ఎ. ఆర్. రెహమాన్
ఎ. ఆర్. రెహమాన్ | |
---|---|
జననం | ఎ. ఎస్. దిలీప్ కుమార్ 1967 జనవరి 6 మద్రాస్, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు) |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అల్లాహ్ రఖా రహమాన్ ఇసై పూయల్ మోజార్ట్ ఆఫ్ మద్రాస్ |
విద్యాసంస్థ | ట్రినిటీ సంగీత కళాశాల |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
Works | |
జీవిత భాగస్వామి | సైరా బాను (m. 1995) |
పిల్లలు | 3, ఖతీజా రెహమాన్ తో సహా |
తల్లిదండ్రులు | ఆర్. కె. శేఖర్ |
పురస్కారాలు | Full list |
సన్మానాలు | Padma Bhushan (2010) |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
వాయిద్యాలు |
|
లేబుళ్ళు | |
సంతకం | |
దస్త్రం:A R Rahman signature.svg |
ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ (pronunciation (help·info) (జ.6 జనవరి 1967) భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు,, దాత.[1] రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.
రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు,[2] రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.
జీవితం
[మార్చు]రెహ్మాన్ అసలు పేరు ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.
పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.
తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు.[3] రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.
సంగీత ప్రస్థానం
[మార్చు]సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు కూడా.
తన సంగీత జీవితాన్ని రాజ్ - కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు. అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది.
"స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.
గౌరవాలు బిరుదులు
[మార్చు]టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించాడు.
2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశోలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.
గ్రామీ అవార్డులు - 2022
[మార్చు]64వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అమెరికా కాలమానం ప్రకారం 2022 ఏప్రిల్ 3న లాస్ వెగాస్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ మ్యూజిక్ లెజెండ్స్ జస్టిన్ బీబర్, లేడి గాగ, బీటీఎస్ టీమ్ లతో పాటూ ఏఆర్ రెహమాన్ సందడిచేసారు. తన కుమారుడు ఏఆర్ అమీన్‌తో కలిసి ఈ వేడుకలకు ఆయన హాజరు అయ్యారు. ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ అమెరికన్ కంపోజర్ రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది. అలాగే మరో భారతీయ గాయని ఫల్గుణి షాకు ఏ కలర్‌ఫుల్ వరల్డ్ అనే పాటకు గాను బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది.[4]
కుటుంబం
[మార్చు]రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్. రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6నే కుమారుడు అమీన్ కూడా పుట్టాడు.
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]తెలుగు చిత్రాలు
[మార్చు]- గ్యాంగ్ మాస్టర్
- సూపర్ పోలీస్
- నిప్పు రవ్వ (నేపథ్య సంగీతం మాత్రమే)
- అడవి రాణి (విడుదల కాలేదు)
- ప్రేమ దేశం
- రక్షకుడు
- రోజా
- జెంటిల్ మాన్
- జీన్స్
- సఖి
- నీ మనసు నాకు తెలుసు
- నానీ
- పులి
- రోబో
- నువ్వు నేను ప్రేమ
1992 లో
[మార్చు]- రోజా (తమిళం)
బిరుదులు
[మార్చు]ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2005 లో మొదటి 10 సినిమాలలో ఎప్పటికి ఉత్తమ చిత్రంగా శబ్ద విభాగానికిగాను టైమ్స్ పత్రికచే గుర్తింపు.
- యోధ (మలయాళం)
1993 లో
[మార్చు]- పుదియ ముగం (తమిళం)
- జెంటిల్మేన్ (తమిళం)
బిరుదులు
[మార్చు]తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
- కిళక్కు సీమయిలే (తమిళం)
- ఉళవన్ (తమిళం)
- తిరుడా తిరుడా ( తమిళం తెలుగులో దొంగా దొంగా)
1994 లో
[మార్చు]- వండిచోళై చిన్నరాసు (తమిళం)
- సూపర్ పోలీస్ (తెలుగు)
- డ్యూయెట్ ( తమిళం)
- మే మాధం (తమిళం)
- కాదలన్ ( తమిళం తెలుగులో ప్రేమికుడు)
బిరుదులు
[మార్చు]తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
- పవిత్ర (తమిళం)
- కరుత్తమ్మ (తమిళం)
- పుదియ మన్నర్గళ్ ( తమిళం)
- మనిదా మనిదా (తమిళం)
- గ్యాంగ్ మాస్టర్ (తెలుగు)
1995లో
[మార్చు]- బొంబాయి (తమిళం మూల భాష)
బిరుదులు
[మార్చు]తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
- ఇందిరా (తమిళం)
- రంగీలా (హిందీ)
బిరుదులు
[మార్చు]ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ ఆర్.డి. బర్మన్ అవార్డు యువ సంగీత దర్శకుడిగా
- ముత్తు (తమిళం) :ఎంతో విజయవంతమైన చిత్రంగా శబ్ద విభాగంలో జపాన్ దేశంచే గుర్తించబడెను.
హిందీ చిత్రాలు
[మార్చు]- రంగీలా
- తాళ్
- స్వదేశ్
- లగాన్
- రంగ్ దే బసంతి
- గురు
- జోధా అక్బర్ (2008)
- గజని
- అదా
- రోబో
- నాయక్
- బాయ్స్
- ఆత్రంగి రే (2021)
సంగీత పాఠశాల
[మార్చు]తన స్వంత సంగీత పాఠశాల ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ని రంజాన్ పర్వదినం నాడు 2013 ఆగస్టు 9న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు.
ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్థులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునే వారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.
బతుకమ్మ పాట
[మార్చు]ఏఆర్ రెహ్మాన్ 2021లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటకు సంగీతమందించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "జయహో రెహమాన్". eenadu.net. ఈనాడు. Archived from the original on 27 November 2017. Retrieved 27 November 2017.
- ↑ Namasthe Telangana (12 March 2023). "ఆస్కార్ గెలుచుకున్న భారతీయులు వీరే". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
- ↑ జె., రాజు; వీరాంజనేయులు. "అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 27 November 2017. Retrieved 27 November 2017.
- ↑ "Grammy Awards 2022 highlights: Jon Batiste wins 5 trophies, AR Rahman makes his presence felt". The Indian Express (in ఇంగ్లీష్). 2022-04-04. Retrieved 2022-04-04.
- ↑ TV 5 (5 October 2021). "తెలుగువారికి అల్లిపూల వెన్నెలను అందిస్తున్న రెహ్మాన్." (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
- Pages using the JsonConfig extension
- Pages using embedded infobox templates with the title parameter
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- బాలీవుడ్
- భారతీయ పురుష గాయకులు
- 1967 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తమిళ సినిమా సంగీత దర్శకులు
- భారతీయ సంగీతకారులు
- అకాడమీ అవార్డు విజేతలు
- గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు