కుందూరి ఈశ్వరదత్తు (పాత్రికేయుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుందూరి ఈశ్వరదత్తు ప్రముఖ పత్రికా సంపాదకుడు. ఇతడు సుమారు నాలుగు దశాబ్దాలపాటు భారతదేశంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో సబ్-ఎడిటర్‌గా, అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఎడిటర్‌గా, ఛీఫ్ ఎడిటర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. ఇతడు అలహాబాద్ నుండి వెలువడిన "ది లీడర్" ఆంగ్ల దినపత్రికకు సి.వై.చింతామణి తరువాత ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు.ఇతడు జయపూర్ సంస్థానంలోను, హైదరాబాద్ స్టేట్‌లోను మీర్జా ఇస్మాయిల్ దీవానుగా పనిచేసిన సమయంలో ఛీఫ్ పబ్లిసిటీ ఆఫీసర్‌గా సేవలను అందించాడు. "స్పార్క్స్ అండ్ ఫ్యూమ్స్", "మై పోర్‌ట్రైట్ గ్యాలరీ" వంటి రచనల ద్వారా ఇతడు దేశవిదేశాలలో రచయితగా పేరు గడించాడు.[1]

వివరాలు[మార్చు]

ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి పట్టణంలో 1898, సెప్టెంబరు 27న జన్మించాడు. ఇతని తండ్రి కె.వెంకటరత్నం ఆ ప్రాంతంలో ప్రధానోపాధ్యాయుడిగా, నిజమైన గాంధేయవాదిగా ప్రసిద్ధి చెందాడు. వెంకటరత్నం తన కుమారుడు ఈశ్వరదత్తుకు, అతని స్నేహితుడు కోటంరాజు రామారావుకు ఇంగ్లీషు నేర్పించాడు. కోటంరాజు రామారావు తదనంతర కాలంలో ప్రముఖ సంపాదకునిగా ఎదిగి జవహర్‌లాల్ నెహ్రూ ఆరంభించిన "ది నేషనల్ హెరాల్డ్" పత్రికకు తొలి సంపాదకుడయ్యాడు.

ఈశ్వరదత్తు విద్యాభ్యాసం రాజమండ్రి, మచిలీపట్నంలలో గడిచింది. ఇతడు 1923లో నోబుల్ కాలేజి నుండి బి.ఎ.పట్టా పొందాడు. ఇతడు కళాశాలలో చదువుకునే సమయంలోనే జర్నలిజం పట్ల ఆసక్తిని కనబరచాడు. నోబుల్ కాలేజీనుండి వెలువడే "ఫ్రెష్‌మెన్స్ మ్యాగజైన్" అనే లిఖిత (టైపు) పత్రికకు సహ సంపాదకునిగా వ్యవహరించాడు.

ఇతడు పాత్రికేయునిగా తన వృత్తిని అలహాబాద్‌నుండి వెలువడే "ది ఇండిపెండెంట్" అనే ఆంగ్లదినపత్రికతో ప్రారంభించాడు. తరువాత టంగుటూరి ప్రకాశం మద్రాసు నుండి నడిపిన "ది స్వరాజ్య"లో సబ్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేశాడు. తరువాత పోతన్ జోసెఫ్ సంపాదకత్వంలో వెలువడే ది వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల దినపత్రికకు మారాడు. తరువాత కొంతకాలానికి మళ్లీ స్వరాజ్య పత్రికలో చేరాడు. ఆ సమయంలో ఆ పత్రికలో ఖాసా సుబ్బారావు, జి.వి. కృపానిధి సంపాదకవర్గంలో పనిచేసేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతి కట్టమంచి రామలింగారెడ్డి ఇతడిని తన కార్యాలయంలో పనిచేయడానికి ఆహ్వానించాడు. అక్కడ ఈశ్వరదత్తు కొన్ని నెలలు పనిచేశాడు. ఇతడు స్వరాజ్యలో పనిచేసినప్పుడు 12 మంది స్వాంతత్ర్య సమరయోధులు, మేధావుల గురించి వ్యాసాలు వ్రాశాడు. వాటిని తరువాత "స్పార్క్స్ అండ్ ఫ్యూమ్స్" అనే పేరుతో పుస్తకరూపంలో ప్రచురించాడు. ఈ పుస్తకం ఇతడికి రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

1929లో ది హిందూ దినపత్రిక అప్పటి సంపాదకుడు ఎ.రంగస్వామి అయ్యంగార్ ఇతడిని హిందూ పత్రికలోనికి ఆహ్వానించాడు. ఇతడు హిందూలో చేరి "మద్రాస్ లెటర్" పేరుతో నెలనెలా రిపోర్టు పంపేవాడు. సి.వై.చింతామణి ఇతడిని "ది లీడర్" దిన పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేయడానికి ఆహ్వానించాడు. ఆ పత్రికలో దాదాపు 3 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి స్వంతంగా "ట్వంటీయత్ సెంచురీ" అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికలో తేజ్ బహద్దూర్ సప్రూ, కె.ఎం.పానికర్, హుమయూన్ కబీర్, కట్టమంచి రామలింగారెడ్డి, రాధా కుముద్ ముఖర్జీ, ఎం.చలపతిరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, హీరేన్ ముఖర్జీ, కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్, కె.ఎస్.వెంకటరమణి వంటి మహామహులు వ్యాసాలు వ్రాశారు.

పిఠాపురం రాజా సూర్యారావు బహద్దూర్ 1937 సాధారణ ఎన్నికలలో పోటీ చేయదలచి పీపుల్స్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి "ది పీపుల్స్ వాయిస్" అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించి దానికి ఈశ్వరదత్తును సంపాదకునిగా నియమించాడు. అయితే ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. మహారాజా ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ పత్రిక మూతపడింది. ఆ పత్రిక మూతపడడంతో ఈశ్వరదత్తు మళ్ళీ అలహాబాదుకు వెళ్ళి తన మాసపత్రిక "ది ట్వంటీయత్ సెంచురీ"ని కొనసాగించాడు. 1938లో ఇతడు "ది పయొనీర్" పత్రికకు రెండు పర్యాయాలు సంపాదకునిగా వ్యవహరించాడు.

జయపూర్ సంస్థానం దివాను సర్ మీర్జా ఇస్మాయిల్ 1942లో ఇతడిని జయపూర్‌కు ఆహ్వానించి పబ్లిసిటీ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ ఇతడు నాలుగేళ్లు పనిచేశాడు. ఆ సమయంలో పౌరసంబంధాలకు సంబంధించిన అన్ని విషయాలలో దివానుకు సహకరించాడు. దీవాన్ ఆలోచనలకు అనుగుణంగా ఇతడు న్యూస్ లెటర్ (పక్షపత్రిక)ను ప్రారంభించాడు. "ఎథేనియం" అనే ఒక సాహిత్య ఫోరం ఇతని ఆధ్వర్యంలో నడిచింది. ఇతడు తన హయాంలో జయపూర్‌లో అఖిల భారత గ్రంథాలయోద్యమ సభను, PEN కాన్ఫరెన్సును నిర్వహించాడు.

సర్ మీర్జా ఇస్మాయిల్ హైదరాబాద్ స్టేట్ దీవానుగా పదవిని చేపట్టినప్పుడు మళ్ళీ ఇతడిని హైదరాబాదుకు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా తీసుకువచ్చాడు. ఇతడు 1946లో ఆ పదవిని చేపట్టాడు కానీ పరిస్థితులు ఇద్దరికీ అనుకూలంగా లేకపోవడంతో మీర్జా ఇస్మాయిల్ మైసూర్ రాజ్యానికి 1947లో వెళ్లిపోయాడు. ఈశ్వరదత్తు 1948లో తన పదవికి రాజీనామా చేశాడు.

తరువాత 1948 సెప్టెంబరులో ఇతడు హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరాడు. 1949లో ఢిల్లీలో జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి 1952-53లో ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతడి పదవీకాలంలో ఇతడు పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను చేపట్టాడు.

ఇతడు తన వృత్తిలో "ది లీడర్" దినపత్రికకు ఛీఫ్ ఎడిటర్‌గా చేరడంతో పతాక స్థాయికి ఎదిగాడు. కానీ ఆ పత్రికలో 15 నెలల కంటే ఎక్కువగా కొనసాగలేక పోయాడు. 1955లో పత్రిక యాజమాన్యంతో విభేదాల వల్ల తన పదవికి రాజీనామా చేశాడు. అలహాబాద్ వదిలి పెట్టిన తర్వాత ఈశ్వరదత్తు ఢిల్లీ చేరుకుని "ది న్యూ ఇండియా" అనే వారపత్రికను ప్రారంభించి కొన్ని నెలలు నడిపారు. ఇతడు ఆకాశవాణిలో అనేక ప్రసంగాలను చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను "సైక్లోపీడియా" అనే పేరుతో వ్రాయడం మొదలు పెట్టాడు కానీ 1967లో ఇతని హఠాన్మరణంతో ఆ రచన పూర్తి కాలేదు.

మూలాలు[మార్చు]