గజపతి వంశము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గజపతి వంశము 15 - 16వ శతాబ్దాలలో కళింగ (ఒరిస్సా) కేంద్రంగా ఉచ్ఛదశలో ఉత్తారన మహానది నుండి దక్షిణాన కావేరీ నది వరకు తూర్పు తీరాన్ని పాలించిన భారతదేశపు రాజవంశము. గాంగ వంశం క్షీణదశలో ఉన్నప్పుడు వీరు రాజ్యానికి వచ్చారు. 110 యేళ్లే పరిపాలించినా గజపతి వంశ పాలన ఒరిస్సా చరిత్రలో సువర్ణాధ్యాయంగా భావిస్తారు.

సూర్యవంశ గజపతులు తూర్పు గాంగ చక్రవర్తి నాలుగవ నరసింహ కాలం నుండే ప్రాముఖ్యత సంతరించుకున్నారు. ఓఢ్ర దేశంపై విజయనగర సామ్రాజ్యపు దాడులకు ప్రతిదాడులు క్షీణిస్తున్న తూర్పు గాంగులు కాక గజపతులు చేసేవారు. కపిలేంద్ర గజపతి తను సూర్వవంశానికి చెందినవాడని చెప్పుకున్నాడు. అందువలన ఈ వంశానికి సూర్యవంశ గజపతులన్న పేరు వచ్చింది. చివరి గాంగ వంశ పాలకుడు నాలుగవ భానుదేవ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో భానుదేవుని వద్ద మంత్రిగా ఉన్న కపిలేంద్ర సూర్యవంశాన్ని స్థాపించాడు. ఈ వంశపు పాలకులను గజపతులని వ్యవహరిస్తారు. కపిలేంద్ర గజపతి ఈ వంశంలోని అత్యంత శక్తిమంతమైన రాజు. విజయనగర చక్రవర్తిని ఓడించి రాజ్యాన్ని కావేరీ తీరం దాకా విస్తరించాడు. కపిలేంద్ర తర్వాత రాజ్యానికి వచ్చిన పురుషోత్తమ గజపతి కూడా శక్తిమంతమైన రాజే కానీ ఈయన పాలనలో కళింగ ఒక్కొక్కటే తన ప్రాంతాలను కోల్పోవటం ప్రారంభమైంది. ప్రతాపరుద్ర గజపతి చివరి రోజుల్లో వంశం క్షీణించి తమ ఆధీనం ఒక్క చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది.

1540లో ప్రతాపరుద్ర గజపతి మరణించిన తర్వాత యుక్తవయసు రాని కుమారులు కులువ దేవ మరియు కఖరువ దేవ ఒకరి తర్వాత ఒకరు రాజ్యానికి వచ్చారు. కలువ దేవ సంవత్సరం ఐదు నెలలు పరిపాలించాడు. ఆయన తరువాత తమ్ముడు కఖారువ దేవ మూడు నెలలు పరిపాలించాడు. వీరిద్దరిని హతమార్చి 1541లో ప్రతాపరుద్ర గజపతి వద్ద మంత్రిగా పనిచేసిన గోవింద విద్యాధరుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని భోయి వంశాన్ని స్థాపించాడు. ఆ తరువాత గజపతి వంశం పర్లాకిమిడి ప్రాంతంలో స్థానిక జమీందారీ వంశంగా కొనసాగింది కానీ తిరిగి స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నడూ పాలించలేదు.

పాలకులు[మార్చు]

  1. కపిలేంద్ర దేవ గజపతి (1434–66)
  2. పురుషోత్తమ దేవ గజపతి (1466–97)
  3. ప్రతాపరుద్ర దేవ గజపతి (1497–1540)
  4. కలువ దేవ గజపతి (1540–41)
  5. కఖారువ దేవ గజపతి (1541)