ఎస్.పి.నరసింహులు నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.పి.నరసింహులు నాయుడు
జననం
సేలం పగడాల నరసింహులు నాయుడు

(1854-04-12)1854 ఏప్రిల్ 12
ఈరోడ్, తమిళనాడు
మరణం1922 జనవరి 22(1922-01-22) (వయసు 67)
జీవిత భాగస్వామిఎతిరాజ్ అమ్మాళ్, మీనాక్షీ అమ్మాళ్
తల్లిదండ్రులురంగస్వామి నాయుడు, లక్ష్మీ అమ్మాళ్

సేలం పగడాల నరసింహులునాయుడు (లేదా పగడాల నరసింహులునాయుడు) (1854 ఏప్రిల్ 12 - 1922 జనవరి 22) తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. తమిళంలో యాత్రసాహిత్యం వ్రాసిన తొలివ్యక్తి. ఈయన కోయంబత్తూరులో తొలి పరిశ్రమలను నెలకొల్పి, ప్రజా విద్యాసంస్థల ఏర్పాటుకై విశేషకృషి చేశాడు.[1][2]

జీవిత చరిత్ర

[మార్చు]

నరసింహులు నాయుడు, 1854, ఏప్రిల్ 12న ఈరోడ్‌లో ఒక బలిజ నాయుడు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి రంగస్వామి నాయుడు, తల్లి లక్ష్మీ అమ్మాళ్. పుట్టినప్పుడు ఈయనకు బాలకృష్ణ అని పేరుపెట్టారు. కానీ ఆ తర్వాత తాతగారి పేరు నరసింహులు అనే పేరుపెట్టారు. 1868లో ఈయన సేలంకు చెందిన ఎతిరాజ్ అమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తమ ఇద్దరు పిల్లలు పుట్టి, మరణించిన తర్వాత క్షయవ్యాధితో మరణించింది. ఆ తర్వాత నరసింహులు నాయుడు 1899లో పాలక్కాడుకు చెందిన మీనాక్ష్మీ అమ్మాళ్‌ను పెళ్లిచేసుకున్నాడు.

1889లో వింధ్యా పర్వతాల ఆవలి ప్రాంతాలను పర్యటించిన అనుభవాలను వర్ణిస్తూ, ఈయన తమిళ భాషలో తొలి యాత్రా గ్రంథమైన ఆర్య దివ్యదేశ యాత్తరి సరిత్తిరం వ్రాశాడు. 1877లో సాంఘిక సమస్యలపై వ్రాయటానికి సేలం పేట్రియాట్ అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. సేలం పేట్రియట్ మూతబడిన తర్వాత, కోయంబత్తూరు అభమాని పత్రికను, ఆ తర్వాత 1879లో కోయంబత్తూరు పత్రికలను ప్రచురించడం ప్రారంభించాడు. 1881లో కోయంబత్తూరు క్రెసెంట్ అనే మరో పత్రికను ప్రారంభించాడు. కళానిధి ప్రెస్ కూడా ఈయన స్థాపించినదే.

నరసింహులు నాయుడు, కోయంబత్తూరు నగరంలోని తొలి బట్టల మిల్లు అయిన సి.ఎస్&డబ్ల్యూ మిల్స్‌ను ప్రారంభించాడు. ఈయన పొధనూరులో ఒక చక్కెర మిల్లును కూడా స్థాపించాడు. ప్రస్తుతం కోయంబత్తూరులో టౌన్ హాలుగా వ్యవహరించబడుతున్న విక్టోరియా మున్సిపల్ హాలు, కోయంబత్తూరు కాస్మొపాలిటన్ క్లబ్, కోయంబత్తూరు కాలేజీ కమిటీ, కోయంబత్తూరు సహకార దుకాణం మొదలైన అనేక సాంఘిక సంస్థల ఏర్పాటులో నాయుడు ప్రముఖపాత్ర వహించాడు. కోయంబత్తూరులోని సిరువాణి నీటి సరఫరా వ్యవస్థ, నరసింహులు నాయుడు యొక్క అధ్యయనం, కృషి ఫలితమే.[1][3]

ఈయన దార్శనీకుడు. స్థానిక ప్రజల సామాజిక, సాంస్కృతిక జాగరణకు విశేషకృషి చేశాడు. సేలం, కోయంబత్తూరులలో బ్రహ్మసమాజ సిద్ధాంతాల ప్రచారానికి సంస్థలను ఏర్పాటుచేశాడు. ఈయన మతం, చరిత్ర, సంగీతం, వ్యవసాయం, న్యాయశాస్త్రం, వైద్యం తదితర అంశాలపై వందకు పైగా పుస్తకాలు, కరపత్రాలు వ్రాశాడు. నరసింహులు నాయుడు, తమ కుటుంబం యొక్క మూలాలని విజయనగర రాజులకు ఆపాదించి, ఈయన వ్రాసిన బలిజవారి పురాణము 1896లో ప్రచురించబడింది.[2]

నరసింహులు నాయుడు, సాంఘిక సంస్కరణా ఉద్యమమైన మద్రాసు మహాజనసభ యొక్క కోయంబత్తూరు విభాగానికి కార్యదర్శిగా పనిచేశాడు. 1885లో భారత జాతీయ కాంగ్రేసు ఏర్పడినప్పుడు, దాని కోయంబత్తూరు విభాగానికి కార్యదర్శి అయ్యాడు. 1885లో బొంబాయిలో జరిగిన తొలి కాంగ్రేసు సమావేశానికి, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి హాజరైన 21 మంది ప్రతినిధులలో ఈయన కూడా ఒకడు. ఈయన 1886 కలకత్తాలో జరిగిన రెండవ కాంగ్రేసు సమావేశంలో, 1887లో మద్రాసులో జరిగిన మూడవ కాంగ్రేసు సమావేశంలో కూడా పాల్గొన్నాడు.

మూలలు

[మార్చు]
  1. 1.0 1.1 "The Hindu : Metro Plus Coimbatore / Heritage : A man who made this city his own". Archived from the original on 2006-05-12. Retrieved 2017-12-09.
  2. 2.0 2.1 A Catalogue of the Tamil Books in the Library of the British Museum, by Lionel David Barnett, George Uglow Pope, British Museum Department, Oriental Printed Books and Manuscripts, p. 208.
  3. "The Hindu : Tamil Nadu / Coimbatore News : A reformer journalist". Archived from the original on 2009-02-11. Retrieved 2017-12-09.