షోలే
షోలే (1975 హిందీ సినిమా) | |
దర్శకత్వం | రమేష్ సిప్పీ |
---|---|
నిర్మాణం | జి.పి.సిప్పీ |
కథ | సలీమ్-జావేద్ |
చిత్రానువాదం | సలీమ్-జావేద్ |
తారాగణం | ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, హేమమాలిని, అమితాబ్ బచ్చన్, జయాబాధురీ, అంజాద్ ఖాన్ |
సంగీతం | ఆర్.డి.బర్మన్ |
నేపథ్య గానం | కిషోర్ కుమార్, మన్నా డే, లతా మంగేష్కర్ |
గీతరచన | ఆనంద్ బక్షి |
సంభాషణలు | సలీమ్-జావేద్ |
ఛాయాగ్రహణం | ద్వారకా దివేచా |
కూర్పు | ఎం.ఎస్.షిండే |
నిర్మాణ సంస్థ | యునైటెడ్ ప్రొడ్యూసర్స్, సిప్పి ఫిలిమ్స్ |
పంపిణీ | సిప్పి ఫిలిమ్స్ |
నిడివి | 204 నిమిషాలు |
భాష | హిందీ |
పెట్టుబడి | 3 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
షోలే 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]- వీరూ - ధర్మేంద్ర
- ఠాకూర్ బలదేవ్ సింగ్ - సంజీవ్ కుమార్
- బసంతి - హేమమాలిని
- జై - అమితాబ్ బచ్చన్
- రాధ (ఠాకూర్ కోడలు) - జయబాధురి
- గబ్బర్ సింగ్ - అంజాద్ ఖాన్
- రామ్‌లాల్ (ఠాకూర్ సేవకుడు) - సత్యేన్ కప్పు
- రహీమ్ చాచా - ఎ.కె.హంగల్
- అహ్మద్ (రహీమ్ చాచా కొడుకు) - సచిన్
- సూర్మా భూపాలీ - జగ్దీప్
- మౌసీ - లీలా మిశ్రా
- జైలర్ - అస్రానీ
- పోలీస్ కమీషనర్ - పైడి జైరాజ్
- ఇన్స్‌పెక్టర్ ఖురానా - ఇఫ్తెకార్
- సాంబా - మాక్ మోహన్
- కాలియా - విజు ఖోటే
- గీతా సిద్ధార్థ్
చిత్రకథ
[మార్చు]రాంగఢ్ అనే కుగ్రామంలో ఠాకూర్ బల్‌దేవ్ సింగ్(సంజీవ్ కుమార్) అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నివసిస్తూ ఉంటాడు. అతడు విధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు చిల్లరదొంగలు వీరూ, జై లను రప్పించి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. బందిపోటు గబ్బర్‌సింగ్‌ను ప్రాణాలతో బంధించే విషయంలో అతడికి సహాయం చేస్తే ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయలతోపాటు అదనంగా మరో 20,000 రూపాయలను ఇస్తానని ఠాకూర్ ఆ ఇద్దరికీ ఆశ పెడతాడు.
గ్రామస్తులను దోచుకోవడానికి గబ్బర్‌సింగ్ పంపిన బందిపోటు దొంగలను ఆ ఇద్దరూ ఎదుర్కొని వారిని తరిమికొడతారు. వెంటనే హోలీ పండుగ రోజు గబ్బర్ అతని అనుచరులు రాంగఢ్‌పై దాడి చేస్తారు. బందిపోట్లకు, వీరూ, జై ద్వయానికీ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఠాకూర్ అందుబాటులో తుపాకీ ఉన్నా అతడు వారికి సహాయం చేయడు. వీరూ, జై పోరాడి బందిపోట్లను తరిమికొడతారు. ఆ ఇద్దరూ ఠాకూర్ చర్యకు నిరసన తెలుపుతూ ఆ గ్రామం వదిలి వెళ్లడానికి సిద్ధపడతారు. అప్పుడు ఠాకూర్ తన కుటుంబం అంతటినీ కొన్నేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ చంపివేసి, తన రెండు చేతులను నరికివేసిన విషాయాన్ని వారికి వివరిస్తాడు. ఆ కారణంతోనే తాను తుపాకీని ఉపయోగించలేకపోయానని చెప్తాడు. తను ఎప్పుడూ కప్పుకుని ఉండే శాలువాను తీసి తన మొండిశరీరాన్ని వారికి చూపిస్తాడు.
కలివిడిగా ఉండే వీరూ, ముభావంగా ఉండే జై ఆ గ్రామప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వీరూ జట్కాబండిని నడిపే బసంతి(హేమమాలిని)ని ఆకర్షిస్తాడు. జై విధవరాలైన ఠాకూర్ కోడలు రాధ(జయబాధురి)ని ప్రేమిస్తాడు.
గబ్బర్ సింగ్ ముఠా వీరూ బసంతిలను పట్టి బంధిస్తుంది. జై ఆ బందిపోట్లపై దాడిచేసి వారిని విడిపిస్తాడు. ఆ ముగ్గురూ ఒక పెద్దబండ వెనక దాగి గబ్బర్ సింగ్ ముఠాపై గుళ్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. వారి వద్దనున్న మందుగుండు సామాగ్రి తగ్గిపోతూ ఉండడంతో వీరూ వాటికోసం అక్కడి నుండి బలవంతంగా వెళ్లవలసివస్తుంది. జై అప్పటికే గాయపడిన విషయం అతనికి తెలియదు. ఇంతలో ఒక్కడే గబ్బర్ సింగ్ ముఠాతో పోరాడుతున్న జై తనవద్ద నున్న చివరి తూటాతో డైనమైట్‌ను పేల్చి వంతెనను కూల్చివేయడానికి తన ప్రాణాలను అర్పించుకుంటాడు.
తిరిగివచ్చిన వీరూ చేతులలో జై మరణిస్తాడు. వీరూ ఉగ్రరూపం దాల్చి గబ్బర్ స్థావరంపై దాడి చేసి అతడిని పట్టుకుంటాడు. అతడిని చితకబాది చంపడానికి ప్రయత్నించగా ఠాకూర్ ప్రత్యక్షమై అతడిని సజీవంగా అప్పగిస్తానని మాట ఇచ్చిన విషయం గుర్తుచేస్తాడు. ఠాకూర్ తన కాళ్ళతో గబ్బర్‌సింగ్‌ను గాయపరచి అతని చేతులను నరికివేస్తాడు. పోలీసులు వచ్చి గబ్బర్‌ను అరెస్ట్ చేస్తారు. జై దహనసంస్కారాల తరువాత వీరూ రాంగఢ్ వదిలి వెళతాడు. బసంతి అతనికోసం రైల్వేస్టేషన్‌లో సిద్ధంగా ఉంటుంది. రాధ ఏకాకిగా మిగిలిపోతుంది.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలనన్నింటినీ ఆనంద్ బక్షి వ్రాయగా ఆర్.డి.బర్మన్ వాటికి సంగీతాన్ని సమకూర్చాడు.
సం. | పాట | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఏ దోస్తీ హం నహీ తోడేఁగే" | కిషోర్ కుమార్, మన్నా డే | 05:21 |
2. | "హా జబ్ తక్ హై జాన్" | లతా మంగేష్కర్ | 05:26 |
3. | "కోయీ హసీనా జబ్ రుఠ్ జాతీహై" | కిషోర్ కుమార్, హేమమాలిని | 04:00 |
4. | "హోలీ కే దిన్ దిల్ ఖిల్ జాతే హై" | కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ | 05:42 |
5. | "మెహబూబా మెహబూబా" | రాహుల్ దేవ్ బర్మన్ | 03:54 |
6. | "ఏ దోస్తీ హం నహీ తోడేఁగే" (విషాద సన్నివేశంలో) | కిషోర్ కుమార్ | 01:49 |
చిత్రనిర్మాణ విశేషాలు
[మార్చు]బాక్సాఫీస్
[మార్చు]జనం మెచ్చిన డైలాగులు
[మార్చు]- జో డర్ గయా సంఝో మర్‌గయా...
- తేరా క్యా హోగా కాలియా....
- యే హాత్ ముఝే దేదే ఠాకూర్...
- బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్‌నే మత్ నాచ్‌నా....
- ఓ కిత్ నే ఆద్మీథే....
- పచాస్ పచాస్ కోస్ దూర్ జబ్ బచ్చా రోతాహై తో.. మా కెహతీహై బేటా సో జా వర్నా గబ్బర్ ఆయేగా