జానకి విముక్తి
జానకి విముక్తి రంగనాయకమ్మ చే రచింపబడ్డ నవల. ఈ నవల మొదట ఒక ప్రముఖ తెలుగు వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమయ్యింది. ఆ సీరియల్ వివాదాస్పదం కావడంతో ఆ సీరియల్ ని నిలిపి వేశారు. పూర్తి కథ పుస్తక రూపంలో వచ్చింది.
కథ పరిచయం
[మార్చు]పుస్తక ప్రకారం "జానకి అనే స్త్రీకి చిన్న వయసులో పెళ్ళి అవుతుంది. ఆమెని ఆమె భర్త వెంకటరావు అనేక బాధలు పెడుతుంటాడు. జానకి అన్న సత్యంకి ఒక విప్లవ పార్టీకి అనుబంధ సంఘంలో పని చేసే వ్యక్తి పరిచయమవుతాడు. అతని ప్రభావం వల్ల సత్యం మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాద తత్వశాస్త్రాలు చదువుతాడు. ఆ సమయంలో అతనికి ప్రభాకర్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతను ఏ తత్వ శాస్త్రమూ తెలియని బండ నాస్తికుడు. తత్వంతో పని లేకుండానే తాను జానకిలోని మూఢ నమ్మకాలని తొలిగించగలనని భ్రమపడతాడు. అది తప్పని తరువాత తెలుసుకుని అతను కూడా తత్వశాస్త్రాలు చదువుతాడు. జానకి తన భర్త పెట్టే బాధలు భరించలేక అతన్ని వదిలేస్తుంది. ప్రభాకర్ తో కలిసి వివాహం లేకుండానే కాపురం చేస్తుంది. ఆ క్రమంలో ప్రభాకర్ జానకిలోని మూఢ నమ్మకాల్ని తొలిగించగలుగుతాడు. "
వివాదాలు
[మార్చు]జానకి విముక్తి నవల వ్రాయక ముందు రంగనాయకమ్మ బూర్జువా నాస్తికుల్ని విమర్శిస్తూ అనేక వ్యాసాలు వ్రాసింది. రంగనాయకమ్మను విమర్శిస్తూ సి.వి. అనే నాస్తికుడు విశాఖ హేతువాద సంఘం పేరుతో పుస్తకాలు ప్రచురించాడు. అతను నాస్తిక యుగం పత్రిక ఎడిటర్ డా.జయగోపాల్ మిత్రుడు. విశాఖపట్నం నాస్తికుల్లో ఎక్కువ మంది సి.వి. వైపు నిలిచి రంగనాయకమ్మ సీరియల్ ఆపి వెయ్యాలని కోరుతూ పత్రిక ఎడిటోరియల్ బోర్డ్ కి ఉత్తరాలు వ్రాసారు. పత్రిక వాళ్ళు సీరియల్ ని నిలిపివేసిన తరువాత రంగనాయకమ్మ పూర్తి కథని పుస్తక రూపంలో ప్రచురించింది.