ప్రత్తి శేషయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రత్తి శేషయ్య
జననం1925
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తిరాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు

ప్రత్తి శేషయ్య (జననం 1925) పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రోద్యమకారుడు. సర్వోదయ సేవకునిగా, సత్యాగ్రాహిగా, అంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో మంచి నాయకునిగా, విశాఖ ఉక్కు ఉద్యమంలోనూ ఆయన చేసిన కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ స్వాతంత్ర్యయోధులు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నాయకుల సమకాలీకులు శేషయ్య. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరంగ్రామంలో జన్మించారు శేషయ్య. తన 17వ ఏట క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించారు ఆయన. 2017 అక్టోబరు 27న తాడేపల్లిగూడెంలో ఆయన మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1925లో తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ప్రత్తి రాఘవయ్య, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. శేషయ్య వీరికి 4వ కుమారుడు. ప్రాథమిక, మాధ్యమిక విద్యలను మాధవరం పాఠశాలలో చదివిన శేషయ్య, 1940 నుండి 1944వరకు పెంటపాడులోని ఎస్.టి.వి.ఎస్ హిందూ హైస్కూలులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. 1945 నుండి 1947వరకు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు.[1] చదువుకునే వయసులోనే 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంతో జాతీయోద్యమం వైపు మళ్ళారు శేషయ్య.

జాతీయోద్యమంలో[మార్చు]

ఆయన జన్మించిన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని మిలటరీ మాధవరం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక యువకుడైనా భారత సైన్యంలో చేరతారు. ప్రపంచ యుద్ధాల కాలం నుండి ఇప్పటికీ ఈ ఊరిలో అదే జరుగుతూ వస్తోంది.[2] శేషయ్య తన 17వ ఏట దేశ పరిస్థితులను అనుసరించి, సైన్యంలో చేరడం కన్నా స్వాతంత్ర్యోద్యమంలోకి రావడమే ఉత్తమంగా నిర్ణయించుకున్నారు. 1942 ఆగస్టు 17న బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో పెంటపాడులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సహ విద్యార్థులు వరదా బ్రహ్మానందం, మెండు నరసింహారావు, మందలపర్తి సారంగపాణి, చిలుకూరి వీరభద్రయ్యలతో కలసి పోస్టాఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. టెలీఫోన్, టెలిగ్రాఫ్ తీగలు కత్తిరించి, పి.డబ్ల్యూడి భవనం ముట్టిడించారు. పోస్టాఫీసులోని రికార్డులను, సామాగ్రిని తగులబెట్టారు. ఈ కేసులో ప్రత్తి శేషయ్యకు కొవ్వూరు మేజిస్ట్రేటు ఫేము బెత్తంతో దెబ్బలు శిక్షగా విధించింది.[1]

ఏలూరులో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో పట్టణ విద్యార్థి కాంగ్రెస్ కార్యదర్శిగానూ, జిల్లా విద్యార్థి కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగానూ, రాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్ కార్యదర్శిగానూ పలు హోదాల్లో జాతీయోద్యమంలో సేవలు కొనసాగించారు శేషయ్య. ఆ సమయంలోనే 15 రోజులపాటు జైలుశిక్ష కూడా అనుభవించారు ఆయన. సి.ఆర్.రెడ్డి కళాశాల విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు శేషయ్య. అదే హోదాతో 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు కళాశాల ఆవరణలో జాతీయ జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు శేషయ్య.[1]

స్వాతంత్ర్యానంతర ఉద్యమ జీవితం[మార్చు]

1948లో దళితులను ఆలయ ప్రవేశం చేయనివ్వాలంటూ నిరాహార దీక్ష చేశారు శేషయ్య. అదే సంవత్సరం ఆయన స్వంతగ్రామమైన మాధవరంలో అమ్మవారి ఆలయంలో జంతుబలుల నిషేధానికి దీక్ష చేశారు. అది సఫలీకృతం కూడా అయింది. ఆయన వివాహం కూడా ఆదర్శప్రాయంగా చేసుకున్నారు శేషయ్య. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా మణెమ్మను తండ్రికి ఇష్టం లేకపోయినా మాధవరంలో పెళ్ళి చేసుకున్నారు ఆయన. కామవరపుకోటలో హరిజనాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1952లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మద్రాసుకు వెళ్ళారు శేషయ్య. తన తోటి సత్యాగ్రహులు కావించి స్వామి సీతారాం, మోతే నారాయణరావు, రాయుడు గంగయ్య, భూపతిరాజు సుబ్బతాతరాజు వంటి వారితో కలసి మద్రాసులోని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఆయన. ఆంధ్ర రాష్ట్రం అవతరణ తరువాత 1954లో విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత 1956లో ఆచార్య వినోభాబావేతో కలసి పశ్చిమగోదావరి జిల్లాలో సర్వోదయ ఉద్యమంలో పనిచేశారు ఆయన. జిల్లాలో నిర్వహించిన భూదాన యజ్ఞ పాదయాత్రలో వినోభాభావేతో పాటు, శేషయ్య దంపతులు, చింతలపాటి మూర్తిరాజు, గెడా రఘునాయకులతో కలసి జిల్లా అంతా నడిచారు. 1965లో మంత్రుల ఆడంబరాలకు వ్యతిరేకంగా శేషయ్య, మణెమ్మ, గోపరాజు రామచంద్రరావులు కలసి సత్యాగ్రహం చేశారు. ఈ కేసులో రెండుసార్లు అరెస్టయ్యారు ఆ దంపతులు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1966 నవంబరు 1న నిరాహారదీక్ష మొదలుపెట్టిన శేషయ్య 15రోజుల తరువాత బలవంతంగా ఆసుపత్రిలో చేర్చినా దీక్ష విరమించలేదు. కొన్నిరోజుల తరువాత ఫ్యాక్టరీ స్థాపనపై స్పష్టత వచ్చాకా మాత్రమే దీక్ష విడిచారు ఆయన. 90ఏళ్ళ వయసులో 2014లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు ఆయన.[1]

ఉద్యోగం, వివిధ సంస్థల్లో హోదాలు[మార్చు]

ప్రత్తి శేషయ్య 1950 అక్టోబరు 15 నుండి 1951 డిసెంబరు వరకు పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోటలో వి.డి.ఒగా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాదీ, హరిజనాభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆయన. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉద్యోగం వదిలిపెట్టి ఉద్యమాల్లో తిరిగారు శేషయ్య. 1948 డిసెంబరులో కర్నూలు జిల్లా చాగలమర్రు గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర గ్రంథాలయ మహాసభలో ఆ సంఘానికి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆయన. వయోజన విద్యా విభాగానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కూడా పనిచేశారు ఆయన. 1958 నుండి 1960వరకు జిల్లా వ్యవసాయాభివృద్ధి సంఘానికి కార్యదర్శిగా సేవలందించారు. రాష్ట్రంలో రైతుమహాసభలు నిర్వహించేవారు ఆయన. రాష్ట్ర కాంగ్రెస్ లో తగాదాలను నిరశిస్తూ ఆయన 1982లో కాంగ్రెస్ ను వదలి తెలుగుదేశం పార్టీలో చేరారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా 1949 జూన్ 8న మణెమ్మను ఆదర్శ వివాహం చేసుకున్నారు శేషయ్య. బ్రహ్మధర్మ పద్ధతిలో జరిగిన ఈ పెళ్ళిని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తల్లాప్రగడ ప్రకాశరాయుడు జరిపించారు. మాధవరంలో జరిగిన ఈ వివాహానంతరం శేషయ్య దంపతులు హరిజన విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనాలు చేసి తమ ఆదర్శాన్ని చాటుకున్నారు. మణెమ్మ కూడా భర్తతో కలసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఆయనతో పాటు ఎన్నో సార్లు జైలు జీవితం కూడా గడిపారామె. 90ఏళ్ల వయసులో కూడా మొన్నటి సమైక్యాంధ్ర ఉద్యమంలో దీక్షలు చేపట్టారు శేషయ్య.[1]

మరణం[మార్చు]

ఆయన 2017 అక్టోబరు 27న తాడేపల్లిగూడెంలో మరణించారు. తన 92వ ఏట శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు శేషయ్య.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 గాదం, గోపాలస్వామి (ఆగస్టు 2015). (1 ed.). అత్తిలి: శ్రీ సత్య పబ్లికేషన్స్. pp. 92–95
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-28. Retrieved 2016-08-27.
  3. ప్రత్తి, శేషయ్య. "ఆంధ్రజ్యోతి". ఆంధ్రజ్యోతి పత్రిక.[permanent dead link]