సచిన్ దేవ్ బర్మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సచిన్ దేవ్ బర్మన్
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుশচীন দেববর্মণ
ఇతర పేర్లుబర్మన్ దా, కుమార్ సచీంద్ర దేవ్ బర్మన్, సచిన్ కర్తా, ఎస్.డి.బర్మన్
జననం(1906-10-01)1906 అక్టోబరు 1
కొమిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్)
మరణం1975 అక్టోబరు 31(1975-10-31) (వయసు 69)
బాంబే, మహారాష్ట్ర, భారత్
వృత్తిస్వరకల్పన, గాయకుడు
జీవిత భాగస్వామిమీరా దేవ్ బర్మన్, నీ దాస్ గుప్తా(1911–2007)
పిల్లలురాహుల్ దేవ్ బర్మన్

సచిన్ దేవ్ బర్మన్ (1 అక్టోబరు 1906 – 31 అక్టోబరు 1975) భారతీయ సంగీత కారుడు. ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు. ఇతను 100 సినిమాలకు సంగీతం సమకూర్చాడు, వీటిలో హిందీ, బెంగాలీ సినిమాలున్నాయి. ఇతను సంగీత దర్శకుడేగాక మంచి గాయకుడు కూడా. ఇతడి కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్ కూడా సంగీత దర్శకుడే.

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన సంగీతంలో ప్రముఖంగా లతా మంగేష్కర్, ముహమ్మద్ రఫీ, గీతా దత్, మన్నాడే, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్, ఆశా భోంస్లే, షంషాద్ బేగం లాంటి గాయకులున్నారు. వీరేగాక ముకేష్, తలత్ మహమూద్ లూ ఉన్నారు. ఇతడు 20కి పైగా పాటలూ పాడాడు.

నేపథ్యం

[మార్చు]

బ్రిటిష్ పాలనలో అవిభక్త భారతదేశంలో బంగ్లాదేశ్ లోని కోమిల్లలో 1906 అక్టోబర్ 1న పుట్టారు ఎస్.డి.బర్మన్. త్రిపుర రాజవంశంలోని రాజకుమారుడు, గాయకుడు నబద్వీప్ చంద్ర దేవ్ బర్మన్, మణిపూర్ రాజవంశానికి చెందిన నిరుపమ దేవిల కుమారుడు సచిన్ దేవ్ బర్మన్. త్రిపుర మహారాజు మహారాజా ఇషనచంద్ర మాణిక్య దేవ్ బర్మన్ మనుమడు ఈయన. తన తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానం. వారిలో ఈయన ఆఖరి, ఐదవ మొగపిల్లవాడు. బర్మన్ 2ఏళ్ళ వయసులో ఉండగా ఆయన తల్లి చనిపోయారు.

విద్యాభ్యాసం

[మార్చు]

కోమిల్లా విక్టోరియా కళాశాల నుంచి బి.ఎ. డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ పట్టా పొందారు బర్మన్. 1925 నుండి 1930 వరకు కె.సి.డేయ్ దగ్గర ప్రాథమిక సంగీతాభ్యాసం, 1932లో భిస్మదేవ్ ఛత్తోపాధ్యాయ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. భిస్మదేవ్, బర్మన్ కన్నా కేవలం 3ఏళ్ళు మాత్రమే సీనియర్. ఆ తరువాత హిందుస్తానీ సంగీతంలో అతి ముఖ్యమైన వాద్యం సరంగీను ఖైఫా బాదల్ ఖాన్, ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు. అగర్తలలోని తన నివాసంలోన డేయ్, బాదల్ ఖాన్, అల్లాఉద్దీన్ ఖాన్ తోను శిక్షణ ఇప్పించుకున్నారు బర్మన్. 1920వ దశకంలో ప్రముఖ బెంగాల్ కవి ఖాజీ నాజ్రుల్ ఇస్లాం కూడా కోమిల్లాలోని బర్మన్ నివాసంలో చాలా రోజులు వారి కుటుంబంతో కలసి ఉన్నారు.

1930వ దశకం

[మార్చు]

1920దశకం చివర్లో కలకత్తా రేడియో స్టేషన్ లో గాయకునిగా కెరీర్ ప్రారంభించిన బర్మన్ బెంగాలీ జానపద, హిందుస్థానీ సంప్రదాయ సంగీతంలో పాటలను స్వరపరచి, పాడేవారు. ఆ తరువాత కూడా ఆయన స్వరాలలో బెంగాలీ జానపదాల ప్రభావం ఉండేది. అతని మొదటి రికార్డు 1932లో విడుదలైంది. ఆ రికార్డ్ లో ఒకవైపు ఖమాస్ రాగంలో పాడిన ఏ పాతే ఆజ్ ఏసో ప్రియో పాట, రెండో వైపు దాక్లే కోకిల్ రోజ్ బిహానే అనే జానపద పాట ఉన్నాయి. అదే సంవత్సరంలో బెంగాలీలో 131 పాటలు పాడి, ప్రముఖ స్వరకర్తల సినిమాలలో అత్యధిక పాటలు పాడి గాయకునిగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. హిమంగ్సు దత్తా, ఆర్.సి.బోరల్, నజ్రుల్ ఇస్లామ్, శైలేష్ దాస్ గుప్త, సుబల్ దాస్ గుప్తల సంగీత దర్శకత్వంలో 1932 సంవత్సరంలో ఎక్కువ పాటలు పాడారు బర్మన్. ఆ తరువాతి కాలంలో మాధవ్ లాల్ మాస్టర్, బర్మన్ కుమారుడు ఆర్.డి.బర్మన్ ల సంగీత దర్శకత్వంలో కూడా పాటలు పాడారు.

1934లో అఖిలభారత సంగీత సమ్మేళనంలో పాల్గొన్న బర్మన్ బెంగాలీ టుమ్రీతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సమ్మేళనానికి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బర్మన్ కు ఆహ్వానం అందింది. ఈ సమ్మేళనంలో అతని ప్రతిభకు విజయలక్ష్మీ పండిట్, అబ్దుల్ కరీం ఖాన్ ఘరానాల ప్రశంసలు లభించాయి. ఆ తరువాత, అదే సంవత్సరంలో కలకత్తాలో జరిగిన బెంగాల్ సంగీత సమ్మేళనంలో అదే టుమ్రీ పాడి బంగారు పతకం సాధించారు బర్మన్. ఈ సమ్మేళనాన్ని రవీంద్రనాధ టాగూరు ప్రారంభించారు.

కలకత్తాలోని సౌత్ హెండ్ పార్క్ లో తన స్వంత ఇల్లు కట్టుకున్నారు బర్మన్. తన విద్యార్థిని, మీరా దాస్ గుప్తా (1920-2007)ను పెళ్ళి చేసుకున్నారు. మేజిస్ట్రేట్ రాయ్ బహద్దూర్ కమలనాథ్ దాస్ గుప్తా మనవరాలు మీరా. ఆమె ధాకాకు చెందినవారు. 10 ఫిబ్రవరి 1938లో కలకత్తాలో వాళ్ళ వివాహం జరిగింది. రాజకుటుంబానికి చెందని అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంతో బర్మన్ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైంది. దాంతో రాజవంశపు వారసత్వాన్ని వదులుకున్నారు బర్మన్. కానీ తన తండ్రికీ, అన్నలకూ రాజకుటుంబంలో చాలా అవమానాలు జరగడం వల్లనే ఆ వారసత్వాన్ని ఆయన వదులుకున్నారని ఒక పుకారు కూడా ఉండేది. సచిన్, మీరాలకు రాహుల్ దేవ్ బర్మన్ ఒకే ఒక సంతానం. ఆర్.డి.బర్మన్ 1939లో జన్మించారు. ఆ తరువాత రాహుల్ దేవ్, మీరా దేవిల సహాయంతో సచిన్ దేవ్ చాలా పాటలను స్వరపరిచారు. ఉర్దూ సినిమా సెలిమా (1934)లో ఒక పాత్ర కూడా పోషించారు. గాయకుని పాత్రలో ఈ సినిమాలో నటించారాయన. ధిరెన్ గంగూలీ తీసిన బిద్రోహి (1935)లో కూడా ఒక పాత్రలో నటించారు బర్మన్.

బెంగాలీ నాటకాలకు స్వరాలు సమకూర్చడంతో సంగీత దర్శకునిగా కెరీర్ ప్రారంభించిన సచిన్ దేవ్ సతి టిరితా, జననీ నాటకాలకు మొదట స్వరాలు అందించారు. రాజ్గీ (1937)సినిమాకు మొదట సంగీతం ఇచ్చారు. అతని రెండవ చిత్రం రాజ్ కుమారర్ నిర్బషాన్ (1940) విజయవంతం అయింది. ప్రోతిషోధ్ (1941), అభోయర్ బియే (1942), చద్దోబేషీ (1944) వంటి బెంగాలీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన బర్మన్ 1946లో ముంబైలో కుటుంబంతో సహా స్థిరపడిపోయారు. మొత్తం అతని కెరీర్ లో 20బెంగాలీ చిత్రాలకు, 89 హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. యాహుదీకీ లడకీ (1933)సినిమాలోని అన్ని పాటలను మొదట బర్మన్ పాడారు. కానీ ఆ పాటల్ని పహారీ సన్యల్ తిరిగి పాడి, సినిమాను విడుదల చేశారు. దాంతో సంజహీర్ పిదిమ్ (1935) గాయకునిగా అతనికి మొదటి సినిమా అయింది.

1940వ దశకం

[మార్చు]

1944లో శశధర్ ముఖర్జీ కోరిక మేరకు ముంబైకు కుటుంబాన్ని మార్చారు బర్మన్. అశోక్ కుమార్ నటించిన షికారీ (1946), ఆత్ దిన్ సినిమాలకు బర్మన్ ను సంగీత దర్శకునిగా తీసుకున్నారు శశధర్. కానీ దో భాయ్ (1947) సినిమాతో అతిపెద్ద హిట్ అందుకున్నారు సచిన్. గీతా దత్ పాడిన మేరా సుందర్ సపనా బీత్ గయా పాటతో అతనికి మంచి గుర్తింపు లభించింది. 1949లో విడుదలైన షబ్నం సినిమా ఫిల్మ్ స్థన్ సంస్థలో అతనికి అతిపెద్ద హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పలు భాషలతో స్వరపరచిన పాట ఏ ధునియా రూప్ కీ చోర్ ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాటను గాయని షంషాద్ బేగం పాడారు.

1950వ దశకం

[మార్చు]

ముంబై భౌతికవాద భ్రమల జీవితాన్ని గడపలేక అశోక్ కుమార్ నటించిన మషాల్ (1950) సినిమాను సగంలో వదిలేసి కలకత్తా వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ పునారాలోచించుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బాలీవుడ్ లో కొనసాగారు బర్మన్.

1950వ దశకంలో, బర్మన్ దేవ్ ఆనంద్ ప్రొడక్షన్ కంపెనీ అయిన నవ కేతన్ ప్రొడక్షన్స్ తో కలసి టాక్సీ డ్రైవర్ , నవ్ దో గ్యారాహ్ (1957), కాలా పానీ (1958) వంటి ఆల్ టైం హిట్స్ అందించారు. వీటితో పాటు మునింజీ (1955), పేయింగ్ గెస్ట్ (1957) వంటి హిట్ సినిమాలకు కూడా స్వరాలు సమకూర్చారు. బర్మన్ సంగీత సారథ్యంలో మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లు పాడిన పాటలు శ్రోతల్ని ఉర్రూతలూగించాయి అనడంలో అతిశయోక్తి లేదు. నవ కేతన్ ప్రొడక్షన్స్ మొదటి సినిమా అఫ్సర్ (1950)కు సంగీతం అందించారు బర్మన్. వారి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా బాజీ (1951)తో దేవ్ ఆనంద్ ప్రొడక్షన్ కంపెనీ, బర్మన్ తరువాత ఎన్నో చిత్రాలు చేశారు. తద్బిర్ సే బిగ్డీ హుయీ తక్దీర్ అనే గజల్ అప్పట్లో మంచి హిట్. జాల్ సినిమాలోని హేమంత్ కుమార్ పాడిన యే రాత్ యే చాందినీగీతం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

గురుదత్ తీసిన ప్యాసా (1957), కాగజ్ కా ఫూల్ (1959) సినిమాలకు కూడా సచిన్ దేవ్ సంగీత సారథ్యం వహించారు. దేవదాస్ (1955) సినిమాకి సౌండ్ ట్రాక్ కూడా అందించారు. హౌస్ నెం. 44 (1955), ఫంటూష్ (1956), సోల్వా సాల్ (1958) వంటి సినిమాలు కూడా బర్మన్ హిట్సే. 1959లో బిమల్ రాయ్ దర్శకత్వంలో విడుదలైన సుజాత , తాలత్ మమూద్ తీసిన జల్తా హై జిస్కే లియే సినిమాలలోని పాటలు కూడా మాస్టర్ పీస్ గా నిలిచాయి.

గురుదత్ బాజీ, జాల్ వంటి మామూలు సినిమాలు తీసినప్పుడు ఆ మూడ్ కు తగ్గట్టుగా సునో గాజర్ క్య గయే, దే భి చూకే హమ్ వంటి పాటలతో సంగీతం అందించిన సచిన్, ప్యాసా, కాగజ్ కా ఫూల్ వంటి గంభీరమైన సినిమాలకు అంతకు తగ్గట్టు గానే స్వరాలు కూర్చారు. జిన్హే నాజ్ హై హింద్ , వక్త్ నే కియే క్యా హసీన్ సితమ్ వంటి పాటలు అతని సామర్ధ్యాన్ని వివరిస్తాయి. 2004లో ప్యాసా సినిమా సౌండ్ ట్రాక్ ను బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ పత్రిక ఉత్తమ సినిమా సంగీతంగా గుర్తించి, గౌరవించింది.

1957లో లతా మంగేష్కర్తో పాటలు తగ్గించేసిన సచిన్ దేవ్ ఆమె చెల్లెలుఆశా భోస్లేకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఎస్.డి.బర్మన్, కిషోర్ కుమార్, ఆశా భోస్లే, గీత రచయిత మజ్రూహ్ సుల్తాపురీ ల కాంబినేషన్ లో వచ్చిన డ్యుయెట్లూ ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచాయి. ఒ.పి.నయ్యర్ తో కలసి ఆశాను ఒక ప్రఖ్యాత గాయనిగా రూపుదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారు దేవ్. కొన్ని సంవత్సరాల తరువాత దేవ్ కుమారుడు ఆర్.డి.బర్మన్ ను పెళ్ళి చేసుకుని ఆశా సచిన్ దేవ్ కు కోడలు అయ్యారు.

1958లో కిషోర్ కుమార్ స్వంత ప్రొడక్షన్ లో విడుదలైన చల్తీ కా నామ్ గాడీ సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశారు. అదే సంవత్సరంలో సుజాత లో దేవ్ అందించిన సంగీతానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంగీత నాటక అకాడమీఅవార్డు లభించింది. ఈ అవార్డును అందుకున్న ఏకైక సంగీత దర్శకునిగా ప్రసిద్ధికెక్కారు సచిన్ దేవ్ బర్మన్.

1960వ దశకం

[మార్చు]

మొదట్లో సినిమాలలో నేపథ్య గానం చేయడానికి ఇష్టపడని బర్మన్, బాందినీ (1963)లోని ఒరి మజీ మేరే సనమ్ హై ఉస్ పర్ , గైడ్ (1965)లోని వహా కౌన్ హై తేరే, ఆరధన (1969) చిత్రంలోని సఫల్ హోగీ తేరీ ఆరాధన వంటి పాటలతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ మూడు పాటలకూ ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

1960వ దశకం మొదట్లో అనారోగ్యం ఆయనను కుంగదీసినా, ఆ దశకం చివర్లో మంచి హిట్ సినిమాలు చేశారు. 1961లో ఆర్.డి.బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్ (1961) సమయంలో బర్మన్, లతా ల మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరితో ఒకరు పని చేయలేదు. కానీ తమ మధ్య వచ్చిన మనస్ఫర్ధలను 1962లో అంతం చేసి తిరిగి కలసి పాటలు చేయడం ప్రారంభించారు.

నవకేతన్ బేనర్ లో దేవ్ ఆనంద్-ఎస్.డి.బర్మన్ ల భాగస్వామ్యం మంచి మ్యూజికల్ హిట్స్ అందించింది. బాంబే కా బాబూ (1960), తేరే ఘర్ కే సామ్నే (1963), తీన్ దీవాన్ (1965), గైడ్ (1965), జ్యుయెల్ థీఫ్ (1967) వంటివి ఆ కోవలోనికి చెందినవే. 1963లో మేరీ సూరత్ తేరీ ఆంఖే సినిమాలో మన్నా డే పాడిన పూఛో నా కైసే మైనే పాటను అహిర్ భైరవ రాగంలో స్వరపరిచారు సచిన్. ఈ పాట ఒక ఇస్లాం పాట్ అరుణ్ కంటీ కే గో, ఉస్తాద్ మస్తఖ్ హుస్సేన్ ఖాన్ చేసిన ఖవ్వాలీ పాటల నుండి ప్రేరణతో స్వరపరచినవి. ఈ పాటలు అహీర్ భైరవ భైరవి (మార్నింగ్ రాగా) రాగంలో స్వరపరచినవే. ఈ సినిమాలోనే రఫీ పాడిన నాచే మోరా మన్వా మగన్ పాట హిందీ సినీ సంగీత ప్రపంచంలోనే మైలురాయిగా నిలిచింది.

ఈ సమయంలో బాందినీ (1963), జిద్దీ (1964) వంటి హిట్స్ ఇచ్చారు బర్మన్. ప్రముఖ సినీ గేయ రచయిత గుల్జార్ బాందినీలోని మోరా గోరా అంగ్ లాయీ లే, మోహే షమ్ రంగ్ దాయీ దేతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ సినిమాలోని మిగతా పాటల్ని శైలేంద్ర రాశారు. దేవ్ ఆనంద్ నటించిన గైడ్ (1965) అతని కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. కానీ ఆ సినిమా సంగీతానికి ఫిలింఫేర్ అవార్డు రాకపోవడం బాలీవుడ్ సినిమా పండితుల్ని ఇప్పటికీ నిరాశకు గురిచేస్తున్న విషయమే.

1969లో విడుదలైన ఆరాధన చిత్రం అతని కెరీర్ లోనే మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో పాటలు పాడిన కిషోర్ కుమార్, గీత రచయిత ఆనంద్ బక్షి, నిర్మాత శక్తీ సమంతాల కెరీర్ ను మలుపుతిప్పింది. మేరీ సప్నోం కీ రాణీ కబ్ అయేగీతూ పాటలో ఆర్.డి.బర్మన్ వాయించిన మౌత్ ఆర్గాన్ ట్రాక్ శ్రోతల్ని ఆకట్టుకుంది. దేవ్ ఆనంద్, సచిన్ దేవ్ ల భాగస్వామ్యం ప్రేమ్ పూజారి (1969) సినిమా వరకు కొనసాగింది. బర్మన్ కు ఆత్మగౌరవం ఎక్కువ. ఆయన వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు.

1970వ దశకం

[మార్చు]

ఈ దశకంలో తేరే మేరే సపనే (1971), షర్మీలే (1971), అభిమాన్ (1973), ప్రేమ్ నగర్ (1974), సగీనా (1974), చుప్ కే చుప్ కే (1975), మిలి (1975) వంటి క్లాసిక్స్ ని అందించారు సచిన్.

మిలి సినిమాలో కిషోర్ కుమార్ పాడిన బాదీ సూనీ సూనీ పాటను స్వరపరిచి, రికార్డ్ చేయకముందే దేవ్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత 31 అక్టోబర్ 1975లో ముంబైలో చనిపోయారు.

అక్టోబర్ 1 2007లో దేవ్ 101వ జయంతుత్సవాల సందర్భంగా భారత తపాలా శాఖ త్రిపురలోని అగర్తలలో నిర్వహించిన దేవ్ కళాప్రదర్శనలో భాగంగా సచిన్ దేవ్ బర్మన్ పేరు మీద ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు. తరువాతి సంవత్సరాలలో ప్రభుత్వం దేవ్ పేరుమీదుగా సంగీతంలో "సచిన్ దేవ్ బర్మన్ స్మారక అవార్డ్" ప్రకటించింది.

కిషోర్ కుమార్ తో అనుబంధం

[మార్చు]

కిషోర్ కుమార్, మహ్మద్ రఫీలతో సమానంగా పాటలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు సచిన్ దా. కిషోర్ ను తన రెండవ కొడుకుగా చెప్పుకున్నారు దేవ్. తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన సచిన్ దా (దా అంటే బెంగాలీలో అన్నయ్య) ఋణం తీర్చుకోలేననేవారు కిషోర్. సచిన్ కు స్ట్రోక్ వచ్చిన తరువాత హాస్పటల్ కు వెళ్ళిన కిషోర్ "దాదా, త్వరగా కోలుకోండి, మీ రికార్డింగ్ మూడు రోజుల తరువాత చేద్దాం, మీరు అంతా చూస్తూండండి, బాగా జరుగుతుంది" అన్నారట. చనిపోకముందు రోజు దేవ్ కిషోర్ కు ఫోన్ చేసి తను స్వరాలు రాసుకున్న పాటలను కిషోర్ కు పాడి వినిపించి, తనతో పాటు పాడమని అడిగి ఆయనతో పాడి వినిపించుకున్నారట. స్వరకర్తకూ, గాయకునికీ మధ్య ఉండే సంబంధం కన్నా అంతకు మించి ఆత్మీయమైన బంధం వారిద్దరి మధ్యా ఉండేది.

ఇతర గౌరవాలు

[మార్చు]
 • దక్షిణ ఆసియా వారసత్వం కలిగిన బ్రిటిష్ గాయకుడు నజ్మా అక్తర్ బర్మన్ పాటలను ఫర్బిడెన్ కిస్: ది మ్యూజిక్ ఆఫ్ ఎస్.డి.బర్మన్ పేరుతో సి.డి రూపంలో తీసుకువచ్చారు.
 • భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ తాత బర్మన్ కు అభిమాని. అందుకే తన మనుమడికి సచిన్ అని పేరు పెట్టారట.
 • బర్మన్ పాడటంలో ప్రదర్శించే వింత శైలిని గాయకుడు, మిమిక్రీ కళాకారుడు సుదేశ్ భన్సాలీ అనుకరించేవారు.
 • తబలా మేస్ట్రో బ్రజేన్ బిస్వాస్ తో కలసి చాలా బెంగాలీ పాటలను స్వరపరిచారు దేవ్. వీరిద్దరి భాగస్వామ్యంలో చాలా మంచి పాటలు వచ్చాయి.

సినిమాలు

[మార్చు]
4

అవార్డులు పతకాలు

[మార్చు]
 • 1934: అఖిలభారత సంగీత సభలు, కలకత్తాలో బంగారు పతకం
 • 1958: సంగీత నాటక అకాడమీ అవార్డు
 • 1958: ఆసియా చలనచిత్రం సొసైటీ అవార్డు
 • జాతీయ సినిమా అవార్డు
 • 1969: పద్మశ్రీ
 • అంతర్జాతీయ జ్యూరీ (ఫోక్ మ్యూజిక్)
 • ఫిలిం ఫేర్ అవార్డులు
  • 1954: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: టాక్సీ డ్రైవర్
  • 1973: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: అభిమాన్
  • 1959: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: సుజాత: నామినేషన్
  • 1965: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: గైడ్: నామినేషన్
  • 1969: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు : ఆరాధన: నామినేషన్
  • 1970: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: తలాష్: నామినేషన్
  • 1974: పిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు: ప్రేం నగర్ : నామినేషన్
 • BFJA అవార్డులు
  • 1965: ఉత్తమ సంగీతం (హిందీ విభాగం): తీన్ దేవియాఁ
  • 1966: ఉత్తమ సంగీతం (హిందీ విభాగం): గైడు
  • 1966: ఉత్తమ నేపధ్యగాయకుడు (హిందీ విభాగం): గైడ్
  • 1969: ఉత్తమ సంగీతం (హిందీ విభాగం): ఆరాధన
  • 1973: ఉత్తమ సంగీతం (హిందీ విభాగం): అభిమాన్

ఇవి కూడ చూడండి

[మార్చు]

దిల్ కీ రాణి

మూలాలు

[మార్చు]
 • "Sachin Karta", by Pannalal Roy. Parul Prakashani, Agartala. 2005.
 • The Hundred Luminaries of Hindi Cinema, by Dinesh Raheja, Jitendra Kothari. India Book House Publishers, 1996. ISBN 81-7508-007-8, page 1919.
 • [1]

బయటి లింకులు

[మార్చు]