Jump to content

కిషోర్ కుమార్

వికీపీడియా నుండి
కిషోర్ కుమార్
జననం
అభాస్ కుమార్ గంగూలీ [1]

(1929-08-04)1929 ఆగస్టు 4
ఖాండ్వా, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం మధ్యప్రదేశ్)
మరణం1987 అక్టోబరు 13(1987-10-13) (వయసు 58)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తి
  • గాయకుడు
  • సంగీత దర్శకుడు
  • గీతరచయిత
  • నటుడు
  • సినిమా నిర్మాత
  • సినిమా దర్శకుడు
  • సినిమా రచయిత
క్రియాశీల సంవత్సరాలు1946–1987
జీవిత భాగస్వామి
రుమా గుహ తాకుర్తా
(m. 1950; విడాకులు 1958)
మధుబాల
(m. 1960; మరణం 1969)
యోగీత బాలి
(m. 1976; విడాకులు 1978)
లీనా చందవర్కర్
(m. 1980; అతని మరణం 1987)
పిల్లలుఅమిత్ కుమార్
సుమిత్ కుమార్
పురస్కారాలు
  • 8 ఉత్తమ పురుష నేపధ్యగాయకునిగా ఫిలిం ఫేర్ పురస్కారం
  • 4 ఉత్తమ పురుష నేపధ్యగాయకునిగా బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్
  • లతా మంగేష్కర్ పురస్కారం
సంతకం

కిషోర్ కుమార్ (ఆగస్టు 4, 1929అక్టోబరు 13, 1987 జననం:అభాస్ కుమార్ గంగూలీ[2]) భారతీయ హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి.[3] అనేక కళలు ఒక్క మనిషి లోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ ను మన హృదయాల్లో శాశ్వతంగా నిచిలిపోయేట్టు చేస్తాయి. హిందీ సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకులలో ఒకనిగా గుర్తింపు పొందాడు.[4][5] అతను 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిధ్ధి.[6] హిందీ చిత్రాలతో పాటు అతను బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, బోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషా చిత్రాలలో పాటలను పాడాడు. అతను అనేక భాషలలో ప్రవేట్ ఆల్బంలలో పాడాడు. ముఖ్యంగా బెంగాలీ భాషా ఆల్బంలు చేసాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా ఎనిమిది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందాడు. ఈ విభాగంలో అత్యధిక ఫిలిం ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నాడు.[7] అతనికి మద్యప్రదేశ్ ప్రభుత్వం 1985-86 సంవత్సరంలో "లతా మంగేష్కర్ పురస్కారం" అందజేసింది. 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం "కిషోర్ కుమార్ పురస్కారం" ను ప్రారంభించింది. ఇటీవల 2012లో న్యూఢిల్లీ లో జరిగిన ఓసియన్ సినీఫాన్ ఆక్షన్ లో అతను విడుదలచేయని చివరి పాట రూ.15.6 లక్షలు (1.56 మిలియన్లు)[8] కు అమ్ముడయింది.[9][10]

జీవిత విశేషాలు

[మార్చు]

కిషోర్ కుమార్ ఆగష్టు 4, 1929 న ఖాండ్వా గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ.[11] అతని తండ్రి కుంజలాల్ గంగూలీ (గంగోపాధ్యాయ్) న్యాయవాది, అతని తల్లి గౌరీ దేవి ధనికులైన బెంగాలీ కుటుంబానికి చెందినది. కుంజలాల్ గంగోపాధ్యాయ కమవిశాదర్ గోఖలే కుటుంబానికి వ్యక్తిగత న్యాయవాదిగా ఉండేవాడు. కిషోర్ తన సహోదరులలో చిన్నవాడు. అతని కన్నా పెద్దవారు అశోక్ కుమార్, సతీదేవి, అనూప్ కుమార్.[12] అతను బాల్యంలో ఉన్నప్పుడే తన సోదరుడు అశోక్ కుమార్ బాలీవుడ్ నటునిగా ఉన్నాడు. తరువాత అనూప్ కూడా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. అశోక్ కుమార్, అనూప్ కుమార్ లకు ముద్దుల తమ్ముడిగానే, బొంబాయి చిత్ర రంగంలో కిషోర్ అడుగు పెట్టాడు.[13] అతను ఇండోర్ లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసాడు.[14]

1948లో తొలిసారిగా ఫిల్మిస్థాన్ వారి "షికారి" చిత్రంలో చిన్న పాత్ర వేశారు.అదే ఏడాది బాంబే టాకీస్ వారి "జిద్ది"లో తోటమాలి పాత్ర వేశారు. ఈ చిన్న పాత్రలు గుర్తింపు రాలేదు కానీ, "జిద్ది"లో హీరో దేవానంద్ కు పాడిన నేపథ్య గీతాలు పదిమందినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రిమ్‌జిమ్ (1949) లో రెండు పాటలూ, ప్రముఖ దర్శకుడు ఎన్.డి.బర్మన్ అధ్వర్యంలో "ప్యార్" (1950) లో హీరో రాజ్‌కపూర్ కు అన్ని పాటలూ పాడటంతో కిషోర్ గాన విశిష్టత అందరికీ తెలియవచ్చింది.

నౌజవాన్, బాజీ, బహార్ చిత్రాలలో నేపథ్య గీతాలు, ఆందోళన్, బహార్ చిత్రాలలో నటన - కిషోర్ ను గాయకనటునిగా స్థిరపరిచాయి. 1950 ప్రాంతంలో తమ పాత్రలకు తామే పాటలు పాడే కామెడీ పాత్రలలోనే నటనా సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుడుగా కిషోర్ కీర్తిమంతుడయ్యాడు. హేమంతకుమార్, మన్నా డే, రఫీ, తలత్ మహమ్మద్, జి.ఎం.దురానీ వంటి దిగ్ధండులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను మరపురాని స్థానాన్ని రూపొందించుకోగలిగారు. శాస్త్రీయ సంగీతం నుండి రాక్ ఎన్‌రోల్ పాటల దాకా సమప్రజ్ఞతో పాడగల మహ్మద్ రఫీ, ముకేష్ లు కూడా ప్రారంభంలో సైగల్ ను అనుకరించి, ఆ తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు. జానపద గేయాలను, శాస్త్రీయ గీతాన్ని కూడా అధ్బుతంగా పాడే తలత్ మొహమ్మద్, మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గళం వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ హిందీ చిత్ర సంగీతాన్ని స్పీడ్ యుగం లోకి నడిపించుకువచ్చాడు.

సినిమా జీవితం

[మార్చు]

ఆశోక్ కుమార్ హిందీ చిత్రసీమలో నటునిగా చేరిన తరువాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు. అభాస్ కుమార్ తన పేరును "కిషోర్ కుమార్" గా మార్చుకున్నాడు. తరువాత అతను తన సోదరుడు పనిచేసే ముంబై టాకీస్ వద్ద కోరస్ గాయకునిగా సినీప్రస్థానం మొదలుపెట్టాడు. తన సోదరుడు కీలక పాత్ర పోషించిన చిత్రం శిఖారీ(1946) ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు. సంగీత దర్శకుడు ఖేమ్‌చంద్ ప్రకాష్ తన చిత్రం జిడ్డి (1948) లో "మర్నే కీ దుయాయెన్ క్యోం మంగు" అనే పాట పాడడానికి అవకాశం కల్పించాడు. తరువాత అతనికి అనేక సినిమాలలో అవకాశం వచ్చింది.[15] 1949లో ముంబైలో స్థిరపడ్డాడు. "ఫణి మజుందార్" దర్శకత్వంలో నిర్మించబడిన బొంబాయి టాకీస్ చిత్రం "ఆందోళన్ (1951)" లో ముఖ్యపాత్రలో నటించాడు. తన సోదరుని సహాయం ద్వారా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అతనికి తాను గాయకుడు కావాలనే అభిలాష ఉండేది. కానీ అశోక్ కుమార్ తనలాగే నటునిగా ఉండాలని కోరుకునేవాడు.[16] 1946 - 1955 మధ్య అతను 22 సినిమాలలో నటించాడు. అందులో 16 సినిమాలు విజయం సాధించలేకపోయాయి. లడకీ, నౌకరీ, మిస్ మలేసియా, చార్ పైసే, బాప్ రె బాప్ చిత్రాల విజయం తరువాత అతను నటనాజీవితంపై ఆసక్తిని పెంచుకున్నాడు. 1955 నుండి 1966 మధ్య కాలంలో మంచి నటునిగా గుర్తింపు పొందాడు.[17]

తన వృత్తి జీవిత ప్రారంభంలో అతను గాయకుడు కె.ఎల్.సైగల్ ద్వారా ప్రభావితుడై అతని శైలిలో కొన్ని చిత్రాలలో పాటలు పాడాడు. అతనికి కవి, సంగీతకారుడైన రవీంద్రనాధ టాగూరు పై ఉన్న గౌరవం అతన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది.

అతను హాలీవుడ్ నటుడు-గాయకుడు డానీ కాయే కు గొప్ప ఆరాధకుడు. అతను తన గౌరీకుంజ్ నివాసంలో ఈ ముగ్గురు చిత్రాలను ఉంచి ప్రతీరోజూ వారిపై గౌరవం కనబరచేవాడు.[18] తరువాత కాలంలో అతను నేపధ్యగాయకుడు అహ్మద్ రుష్ది కి ప్రభావితుడైనాడు. అతను లండన్ లోణి రాయల్ ఆల్బర్డ్ హాల్ లో రుష్దీ పాడిన పాటలను పాడడం ద్వారా అతనికి నివాళి అర్పించాడు.[19]

అతను తను పాడిన పాటలు "తుం బిన్ జావో కహా", "జిందగీ ఏక్ సఫర్ నై సుహానా", " చలా జాతా హూ" మొదలైన పాటలలో యోడెలింగ్ శైలిని ఉపయోగించాడు. ఈ ప్రక్రియ జిమ్మీ రోడ్జెర్స్, టెక్స్ మార్టిన్ ద్వారా ప్రేరణ పొందిన అతని గానం యొక్క ముఖ్య లక్షణంగా మారింది.[20]


బహుముఖ ప్రజ్ఞాశాలి

[మార్చు]

అధికార్ (1954), చప్‌రే చాప్ (1955), న్యూఢిల్లీ, భాగం భాగ్, భాయ్ భాయ్ (1956) చిత్రాలలోనటునిగా, మిస్ మాలా, నౌక్రీ, ముసాఫిర్ చిత్రాలలో విషాంత రేఖలు వున్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ 1958 లో, "చల్తీకా నాం గాడీ" చిత్రంలో తారాస్థాయి అందుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్ పాడిన పాటలు ఈ నాటికీ మారు మ్రోగుతున్నాయి. అశోక్, అనూష్, కిషోర్ కుమార్ లు మువ్వురూ అన్నదమ్ములూ నటించిన చిత్రం కూడా అదే. "జిద్ది" (1948) లో దేవానంద్ కు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ తరహాలో నటుడుగా, హాస్య పాత్రధారిగా, గాయకుడుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని, చిత్ర రంగంలో స్థిరపడిన తరుణంలో 1961 లో కొత్త అవతారమెత్తారు. "ఝమ్రూ" సినిమాకు సంగీత దర్శకత్వం, పాటల రచన మొదలైన అదనపు బాధ్యతలు చేపట్టారు. అంతటితో ఆగలేదు. "కొషోర్ ఫిలిమ్స్" బ్యానర్ కింద సినిమా నిర్మాణం చేపట్టి, తాను డైరక్ట్ చేయడం, సంగీత దర్శకత్వం చేపట్టడం, పాటలు రాయడం, నటించడం, వీలయినంతమేరకు ఇతర సాంకేతిక బాధ్యతల్ పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు. మొదటి చిత్రం "దూర్ గగన్ కీ ఛాఁవ్ మేఁ", ఆ తర్వాత "హమ్‌ దో డాకూ" (1967), దూర్ కారాహి (1969), "బడ్‌తీ కా నామ్‌ దాడీ", "శభాష్ డాడీ" (1978) చిత్రాలు చెప్పుకోదగినవి.


జీవితంలో వ్యధలు

[మార్చు]
రుక్ జానా నహీఁ తూ కహీఁ హార్‌కే
కాంటోఁ పే చల్‌కే మిలేంగే సాయే బహార్ కే...
ముసాఫిర్‌ హూఁ యారో...న ఘర్‌హై , నా ఠికానా
ముఝే చలతే జానా హై
హంస్‌తే గాతే యహాఁ సే గుజర్
దునియాకీ తూ పర్‌వా నకర్....

ఈ పదాల కలయికలో ఎంత భావమున్నదో కిషోర్ జీవితంలో అంతకంటే ఎక్కువ గాఢమైన వ్యధ ఉంది. ఏ పరిస్థితులలోనూ రాజీ పడలేదు. ఊపిరి పీల్చినంతకాలమూ దర్జాగా నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ వ్యక్తిత్వాన్ని 90 శాతం గ్రహించిన వాళ్ళూ ఇద్దరే ఉన్నారు. ఆయన నలుగు భార్యల్లో రెండవ భార్య మధుబాల, నాల్గవ భార్య లీనా చందావర్కర్. మధుబాలను కిషోర్ స్వప్న దేవతగా పేర్కొనవచ్చు. ఆమెను దృష్టిలో వుంచుకొనే "రాత్ కలీ ఏక్ ఖాబ్ మె ఆయీ ఔర్ గలే కా హార్ హుయి..." అన్నాడు. అయితే మధుబాలతో పెళ్ళి జరిగిన సంతోషం వుండీ వుండగానే ఆమె హృద్రోగం ఉందనీ, సంతానవతిగా అర్హత లేదని తెలియవచ్చింది. మొదటి భార్య బెంగాలీ వనిత రుమాదేవి. వీరిద్దరి సంతానమే అమిత్‌కూమార్. రుమాదేవి కొడుకును భర్త దగ్గర వదిలి వెళ్ళిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నది. మధుబాల మృతి చెందిన తర్వాత యోగితా బాలిని వివాహమాడారు. అనతికాలంలోనే నటి లీనా చందావర్కర్ ను పెళ్ళి చేసుకున్నారు. లీనాతో తిరిగి మధుబాలను దర్శింప గలిగారు. "హాల్ క్యా హై జనాబ్ కా?" అంటూ మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా.

జీవితంలో అనేక సందర్భాలలో తీవ్ర మనస్తాపానికి, పలువురి కువిమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ తన మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు. చలన చిత్రాలలో గాని, స్టేజీ మీద గాని గంతులు వేస్తూ, మేనరిజం లను అభినయిస్తూ, ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్‌ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైనా, దుఖఃమైనా తనలోనే యిముడ్చుకొని, వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తనవరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్.

జీవిత సత్యాలు

[మార్చు]

"ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకులను మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజలను ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గాని మన బాధ వారికి పంచకూడదు." ఇదీ కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన జీవిత సత్యం.

చమన్‌సే భి ఎక్ ఫూల్ బిఛ్‌డాతో క్యా హై,
నయే గుల్ సె గుల్షన్ తొ ఆబాద్ హోంగే,
సవేరే కా సూరజ్ తుమ్హారే లియే హై.

"తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి."

జీవితంలో ఒడిదుడుకులు

[మార్చు]

దేశంలో ఎమర్జెన్సీ విధింపు కిషోర్ పాలిట కూడా ఆశనిపాతంఅయింది. సంజయ్ గాంధీ ముఖ్య అనుచరుడు వి.సి.శుక్లా చెప్పిన ప్రకారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనని కారణంతో కిషోర్ పాటలు 1976 మే నెల నుండి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రసారం చేయడం పూర్తిగా ఆపివేశాయి. పులిమీద పుట్రలా ఇన్‌కంటాక్స్ దాడులు ముమ్మరంగా సాగాయి. దేనికీ ఎత్తిన తల దించలేదు. ఎమర్జన్సీ అంతరించటంతో కిషోర్ గాన మాధుర్యం తిరిగి ఎల్లెడలా ప్రవహించింది. మొత్తం మీద కిషోర్ జీవితంలో నీలినీడలు అనేకం. సినీ ప్రపంచంలో వ్యక్తిగత జీవితంలో కిషోర్ అనేక మార్లు ఘాటైన దెబ్బలు తిన్నారు. అపనిందలకు గురయ్యారు.

సినీరంగంలో కుమారుడు

[మార్చు]

కిషోర్ మొదటి భార్య కుమారుడు అమిత్ కుమార్ "దూర్ గగన్ కీ ఛావోమే" సినిమాలో అత్యద్భుతమైన పాత్ర (1964) పోషించారు. తల్లి సజీవ దహనమై పోతుండగా చూసి, మాట పడిపోయి మూగవాడైన బాలుని పాత్రలో అందరి మన్ననలూ పొందారు. ఈ సినిమా తెలుగులో రాముగా విడుదలైంది. (రీటేక్) . "పడోసి" కూడా మన తెలుగులో "పక్కింటి అమ్మాయి"గా అలరించింది.

స్వర్ణయుగం

[మార్చు]

కిషోర్ ప్రాభవాన్ని స్మరించుకునే సందర్భంలో తప్పని సరిగా ఆరాధన (1969) సినిమాలో పాటల గూర్చి ముచ్చటించుకోవాలి. రూప్‌తేరా మస్తానా, మేరే సప్నోంకిరాణి -- ఈ రెండుపాటలు యావద్భారతంలో మారుమ్రోగాయి. రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్ కూ స్వర్ణయుగం ప్రారంభమైంది. హిందీ సినీరంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ చేత దాదాపు అందరు హీరోలకూ పాడించారు. కిషోర్ గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించటానికి మనకు అవకాశమిచ్చిన వారిలో ఎస్.డి.బర్మన్ ప్రథములు. ఈయన సంగీత దర్శకత్వంలో వెలువడిన మొత్తం 50 పాటలూ చిత్రరంగంలో నేపథ్యగానం ఉన్నంతవరకూ నిలిచే యుంటాయి. కిషోర్ నాదం చిరస్మరణీయంగా ఉంటుంది.

అస్తమయం

[మార్చు]

ఒక దీపావళి రోజున కిషోర్ ఆకశ్మికంగా మరణించారు. అదే రోజు (అక్టోబరు 13) అశోక్ కుమార్ పుట్టిన రోజు. 1987 నుండి అశోక్‌కుమార్ దీపావళి గానీ, తన పుట్టిన రోజును గానీ జరుపుకోవడం విరమించారు. కిషోర్ మరణించి ఎంతోకాలం గడచిపోయింది. అతను వదలి వెళ్ళిపోయిన ఖాళీని ఎవరూ పూరించలేరనే విషయం గత ఎనిమిదేళ్ళలో అర్థం అయింది. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. ముఖేష్ ను అనుకరించే వాళ్ళూ, రఫీని అనుకరించేవాళ్ళూ, కిషోర్ మాదిరిగా పాడే వాళ్ళు చాలా మంది రంగంలోకి ప్రవేశించారు. ఎవరూ కిషోర్ స్థాయికి ఎదగలేకపోయారు. అశోక్ కుమార్ కంటే 20 యేండ్ల పిన్న వయస్కుడు.

మరుగుపడిపోయిన పాటలు

[మార్చు]

కిషోర్ ప్రారంభించిన "మమతా సీభాన్ యే" చిత్రం ఆయన మృతితో అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో కిషోర్ భార్య లీనా చందావర్కర్, కుమారులు అమిత్ కుమారు, సుమీత్ కుమారులు నటిస్తున్నారు. అదలా ఉండగా, కిషోర్ పాడిన పాటలు అనేకం తెరమరుగున ఉన్నాయి. నిర్మించిన చిత్రాలూ కనుమరుగైపోయాయి. వాటినన్నింటినీ కేసెట్లు రూపంలో, కొత్త ప్రింట్లు రూపంలో వెలికి తీసి పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే, ఎందరో సంగీతాభిమానులు హర్షిస్తారు. ఆదరిస్తారు. అంతటి బృహత్కార్యక్రమాన్ని చేపట్టే సంస్థలూ, సహృదయులే కరువవుతున్నారీనాడు.

చల్‌తే చల్‌తే మేరే యే గీత్ యాద్ రఖనా, కభి అల్‌విదా నా కెహనా కభి భూల్‌తమ్‌ జానా.. (కిషోర్ ఈ ప్రపంచానికి అందించిన వీడ్కోలు)

పురస్కారములు

[మార్చు]
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

విజేత:

సంవత్సరము పాట చిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం
1969 రూప్ తెరా మస్తానా ఆరాధన సచిన్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1975 దిల్ ఐసా కిసీనే మేరా తోడా అమానుష్ షైమల్ మిత్రా ఇండీవర్
1978 ఖైకే పాన్ బనారస్ వాలా డాన్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ అంజాన్
1980 హజార్ రాహే ముడ్ కర్ దేఖే థోడీసీ బేవఫాయీ ఖయ్యాం గుల్జార్
1982 పగ్ ఘుంఘృ బాఝె నమక్ హలాల్ బప్పీ లహరి అంజాన్
1983 హమే ఔర్ జీనేకీ చాహత్ న హోతీ అగర్ తుం న హోతే రాహుల్ దేవ్ బర్మన్ గుల్షన్ బావ్రా
1984 మంజిలేం అప్నీ జగా షరాబీ బప్పీ లహరి అంజాన్
1985 సాగర్ కినారే సాగర్ రాహుల్ దేవ్ బర్మన్ జావేద్ అఖ్తర్

పోటీల పరిశీలనకు వెళ్ళినవి:

సంవత్సరము పాట చిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం
1971 జిందగీ ఎక్ సఫర్ అందాజ్ శంకర్-జై కిషన్ హస్రత్ జైపురి
1971 యేజో మొహొబ్బత్ హై కటీపతంగ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1972 చింగారీ కొయీ భడ్కే అమర్ ప్రేమ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1973 మెరె దిల్ మే ఆజ్ క్యా హై దాగ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సాహిర్ లుధియానవి
1974 గాడి బులారహీ హై సీటీ బజారహీ హై దోస్త్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1974 మేరా జీవన్ కోరా కాగజ్ కోరా కాగజ్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ ఎం.జి.హష్మత్
1975 మై ప్యాసా తుమ్ ఫరార్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ రాజేంద్ర క్రిషన్
1975 ఒ మాఝి రే' ఖుష్బూ రాహుల్ దేవ్ బర్మన్ గుల్జార్
1977 ఆప్ కె అనురోధ్ అనురోధ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1978 ఓ సాథీ రే ముకద్దర్ కా సికందర్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ అంజాన్
1978 హమ్ బేవఫా హర్గిజ్ న థే పర్ హమ్ వఫా భీ న రహే షాలిమార్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1979 ఎక్ రస్తా హై జిందగీ కాలా ఫత్తర్ రాజేష్ రోషన్ సాహిర్ లుధియానవి
1980 ఓమ్ శాంతి ఓమ్ కర్జ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1981 హమే తుంసే ప్యార్ కిత్నా కుద్రత్ రాహుల్ దేవ్ బర్మన్ మజ్రూహ్ సుల్తాన్ పురి
1981 ఛూకర్ మెరె మన్ కో యారానా రాజేష్ రోషన్ అంజాన్
1983 షాయద్ మేరీ షాదీ కా ఖయాల్ సౌతన్ ఉషా ఖన్నా సావవ్ కుమాన్
1984 దే దే ప్యార్ దే షరాబీ బప్పీ లహరి అంజాన్
1984 ఇంతెహా హోగయీ షరాబీ బప్పీ లహరి అంజాన్
1984 లోగ్ కెహెతే హై మై షరాబీ బప్పీ లహరి అంజాన్

చిత్రమాలిక

[మార్చు]

ఇతర పఠనాలు

[మార్చు]
  • Bose, Derek (2004). Kishore Kumar: Method in Madness. New Delhi: Rupa & Co. ISBN 978-81-291-0526-4. OCLC 57429780.
  • Valicha, Kishore (1998). Kishore Kumar: The Definitive Biography. New York/New Delhi: Penguin Books/Viking. ISBN 978-0-670-88264-9. OCLC 40164015.
  • Nerurkar, Vishwas (2004). Kishore Kumar: The Many Faces of a Genius. Gayathri Publications. ( (The book includes complete filmography, discography, unreleased material, and film posters of his films)
  • Dhiman, Kamal (2002). Kishore Kumar: Gata Rahe Mera Dil (The book includes complete filmography and discography with detailed information for each song, such as music director, lyricist, producer-director etc. It also includes a biography and rare photographs.). New Delhi: Seema. ISBN 81-7525-364-9.

మూలాలు

[మార్చు]
  1. https://www.britannica.com/biography/Kishore-Kumar
  2. "Kishore Kumar | Indian actor, singer, composer, and director". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2019-04-19.
  3. Valicha, Kishor (1 April 2001). Kishore Kumar: The Definitive Biography (1st ed.). Mumbai: Penguin Books. ISBN 0140278222.
  4. Kishore Kumar birth anniversary special: Woo your ladylove by singing these classic romantic numbers | Music News Archived 2019-07-26 at the Wayback Machine. Zeenews.india.com (4 August 2016). Retrieved on 2018-11-06.
  5. Kishore Kumar: Some funny antics of his life | The Times of India. Timesofindia.indiatimes.com (4 August 2018). Retrieved on 2018-11-06.
  6. ANI (4 August 2017). "Kishore Kumar is always missed: Lata Mangeshkar on his birth anniversary". The Times of India. Retrieved 9 May 2018.
  7. Kishore Kumar: Movies, Photos, Videos, News & Biography | eTimes. Timesofindia.indiatimes.com (4 August 1929). Retrieved on 2018-11-06.
  8. Kishore's last song fetches Rs 15.6 lakh at Delhi auction | Hindi Movie News – Times of India. Timesofindia.indiatimes.com (4 August 2012). Retrieved on 2018-11-06.
  9. Kishore Kumar song rights, Umrao Jaan ring in vintage cinema auction. The Hindu BusinessLine. Retrieved on 6 November 2018.
  10. Nambiar, Smitha. (5 July 2012) Kishore Kumar | Last Song | Auction. Filmibeat. Retrieved on 2018-11-06.
  11. "When Kishore Kumar insisted on the bullockcart ride". The Indian Express. 13 October 2010. Retrieved 13 October 2010.
  12. Nabendu Ghosh (1995). Ashok Kumar: His Life and Times. Indus. ISBN 978-81-7223-218-4.
  13. Derek Bose (1 January 2006). Everybody Wants a Hit: 10 Mantras of Success in Bollywood Cinema. Jaico Publishing House. pp. 38–. ISBN 978-81-7992-558-4.
  14. "Facts about Indore" Archived 9 జూన్ 2015 at the Wayback Machine, "District Administration Indore", 2015
  15. Filmfare (1–15 November 1987)
  16. Ghosh, Avijit (7 October 2007). "Unforgettable Kishore". The Times of India. Archived from the original on 31 జూలై 2013. Retrieved 7 October 2007.
  17. The legend of Kishore Kumar: Why he remains relevant even today | music. Hindustan Times (22 April 2016). Retrieved on 2018-11-06.
  18. "Remembering Kishore Kumar". The Better India. Retrieved 23 April 2018.
  19. "Legendary singer Ahmed Rushdi". ARY News. Retrieved 11 December 2015.
  20. Pal, Sanchari. (13 October 2016) Remembering Kishore Kumar: Little Known Stories About the Legend. Thebetterindia.com. Retrieved on 2018-11-06.

బయటి లింకులు

[మార్చు]