ఫీల్డ్స్ పతకం
ఫీల్డ్స్ పతకం | |
---|---|
వివరణ | గణిత శాస్త్రం లో చేసిన విశేష కృషికి లభించే పురస్కారం |
అందజేసినవారు | ఇంటర్నేష్నల్ మేథమాటికల్ యూనియన్ ( ఐ ఎం యు) |
Reward(s) | C$15,000 |
మొదటి బహుమతి | 1936 |
Last awarded | 2010 |
వెబ్‌సైట్ | https://mathunion.org/imu-awards/fields-medal |
ఫీల్డ్స్ పతకం ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 40 ఏండ్లు పైబడని ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఇంటర్‌నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటీషీయన్స్ (ఐసీఎం) సందర్భంగా ఈ పురస్కారం లభిస్తుంది. పతకంతోబాటు 15,000 కెనేడియన్ డాలర్లు కుడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతి యొక్క ఆధికారిక నామం ఇంటర్నేష్నల్ మెడల్ ఫర్ ఔట్ స్టాండింగ్ డిస్కవరీస్ ఇన్ మాథమాటిక్స్ అయినప్పటికీ, దీనిని స్థాపించడానికి కృషి చేసి, ఆర్థిక వనరులను సమకూర్చిన జోన్ చార్ల్స్ ఫీల్డ్స్ యొక్క పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్స్ పతకంగా గుర్తింపు పొందింది.
ఫీల్డ్స్ పురస్కారం మొట్టమొదటి సారి 1936లో ఫిన్లాండుకు చెందిన లార్స్ అల్ఫోర్స్, అమెరికాకు చెందిన జెస్సి డగ్లస్ లకు లభించింది. రెండో ప్రపంచ యుధ్ధం కారణంగా ఐసీఎం జరగకపోవడం చేత 1950 వరకు ఈ బహుమతి ఎవ్వరికీ దక్కలేదు. అటు తరువాత ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఐసీఎం 2010 లో హైదరబాదులో జరిగింది.
చరిత్ర
[మార్చు]1923లో టొరొంటొ విశ్వవిద్యాలయం చేత స్థాపించబడిన కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కి ఫీల్డ్స్ అధ్యక్షత వహించారు. ఫీల్డ్స్ పతకం యొక్క ప్రస్తావన మొదటిసారిగా ఫిబ్రవరి 24, 1931న జరిగిన కమిటీ సమావేశంలో వచ్చినట్టుగా నమోదు చేయబడి ఉంది.[1] ప్రారంభంలో రెండు పతకాలు, $2,500 నగదు బహుమానంగా నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత ఫ్రాన్స్, జర్మనీ, ఇతర దేశాలలోని గణిత శాస్త్రవేత్తల బృందాల నుండి ఈ ఆలోచనకు మద్దతు లభించింది. ఈ విధంగా ఫీల్డ్స్ తన ఆలోచనను అమలుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసాడు. కానీ తన ప్రణాళిక కార్యరూపం దాల్చేముందే ఆగస్టు 9, 1932 న ఫీల్డ్స్ కన్ను మూసాడు. వీలునామాలో తన ఆస్తిలో నుండి $47,000 ఈ పతకం కొరకు ఫీల్డ్స్ సమకూర్చాడు.[1] ఈ పతకం ఏ ఒక్క వ్యక్తికిగానీ, దేశానికిగాని సంబంధం లేకుండా తగినంతవరకు నిష్పాక్షిక స్వభావం కలిగి ఉండాలని ఫీల్డ్స్ భావించాడు. అయినప్పటికీ ఈ పతకం యొక్క పేరు ఫీల్డ్స్ పతకంగా నిలిచిపోయింది.
ఆకృతి
[మార్చు]ఫీల్డ్స్ పతకాన్ని కెనడాకు చెందిన రోబర్ట్ టేట్ మెక్కెంజీ అనే శిల్పి రూపొందించాడు. ఈ పతకం 9 సెంటిమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పతకానికి ఒక వైపు కుడి వైపుకి తిరిగి ఉన్న గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడెస్ యొక్క ముఖము, గ్రీకు అక్షరములలో అతని పేరు, టేట్ మెక్కెంజీ యొక్క సంతకము ("RTM"), రోమన్ సంఖ్యామానంలో తేది ("MCMXXXIII" అనగా 1930), లాటిన్ అక్షరాలలో సామెత ("Transire suum pectus mundoque potiri" ) ఉంటాయి. పతకానికి మరో వైపు లాటిన్ భాషలో ఈ విధంగ ముద్రించబడి ఉంటుంది: CONGREGATI EX TOTO ORBE MATHEMATICI OB SCRIPTA INSIGNIA TRIBUERE దీని అర్ధము ఈ విధంగా ఉంటుంది: "ప్రపంచమంతటి నుండి హాజరు అయిన గణిత శాస్త్రవేత్తలు అత్యుత్తమ రచనలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు". పతకాన్ని అందుకునే శాస్త్రవేత్త పేరు పతకం అంచులో ముద్రించబడి ఉంటుంది.[2]
గ్రహీతలు
[మార్చు]*గ్రిగోరి పెరెల్మాన్ ఈ పురస్కారాన్ని తిరస్కరించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The Early History of The Fields Medal" (PDF). Retrieved 3 November 2013.
- ↑ "The Fields Medal". The Fields Institute For Research in Mathematical Sciences. Retrieved 1 November 2013.
- ↑ "List of Fields Medallists". International Mathematical Union (IMU). Retrieved 1 November 2013.