రాజతరంగిణి
రాజతరంగిణి (రాజుల నది) వాయవ్య భారత ఉపఖండం యొక్క చారిత్రిక సంచిక, మరీ ప్రత్యేకంగా కాశ్మీరు చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథం. దీన్ని సంస్కృతంలో రచించారు. రాజతరంగిణిని కాశ్మీరీ బ్రాహ్మణుడు కల్హణుడు సా.శ.12వ శతాబ్దంలో వ్రాశారు.[1] [2]
ఈ రచన సాధారణంగా కాశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలను నమోదు చేస్తుంది. కానీ రాజతరంగిణిలోని 120 శ్లోకాలు అనంత దేవ రాజు కుమారుడైన కలాశ్ రాజు పరిపాలనాకాలంలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించింది. రాజతరంగిణిలోని ప్రాచీన చారిత్రిక వివరాలు ప్రాచీన భారతీయ చరిత్ర రచనకు ప్రామాణికంగా వినియోగపడుతున్నాయి.
నేపథ్యం
[మార్చు]రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా హిమాలయాలు, పిర్ పంజల్ శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్హణుని ప్రకారం కాశ్మీరు లోయ ప్రాచీనకాలంలో ఓ పెద్ద సరస్సు. ప్రఖ్యాతుడైన మహర్షి కశ్యపుడు బారాముల్లా వద్ద సరస్సు కరకట్టను త్రుంచివేయగా ఆ లోయలోని మొత్త నీరంతా బయటకు ప్రవహించింది. సంస్కృతంలో वराहमूल (వరాహమూల) అనే పేరుండేది బారాముల్లాకు. దీని అర్థం వరాహ మూలం అని వస్తుంది. ఇదే క్రమంగా బారాముల్లా అయింది.
తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి
[మార్చు]కల్హణుడు రచించిన రాజతరంగిణి గ్రంథం తెలుగు సాహిత్యంలో అనేక విధాలుగా ప్రఖ్యాతి చెందింది. రాజతరంగిణిలోని పలువురు రాజుల కథలను ఇతివృత్తాలుగా స్వీకరించి తెలుగు రచయితలు, కవులు కాల్పనిక గ్రంథాలను, చారిత్రిక కల్పనలను రచించారు. తెలుగు సాహిత్యంలోని పలువురు గొప్ప గ్రంథకర్తలు ఈ క్రమంలో వ్రాశారు. నవలలు, కథలు, పద్యకావ్యాలు రాజతరంగిణిని ఆధారం చేసుకుని వ్రాశారు. వీటిలో ప్రఖ్యాతమైన కొన్ని రచనలు:
- విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన కాశ్మీర రాజవంశావళి నవలలు
- పిలకా గణపతిశాస్త్రి రచించిన కాశ్మీర పట్టమహిషి నవల, మరికొన్ని నవలికలు.
- కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన కాశ్మీర రాజతరంగిణి కథలు
- రెండుచింతల లక్ష్మీ నరసింహశాస్త్రి రచించిన రాజతరంగిణి తెలుగు పద్యకావ్యము.