బుడబుక్కల

వికీపీడియా నుండి

బుడబుక్కల ఆదిమజాతి సంచార తెగ, ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 4వ కులం. ఇది షెడ్యూల్డ్ తెగ లలో ఉండవలసిన కులం అని ఆ కులస్థుల వాదన.

విషయ సూచిక

[మార్చు] బుడబుక్కల వారి గురించి

  • బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని ఢమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.--చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి
  • చల్లని నిద్దురవేళ …. చలిపొద్దున ఢమరుక శబ్దం …. ఆ వీధి నుంచి ఈ వీధికి నిరంతరాయంగా మోగుతూ ఉన్న బుడబుక్కల వాని కంఠస్వరం …. అదో రకమైన యాసతో, చల్లపొద్దును పక్కలో చేయి దూర్చిలేపినంత జలదరింపుగా అతని గొంతు …. ఢమరుక శబ్దం ఇంకా మోగుతూనే ఉంది. వీధుల్ని నిద్ర లేపుతూనే ఉంది. నిద్రా భంగమైనందుకు విసుక్కొంటోన్న వాళ్ళు వద్దన్నా మరికొంత సేపు మోగుతోంది. ఆ కళలన్నీ అంతరించి పోకుండా ఇంకా జీవించి ఉండటం ఆశ్చర్యమే! అయితే - అప్పటికి ఇప్పటికి కొంత తేడా కన్పిస్తోంది. ఏ ఇంటి వద్దా ఎక్కువసేపు నిల్చున్నట్టు లేదు అతను. లోగడ అయితే ఒక్కో ఇంటివద్ద ఒక ఉదయమంతా గడిచిపోయేది. పాత వస్త్రాలిమ్మనీ, చేరెడు గింజలు పెట్టమనీ, మరేవేవో కోరికలతో గృహస్తుల్ని పీడించేవారు. ఇంటి ముందునించి లేచేవారు కాదు. ఢక్కి మోత ఆపేవారు కాదు. పాడటం చాలించేవారు కాదు. ఇంట్లో వాళ్ళచ్చి కాళ్ళా వేళ్ళాపడి బతిమాలి చేటెడు గింజల వద్ద సగం చేటెడయినా పెట్టి పంపేవారు. ఇప్పుడు బుడబుక్కల వాడి ఆలోచనా ధోరణిలో తేడా వచ్చిందో మరి రైతుల్లో మార్పొచ్చిందో అర్థం కాలేదు. పూర్తిగా తెల్లారేసరికి అతని యాచన విరమించబడుతుంది. ఇంతకు మునుపటి కాలంలా ఎవరినీ వేధించటం లేదు. మొండికి పడి పాత వస్త్రాన్నో, చేటెడు గింజెల్నో గుంజుకోవటం తన హక్కుగా భావించటం లేదు. పొద్దు పొడిస్తే వీధుల మొహం చూడకూడదనే సాంప్రదాయిక కట్టుబాట్లను పాటించటం లేదు. వేషం అదే ఉన్నా, భాష మారకున్నా, ఢమరుకం వీడకున్నా తన వృత్తి లక్షణాల్ని వేటినో వదలుకున్నాడు. సాధారణ యాచకుల్లా పది రూపాయలిచ్చినా చేయిపడుతున్నాడు. ఐదు రూపాయలు విసిరినా కొంగు పడుతున్నాడు. చివరకు రెండు రూపాయల బిళ్ళతో సైతం తృప్తిపడి మరో ఇంటికి వెళుతున్నాడు.-- సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి ( తోలుబొమ్మలాట )
  • జానపద సంగీతం సామాజిక స్పృహతో వెలువడుతుంది. జానపదులు సంతోషాన్నో, దు:ఖాన్నో వ్యక్తం చేయడానికి తీసిన కూనిరాగాలే సంగీతం. తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు , జంగాలు , దాసర్లు, బుడబుక్కల వారు, బవనీలు, జక్కుల వారు, బొమ్మలాటకాండ్రు, జానపద సంగీతాన్ని గాత్ర సంగీత రూపంగా కాపాడుతున్నారు. తమ సంగీత పరికరాలను వారే తయారు చేసుకొంటారు. ఎలుగుబంటి వేషం, కప్పల కావడి, కరగనృత్యం, కరువ నృత్యం, కలాపం, కురవంజి నృత్యం, చెంచుల కథలు , జట్టిజాము, జేగంట భాగవతులు, జోకుమార సంప్రదాయము, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, దాసర్లు, పగటి వేషము, పాముల వాళ్ళు, పులివేషము, బయలాట, బహురూపులు, బాలసంతు వారు, బుట్టబొమ్మలు, బుడబుక్కలవారు, బుర్రకథ, భజన కూటాలు, మారెమ్మ ఉత్సవం, మెరవణి, మోడి, యక్షగానం, గిరిజనుల కళలు, వాలకము, వీధి భాగోతం మొదలైనవి జానపద కళా రూపాలు.--డా. కె. రెడ్డప్ప
  • ``సుభోజ్జయం కలగాలి-మహా ప్రభువులకు

మా పని నయంగండాలి మీ పని నయంగుండాలి రాను మా భారం రక్షించుట మీ భారం అంబపల్కు జగదంబ పలుకతవే ఆది పేరేటి శక్తి రావే కంచిలోన కామాక్షి పల్కవే మూలనున్న ముసలమ్మ పల్కవే బెజవాడ దుర్గమ్మ పల్కవే కలకత్తా కాళికమ్మ : మహాప్రభువలకు జయం కలగాలి, సుభోజ్జయం కగాలి

  • ఈ కులస్తులు అనంతపురం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. నారాయణ ఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, ప్రజ్ఞాపూర్‌లలో, కరీంనగర్‌ జిల్లా, వరంగల్‌ జిల్లాలోని సుల్తానా బాద్‌, ఖమ్మంజిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఉన్నారు.పూర్వం వీరు ఏ గ్రామం వెళ్ళినా కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండేవారు. బుడబుక్కలకు భోజనం కావా లన్నా కుమ్మరులనే అడుక్కునే వారు తప్ప మరో కులస్తుల ఇంటికి వెళ్ళేవారు కాదు.సంచార జీవితం గడుపుతున్నప్పటికీ వీరిని ఎస్టీల్లో కలపకపోవటానికి ఇదే కారణమని తెలుస్తోంది. వీరు ఒక్కొక్కరూ ఒక్కొక్క వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆరె బుడబుక్కల వాళ్ళు భిక్షాణన వృత్తిగా జీవిస్తారు. వీరి మాతృభాష మరాఠి, ఇళ్ళలో మరాఠి భాషను వాడతారు. బయట మాత్రం తెలుగు మాట్లాడతారు.ఆరెబుడబుక్కల వారి పరికరాన్ని డక్కు అంటారు. పరమశివుడు నాట్యం చేసే సందర్భంలో వాయించిన ఢమరకాన్నే వీరు ప్రధానవస్తువుగా స్వీకరించినట్లు చెప్తారు. వీరి వేషధారణ చేతిలో డక్కు, నల్లని పాత కోటు ధరించి పొడవైన తలపాగ చుట్టి, మెడలో రంగురంగుల ధోవతులు వల్లెవాటుగా వేసి ముంజేతికి కడియం ధరించి, నొసట కుంకుమ బొట్టు పెట్టి దానం కోసం ఇంటింటికి తిరిగి దీవించి దర్పంతో యాచన చేస్తుంటారు. వీరు ఉదయాన్నే లేచి గ్రామదేవతలకు పూజచేసి యాచనకు బయలుదేరుతారు. గ్రామదేవతలకు సంబంధించిన పాటలను ద్విపద శైలిలో పాడుతూ డక్కును లయ బద్ధంగా వాయిస్తూ చాలా హుందాగా ఇంటింటికి తిరుగుతారు. వీరి యాచనలో బియ్యం, డబ్బుల కంటే పాతగుడ్డల యాచనే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యాచించి తెచ్చిన పాత గుడ్డలను బొంతలుగా కుట్టి విక్రయిస్తారు. బొంతలు కుట్టడాన్ని ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమగా సాగిస్తారు.

వీరిది మాతృస్వామ్య వ్వవస్థ.వీరు గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామట్టు, గౌరికట్టు కడతారు. దాని వలన ఆ గ్రామానికి ఎటువంటి అశుభాలు జరగవని చీడలు రావని వారి నమ్మకం, వారిచేత చిన్న పిల్లలకు తాయత్తులు కూడా కట్టిస్తారు. దానివల్ల చిన్న పిల్లలకు చెడు గ్రహణ దోషాలు రావని గ్రామీణుల నమ్మకం. గతంలో మిరాశి వ్యవస్థ ఉండేది. బుడబుక్కల వాళ్లకు రైతులు ధాన్యం కొలిచి ఇచ్చేవారు. క్రమంగా ఆ సాంప్రదాయాలు కనుమరుగైపోవడంతో కళా అనే అంశం వెనక్కి పోయి కేవలం దయనమైన యాచకులగానే మిగిలిపోయారు.

[మార్చు] కులం పేరు

బుడబుక్కల పేరు చెపితేనే సమాజంలో గౌర వం సన్నగిల్లింది. పైగా వీరిని కించపరిచే విధంగా సినిమాలలో కూడా డైలాగులు వస్తున్నాయి. వీరి విజ్ఞప్తి మేరకు కొందరు సినీ నిర్మాతలు అటువంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించినా ఇప్పటికీ అటువంటి డైలాగులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో వీరు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరు మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.వీరిని కొన్ని చోట్ల ఆరెకటిక , ఆరెబొందిలి , ఆరెబుడబుక్కల , ఆరెమరాటి వాళ్ళు అనికూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రాంతంలోనివారు `రాజక్షత్రియ 'గా, అనంతపురం ప్రాంతవాసులు `జ్ఞానేశ్వర్‌' క్షత్రియ జోషి గా పేరుమార్చాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో రామ్‌ జోషి పేరున ఈ కులస్తులు ఉన్నారు.

[మార్చు] ఆచార వ్యవహారాలు

వీరి కులంలో కుల పెద్దల మాటే శిరోధార్యం. పెద్దల మాట తప్పిన వానిని కుల బహిష్కరణ చేస్తారు. తప్పు చేసిన వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక కాగులో నూనె పోసి పొయ్యి మీద పెట్టి సలసలా కాగబెడతారు. కాగిన నూనెలో తప్పు చేసిన వ్యక్తి చేయిపెట్టాలి. కాలితే తప్పు చేసినట్లుగా, కాలకపోతే తప్పు చేయనట్లుగా భావించి తీర్పు ఇస్తారు. భార్యను కొట్టినా తిట్టినా బూతులు మాట్లాడినా కుల కట్టుబాటు ప్రకారం శిక్ష వేస్తారు.

భార్య తప్పుచేసినా, భర్త తప్పుచేసినా భర్తే మూల్యం చెల్లించాలి. ఇందుకు పరిష్కారంగా పెద్దలందరినీ పిలిపించి పావుశేరు పద్ధతి ప్రకారం పెద్దల సమక్షంలో తప్పు నిర్ణయిస్తారు. వచ్చిన వారందరికీ ముందుగా మాంసంతో విందు భోజనం ఏర్పాటుచేయాలి. ఆరె బుడబుక్కల వారికి ముఖ్యమైనది పావుశేరు పద్ధతి, పెళ్ళి విషయాలలో కానీ, తప్పులు నిర్ణయించేటప్పుడు గానీ, అప్పుల ఒప్పందంలోగానీ, ప్రతి కార్యానికి పావుశేరు పద్ధతి ముఖ్యం. పావుశేరు పద్ధతి అంటే ఇరువైపులా పెద్దలు ఒకచోట చేరినపుడు ఆ ఇంటి యజమాని ఒక గ్లాసులో సారాయి పోసి వారి ముందు పెడతారు.

వచ్చిన పెద్దలలో ముఖ్యమైన వ్వక్తి తన చిటికిన వేలు అందులో ముంచిన తరువాత అందరూ తాగుతారు. దీనినే పావుశేరు పద్ధతి అంటారు. అప్పుపుచ్చుకున్నా ఎటువంటి ఒప్పందానికి గానీ పెద్దల సమక్షంలో పావుశేరు పుచ్చుకుంటే రాతకోతలతో పనిలేదు. అదే వారికి సాక్ష్యం. పెళ్ళిళ్ళ విషయంలో అబ్బాయి తరుపువారే ఖర్చు అంతా పెట్టుకోవాలి. ఓలి ఇస్తారు. అమ్మాయిని కొనుక్కోవాలి. పెండ్లి ఖర్చు అంతా అబ్బాయి భరించాలి. పెండ్లి అయిన తరువాత అబ్బాయి, అమ్మాయి వారింట ఒక సంవత్సరం ఉండి ఇంటి చాకిరిమొత్తం చేయాలి.

ఆ తరువాతనే వేరే కాపురం పెడతారు. కుటుంబంలో ఎటువంటి గొడవలు జరిగినా భర్తే అన్ని ఖర్చులు భరించి పెద్దలను పిలిపించుకొని తీర్పులు చేయించుకోవాలి. ఈ కులంలో ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మగవాడు ఏడు పెండ్లిండ్లు చేసుకోవచ్చు. తీర్పు విషయంలో ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇస్తే ఖర్చు అంతా వాడి నెత్తినే వేస్తారు. అప్పు తీసుకొన్న వ్యక్తి రూపాయి వడ్డీతో అప్పు తీర్చాలి. అతను చనిపోతే అతని కొడుకు, అతనుకూడా చనిపోతే అతని కొడుకు తీర్చాలి. కులపెద్దలే ఇందుకు సాక్ష్యం. వీరికి భిక్ష వృత్తిలో మీరాశి గ్రామాలు ఉంటాయి. ఒకరి గ్రామాలకు ఒకరు వెళ్ళకూడదు.

అలా వెళితే వారికి తప్పు వేస్తారు. పెళ్ళిళ్ళలో అల్లుడికి బహుమానంగా మామ తమ మీరాశి గ్రామాలను ఇస్తుంటారు. ఆ గ్రామాలపై అతనికే పూర్తి హక్కు ఉంటుంది.ప్రస్తుతం గ్రామాల్లో సరైన ఆదరణలేక ఇళ్ళకు తిరిగి పాత గుడ్డలు తెచ్చి బొంతలు కుట్టి జీవనం సాగిస్తున్నారు. వీరు సంచార జాతులలోని వారే. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకొని నివసిస్తున్నారు.

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=బుడబుక్కల&oldid=383022" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె