రెంటాల వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెంటాల వెంకటసుబ్బారావు

రెంటాల వెంకట సుబ్బారావు అత్యధ్యుత ప్రతిభాశాలి, ప్రజ్ఞాశాలి అయిన రచయిత. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు.[1] మద్రాసు సమాజంలో మొదటి తర గైడులు తయారుచేసిన వ్యక్తిగా సుపరిచితులు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన బి.ఎ. బి.ఎల్ చేసి మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు చేసారు. ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఈయన అపార ప్రజ్ఞను చూసిన ఇంగ్లీషు జడ్జీలు, న్యాయ శాస్త్రకోవిదులు, ప్రతిభాశాలురైన న్యాయవాదులు ఆశ్చర్యపడేవాళ్ళు. వేంకట సుబ్బారావు ప్రాక్టీసుకు స్వప్తి చెపుతున్నారని తెలిసి ఖిన్నుడై "అట్లా చేయవద్దు, నీవు త్వరలో హైకోర్టు జడ్జి పదవి నలంకరిస్తావు" అని ఒక ఇంగ్లీషు జడ్జి నచ్చచెప్పే లోగా సుబ్బారావు "నేను నా జీవిత కాలంలో ఆర్జించే ధనంకన్నా సంపదకన్నా మూడునాలుగేళ్ళలో ఎక్కువే సంపాదిస్తానని" ఆత్మవిశ్వాసంతో అలవోకగా ఆయన అభ్యర్ధన తోసిపుచ్చారు.[3] రెంటాలవారు గొప్ప విద్వాంసుడు. తెలుగు జిల్లాల నుంచి ఏ పండితుడు, ఏ కవి, ఏ ప్రముఖుడు వచ్చినా ఆయన ఆదరించేవారు. వారింట్లోనే వసతి ఏర్పరచేవారు.

ఈయన ఆరోజుల్లో విద్యార్థులకు గైడ్లు ప్రచురించిన చారిత్రిక పురుషుడు. గురజాడ కన్యాశుల్కం నాటకంలో ఈయన ప్రస్తావన ఉంది. గిరీశం తన శిష్యుడైన వెంకటేశానికి కొన్ని పుస్తకాల జాబితా చెప్పినపుడు అందులో "రెంటాల వెంకటేశ్వరరావు మేడ్ ఈజీ" ప్రస్తావన ఉంది.[2] అంటే రెంటాల వెంకట సుబ్బారావు కన్యాశుల్కం రచనా కాలానికి జీవించి ఉన్న వ్యక్తి. అంటే 1890—1910 ప్రాంతంలోనన్నమాట. ఆయన పాఠశాల విద్యార్థులకు గైడ్లు ప్రచురించి లక్షల ధనాన్ని ఆర్జించారు. అవి ఆ రోజుల్లో అత్యంత ప్రచారం పొందాయి. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడైన కాశీనాధుని నాగేశ్వరరావు గారి మేనకోడలను వివాహం చేసుకున్నారు.[4] కాశీనాథుని నాగేశ్వరరావు గారికి వాణిజ్యాభిలాష కలిగించి ప్రోత్సహించి ఆ ప్రయత్నంలో మార్గదర్శకులైనవారు రెంటాల. కాశోనాథుని నాగేశ్వరరావు కంటే ముందే విక్టోరియా మందుల డిపో నడిపి అనేక మందులు తయారుచేసారు. అమృతాంజనం వంటిదే ఆయన తయారుచేసిన భేతాళ తైలం ఒకటి.[5]

ఈయన రాసిన షేక్స్‌పియర్ నాటకాలకు ఇంగ్లీషులో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమెరికాలో షేక్స్‌పియర్ విమర్శకులు ఆయన గ్రంథాలను పొగిడారు. షేక్స్‌పియర్ రచనల్లో ప్రసిద్దమైన హేమ్లెట్, ఒథెల్లో నాటకాలకు రెంటాల వేంకటసుబ్బారావు హేమెట్ అన్వీల్డ్ (1909), ఒథెల్లో అన్వీల్డ్ (1910) అని గొప్పవ్యాఖ్యానాలు రాశారు.[6] 1903లో "కమలాస్ లెటర్స్ టు హెర్ హస్బండ్"ను రాసారు.[7] విదేశీ విశేషాలు భార్యకు భర్త రాసినట్లుగా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ వేంకటసుబ్బారావు లేఖావళి ప్రచురించారు. ఈయన 1895లో కేసరి విలాసం, ఆనంద దీపిక అనే నవలలను తెలుగులో వ్రాసి, తానే వాటిని కన్నడ భాషలోనికి అనువదించారు[8]. రెంటాల వేంకట సుబ్బారావు ఆత్మగౌరవ దృక్పథం ఉన్న మనీషి. క్రైస్తవ మిషన్ స్కూలు ప్రధానోపాధ్యాయకత్వం వీరికివ్వజూపినప్పడు యూరోపియన్ ఉద్యోగులతో సమానమైన హోదా, జీతం ఇస్తేనే వస్తానని చెప్పి మరీ ఆ ఉద్యోగం కొన్నాళ్ళ నిర్వహించారు. కుటుంబ కష్టాల వల్ల ఈయన ప్రతిభ మరింతగా రాణించలేదు. షష్టిపూర్తి కూడా కాకముందే యీ మహాపురుషుడు దివంగతుడైనారు.[5]

ఆయన గూర్చి విశేషాలు[మార్చు]

ఆదిభట్ల నారాయణదాసుగారి స్వీయ చరిత్రలో “ఈయన ఆరోజుల్లో చెన్నపట్నం మైలాపూరు చెరువు ఉత్తర గట్టున నివశిస్తూ ఉండేవాడు. ఆరోజుల్లోనే ఈరకమైన మేడీజీ పుస్తకాలు (గైడ్లు) ప్రచురించి రెండు లక్షలార్జించేడట.బియేబియల్ చదువుకున్న విద్యాధికుడు. తెలివితేటలుకలవాడు మిక్కిలి రసికుడున్నూ. కడు ఉదారవంతుడు. తెలుగున గద్యపద్యములు మిక్కిలి చురుకుగనల్లగలడు. దొరలు మెచ్చునట్లింగ్లీషు వ్రాసి మాట్లాడగలడు.” అని ఉంది. ఈ వెంకట సుబ్బారావుగారు నారాయణదాసు గారికి కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి ఆయన చేత సంగీత సభలు చేయించినట్టు,హరికథలు చెప్పించినట్లు వ్రాసుకున్నారు. దాసుగారి సభలమీద హిందూ పత్రికలో వ్యాసాలు కూడా వ్రాసేరట.[9]

వెంకట సుబ్బారావు గారు ఆరోజుల్లోనే ప్రపంచంలో అతి పెద్దదైన ఫోటో స్టుడియోలలో రెండవ స్థానం పొందిన ఫుటో స్టుడియో నిర్వహించే వారని తెలుస్తోంది. ఇదికాక రెంటాలవారు షేక్స్పియర్ నాటకాలను గూర్చి ఇంగ్లీషులో ప్రకటించిన గొప్ప వ్యాఖ్యలు,విమర్శలు, అమెరికన్ విద్వాంసుల ప్రశంసనూ అబ్బురాన్నీ పొందేయట.[3] శ్రీ వల్లూరి వారి స్వీయచరిత్రలో ఒక అధ్యాయం అంతా రెంటాల వారిని గురించే ఉందట.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మద్రాసు లోఉన్నప్పుడు కొంత కాలం మైలాపూర్ లోఉంటూ అక్కడల కపాలీశ్వర స్వామి గుడి దగ్గర ఒక పూటకూటింట్లో భోజనం చేసేవారట. అది నిర్వహించే స్త్రీ మూర్తి రెంటాల వారికి దూరపు బంధువనీ కొన్నాళ్లు ఆమెకు ఏ ఆసరా లేకపోతే ఆదుకున్నారనీ ఆవిడ స్వతంత్రంగా జీవించాలనే తలంపుతో పూటకూళ్ళిల్లు నిర్వహించడం మొదలు పెట్టిందనీ వ్రాసేరు. శాస్త్రిగారు సేకరించి సంకలించిన చాటు పద్యమణిమంజరి ప్రచురించడంలో రెంటాల వారు చాలా సహాయము చేసేరట.[10][11]

మూలాలు[మార్చు]

  1. WHAT DO WE OWE TO SHAKESPEARE? Dr. D. ANJANEYULU[permanent dead link]
  2. 2.0 2.1 Centennial of a Sentinal, hans india articla
  3. 3.0 3.1 శ్రీ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్వీయచరిత్ర
  4. life history of kasinathuni nageswararao
  5. 5.0 5.1 ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ ఎడిసన్, తే.29.05.2016దీ."తెలుగులో మేథలో షేక్‌స్పియర్ - అక్కిరాజు రమాపతి రావు
  6. Encyclopaedia of Indian Literature: A-Devo
  7. Bards, our own: Rentala Venkata Subba Rao and Laxmikant Mohan
  8. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (1 May 1979). "కన్నడంలో తొలి నవల". అభ్యుదయ. 3 (5): 51–52. Retrieved 1 December 2017.[permanent dead link]
  9. ఆదిభట్ల నారాయణదాసు స్వీయ చరిత్ర
  10. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞాప్రభాకరము
  11. Full text of "MANIMAJARI VOL:-3 PART:-1&2"

ఇతర లింకులు[మార్చు]