కన్యాశుల్కం (నాటకం)
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసంలో బొమ్మలు గాని, మరి కొన్ని భాగాలు గాని కాపీ హక్కుల నియమాలను ఉల్లంఘిస్తున్నాయి అనిపిస్తున్నది. |
కన్యాశుల్కం గురజాడ అప్పారావు పంతులు రాసిన సాంఘిక నాటకం. అది మొదటిసారి 1897 లో ప్రచురించబడింది. అంతకు ముందే 1892 లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్ది మార్పులతో రెండవ ముద్రణ పొందింది. అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. విజయనగర రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా "కన్యాశుల్కం" అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.
గురజాడ కన్యాశుల్కం గొప్పనాటకం అని నిరూపించే అంశాలు:
- వస్తువు,
- పాత్రపోషణ,
- హాస్యం, అధిక్షేపం,
- సంభాషణలు,
- భాష.
విషయ సూచిక |
[మార్చు] వస్తువు
కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ, మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచాడు.
ఈ నాటకంలోని కథావస్తువు "సంఘసంస్కరణ"కి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివి. చిన్న పిల్లల్ని ముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం, వేశ్యావృత్తి హైన్యత, స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనా మేధావులు.
ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. ఈ అన్యాయాన్ని ఎత్తి చూపాడు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.
కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ, న్యాయాన్యాయాలూ లేవు. అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది కేవలం ధనవ్యామోహం. వీటిని గురజాడ ఎత్తిచూపాడు. పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ, ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసి గిరీశం, రామప్పంతులు వంటి పాత్రల్ని కథలో పొందు పరచాడు. మోసాలు, అబద్ధాలు, సొంతడబ్బా, ఏదోవిధంగా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసాడు. "ఆధునికత" పేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని నిరసించాడు. ఈ నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.
ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది. అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు, తెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ ఈ నాటకం జనాదరణ పొందడానికి కారణం, ఈ నాటకాన్ని ఒక "సజీవసాహిత్య ప్రక్రియ" గా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు, సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి. 'గిరీశం' పాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషులూ ఉన్నంతవరకూ ఈ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. ఈ నాటకం ఆధునిక నాటకసాహిత్యానికి విఙ్ఞాన సర్వస్వం వంటిది. ఈ నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.
[మార్చు] పాత్రపోషణ
ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది.
సర్దేశాయి తిరుమల రావు "కన్యాశుల్క నాటకకళ" అనే విమర్శలో నాటకంలోని పాత్రల్ని మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు అని రెండు వర్గాలుగా విభజించాడు. మనిషిలోని మంచిచెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డమంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపాడు. మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రాని 'నాయిక' వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెంటిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది. కన్నీళ్ళు వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక కర్త ఉద్దేశ్యం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. "సామూహిక పాత్రీకరణ" అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది. ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.
ఈ నాటకానికి ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొని ఉంది. నాటకం మొదలూ, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంత సమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి పాఠకుడిలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, ఆ పనులవల్ల ఏ ప్రయోజనం, మార్పూ కనుపించదు.
గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక. మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్ని తెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్ని ఆశించి గురజాడ సృష్టించి ఉండవచ్చు. డామిట్ ! కథ అడ్డం తిరిగింది అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.
ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర మధురవాణి. ఈ పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది. వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది. ఆమె సంస్కారవతి. దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్న శిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా? అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ, లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. ఆహా! ఏమి యోగ్యమైన మనిషి అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలో నీకు సిగ్గులేదే లంజా! లాంటి మాటలు ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.
ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్రోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.
డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.
[మార్చు] మిగిలిన పాత్రలు
రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను నిశిత దృష్టికలవాడు. నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁను అనే సూక్ష్మబుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.
అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.
సౌజన్యారావు న్యాయవాది. వివిధ స్వభావాలున్న మనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్ని గెట్ అవుట్ అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.
ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో. మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.
[మార్చు] హాస్యం, ఎత్తిపొడుపు
కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికొకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు. గిరీశం అగ్నిహొత్రావధానిని అగ్గిరావుఁడన్నాడు. కరటక శాస్త్రి మూర్ఖపగాడ్దె కొడుకన్నాడు. గిరీశాన్ని రామప్పంతులు గిర్రడు బొట్లేరు అని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్ని హనుమాన్లుగా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు, లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది. మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం, గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ, గిరీశం వెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులు నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా? అన్నప్పుడూ, మధురవాణి లుబ్ధావధానిని ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో అన్నప్పుడూ నవ్వుకుంటాం.
సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశం లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు అంటాడు. అలాగే నీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్ చేసాడు గానీ.. అనడం గూడా. పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్, మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే! అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, సత్యం చ మే, ధర్మం చ మే వంటి వేద మంత్రాలకు చేగోడిం చ మే లాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు.
[మార్చు] సంభాషణలు
సంభాషణలు, భాషా ఈ నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్ కాజెస్ ఫర్ది డీజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారు వంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి. గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్, డామిట్ కధ అడ్డం తిరిగింది లాంటివి సాక్ష్యాలు.
పూటకూళ్ళమ్మని గురించి మీరుండగా వెధవెలా అవుతుంది అనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోంది అనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి అన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.
[మార్చు] భాష
కన్యాశుల్కం వాడుకభాషలో వచ్చిన మొదటి సాంఘిక నాటకం. ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలు
- చెప్పాను కానా?
- నా ఆబోరుండదండీ
- గుంటవెధవ
- కనిష్టీబు
- నాను ఉంది
- అనాడీ చేస్తున్నారు
- వగుస్తున్నారు
- కొసాకి విను
పాత్రోచిత ప్రయోగాలు:
- అగ్నిహోత్రావధాని: మానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.
- వెంకమ్మ: మీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?
- గిరీశం: నేనే దాని హజ్బండై ఉంటే నిలబడ్డపాట్న నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేసి ఉందును.
మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి, సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు, తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి, ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్ కానేరడు వంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.
మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, కన్యాశుల్కం ఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.
[మార్చు] ప్రధాన పాత్రలు
- గిరీశం
- మధురవాణి
- రామప్పంతులు
- అగ్నిహోత్రావధాన్లు
- లుబ్దావధాన్లు
- పూటకూళ్ళమ్మ
- బుచ్చమ్మ
- వెంకటేశం
- కరటకశాస్త్ర్రి
- శిష్యుడు
- కొండుభట్టు
- దుకాణదారు
- బైరాగి
- హవల్దారు
- వీరేశ
- అసిరిగాడు
- మీనాక్షి
[మార్చు] ప్రశంసలు
- "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృఛ్ఛకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ
[మార్చు] విమర్శలు
కన్యాశుల్కం వ్యాసానికి అనుబంధంసమీక్షలురచన : వేలూరి వేంకటేశ్వర రావు (కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శలు నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు పొందుపరచడం కోసం ఈ అనుబంధంలో నేను సాధ్యమైనంతవరకు మూల వ్యాసాలను చూడటానికి ప్రయత్నించాను. ఇందుకు కారణం లేకపోలేదు. ఫలానా ఆయన ఫలానా మాటలు అన్నారు అని ఒక విమర్శకుడు ఉదహరించినప్పుడు, ఆయన పాక్షికత పైకి కనిపించక పోవచ్చు. ఆ సందేహం నివృత్తి చేసుకోడానికి, మూల వ్యాసం చూడడం అవసరం కదా! అయితే, అన్ని సందర్భాలలోనూ ఆపని సాధ్యం కాలేదు.
కొన్ని కొటేషన్లు చాలామంది విమర్శకులు పదేపదే వాడారు. కత్తిరించి తమ భావ ప్రకటనకోసం మాత్రవే చెప్పినవి నేను వదిలేశాను. ఇక్కడ నా పాక్షికత కనబడుతుంది. అంతకన్నా నిర్మొహమాటంగ చెప్పడం నాకు చేత కాదు. కొటేషన్ల మీద నా కామెంట్లు ఇచ్చిన చోట నేను స్పష్టంగా ఈ మాటలు నావి అని రాసాను. — వే.వే.రా)
కేతవరపు రామకోటి శాస్త్రి గారి విమర్శనా వ్యాసాలు — మళ్ళీ కన్యాశుల్కం గురించి అన్న పేరుతో 1992 లో ప్రచురింపబడ్డాయి. ఇందులో ఆయన 1955 లో రాసిన వ్యాసం కూడా అనుబంధంగా ఇచ్చారు. ఆయన అప్పటికి మార్క్సి స్టు భావాలతో ప్రభావితం కాలేదు. 36 యేళ్ళ తరువాత రాసిన వ్యాసాల్లో ఆ ప్రభావం కనుపిస్తుంది. ఈ క్రింది కొటేషన్లు ఆయన వ్యాస సంపుటినుంచి ఇస్తున్నాను.
–”(అప్పారావుగారు) కన్యాశుల్కానికి అంకితం వ్రాస్తూ “మనస్త్రీజాతిలోని నిస్సహాయమయిన విభాగాన్ని సమాజ అవినీతి క్రిములతో నిండివున్న బాధాకరమైన దాస్యం నుండి రక్షించే సమస్య ఘనతవహించిన మీ దృష్టిని పదేళ్ళ క్రితం (1887-88) ఆకర్షించినప్పుడు ఈ చెడుగును ఒక జనరంజకమైన నాటకంలో వెల్లడి చేసి ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని వుద్దీప్తం చేసేందుకు మీ భృత్యుడొకడు ఒక దుర్బల ప్రయత్నం చేశాడు.” పేజీ - 7
……. దేశభాషాసాహిత్య ప్రయోజనం గురించి తన అంతరంగాన్ని కన్యాశుల్కం మొదటి కూర్పు (1897) పీఠికలో (అప్పారావు గారు) వివరించాడు. “సమాజానికి సిగ్గుచేటు (అయిన) ఇటువంటి (కన్యాశుల్కవివాహ) దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను వ్యాపింపజేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు. ప్రజాబాహుళ్యానికి పుస్తక పఠనం అలవాటయ్యేదాకా అలాంటి ఆరోగ్యకర ప్రభావ వ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించవలసి వుంటుంది. కన్యాశుల్క నాటకరచనకు నన్ను ప్రేరేపించినది ఇదే.” పేజీ - 9 — మూడేళ్ళలో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్క వివాహ పట్టీ (1887) గురజాడ వ్రాసిన పీఠిక (మొదటి కూర్పు) ను బట్టి ఆయన పర్యవేక్షణలోనే జరిగి వుండవచ్చు.
……ఈ అతిబాల్యవివాహపు జబ్బు ఒక్క బ్రాహ్మల్లోనే కాదు, హిందూ కులాలన్నిటిలోనూ, సిక్కుల్లోనూ, జైనుల్లోనూ, బౌద్ధుల్లోనూ కూడా వున్నట్లు సమాచారం వున్నది. –పేజీ 11
— కన్యాశుల్కం మొదటి కూర్పు విషయంలో ఎలా వున్నా గురజాడ దాన్ని పూర్తిగా మర్చి కొత్త నాటకం వ్రాసి 1909 రెండవ కూర్పుగా ప్రచురించింది మాత్రం (వీరేశలింగం) పంతులు గారి బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, వేశ్యాప్రియ ప్రహసనం, కౌతుక వర్ధని మొదలయిన రచనల పునాది మీద సమున్నతంగా నిర్మింపబడిన సాంఘికవ్యంగ్య నాటక కళాసౌధం అని చెప్ప వచ్చు. –పేజీ 17
— కన్యాశుల్కంలో వస్తువు సంఘసంస్కరణ. అంటే సంఘసంస్కరణోద్యమం నడుస్తున్న నడకను వస్తువుగా చేసుకొని , దానిబాహ్యేతర ప్రవృత్తుల వాస్తవాలను విమర్శనాత్మకంగా సామాజికుల ముందు పెట్టడానికి గురజాడ కన్యాశుల్క నాటకాన్ని వ్రాశాడు. ఆయన ఏ సాంఘిక సమస్యనూ ఏ దురాచారాన్నీ పరిష్కరించడానికి గానీ నిర్మూలించడానికి గానీ నాటకం వ్రాయ లేదు. కే.రా.కో — పేజీ –21 (my emphasis -వే.వే.రా)
— మధురవాణిని భవభూతి మాలతీమాధవంలోని కామందకితోకూడా పోల్చిచూడవలసిన అవసరం ఉంది. నిజానికి కన్యాశుల్కంలో మదురవాణి చేసిన గొప్పపని సుబ్బితో లుబ్ధావధాన్లు పెళ్ళి తప్పించడమే. వసంతసేన అసలిటువంటి పని ఏమీ చెయ్యలేదు. మాలతీమాధవంలో కామందకి చేసింది. కన్యాశుల్కం ఇతివృత్తం విషయంలో మాలతీమాధవానికి చాలా దగ్గరగా వస్తుంది . –పేజీ 38
— ఏ సాంఘిక రంగానికి సంబంధించిన సంస్కరణ అయినా అది బ్రాహ్మణవర్గ విమర్శ స్పర్శ లేకండా వుండటం సాధ్యం కాదు. వీరేశలింగంగారు బాల్య వివాహాల విషయంలోను, వృద్ధవివాహాల విషయం లోనూ స్త్రీ పునర్వివాహ విషయంలోనూ నిందించిందెవర్ని? బ్రాహ్మణ వర్గాన్నే కదా! సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకుద్దేశించిన నాటకంలో బ్రాహ్మణవర్గ విమర్శ. అదే అసలు వస్తువు. అందుకే కన్యాశుల్కం నిండా బ్రాహ్మలు. సంఘసంస్కరణోద్యమాన్ని నడిపిస్తున్నదీ బ్రాహ్మలు అయినప్పుడు వాళను వ్యతిరేకించే బ్రాహ్మలు ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడూ లోపాలు వెతుకుతూంటారు - పేజీ 48
(ఇక్కడ ఆయన 1955 లో మార్క్సిస్ట్ ప్రభావంలో పడక ముందు రాసిన వాటితో, ఈ పై వాక్యాలను పోల్చి చూడాలి. — ఆ వాక్యాలు ఇవి: “కన్యాశుల్కంనందలి ఇతివృత్తము ఉత్పాద్యము మరియు సాంఘికము. ఈ రూపకమున ప్రవేశ పెట్టబడిన పాత్రములు నాటికాలములోనున్న కొందర నుద్దేశించి యున్నవని విశాఖ జిల్లా వారు చెప్పుదురు.” ఇటువంటి వ్యాఖ్యలు విజయనగరం వారినుండి నేను కూడా విన్నాను. ముఖ్యంగా, ఈ నాటకంలో తాతా సుబ్బరాయ శాస్త్రి గారిని, ఆదిభట్ల నారాయణ దాసు గారినీ ‘వేళాకోళం ‘ పట్టించడంకోసం అప్పారావుగారు అవధానుల పాత్రలు సృష్టించాడని! వీరందరూ సమకాలికులు. శాస్త్రి గారు, దాసు గారు, వైదీకులలో ద్రావిడ శాఖకు చెందిన వారు. సంప్రదాయ సాహిత్యంలో, ధర్మశాస్త్ర అధ్యయనంలో, సంస్కృత వ్యాకరణంలో ఉద్దండులు అని చెప్పుతారు. ఈ ద్రావిడులలోనే, ఆరోజులలో బాల్యవివాహాలు జరిగేవని, మిగిలిన శాఖల వారిలో ఇది సమస్య కాదని అనే వారు. ఏదిఏమయినా నిర్థారించి చెప్పటం కష్టం. — వే.వే.రా)
(గురజాడ గురించి రాసేటప్పుడు, శ్రీశ్రీ గారి అభిప్రాయాలు చెప్పకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్రింది కొటేషన్లు మనగురజాడ–శ్రీశ్రీ, సాహిత్య సర్వస్వం-9 నుంచి పొందు పరిచాను. 1932 నుంచి 1976 వరకూ శ్రీశ్రీ గురజాడ పై చెప్పిన మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీన్ని 1988 లో విరసం ప్రచురించింది. కూర్పు : చలసాని ప్రసాద్. — వే.వే.రా)
– జీవితంలో ఏ సందర్భానికైనా సరిపోయే మాటలు ఎక్కడో ఒకచోట గురజాడ మహాకవి (కన్యాశుల్కంలో) దొరుకుతాయి . ……..మహాకావ్యాల ప్రధాన లక్షణాలలో ఇదొకటి — ఈ విశ్వతోముఖత్వం. పేజీ - 35
– కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యంలో వాస్తవికతను ఇంతసమగ్రంగా ప్రదర్శించిన నాటకం ఈ నాటి మనదేశంలో లేనే లేదు. …. భారతదేశంలో మృచ్చకటికంతోపాటు ఒక్క కన్యాశుల్కాన్నే నేను ఎన్నిక చేస్తాను. వసంతసేనకంటే మధురవాణి గొప్ప సృష్టి. — పేజీ 36
— విక్రమోర్వశీయంలో ఊర్వశి, మృచ్చకటికంలో వసంతసేన కవితాకన్యకలుగానే కనిపిస్తారు. రక్త మాంసాలతో పుష్టిగా భూమి మీద తిరిగే పాత్రలు కావవి. వసంతసేన మానవ వేశ్య అయినా మధురవాణి ప్రౌఢత్వం ముందు ఆమె వట్టి గోల. షేక్స్పియర్ క్లియొపాత్రా గాని, సోఫోక్లిస్ నాయికలు గాని వేశ్యలు కారు. ముద్దుపళని తన రాధికకు తంజావూరు నాగరికతనాటి వేశ్యల లక్షణాలను ప్రసాదించింది. చింతామణి కంటే, దేవదేవి నాలుగాకులెక్కువ చదువుకుంది. అంతే. Anatole France సృష్టించిన థాఇస్ తో దేవదేవిని పోల్చవచ్చును. వీరంతా శృంగారంలో కొన్ని సున్నితమైన ఒడుపులు చూపిస్తారు. కానీ, జీవితాన్ని వడబోసి చూపించరు. Carmen, Manon Lescaut వీళ్లు వసంతసేనకీ మధురవాణికీ మధ్య ఊగిసలాడతారు. వసంతసేన ప్రేమపాత్రిక అనీ, మధురవాణి జీవిత పాత్రిక అనీ నే నంటాను. ఎమిలీ జోలా సృస్టించిన నానా అనే పంథొమ్మిదవ శతాబ్దపు పరాసు వేశ్య వసంతసేనగా ప్రారంభించి మధురవాణిగా మారుతుంది. ….. చీకటి పడితే గానీ నానా కి ధైర్యం రాదు. ……. పగటివేళ కాకీరుపులను ఎదుర్కునే శక్తి ప్రదర్శించగలది మధురవాణి మాత్రమే! …… ఎంత గొప్ప పాత్రని సృష్టించాడు, గురజాడ! పేజీ - 42, 43.
— కన్యాశుల్కం గ్రంథాన్ని భీభత్సరసప్రధానమైన విషాదాంతనాటకంగా ఇప్పటికీ అభివర్ణించడం మానలేను — పేజీ 70 (మరెవరో చెప్పిన ఈ అంశాన్ని శ్రీశ్రీ సొంతంచేసుకున్నారని ఒక పుకారు వ్యాప్తిలో ఉంది — కోవెల సంపత్కుమారాచార్య, కన్యాశుల్కం -మరోవైపు , పేజీ -27)
(సర్దేశాయి తిరుమలరావు గారు ప్రచురించిన కన్యాశుల్క నాటకకళనుండి — తిరుమలరావుగారు దీనిని మొట్టమొదట సరళగ్రాంధికంలో రాసి, తానే ప్రచురించుకున్నారట. తదుపరి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వాడుకభాషలోకి పరివర్తనం చేశారు. విశాలాంధ్ర వారు, 1994 లో దీనిని ప్రచురించారు. — ఈ పుస్తకంలో కన్యాశుల్కం యొక్క అపూర్వ అద్వితీయ స్థానాన్ని నిరూపిస్తూ దాన్ని “కళాజయ స్థంభం” అని రుజువు చేసేందుకు గ్రీకు, రోమను, ఫ్రెంచ్, ఇంగ్లీషు మొదలైన భాషలనుండి, సంస్కృత, ఆంధ్ర, తమిళ, కన్నడ భాషల్లో ప్రాచీన కావ్యాలనుండి రుజువులు పొందుపరచారు. ఈ పుస్తకంలో ఎన్నో అధో జ్ఞాపికలున్నాయి. — వే.వే.రా)
– మనిషిని స్వాలంబునిగా చేయగల, లోకశ్రేయక్రియాపరునిగా ప్రేరేపించగల ఉదాత్త భావమే కవిత్వం. అలాంటి కవిత్వం కన్యాశుల్కనాటకం. పేజీ -21
– కన్యాశుల్కం ప్రహసనంకాదు. ఇందులో ఉదాత్త పాత్రలు వస్తాయి. హాస్యరస ప్రధానంకాదు. రసపరిభాషలోనే కావాలంటే ఇది కరుణరసవీరరసప్రధానం. దయావీరం కరటకశాస్త్రి, మధురవాణి పాత్రాశయంగా వుంది. దానవీరం మధురవాణిది. వాత్సల్యం సౌజన్యారావు చూపించిన రసం. కరుణరసం సుబ్బి పాత్ర నిష్టం. అనిష్టవస్తు (లుబ్ధావధాని) ప్రాప్తి (పెండ్లి) సుబ్బికి కలిగేయోగముండటంవల్ల కరుణరసం. పేజీ -31
– కన్యాశుల్కనాటకారంభం గిరీశం అవతరణతోనే జరుగుతుంది. ముగింపు ఇతని ‘మహాభినిష్క్రమణ’ తోనే జరుగుతుంది. ఈ విషయంలో నాటకంలో ఆద్యంతసమత (symmetry) వుంది. రామాయణ భారత భాగవతాలలో కూడా ఇలాంటి సంవిధానమే వుంది. పేజీ - 54
– కన్యాశుల్కవరదక్షిణలు భారతదేసంలోనేకాక ప్రాచీనకాలంనుండి వస్తున్న ప్రపంచవ్యాప్తమైన ఆచారాలే. గ్రీకులు, రోమన్లు, బాబిలోనియన్లు, టూటన్లు, ఈ ఆచారాలను అనుసరించారు. యూదులలో అరబ్బులలో వరుడు కన్యకు డబ్బుచెల్లించే ఆచారం వుంది. ముస్లిములలో పెండ్లి సమయములో వరుడు సమాదరంగా వధువుకిచ్చే ధనాన్ని, మహర్ అంటారు. ఇది విధిగా ఇవ్వాల్సిన ధనం. స్మృతి సమ్మతం. పేజీ - 120
— ఈ చెడ్డ ఆచారం (బాలికల్ని శుల్కంతీసికొని ముసలి వాళ్ళకిచ్చి పెళ్ళి చేయడం) బ్రాహ్మల్లోనే ఉందనుకుందాం. ఆనాటి జనసంఖ్యలో బ్రాహ్మణులు నాలుగు శాతం. ఇందులో కొద్దిమందే ఈ చెడు ఆచారం పాటించేవాళ్ళు అయి ఉండాలి. ……. ఎవరికో కొద్దిమందికి జరిగే అన్యాయాన్ని పెద్ద సంస్కరణీయాంశంగా, పెద్ద సంఘటన అయినట్లు నాటకంలో ప్రతిపాదించడం సంఘస్థితిని యదార్థంగా చిత్రించడం అనిపించు కుంటుందా? …. (అయితే) జరుగుతున్న అన్యాయం కొద్దిమందికే అయినా దానిని పరిహరించ వలసిందే అనే సంకల్పంతో కన్యాశుల్కం రాయబడిందని వాదించాల్సి వస్తుంది. పేజీ - 132
– ఆ రోజుల్లో బాల్య వివాహాలు బ్రాహ్మణులు మాత్రవే చేసేవారా? విజయనగరం మహారాజువారి ఆదేశం మేరకు కూర్చబడ్డ బ్రాహ్మణశుల్కవివాహాలపట్టి అపాతినిధ్యదోషభూయిష్టం. ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఉద్ధరించిన వార్తలు బ్రాహ్మణులవి కావు. సంఘంలో అన్ని చోట్లా ఉండే దురాచారానికి కండబలంలేని ఒక బాపడు బాధ్యుడైనట్లు చిత్రించడం అన్యాయం. పేజీ -135, 136.
(రెడ్డివారిలో పాకంటి భాగంవారు బాల్యవివాహాలు చేసే ఆచారం పాటించేవారట! –సెప్టెంబర్ 7, 1972 The Hindu , అధోజ్ఞాపిక పేజీ 23)
(కోవెల సంపత్కుమారాచార్య గారి కన్యాశుల్కం - మరోవైపు, జూన్ 2000 లో ప్రచురించారు. ఇందులో 11 వ్యాసాలున్నాయి. రెండు అనుబంధాలకింద తన వ్యాసాలపై వచ్చిన విమర్శలూ-ప్రతివిమర్శలూ కూడా ఇచ్చారు. ఈ వ్యాసాలన్నీ 1993-94 ప్రాంతంలో, ఆంధ్రప్రభ సాహితీగవాక్షంలో మొట్టమొదటిసారిగా ప్రచురించ బడ్డాయి. విపరీతమైన ఉత్ప్రేక్షలు లేకుండా, ఆయన వ్యాసాలు చదవడానికి చాలా హాయిగా వుంటాయి. ఆయన వ్యాఖ్యలు, విమర్శపై పరామర్శలూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తప్పక చదవాల్సిన పుస్తకం. కన్యాశుల్కాన్ని ఉంచవలసిన స్థాయిలోనే వుంచి, నాటకాన్ని కించపరచకుండా తప్పులు, ఒప్పులూ చూపిస్తూ రాసిన వ్యాసాలు, ఇవి. మొత్తం పుస్తకం అనుబంధంలోపెట్టచ్చు! కానీ అది సాధ్యం కాదు. -వే.వే.రా)
— … కన్యాశుల్కాన్ని ఇన్నిన్ని వందలసార్లు ప్రదర్శించామని ఎందరెందరెన్నిలెక్కలు చెప్పినా, అవన్నీ పాక్షికప్రదర్శనలేననేది సుప్రసిద్ధమే –పేజీ 20
— నిజానికి ‘ కన్యాశుల్కం ‘ గురించి లోతుగానూ, నిష్ఠ గానూ అధ్యయనం చేసిన దాదాపు ప్రతివిమర్శకుడూ రెండో కన్యాశుల్కం నాటకంగా విఫలమైనట్లు గుర్తిస్తూనే ఉన్నారు. కాని, ఆ విషయం చెప్పటానికి, ఒప్పుకోటానికీ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. పేజీ - 21
— అప్పారావుగారు తననాటి అనేకనాటకాలూ, నాటకప్రదర్శనలూ, వాటి పరిమితులను, నాటకాల ప్రదర్శనయోగ్యతలనూ, గాఢంగానూ, నిశితంగానూ అధ్యయనం చేశారనటానికి ఆయన డైరీలు, లేఖలూ సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రదర్శనయోగ్యతారహితంగా, పఠనయోగ్యతాసహితంగా రెండు కన్యాశుల్కాలని రచించి ఉంటారనిపిస్తుంది. ఆయనకు ప్రదర్శనయోగ్యతనుగురించి తెలివిడి లేదనుకోవడంలో అర్థం లేదు. కాగా, ఆయన మొదటి కన్యాశుల్కాన్ని ప్రదర్శనకూ, రెండోకన్యాశుల్కాన్ని పఠనకూ ఉద్దేశించారనవచ్చు. పేజీ-22
— నిజానికి, కన్యాశుల్కం చాలాగొప్పరచన అని నిరూపించటానికే అప్పారావు గారు చెప్పినదాన్నికాదంటూ విమర్శకులు ఆయనతో ఘర్షణ పడుతున్నారు. ఆయన 1909 మే 7 వతేదీన ఆదిభట్ల నారాయణదాసుగారిని తమ నాటకంపై సమీక్ష రాయమని అభ్యర్థిస్తూ — ఆ సమీక్షకు భూమికను సూచిస్తున్నట్లుగా — ‘ ఇతివృత్త స్వీకరణలో, నిర్వహణలో, హాస్యరసపోషణములో, పాత్రోన్మీలనములో తెలుగు సాహిత్యములో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరవకండి. ‘ అంటూ ఒక ఉత్తరం రాసారు.
పేజీ- 28
(ఆదిభట్ల వారు సమీక్ష రాసారో లేదో తెలియదు. ఆయన ఆత్మకథ ‘ నా యెఱుక ‘ లో యెక్కడా కన్యాశుల్క నాటక ప్రసక్తి లేదు. ఉత్తరం ప్రసక్తి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే, దాసుగారి స్వీయచరిత్ర ఆయనకు 30 సంవత్సరాల వయసు వరకే చెప్పారు. ఈ ఉత్తరం 1909 లో రాయబడ్డది. అప్పటికి దాసుగారి వయస్సు 45. –వే.వే.రా)
(దాసుగారి స్వీయచరిత్రనుంచి ఈ క్రింది భాగం గమనార్హం. ఖరనామ సంవత్సరంలో కరువు వచ్చింది. అంటే 1891 లోనన్న మాట. అప్పుడు దాసుగారికి 27 సంవత్సరాలు. ఆయన విజయనగరం ఆస్థానం గురించి ఇల్లా రాశారు:
— దివాన్‌జీ సాహెబుగారి కాలమువరకు రాజ్యాభివృద్ధి కలిగెను. పిదప నిద్దరు మేనేజర్లు రాజ్యవ్యవహారము చూచుచుండిరి. అందులో పెద్ద మేనేజరు చాలాభాషలలో పండితుడు. పరదారధనవిముఖుడు. మాధ్వుడు. ……… రెండవ మేనేజరు (వెలనాటి) నియోగి బ్రాహ్మణుడు. మిక్కిలి తెలివితేటలుగల మంచి వ్యవహర్త. దాసుగారి స్వీయచరిత్రలో పేజీ - 157 (ఈ మేనేజర్లెవరో మనకి తెలిసే అవకాశం తక్కువే! — వే.వే.రా)
— కే.రా.కో పేజీ 21 లో ప్రస్తావించిన సమస్యా పరిష్కారం ఉటంకిస్తూ, సంపత్కుమారాచార్య గారు రాచమల్లు రామచంద్రారెడ్డిని కూడా ఉదహరించారు. ఆవాక్యాలు : గురజాడ మనస్తత్వంలో విపరీతధోరణి అన్నవ్యాసంలో రాచమల్లు రామచంద్రారెడ్డికూడా ఇంతకుముందే అభివ్యక్తి భేదంతో ఈ ప్రతిపాదన ( కే.రా.కో. చేసిన ప్రతిపాదన పైన ఇవ్వబడింది) వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన ఒక విధంగా వస్తునిర్వహణలోని లోపాలను కప్పిపుచ్చటానికి కొంత ఉపకరించవచ్చుకానీ, దీనివల్ల పీఠికలో అప్పారావుగారు చెప్పిన అంశాలు ఎందుకూ కొరగానివయ్యే ప్రమాదం వుంది. సమస్యను వెల్లడి చేసి ఆ విధమైన దురాచారాన్ని ఎండగట్టడం తమ రచనా లక్ష్యం అని అప్పారావు గారు అంటుంటే, అది కాదండీ మీలక్ష్యం. మేం చెప్పేదే మీ లక్ష్యం అని విమర్శకులు అప్పారావుగారిమీద వత్తిడి తీసుకొరావడం ఎంతవరకు ఉచితం? — పేజీ -44.
(రాచమల్లు రామచంద్రారెడ్డి గారి సారస్వత వివేచనలో, ఆయన సంవేదనలో జూలై 1969 లో అప్పారావుగారిమీద రాసిన వ్యాసం పునర్ముద్రించబడినది. ఆ వ్యాసభాగమే, కో.సం. గారు పైన ఉదహరించారు– ఈ క్రింద రా.రా. నుంచి కోట్ చేస్తున్నాను. — వే.వే.రా.)
గురజాడ మనస్తత్వంలో ఏదో వింతధోరణి ఉన్నట్లుంది. యేమిటది? వితంతు వివాహాలకు తాను అనుకూలుడై వుండి కూడా, ఆ సమస్యను అల్లరి పాలు చేసినాడు. వేశ్యా సంస్కరణకు (వేశ్యావృత్తి నిర్మూలనకు) తాను అనుకూలుడై వుండికూడా ఆ సమస్యను నవ్వులపాలు చేసినాడు యెందుకు? నాకు కనిపించే కారణం ఒక్కటే. తన సమకాలిక సమాజంలో సాగుతూ వుండిన ఆ సంస్కరణోద్యమాలపట్ల గురజాడకు తృప్తి లేదు, సానుభూతి లేదు. ….. ఆస్తి కలిసి వస్తుందనో, వితంతువివాహ సంఘం వాళ్ళు ఇచ్చే డబ్బుమీద ఆశ చేతనో, లేదా కొన్ని సందర్భాలలో విపరీతమైన కీర్తిదాహంవల్లనో వితంతువులను పెండ్లి చేసుకోడానికి ముందుకు వచ్చే వాళ్ళే యెక్కువమంది వుండివుంటారు. కన్యాశుల్కం మూడవ అంకం మూడవరంగంలోని గిరీశం స్వగతంలో ఈ మూడు కారణాలూ ప్రముఖంగా కనపడతాయి. — పేజీ 125, 126
(కమ్యూనిస్ట్ ప్రభావంలో పెరిగిన విమర్శకులంతా, కన్యాశుల్కంమీద ఎవరు కాస్త వ్యతిరేక విమర్శ రాసినా … వారి ప్రత్యేక పద సముదాయంతో ఊదర కొడతారు. ఈ పదాలు ….. భూస్వామ్య, బూర్జువా, శ్రామికవర్గ దృక్పధం, ప్రాపంచిక దృక్పధం, పితృస్వామ్య సంస్కృతి, శిథిల పితృస్వామ్య సంస్కృతి, పురుషాధిక్య వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ, పితృస్వామిక సంస్కృతీ చట్రం, చారిత్రక గమనం, సామాజిక నిబద్ధత, …. ఇల్లాంటివే మరికొన్ని వాడి సందర్భాసందర్భ వివేచన లేకండా విసురులు విసిరి తూలనాడడం పరిపాటి. ఈ ‘చట్రం’ లో కొంతమంది స్త్రీవాద విమర్శకులనికూడా కలపచ్చు — వే.వే.రా)
( నాటక ప్రదర్శన విషయంలో అబ్బూరి రామకృష్ణారావుగారి మాటలు భావాలు చెప్పకపోతే, ఈ నాటకానికి సార్థకతలేదనవచ్చు. అబ్బూరి సంస్మరణ నుంచి ఈ క్రింది మాటలు — వే.వే.రా)
… ఈ నాటకాన్ని వందసార్లకు పైగా తెలుగుదేశం నానాప్రాంతాల్లోనూ, భిన్నభిన్నాభిరుచులుగల సామాజికుల సమక్షంలోనూ నేను ప్రయోగించాను. కన్యాశుల్కం నాటక ప్రయోగయోగ్యత అన్నిచోట్లా ప్రశంసాపాత్రం కావటంతో ప్రస్ఫుటమయ్యింది. ….. స్థూలంగా చూస్తే ఈ నాటకంలో విడివిడిగా చూపించదగిన రెండు కథా భాగాలు మనకు గోచరిస్తాయి. ఈ రెండు భాగాలూ అన్యోన్యాశ్రయంతో వుండటం వల్ల దీర్ఘంగావున్న కొన్ని రంగాలను తగ్గించడమూ, వేర్వేరుగావున్న కొన్ని సన్నివేశాలను కలిపివేయడమూ చేస్తే గాని పరిణతమైన ప్రయోగ పద్ధతి సాధ్యం కాదు. ద్వితీయాంకంలో అగ్నిహోత్రవధానుల ఇల్లు, అక్కడ ” వొద్దు వొద్దంటూంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావ్” అనే భావంతో మొదలుపెట్టి, ఆరో అంకంలో “ఈ గాడిదకొడుకు ఇంగ్లీషు చదువు కొంపముంచింది” అనే మాటలతో నాటకం ముగించటం వొక పద్ధతి. నా ప్రయోగాలన్నిటిలో దీనినే అవలంబించాను. …… ఇలా కాకండా ప్రథమాంకం తోనే నాటకాన్ని ఆరంభించడం ఇంకో పద్ధతి. దీనిలో గిరీశం కపట నాటకం ప్రధాన వస్తువవుతుంది. యేదో మిషతో మధురవాణిని విడిచి పెట్టడం, ఇంకోమిషతో అగ్నిహోత్రావధాన్ల ఇంట్లో ప్రవేశిం చటమూ, బుచ్చమ్మను వంచించి లేవదీసుకొపోవడమూ, లుబ్ధావధాన్ల ఆస్తి అపహరింటానికి ప్రయత్నించటమూ, చిట్టచివరకి సౌజన్యారావు ఇంట్లో మధురవాణి సమక్షం లో పరాభూతుడైనా పశ్చాత్తాపం పొందక ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అనడం తో ఈ కథ ముగుస్తుంది. పేజీ- 213, 214 (ఈ వ్యాసం వీశ్వవీణ లో డిసెంబర్ 1959 లోప్రచురించబడింది — వే.వే.రా)
[మార్చు] అనువాదాలు
కన్యాశుల్కం
కన్నడం -1930 - కె. కృష్ణయ్యం ఫ్రెంచి - 1960-61 - హెన్రీ ఆల్బెర్ట్ (ఆల్ బేర్) రష్యన్ - 1962 - పెర్తుని చేవా (అగ్రానిన్) ఇంగ్లీషు (2 సార్లు) - 1964 -ఎస్.ఎన్. జయంతి - 1976 - ఎస్.జి.మూర్తి, కె. రమేష్ (సంక్షిప్త ప్రతి) తమిళం - 1964 - ముదునూరు జగన్నాధ రాజు హిందీ (2 సార్లు) - 1987 - ఎమ్.బి.వి.ఐ.ఆర్. శర్మ - 1997 - డా| భీం సేన్ నిర్మర్ (అబ్బూరి చేసిన సంస్కరణ ప్రతి) భాషల్లోకి అనువాదమైంది.
[మార్చు] కన్యాశుల్కం కర్తృత్వం పై వివాదం
1955 మార్చి 13 న (అప్పారావు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఆ వ్యాసంలో కుమరస్వామి ఇలా రాసాడు:
"గురజాడ అప్పారావు గారు ఆంగ్లములో బహు నిష్ణాతులు. ఆయన ఎన్నో రచనలను ఆంగ్లంలోనే చేసారు. కన్యాశుల్కాన్ని కూడా ఆంగ్లంలోనే రచించారు. కాని తెనిగించినది అప్పా రావు గారు కాదు, గోమఠం శ్రీనివాసాచార్యులు గారు. గోమఠం శ్రీనివాసాచార్యులు గారిది విజయనగరమే అని, ఈ సంగతి గురజాడ అప్పారావు గారి మిత్రులైన వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారి ద్వారా తెలియ వస్తున్నది..."
"..లోకం అంతా గురజాడ అప్పారావు గారే కన్యాశుల్కం తెలుగులో రాసారు అని అనుకుంటున్నారు. శ్రీనివాసాచార్య్లు గారు తెనిగించడం నిజమా? అభూతకల్పనా??" ఇలా సాగింది ఆ వ్యాసం. ఈ వ్యాసంపై ఉవ్వెత్తున విమర్శలు రేగి ఒక నెలాపదిహేను రోజులపాటు ఆంధ్ర పత్రికలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఎందరో ఉద్దండులు చర్చలో పాల్గొనారు. జయంతి కుమారస్వామి వివాదం లేవదీస్తే, నిడుదవోలు వెంకట రావు ఆ వాదనను సమర్ధిస్తూ రాసాడు.
ఆరుద్ర, రామదాసు (అప్పారావు కుమారుడు), గిడుగు సీతాపతి, భమిడిపాటి కామేశ్వరరావు, వంగోలు మునిసుబ్రహ్మణ్యం, ఎ.వి.జగన్నాధరావు మొదలైన వారెందరో ఆ వాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర పత్రికలో వ్యాసాలు రాసారు.
ఈలోగా యామిజాల పద్మనాభస్వామి వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రిని ఇంటర్వ్యూ చేసాడు. ఆ ఇంటర్వ్యూలో శాస్త్రి "గురజాడ కన్యా శుల్కాన్ని ఇంగ్లీషులో రాసారు. దానిని తెలుగులో రాసింది మాత్రం గోమఠం శ్రీనివాసాచార్యులు గారు." అని చెప్పారని స్వామి ఆంధ్రపత్రికలో రాసాడు. దీనిపై మరిన్ని విమర్శలు చెలరేగాయి.
చివరికి ఆంధ్ర పత్రిక సాహిత్య విలేకరి వావిళ్ళను ఇంటర్వ్యూ చేసి ఇలా రాసాడు. వావిళ్ళ వారు "కన్యాశుల్కం తెలుగు లో రసింది గురజాడే. దానిని ప్రదర్శన యోగ్యం చెయ్యడానికి గోమఠం వారూ, వేదం వెంకటాచలయ్య గారు అక్కడక్కడా మెరుగులు పెట్టారు" అని చెప్పారు.
మరి 'స్వామి గారికి అలా ఎందుకు చెప్పార'ని అడగ్గా వావిళ్ళ ఇలా అన్నాడు: "ఏదో అడిగినాడు. ఏదో చెప్పినాను. మీరు పాటించకండి". ఈ విధంగా ఆ వివాదం సద్దుమణిగింది. ఇంత వివాదానికీ మూలకారణం ఐన వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి తనకు తానుగా ఒక్క ప్రకటన కూడా చెయ్యక పోవడం విశేషం.
అప్పట్లో ఆంధ్ర పత్రికలో వచ్చిన ఈ వ్యాస పరంపరను ఆచార్య మొదలి నాగభూషణశర్మ, డాక్టరు ఏటుకూరి ప్రసాదుల సంపాదకత్వంలో విశాలాంధ్ర పబ్లిషింగు హౌసు వారు ఒక పుస్తకంగా ముద్రించారు. 970 పేజీల బృహద్గ్రంధంలో పై వివాదం తో పాటుగా, కన్యాశుల్కం గురించిన ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలు, పరిశోధనలు, పాత్రల పరిశీలనలు ఉన్నాయి. కన్యాశుల్కం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక గొప్ప వనరు.
[మార్చు] ఇవికూడా చూడండి
- కన్యాశుల్కం, ఒక సాంఘిక దురాచారం.
- కన్యాశుల్కం 1955 లో వచ్చిన చలనచిత్రం
[మార్చు] బయటి లంకెలు
- "కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి"
- కన్యాశుల్కం ఇంగ్లీషు అనువాదం పై సమీక్ష
- కన్యాశుల్కం ఇంగ్లీషు అనువాదం పై మరొక సమీక్ష
- కన్యాశుల్కం నాటకంపై ప్రముఖుల ఉల్లేఖనలు
- A Play from Colonial India, Gurajada Apparao, Translated from Telugu By Velcheru Narayana Rao
