నీలకంఠేశ్వర ఆలయం, నిజామాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలకంఠేశ్వర ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిజామాబాద్
ప్రదేశం:కంఠేశ్వర్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
ప్రధాన పండుగలు:రథ సప్తమి, మహాశివరాత్రి
నిర్మాణ శైలి:ఉత్తర భారతదేశం, శాతవాహనులు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1వ శతాబ్దం
నిర్మాత:శాతవాహన రాజు శాతకర్ణి - 2

నీలకంఠేశ్వర ఆలయం, నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో శివలింగం స్వయంభూగా వెలిసిన శివాలయం. 1వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి - 2 నిర్మించినట్లు తెలుస్తుంది.[1] ఈ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో ఉంటుంది.[2] అతిపురాతనమైన ఈ ఆలయం త్రిమూర్తులు వెలసిన అరుదైన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు.

ఇది దేవాలయంగానే కాకుండా నాడు నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకార్లపై తిరుగుబాటుచేసిన స్థానిక ఉద్యమకారులకు రహస్య స్థావరంగా నిలిచింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాందిపలికింది.

అంతేకాదు 2023లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం కూడా ఈ ఆలయం కట్టడ కళా కౌశలం దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.[3]

స్థలపురాణం[మార్చు]

నిజామాబాద్ నుండి ఆర్మూర్ వెళ్ళే ప్రధాన రహదారిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నీలకంఠేశ్వర ఆలయం నెలకొనిఉంది. సుమారు మూడు ఎకరాల సువిశాల స్థలంలో కొలువుదీరిన ఈ ఆలయం, వంద అడుగుల ముఖద్వారంతో ఇట్టే అందరిని ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేషపూజలందుకుంటుంది. ప్రధానాలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. సృష్టి, స్థితి, లయకర్తలైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల స్వరూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఉత్తర దిక్కున కోనేరు, రథశాలలతో పాటు ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, పార్వతీదేవి ఉపాలయాలున్నాయి. దక్షిణాభిముఖంగా దాసాంజనేయస్వామి, సంతాన నాగేంద్రుడు, శివధ్యానమందిరం, పంచవటి కల్పవృక్షం మొదలైనవి ఉన్నాయి.

శాతవాహన రాజు రెండవ పులకేశి జైనమతం స్వీకరించి, తన రాజ్యంలో పలుచోట్ల జైన మందిరాలను నిర్మించాడు. ఈ క్రమంలోనే సుమారు 2000 సంవత్సరాల క్రితం నాడు ఇంద్రపురిగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించాడు. అయితే కొంతకాలం జైన మందిరంగా ఉన్నా అనంతరం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారు. వారు ప్రత్యేకంగా గర్భ గుడిని కట్టారు. క్రమంగా తమ శిల్పకళారీతులతో ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు.

ఆలయంలో స్వయంభూ శివలింగంతో పాటు విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండడంతో నీలకంఠేశ్వర ఆలయంగా నేటికీ విరాజిల్లుతోంది. కాలక్రమంలో ఇంద్రపురి ఇందూరుగా మారింది, నిజాం పాలనలో ఇది కాస్తా నిజామాబాద్ గా నామకరణం పొందింది. ఇక ఈ ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి కంఠేశ్వర్ అని పేరు వచ్చింది.

ఆలయ విశేషాలు[మార్చు]

ఈ ఆలయంలో ప్రతియేట రథసప్తమిని ఘనంగా జరుపుతారు. ఆ రోజు విశేష పూజలతో పాటు రథయాత్ర నిర్వహించడం సప్రదాయంగా వస్తోంది.[4] సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి కూడా. ఇక శివరాత్రిరోజున రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లింగోద్భవం, నిశి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

ప్రతీ సోమవారం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులతో నీలకంఠేశ్వర ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే కార్తీకమాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలనుంచి నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. "SRI NEELAKANTESHWARA TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-01-19.
  2. "శ్రీ నీలకంటేశ్వర టెంపుల్, Nizamabad". telugu.nativeplanet.com. Retrieved 2020-01-19.
  3. "Telangana Secretariat | ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం నూతన సచివాలయం-Namasthe Telangana". web.archive.org. 2023-06-18. Archived from the original on 2023-06-18. Retrieved 2023-06-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "అంగరంగ వైభవంగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం | Chariotsavam of Neelakantheswara Swami in full glory". web.archive.org. 2023-06-18. Archived from the original on 2023-06-18. Retrieved 2023-06-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)