సాంకేతిక విప్లవాన్ని, అందులోని వేగం, శక్తి, చలనాలలో ఉన్న అందాన్ని కీర్తించింది.

ఉద్రేకం, దుడుకుదనం తో కూడుకొన్న ఈ మానిఫెస్టో విమర్శలను లేవనెత్తింది.[5] పురోగతి కి ఇటలీ కేంద్రం కావాలి అని, మ్యూజియం లు/గ్రంథాలయాలు/సాంప్రదాయ బోధనా పద్ధతులను ప్రక్కన పెట్టి, అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సంస్కృతిని పునర్లిఖిస్తేనే ఇది సాధ్యపడుతుంది అని మారినెట్టి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

లక్షణాలు

[మార్చు]

ఫ్యూచరిజం లో

  • చైతన్యం
  • వేగం
  • శక్తి
  • యాంత్రిక శక్తి,
  • తేజం
  • మార్పు
  • చంచలత్వం
  • ఆధునిక
  • ఆవిష్కరణ
  • ఆధునికత

- వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పరిణామాలు

[మార్చు]

మారినెట్టి ఫ్యూచరిస్టు దృక్పథం సాహిత్యం, నాటక రంగం, నిర్మాణ రంగం, ఫ్యాషన్ నుండి వంటల వరకు ప్రభావితం చేసింది. [5] లుయిగి రుస్సొలొ, కార్లో కారా, ఉంబర్టో బోసినీ, గీనో సెవెరినీ వంటి వారు మారినెట్టి వ్యూచరిస్టు భావాలకు వెన్నుదన్నుగా నిలిచారు. స్తబ్దుగా ఉన్న, బోధనాంశం గా పరిమితం అయిన చిత్రకళ వ్యూచరిజం నుండి నేర్చుకొనవలసింది చాలా ఉందని తేల్చారు. చిత్రలేఖనం లోకి ఫ్యూచరిస్టు భావాలు చొప్పించి చిత్రకళకు కొత్త శక్తిని, జవసత్వాలను తెచ్చారు. పౌరాణిక విషయాలు మాత్రం చిత్రీకరించే బదులుగా వేగం, చలనం, శక్తి వంటి నూతన అంశాలను చిత్రీకరించటం మొదలు పెట్టారు. పరిశ్రమ, కార్మికులు, యుద్ధం వంటి వాటిని కీర్తించే చిత్రలేఖనాలు చేశారు. డివిజనిజం వంటి సాంకేతిక అంశాలను చిత్రలేఖనం లో చొప్పించారు.

కళలను ప్రభావితం చేయటం, కళలలో నూతన ఒరవడులను సృష్టించటమే కాక కళాసౌందర్యం, రాజకీయాలు, సాంఘిక ఆదర్శాలు వంటి వాటిని కూడా ఫ్యూచరిజం స్పృశించింది.

రష్యా, ఇంగ్లాండు, బెల్జియం వంటి దేశాలలో కూడా ఫ్యూచరిస్టు భావాలు మొలకెత్తాయి.

ప్రేరణ

[మార్చు]

క్యూబిజం నుండి ఫ్యూచరిజం కొన్ని ప్రేరణలను తీసుకొంది. [5]

పతనం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం, ఫ్యూచరిజం ను చావుదెబ్బ కొట్టింది[5] ఇటలీకి పూర్వ వైభవం రావాలంటే యుద్ధం, హింస తప్పవన్న ఫ్యూచరిస్టు ఆలోచనలే, ఫ్యూచరిస్టులను పొట్టన పెట్టుకొంది. దీనితో ఫ్యూచరిజం వేగానికి కళ్ళాలు పడ్డాయి. అయినా, యుద్దం ముగియగానే మారినెట్టి సెకండ్ ఫ్యూచరిజం ను మళ్ళీ తెప్పించాడు. నవీన ఫ్యూచరిస్టులు విమానయానం పై దృష్తిని కేంద్రీకరించారు. ముస్సోలినీ ఇటలీ నాయకుడుగా ఎదుగుతోన్నప్పుడు, మారినెట్టి అతని సైన్యం లో చేరి ఫాసిస్టు మ్యానిఫెస్టో రచించాడు. ఫ్యూచరిజం ను ఫాసిజం అధికారికంగా స్వంతం చేసుకోలేదు. కానీ ఫాసిజం, ఫ్యూచరిజం దేశభక్తి కలిగినవి, ఆటంకాలు కలుగజేసేవి, కార్మికులను కీర్తించటం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించటం వంటి లక్షణాలు కలవి కావున రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉండేది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి కళాకారులు తిరిగి పాత పద్ధతులనే ఇష్టపడటం, 1944 లో మారినెట్టి తనువు చాలించటం తో ఫ్యూచరిజం కూడా కను మరుగయ్యింది. ఆర్ట్ డెకో, కన్స్ట్రక్టివిజం, సరియలిజం, డాడాయిజం వంటి వాటి పై ఫ్యూచర్జిఅం యొక్క ప్రభావం కనిపిస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. MET, The. "Unique Forms of Continuity in Space". Retrieved 2024-08-30.
  2. Dixon, Andrew Graham (2009-01-18). "Umberto Boccioni and 100 years of Futurism". Retrieved 2024-08-30.
  3. "Definition of FUTURISM". www.merriam-webster.com (in ఇంగ్లీష్). 2024-06-26. Retrieved 2024-07-08.
  4. "ఆక్స్ఫర్ద్ లర్నర్స్ డిక్షనరీస్". oxford learners dictionaries. Retrieved 2024-07-08.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Muse, Curious. "Futurism in 9 minutes: How to Rewrite Culture". Retrieved 2024-08-30.
  6. "బ్రిటానికా లో ఫ్యూచరిజం". బ్రిటానికా. 2024-07-09. Retrieved 2024-07-09.