మహారాజపురం విశ్వనాథ అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాజపురం విశ్వనాథ అయ్యర్
వ్యక్తిగత సమాచారం
జననం(1896-09-15)1896 సెప్టెంబరు 15
మూలంచెన్నై, భారతదేశం
మరణం1970 (aged 74)
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ సంగీతము
వృత్తికర్ణాటక శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు
క్రియాశీల కాలం1911–1966

మహారాజపురం విశ్వనాథ అయ్యర్ (తమిళం: மகாராஜபுரம் விசுவநாதையர்) (1896–1970) ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు. [1] ఇతడు అనేక పురస్కారాలను పొందాడు. వాటిలో సంగీత కళానిధి, సంగీతభూపతి మొదలైనవి ఉన్నాయి.H

ప్రారంభ జీవితం, నేపథ్యం[మార్చు]

ఇతడు 1896, సెప్టెంబరు 15న తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, మహారాజపురంలో రామ అయ్యర్, అంబ దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. ఇతడు మొదట మహావైద్యనాథ అయ్యర్ శిష్యుడైన ఉమయల్పురం స్వామినాథ అయ్యర్ వద్ద సంగీత శిక్షణ తీసుకున్నాడు. మహావైద్యనాథ అయ్యర్ గురువు త్యాగరాజుకు నేరుగా శిష్యుడు. ఆ విధంగా విశ్వనాథ అయ్యర్ త్యాగరాజు శిష్య పరంపరలో ఐదవ తరానికి చెందినవాడు.

నందనార్ సినిమాలో కె.బి.సుందరంబాళ్‌తో విశ్వనాథ అయ్యర్

సంగీత రంగంలో కృషి[మార్చు]

రాగాలను సాగదీసి పాడటం ఇతని ప్రత్యేకత. మోహన రాగం ఆలపించడంలో ఇతడు దిట్ట. కల్పనా సంగీతంలో ఇతడు ఆరితేరినాడు. ఇతని ముఖ్యశిష్యులలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మన్నార్గుడి సాంబశివ భాగవతార్, కుమారుడు మహారాజపురం సంతానం, సంధ్యావందనం శ్రీనివాసరావు మొదలైన వారున్నారు.[2]

సినిమా నటన[మార్చు]

ఇతడు"భక్త నందనార్" అనే తమిళ సినిమాలో భూస్వామి వేదయార్ పాత్రను ధరించాడు. కె.బి.సుందరంబాళ్ నందనార్ పాత్రలో నటించిన ఈ సినిమా 1935, జనవరి 1న విడుదలయ్యింది.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

ఇతనికి 1939లో "సంగీతభూపతి" అనే బిరుదు లభించింది. 1945లో మద్రాసు సంగీత అకాడమీ వారు సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేశారు. 1955లో కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందాడు. ఇతడు తిరువాంకూరు, మైసూరు, పుదుక్కోటై సంస్థానాలలో ఆస్థాన విద్వాంసుని పదవిని అలంకరించాడు.

మూలాలు[మార్చు]

  1. Subrahmaniam, V. Music Season / Music : Of Style and Stalwarts Archived 2007-12-04 at the Wayback Machine. The Hindu, 1 December 2007.
  2. Like the Singing Wind from the Ghat Archived 2006-09-13 at the Wayback Machine. The Hindu - Kerala News, 13 November 2005.