అళియ రామరాయలు(పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అళియ రామరాయలు
అళియరామరాయలు పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: చిలుకూరి వీరభద్రరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: అళియ రామరాయలు
ప్రచురణ: నాళం అప్పలనరశింహము
విడుదల: 1931
పేజీలు: 247
ముద్రణ: రాజమహేంద్రవరం

విజయనగర సామ్రాజ్యం పతనం అంచుల్లో ఉన్న సమయంలో విజయనగర చక్రవర్తి అయిన అళియ రామరాయలు గురించి రాసిన చరిత్ర గ్రంథమిది. ప్రముఖ చారిత్రికులు, పత్రికా సంపాదకులు చిలుకూరి వీరభద్రరావు ఈ గ్రంథాన్ని రచించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలు రచించిన చిలుకూరి వీరభద్రరావు విజయనగర సామ్రాజ్య ఆఖరి పాలనావంశానికి ఆద్యుడైన అళియ రామరాయల జీవిత చరిత్రను సప్రమాణికంగా వివరించారు.

రచన నేపథ్యం[మార్చు]

దీనిని 1931 సంవత్సరంలో నాళం అప్పలనరశింహము, రాజమహేంద్రవరము నందు ముద్రించెను. తరువాత ఈ గ్రంథం 1945లో ప్రచురితమైంది. ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు అళియ రామరాయలు పూర్వం గోల్కొండ నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా గోల్కొండ కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు కృష్ణదేవరాయల వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు. అళియ రామరాయల ప్రవర్తన, వ్యక్తిత్వం, తళ్ళికోట యుద్ధంలో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.[1]

విషయం[మార్చు]

భారతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడైన శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయలను ఆ కారణంగానే అళియ రామరాయలని(అళియ అంటే కన్నడభాషలో అల్లుడు) వ్యవహరిస్తారు. రాంరాయలు కృష్ణదేవరాయల ఆస్థానంలో సమర్థుడైన అధికారిగా, సైన్యనిర్వహణలో వీరునిగా, గొప్ప రాజనీతివేత్తగా పేరొందారు. మగసంతానం లేకుండా కృష్ణదేవరాయలు మరణించగా ఆయన తమ్ముడు అచ్యుతరాయలను, ఆపై బాలుడగు సదాశివరావును పరిపాలనలో ఉంచి తానే రాజ్యతంత్రాన్ని నడిపారు రామరాయలు. ఈ కారణంగా తిమ్మరాజనే మంత్రి రామరాయలను బంధించబోగా వేరే నాయకుల సహకారంతో తిమ్మరాజును ఓడించి తాను రాజ్యపాలన చేపట్టాడు. రామరాయలతో విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఆరవీటి వంశపాలన ప్రారంభమయింది. ఆపైన వరుస విజయాలతో దక్కన్‌లోని సుల్తానులను అణగదొక్కడంతో వారందరూ ఏకమై తళ్ళికోట వద్ద జరిగిన యుద్ధంలో విజయనగర సేనలను ఓడించి, రామరాయలను చంపారు. అంతటితో విజయనగర సామ్రాజ్య ప్రభ తగ్గిపోయింది. అళియ రామరాయల చరిత్రను రాయడంలో వీరభద్రరావు కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు.

విషయసూచిక[మార్చు]

1931 లో ముద్రించబడిన పుస్తకంలోని విషయాలను ఏడు ప్రకరణములుగా విభజించారు:

  1. ప్రథమ ప్రకరణము: రామరాయల పూర్వులు, వీరహోమ్మాళి రాయడు, తాతపిన్నమరాజు, కొటిగంటి రాఘవరాజు, సోమదేవరాజు, రాఘవరాజు, పిన్నభూపాలుడు, ఆరవీటి బుక్కరాజు, రామరాజు, అవుకుతిమ్మరాజు, ఆదవేనికొండ్రాజు, శ్రీరంగరాజు.
  2. రెండవ ప్రకరణము: కృష్ణరాయలు, రామరాయలు, అచ్యుతరాయలు, రామరాయలు, చిన్నవేంకటాద్రి పట్టాభిషేకము, సలకముతిమ్మరాజు, రామరాయలు, సలకము తిమ్మరాజు ద్రోహకృత్యములు, అళియరామరాయల దండయాత్ర, సలకము తిమ్మయ యుద్ధము, సలకము తిమ్మయ మరణము.
  3. మూడవ ప్రకరణము: సదాశివరాయల పట్టాభిషేకము, వేంకటాద్రి నవాబరీదుల యుద్ధము, కళ్యాణి కలుబరగి దుర్గముల ముట్టడి, జమ్షాదు కుతుబ్షా మరణము, ఇబ్రహీము పట్టాభిషిక్తుడగుట, కలుబరిగె యుద్ధము, మఱియొక యుద్ధము, అబ్దుల్లాతో యుద్ధము, విజయనగర గోల్కొండ యుద్ధము.
  4. నాలుగవ ప్రకరణము: రాయల గూర్చిన యపనిందలు.
  5. ఐదవ ప్రకరణము: విఠలుని దక్షిణదేశ దండయాత్ర, సెంటుథోముపై దండయాత్ర.
  6. ఆరవ ప్రకరణము: రక్షస తంగిడి యుద్ధము.
  7. ఏడవ ప్రకరణము: రామరాయల ధర్మపరిపాలనము, దేవాలయ పోషకత్వము, విద్వాంసుల పోషకత్వము, సరిహద్దు తగవుల పరిష్కారము.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. అళియ రామరాయలు: చిలుకూరి వీరభద్రరావు:పేజీ.4