మైక్ డెన్నెస్ - భారత క్రికెట్ జట్టు వివాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008లో మైక్ డెన్నెస్

పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్ పార్క్‌లో 2001 నవంబర్ 16-20 మధ్య జరిగిన 2001 భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో మ్యాచ్ రిఫరీ, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ డెన్నెస్, ఆరుగురు భారత ఆటగాళ్లను వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారించాడు. ఆరుగురు ఆటగాళ్లకు డెన్నెస్ అత్యంత తీవ్రంగా శిక్ష విధించిన తీరును భారత మీడియా జాత్యాహంకారంగా భావించింది. సాధారణ ప్రజలు దీనిపై ఆగ్రహించారు. ఈ సంఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలింది.[1][2]

రెండో టెస్టు: నిషేధాలు

[మార్చు]

క్రికెట్ నియమాల ప్రకారం, బాల్ టాంపరింగ్ అనేది తీవ్రమైన ఉల్లంఘనగానూ, మోసంగానూ పరిగణిస్తారు. రెండవ టెస్టులో సచిన్ టెండుల్కర్ తన గోరును బంతి సీమ్ చుట్టూ చాలాసార్లు తాకించి తిప్పుతూ కెమెరాకు చిక్కాడు. దీనిని డెన్నెస్ ట్యాంపరింగ్‌గా భావించాడు. ఆమాటను టెండూల్కర్ ఖండించాడు. తాను బంతిపై సీమ్‌ను శుభ్రం చేస్తున్నానని పేర్కొన్నాడు, వాస్తవానికి ఈ పద్ధతిలో బంతిని ప్రభావితం చేయడం పెద్ద ప్రయోజనకరం కానందువల్ల సచిన్ ఇచ్చింది ఆమోదయోగ్యంగానే తోచే వివరణ.

సచిన్ టెండూల్కర్ బంతి సీమ్ చుట్టూ గోరును తాకించి తిప్పుతూ ఉండడం, దాన్ని మైక్ డెన్నిస్ టాంపరింగ్‌గా తీసుకోవడం ఈ వివాదానికి మూలకారణమైంది. (2014లో సచిన్ టెండూల్కర్)

దీనికి తోడు ఇతర ఆటగాళ్ళు ఎక్కువగా అప్పీల్ చేయడం, బౌలర్ ఎండ్ వద్ద ఉన్న అంపైర్ వద్దకు దూసుకురావడం వంటి సంఘటనలు కూడా ఈ టెస్టులో చోటుచేసుకున్నాయని డెన్నిస్ నిర్ధారించాడు. పలువురు ఆటగాళ్లకు సంబంధించిన అనేక సంఘటనలు ఉన్నందున, జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టు ప్రవర్తనను నియంత్రించడంలో విఫలమయ్యాడని కూడా పేర్కొన్నాడు. ఈ కారణాలు పేర్కొంటూ డెన్నెస్ వారి మ్యాచ్ ఫీజులో కొంత శాతాన్ని జప్తు చేయడంతో పాటు, భారత ఆటగాళ్లకు ఈ క్రింది సస్పెన్షన్‌లు విధించాడు:

ఈ శిక్షలను డెన్నెస్ ప్రకటించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన చర్యలకు కారణాలను వివరించడంలో విఫలమయ్యాడని తీవ్రంగా విమర్శల పాలయ్యాడు. అయితే, ఐసీసీ నిబంధనల కారణంగా తన అభియోగాలను తెలియజేయడం మినహా డెన్నెస్ మరే వివరణలు ఇవ్వడానికి లేదు. ఇలానే ఎక్కువగా అప్పీల్ చేసిన షాన్ పొలాక్‌పై ఎందుకు ఇలాంటి జరిమానాలే విధించలేదని భారతీయ విలేఖరులు డెన్నెస్‌పై విమర్శలు సంధించారు.[4] ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన చర్యలను డెన్నెస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి "మైక్ డెన్నెస్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే అతను ఇక్కడ (ప్రెస్ కాన్ఫరేన్స్‌లో) ఎందుకు ఉన్నట్టు? అతను ఎలా ఉంటాడన్నది మాకు ఎలాగా తెలుసు" అని విమర్శించాడు.[5] ఇది భారతీయ క్రికెట్ వ్యవస్థ నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. తద్వారా, అంతర్జాతీయ క్రికెట్, రాజకీయ, పరిపాలనాపరమైన సంక్షోభానికి కారణమైంది.[6][7][8]

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో బీసీసీఐ వివాదం

[మార్చు]

అనధికారిక మూడవ టెస్టు

[మార్చు]

భారతదేశంలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి డెన్నెస్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఈ విషయం భారత పార్లమెంటులో చర్చకు వచ్చింది. ప్రముఖ పత్రికలు డెన్నెస్‌ను జాత్యహంకారిగా పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న థర్డ్ వరల్డ్ దేశాల పట్ల ఐసీసీ వివక్ష చూపుతుందని ఆరోపించాయి.[9]

నవంబరు 23-27 తేదీల్లో సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్కులో జరగబోయే మూడవ టెస్టులో మ్యాచ్ రిఫరీగా డెన్నెస్ బదులు వేరొకరిని నియమించకపోతే దక్షిణాఫ్రికా పర్యటనను రద్దుచేసుకుంటామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం డెన్నెస్ పక్షానే నిలిచింది. రిఫరీని మార్చేది లేదని స్పష్టం చేసింది.[10] బీసీసీఐ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమర్థించింది. ఐసీసీ గుర్తింపుతో సంబంధం లేకుండా తర్వాతి టెస్టును ఈ రెండు బోర్డులూ కలసి నిర్వహించాయి.[11] మ్యాచ్ రిఫరీగా మైక్ డెన్నెస్ బదులు దక్షిణాఫ్రికాకు చెందిన డెనిస్ లిండ్సేని నియమించారు. మైక్ డెన్నెస్ స్టేడియంలోకి కూడా ప్రవేశించడానికి వీల్లేదని కట్టడి చేశారు.[12] దీనితో ఐసీసీ ఈ మ్యాచ్‌ను అనధికారికం అని ప్రకటించి, దీనిని "స్నేహపూర్వక ఐదు రోజుల మ్యాచ్"గా వర్గీకరించింది;[13] ఇందువల్ల టెస్ట్ సిరీస్ అప్పటికి పూర్తయిన రెండు మ్యాచ్‌లకే పరిమితం చేస్తూ నిర్ణయించింది. ఆ ప్రకారం టెస్టు సీరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో గెలిచినట్టు ఐసీసీ ప్రకటించింది.

సెహ్వాగ్‌పై ఒక మ్యాచ్ నిషేధం

[మార్చు]
మిగిలిన క్రికెటర్లపై నిషేధాలను ఎత్తివేసినా సెహ్వాగ్‌పై మాత్రం ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధాన్ని ఐసీసీ కొనసాగించింది. (2010లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్)

ఐసీసీ తదుపరి టెస్టులో సెహ్వాగ్‌పై విధించిన నిషేధాన్ని సమర్థించింది, అయితే టెండూల్కర్, గంగూలీలపై నిషేధాలను మాత్రం రద్దు చేసింది.[14] భారత్‌ జట్టు మాత్రం సెహ్వాగ్‌ని టెస్ట్ జట్టుకు ఎంపిక చేయడంతో ఆ తర్వాత ఇంగ్లండ్ భారతదేశంలో చేయాల్సిన పర్యటన చిక్కుల్లో పడింది.[15] ఈ పరిణామంతో, సెహ్వాగ్ తన నిషేధాన్ని పూర్తిచేసుకునేదాకా సెహ్వాగ్‌తో భారత జట్టు ఆడే ఏ టెస్ట్ మ్యాచ్ అయినా అధికారిక టెస్ట్‌గా పరిగణించబడదని ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది.[16] ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఐసీసీలతో చర్చల తరువాత, క్రికెట్ సాధారణ ప్రయోజనాల దృష్ట్యా, సెహ్వాగ్ ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌కు మాత్రం జట్టు నుండి తొలగించబడ్డాడు.[17]

తర్వాతి పరిణామాలు

[మార్చు]

మైక్ డెన్నెస్ మరో రెండు టెస్టులకు, మరో మూడు వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు మాత్రమే రిఫరీగా పనిచేశాడు. ఈ మ్యాచ్‌లన్నీ 2002 జనవరి, ఫిబ్రవరి నెలల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో పాకిస్తాన్‌కీ, వెస్టిండీస్‌కీ మధ్య జరిగిన సిరీస్‌లో భాగం. ఆ తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా మ్యాచ్ రిఫరీగా అతను పదవీ విరమణ చేసాడు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్‌కు అప్పట్లో ఛైర్మన్‌గా వ్యవహరించిన మైఖేల్ బెలాఫ్ క్యూసీ నేతృత్వంలో ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీ 2002 జూన్ 6, 7 తేదీల్లో ఈ కేసును విచారించడానికి షెడ్యూల్ చేసింది. కానీ, డెనెస్ అనారోగ్యం, గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండడం వంటివాటి కారణంగా విచారణ షెడ్యూల్ తేదీకి ఒక వారం ముందు వాయిదా పడింది.[18]

డెనెస్ గుండె శస్త్రచికిత్సను దృష్టిలో ఉంచుకుని బిసిసిఐ కేసును విరమించుకోవాలని నిర్ణయించుకున్నందున డెనెస్‌కీ, భారత జట్టుకీ మధ్య జరిగిన వివాదంలో కేసు మెరిట్‌ని విచారించి నిర్ణయం తీసుకోవడానికి రిజల్యూషన్ కమిటీ మరెప్పుడూ సమావేశం కాలేదు.[19] డెన్నెస్ సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడి 2013లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Fines and bans handed down to Indian players". Cricinfo. 20 November 2001. Retrieved 2 April 2007.
  2. "The Denness affair". Cricinfo. 20 November 2001. Retrieved 11 January 2011.
  3. "Tendulkar handed suspended ban from Test cricket". Cricinfo. 19 November 2001. Retrieved 2 April 2007.
  4. "No enlightenment from Denness at farcical press conference". Cricinfo. 20 November 2001. Retrieved 2 April 2007.
  5. Shastri, Ravi. "rediff.com: cricket channel: Quotes on the Mike Denness controversy". Rediff.com. Retrieved 18 April 2008.
  6. "Former cricketers express anger at Denness' decision". Cricinfo. 20 November 2001. Retrieved 2 April 2007.
  7. "Ball tampering controversy aired in Indian parliament". Cricinfo. 22 November 2001. Retrieved 2 April 2007.
  8. "BCCI call for Denness's removal". Cricinfo. 20 November 2001. Retrieved 2 April 2007.
  9. "Cricket outrage unites Indians". BBC News. 23 November 2001. Retrieved 18 April 2008.
  10. "ICC praised Denness' stand against gamesmanship in cricket, and ruled out replacing him for the final Test". Cricinfo. 21 November 2001. Retrieved 2 April 2007.
  11. "South Africa will back India in Denness affair". Cricinfo. 20 November 2001. Retrieved 2 April 2007.
  12. "UCBSA issues statement regarding third Castle Lager/MTN Test". Cricinfo. 22 November 2001. Retrieved 2 April 2007.
  13. "ICC sets out latest position regarding South Africa v India". Cricinfo. 23 November 2001. Retrieved 2 April 2007.
  14. "Centurion Match Is Not a Test and Sehwag Ban Will Stand, Says ICC" (Press release). International Cricket Council. 25 November 2001. Retrieved 6 January 2022.
  15. "India name Sehwag in 14-member squad for Mohali Test". Cricinfo. 27 November 2001. Retrieved 2 April 2007.
  16. "ICC sets out its position on 1st Test at Mohali". Cricinfo. 27 November 2001. Retrieved 2 April 2007.
  17. "Mohali Test will go ahead after BCCI agree to exclude Sehwag". Cricinfo. 30 November 2001. Retrieved 2 April 2007.
  18. "ICC disputes resolution Committee deferred". Cricinfo. 31 May 2002. Retrieved 2 April 2007.
  19. "India to 'forget' Mike Denness affair". Cricinfo. 22 June 2003. Retrieved 2 April 2007.