Jump to content

ఠాగూర్ (సినిమా)

వికీపీడియా నుండి
ఠాగూర్
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి. వినాయక్
నిర్మాణం బి. మధు
రచన ఏఆర్ మురుగదాస్,
పరుచూరి సోదరులు
తారాగణం చిరంజీవి,
శ్రియ,
జ్యోతిక,
ప్రకాష్ రాజ్,
సాయాజీ షిండే
సంగీతం మణిశర్మ
నేపథ్య గానం కె.ఎస్.చిత్ర,
శ్రేయ గోశాల్,
హరిహరన్,
శంకర్ మహదేవన్,
మహాలక్ష్మి,
మల్లికార్జున,
మనో,
ఉదిత్ నారాయణ్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఛాయాగ్రహణం ఛోటా కె.నాయిడు
కూర్పు గౌతంరాజు
పంపిణీ లియో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ సెప్టెంబరు 24, 2003
భాష తెలుగు
పెట్టుబడి 5 crores
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఠాగూర్, 2003 సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. తమిళంలో విజయవంతమయిన రమణ చిత్రం దీనికి మూలం.

ఠాగూర్ (చిరంజీవి) ఒక కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడు. అనాథ పిల్లలని కొందరిని దత్తతకు తీసుకొని సొంత బిడ్డల్లా చూసుకొంటూ ఉంటాడు. పిల్లలతో బాటు బూస్టు (సునీల్) సరదగా ఉంటాడు. దేవకి (శ్రియ) కేవలం గుర్తింపు కోసం సమాజ సేవ చేస్తూ ఉంటుంది. ఠాగూర్ ని ప్రేమిస్తూ ఉంటుంది.


రాష్ట్రంలో లంచం తీసుకున్న ప్రభుత్వాధికారులు ఒక్కొక్కరే హత్యకి గురి అవ్వటంతో అలజడి మొదలవుతుంది. నేరస్థుడిని పట్టుకొనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి (విశ్వనాథ్) పోలీసు అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులని జారీ చేస్తాడు. పోలీసు శాఖలో కేవలం డ్రైవర్ అయిన సూర్యం (ప్రకాశ్ రాజ్) ఈ కేసు ఛేదించటంలో అత్యుత్సాహం చూపిస్తుంటాడు. ఒక ప్రక్క అవినీతి పరులైన పోలీసులకు, డాక్టర్లకు ఠాగూర్ తగిన విధంగా బుద్ధి చెబుతుంటాడు.


సూర్యం లంచం తీసుకున్న అధికారుల జాబితాతో కేసును ఛేదించటం మొదలు పెడతాడు. లోతు పరిశీలనలో నేషనల్ కాలేజిలో చదివిన విద్యార్థులందరూ కలగలిసి ACF (Anti Corruption Force) గా ఏర్పడి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా చేరి లంచగొండుల జాబితా సేకరిస్తున్నారని తెలుసుకొంటాడు. అయితే కేవలం విద్యార్థులకి ఇది సాధ్యపడే పని కాదని, ఈ సంస్థ వెనుక ఏదో బలీయమైన శక్తి ఉండవచ్చని అభిప్రాయపడతాడు. ఈ కేసు కోసం ప్రత్యేకంగా నియమింపబడిన బల్బీర్ సింగ్ (పునీత్ ఇస్సార్) నేషనల్ కాలేజిలో చదివిన విద్యార్థులందరినీ మూకుమ్మడిగా అరెస్టు చేయించి వారి నాయకుడి గురించి వివరాలు తెలుపమంటాడు. ప్రాణత్యాగానికైనా సిద్ధం కానీ తమ నాయకుడి వివరాలని మాత్రం తెలుపదలచుకోని విద్యార్థుల గురుభక్తికి ఆశ్చర్యపోతాడు బల్బీర్.


బద్రీనారాయణ (సాయాజీ షిండే) ధనదాహంతో, లంచగొండుల వలన తన భార్య నందిని (జ్యోతిక)ని పోగొట్టుకొన్న ఠాగూర్ ACF ని నడుపుతుంటాడు. తన విద్యార్థులని బంధించటం సహించని ఠాగూర్ స్వయంగా పోలీసులకి లొంగి పోతాడు.

లొంగిపోయిన ఠాగూర్ న్యాయస్థానంలో సమాజానికి ఇచ్చిన సందేశంతో చిత్రం ముగుస్తుంది.

సంభాషణలు

[మార్చు]
  • ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు అన్న చిరంజీవి స్వరంతోనే చిత్రం ఆరంభం, అంతం అవుతుంది.
  • తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం, క్షమించటం

ఈ చిత్రంలో పాటలు

[మార్చు]
  • మన్మథా మన్మథా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్
  • వానొచ్చేనంటే వరదొస్తదీ, రచన:భువన చంద్ర, గానం. ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్
  • గప్పు చిప్పు గప్పు చిప్పు , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. మనో, చిత్ర
  • చల్లగ చల్లగ చల్లగ , రచన: చంద్రబోస్, గానం. చిత్ర, హరి హరన్
  • నేను సైతం ప్రంపంచాగ్నికి , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్.

విశేషాలు

[మార్చు]
  • దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్రంలో ఠాగూర్ విద్యార్థిగా నటించారు. తన తండ్రి కూడా లంచగొండి అని తెలుసుకొన్న ఠాగూర్ అతనిని నిష్కర్షగా శిక్షించబోతున్నాడని, కేవలం తన తండ్రి కావటం వలననే ఠాగూర్ తన అభిప్రాయం కోసం వేచి ఉన్నాడని తెలుసుకొన్న ACF సభ్యుని పాత్రలో వినాయక్ పలికించిన హావభావాలు ప్రశంసనీయం.
  • ఇంద్ర చిత్రంలో వేసిన వీణ స్టెప్ కి కొనసాగింపుగా మన్మథా మన్మథా పాటలో చిరంజీవి వేసిన స్టెప్ ప్రత్యేక ఆకర్షణ.
  • కేవలం సంగీతం ఉన్న (పదాలు లేని) ఒక పాటకి చిరంజీవి సినిమాలో నాట్యం చేశారు. (జ్యోతిక మరణానికి ముందు.) ఇది ఆడియో క్యాసెట్/సీడీ లలో లేదు. కేవలం చిత్రానికి మాత్రమే పరిమితం.
  • రుద్రవీణ చిత్రంలో చిత్రీకరించిన శ్రీశ్రీ గీతం నేను సైతం ఈ చిత్రంలో కూడా కొంత మార్పులతో చిత్రీకరించబడ్దది . ఈ సినిమాలో గీతాన్ని సుద్దాల అశోక్ తేజ వ్రాశాడు. మొదటి చరణం మాత్రం యధాతధంగా మహా ప్రస్థానంలోని శ్రీశ్రీ గీతం నుండి తీసికొనబడ్డది. పాటనుండి మరొక చరణం ఇక్కడ ఇవ్వబడింది.


అగ్ని నేత్ర మహోగ్ర జ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా
మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా
భగత్ సింగ్ కడసారి పల్కిన 'ఇంక్విలాబ్' శబ్దానివా

తరువాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఈ పాట కొంత మార్పులతో ప్రచారగీతంగా వాడబడింది.

  • చల్లగ చల్లగ పాటలో శృంగార రసాన్ని రాజకీయ రంగుతో కలపటం చిరంజీవిలో రాజకీయాల పై ఆసక్తిని అప్పుడే బయటపెట్టింది.

ఈ సినిమా మొత్తం 605 థియేటర్లలో విడుదలయ్యింది.[1] మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ల షేరు కలెక్షనులు 10 కోట్లు. నాలుగు వారాలలో కలెక్షనులు 23.79 కోట్లు [2] మొత్తం 353 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు నడిచింది.[3] 196 సెంటర్లలో 100 శతజయంత్యుత్సవాలు చేసుకొంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Nonstopcinema Box Office - Tagore release centers list : Telugu movies, tollywood, cinema". Archived from the original on 2007-12-11. Retrieved 2009-04-27.
  2. "Nonstopcinema Box Office - Tagore Opening Week shares : Telugu movies, tollywood, cinema". Archived from the original on 2007-12-11. Retrieved 2009-04-27.
  3. "Nonstopcinema Box Office - Tagore 50 days centers -253 : Telugu movies, tollywood, cinema". Archived from the original on 2007-12-11. Retrieved 2009-04-27.
  4. "Nonstopcinema Box Office - Tagore 100 days centers : Telugu movies, tollywood, cinema". Archived from the original on 2007-12-11. Retrieved 2009-04-27.

బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]