రేబీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రేబీస్ (రభసవ్యాధి)[మార్చు]

రేబీస్

రేబీస్ ను రభసవ్యాధి, జలభయవ్యాధి (హైడ్రోఫోబియా) అని కూడ అంటారు. ఈ వ్యాధి ప్రాణాంతకవ్యాధి. ఇది కుక్కలు,నక్కలు,తోడేళ్ళు,స్కంకులు,రాకూన్లు,పిల్లులు, గబ్బిలాల వంటి క్షీరదాలలో జబ్బుపడిన జంతువు నుండి యితర జంతువులకు,లేక మనుజులకు కరవడం, లేక రక్కడం వలన లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది[1]. రేబీస్ పేరు లాటిన్ భాషలో rebere (ఉద్వేగం,కోపం), సంస్కృత భాషలో రభస (रभस) పదాలతో సంబంధము కలిగి పుట్టింది[2]. ప్రపంచంలో కుక్కకాట్ల వలన ఎక్కువగా (99% శాతం) రేబీస్ మనుష్యులకు సంక్రమిస్తుంది. వ్యాధి పొడచూపక ముందు టీకాలతో నివారించ గలిగిన వ్యాధి రేబీస్. వ్యాధి లక్షణాలు కనిపించాక ఇది కొద్ది దినాల్లో మరణానికి దారితీస్తుంది. కుక్కలకు టీకా లివ్వడం వలన రభసవ్యాధిని నిర్మూలించగలుగుతాము[3]. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు

కారణం[మార్చు]

రేబీస్ (రభసవ్యాధి) లిస్సా సమూహంకు చెందిన రేబ్డోవైరిడే కుటుంబానికి చెందిన కణుపులు లేని ఒంటి పోగు ఆర్. ఏన్.ఎ విషజీవాంశాల ( RNA viruses ) వలన కలుగుతుంది.

రేబీస్ వైరస్

ఈ విషజీవాంశాలు తుపాకి గుండు ఆకారంలో ఉండి 180 నానో మీటర్ల పొడవు, 75 నానో మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.

ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులో రేబీస్ వైరస్

ఈ విషజీవాంశాలు (వైరసస్) వ్యాధి గల జంతువుల లాలాజలం నుంచి కాట్ల గుండా కాని, కన్ను, ముక్కు, నోరు శ్లేష్మపుపొరల ద్వారా గాని శరీరంలోనికి చొరబడి మెదడుకు చేరితే రభసవ్యాధి కలుగుతుంది. మానవులలో రేబీస్ చాలా వరకు కుక్క కరవటం వలన సంభవిస్తుంది. టీకాలు వేయని కుక్కలు తిరిగే దేశాలలో 99% కంటే ఎక్కువ రేబీస్ కేసులు కుక్క కరవటం వలన సంభవిస్తాయి. పెంపుడు జంతువులకు టీకాలు వేయుట వలన, కుక్కల నియంత్రణ వలన అమెరికా ప్రజలలో కుక్కకాట్ల వలన రేబీస్ సోకుట అరికట్టబడింది. వీరిలో అరుదుగా గబ్బిలం కరవటం వలన రేబీస్ వ్యాధులు కలుగుతుంటాయి. 5% కంటే తక్కువ కేసులు మాత్రమే కుక్కల ద్వారా సంభవిస్తాయి. చిట్టెలుకలకు చాలా అరుదుగా రేబీస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

వ్యాధి లక్షణాలు[మార్చు]

రేబీస్ వలన మెదడువాపు (ఎన్సెఫలైటిస్) కలుగుతుంది. ఇది మానవులకు, యితర క్షీరదాలకు సోకగలదు[1] గురైన ప్రాంతం వద్ద ప్రారంభ లక్షణాలుగా తిమ్మిరి ఆపై జ్వరం, వాంతిభావన, వాంతులు ,జలదరింపు కలుగవచ్చు[3]. ఈ క్రింది లక్షణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన తరువాత ఈ లక్షణాలు కనిపిస్తాయి: కుదుపు వంటి కదలికలు, ఉద్రిక్తత , మింగుటలో ఇబ్బంది, జలభయం, శరీర భాగాలను కదలించలేకపోవుట, గందరగోళం, అపస్మారక లక్షణాలు కనిపించిన తరువాత, దాదాపు రేబీస్ ఎల్లప్పుడూ మరణానికి దారితీస్తుంది.[3] ఉగ్ర తరగతికి చెందిన రేబీస్ వ్యాధిగ్రస్థులలో జలభయం ఒక ముఖ్య లక్షణం. వీరు నీటిని, ఇతర పదార్థాలను మింగడానికి ప్రయత్నించేటపుడు మింగు కండరాలు సరిగా పనిచేయక వాటిలో పదే పదే నొప్పితో కూడిన దుస్సంకోచాలు కలుగుతాయి. స్వరపేటిక కండరాలలోను, మెడలో ఉండు ఉరఃకర్ణ మూలిక స్నాయువు ( ష్టెర్నో మాష్టాయిడ్ కండరము ) వంటి అదనపు శ్వాసకండరాలలోను, ఉదరవితాన కండరాలలోను కూడా ఈ దుస్సంకోచాలు కలుగుతాయి. ఈ దుస్సంకోచాలతో బాధ ఉండుట వలన రేబీస్ వ్యాధిగ్రస్థులు నీటిని ద్రవపదార్థాలను చూసినపుడు భయానికి, ఆందోళనకు గురి అవుతారు. రేబీస్ ‘ జలభయ వ్యాధి’గా ( హైడ్రోఫోబియా ) ప్రసిద్ధి కెక్కింది. వ్యాధి లక్షణాలు పొడచూపిన తర్వాత 2 నుండి 10 దినాలలో మరణం కలుగుతుంది. వ్యాధి సోకటం, లక్షణాల ప్రారంభం కావటానికి మధ్య కాలం సాధారణంగా రెండు నుండి మూడు నెలల ఉంటుంది. అయితే, ఈ సమయ వ్యవధి ఒక వారం కంటే తక్కువ, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వరకు ఉండవచ్చు[3]. వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థ కు చేరుకోవడానికి ప్రయాణించే దూరంపై ఈ సమయ వ్యవధి ఆధారపడి ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి[4]..

నివారణ, చికిత్స[మార్చు]

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కుక్కల ద్వారా వచ్చే రేబీస్ ప్రమాదాన్ని జంతు నియంత్రణ, టీకా కార్యక్రమం తగ్గించింది[3]. రేబీస్ అరుదుగా ఉన్న దేశాలలో గబ్బిలాలతో పని చేసే లేదా ఎక్కువ కాలం గడిపే వ్యక్తులకు రేబీస్ కలిగే అవకాశం ఎక్కువ[3]. రేబీస్‍ గల జంతువుల కాట్లకు గురైన వ్యక్తులు, రేబీస్ లక్షణాలు ప్రారంభం కావడానికి ముందే, వ్యాధి నివారణకు రేబీస్ టీకాను, రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ చికిత్సను పొందాలి.[3] గాట్లు, గీతలను సబ్బు, నీటితో 15 నిమిషాలు కడగటం వల్ల పోవిడన్ అయోడిన్ , లేదా సబ్బు వైరస్‍ను చంపవచ్చు, రేబీస్ వ్యాప్తిని నిరోధించడంలో అవి కొంతవరకు ప్రభావంతంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది.[3] లక్షణాలు కనబడిన తర్వాత చాలా చాలా కొద్ది మంది మాత్రమే రేబీస్ వ్యాధి నుండి ప్రాణాలతో బయటపడగలిగారు.మిల్వాకీ ప్రోటోకాల్ అని పిలువబడే విస్తృతమైన చికిత్సలో[5] రోగిని మత్తులో ఉంచి వైరస్ కు ప్రతికూలంగా పనిచేసే మందులు వాడుతారు. కాని సత్ఫలితాలు చాలా చాలా అరుదు.

రోగ నిర్ణయం[మార్చు]

సాధారణంగా కుక్కకాట్ల చరిత్రతోను, వ్యాధి లక్షణాలబట్టే రేబీస్ ని నిర్ణయిస్తారు. మనుజులలో రభస వ్యాధిని మరణానికి ముందు నిర్ణయించడానికి పరీక్షలు లభ్యం. లాలజలం నుంచి విషజీవాంశాలను (వైరస్ లు) వేర్పాటు చేయవచ్చు. RT-PCR పరీక్షతో (Reverse Transcription followed by Polymerase Chain Reaction[6]) వైరస్ గుర్తించే అవకాశం ఉంది. రక్తం, వెన్నుద్రవాలలో రభస విషజీవాంశాలకు ప్రతిరక్షకాలను (ఏంటిబాడీస్) గుర్తించవచ్చు. చర్మకణపరీక్షలతో కేశకూపాల క్రింద చర్మనాడులలో రేబీస్ విషజీవాంశ ప్రతిజనకాలను (ఏంటిజెన్స్) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షతో (డైరెక్ట్ ఫ్లోరెసెంట్ ఏంటిబాడీ టెస్ట్ [7]తో) గుర్తించే అవకాశం ఉంది.

కఱచిన జంతువులు వన్యమృగాలయి అవి పట్టుబడినప్పుడు, లేక కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులయి అవి వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నపుడు వాటిని బాధ లేకుండా మానవతా దృష్టితో చంపి వాటి మెదడును ( ముఖ్యంగా చిన్నమెదడు, మస్తిష్క మూలాలను ) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షలతో (డైరెక్ట్ ఫ్లోరెసెంట్ ఏంటిబాడీ టెస్ట్) విషజీవాంశాలకై పరిశోధించాలి[8]. మస్తిష్క కణపరీక్షలలో నెగ్రీబాడీస్ కనిపించినా వ్యాధిని నిరూపించవచ్చు[9].

జంతువులు కఱచినపుడు, ఱక్కినపుడు[మార్చు]

జంతువులు కఱచినపుడు, లేక ఱక్కినపుడు, వాటి లాలాజలం ఱక్కులపైన, గాయాలపైన చేరినపుడు ఆ జంతువులు వన్యమృగములైతే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభస వ్యాధి పరీక్షలకు పంపాలి. మెదడులు రభసవ్యాధిని సూచిస్తే టీకాల చికిత్స అవసరము. ఆ జంతువులు దొఱకక పారిపోయినా టీకాల చికిత్సలు అవసరం.

ఆ జంతువులు ఊరకుక్కలు, పిల్లులు అయినా, పెంపుడు జంతువులు అయినా వాటిని పది రోజులు నిర్బంధించి వాటిలో రోగ లక్షణాలు కనిపిస్తే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభసవ్యాధి పరిశోధనలకు పంపాలి. రభసవ్యాధి నిరూపితమయితే టీకా చికిత్సలు అవసరం. పది దినాల తరువాత కూడా అవి ఆరోగ్యంగా ఉంటే రభస వ్యాధి టీకాల అవసరం లేదు. వీధి జంతువులు దొఱకక పారిపోతే టీకాలు అవసరం.

రభసవ్యాధి కలిగే అవకాశాలు ఉంటే[మార్చు]

రభస వ్యాధి సంక్రమించు అవకాశాల బారి పడినవారికి వ్యాధి నివారణ చికిత్స అవసరం. వీరికి  మనుజుల రభస వ్యాధి ప్రతిరక్షకాలను ( Human Rabies Immune Globulin - HRIG ) 20 units / Kg శరీర బరువు మోతాదును వీలయినంత కఱచిన గాయములోనికి , గాయం చుట్టూ ఇచ్చి మిగిలినది కండరంలో సూదిమందుగా వెంటనే ఇయ్యాలి. దీని వలన వెంటనే అచేతన రక్షణ (పేసివ్ ఇమ్యూనిటీ) కలుగుతుంది. HRIG ని కాటుకు 7 దినముల తర్వాత ఈయకూడదు.

రభస వ్యాధి టీకా 1 మి.లీ ను 0, 3, 7, 14 దినములలో మొత్తము నాలుగు మోతాదులు భుజ కండరాలలో సూదిమందుగా ఇయ్యాలి[10]. రక్షణ వ్యవస్థ లోపాలు ఉన్నవారిలో ఐదవ మోతాదు కూడా  28 వ రోజు ఇయ్యాలి. టీకాల వలన చైతన్య రక్షణ (శరీర రక్షణ వ్యవస్థ చేకూర్చు స్వీయరక్షణ ) చేకూరుతుంది.

అదివరకు టీకాలు తీసుకుంటే[మార్చు]

అది వఱకు టీకాలు తీసుకొని రక్షణ పొందిన వారు రభస వ్యాధి కలిగే అవకాశాలకు గుఱి అయినపుడు రెండు మోతాదుల టీకాను 0, 3 దినములలో తీసుకుంటే సరి పోతుంది[11][12]. వీరికి రభసవ్యాధి ప్రతిరక్షకాలు (HRIG) అవసరం లేదు, ఇవ్వకూడదు.

వృత్తిరీత్యా అవకాశాలుంటే[మార్చు]

పశువుల వైద్యులు, జంతువులతోను, వన్యమృగములతో పనిచేసేవారు, రభసవ్యాధి పరిశోధకులు, రభసవ్యాధి కలిగే అవకాశములకు ముందుగానే 0, 7 రోజులలో రభస వ్యాధి టీకాలు రెండు మోతాదులలో తీసుకోవాలి. ఆపై ప్రతి 6 నెలల నుంచి 3 సంవత్సరాలు వృత్తి బట్టి రక్తములో ప్రతిరక్షకాల ప్రమాణాలు పరీక్షించి తక్కువైతే టీకా మళ్ళీ తీసుకోవాలి[13].

రభసవ్యాధి లక్షణాలుంటే[మార్చు]

రభస వ్యాధి లక్షణములు కలవారు అందఱూ సర్వసాధారణముగా మరణం పాలవుతారు. వారికి ఆలంబన చికిత్సలు, ఉపశమన చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. అందువలన రభసవ్యాధిని నివారించు చర్యలు తప్పక తీసుకోవాలి.

టీకా[మార్చు]

రేబీస్ టీకా
Vaccine description
Target disease రేబీస్
Type Killed/Inactivated
Clinical data
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a607023
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి ?
Identifiers
ATC code J07BG01
ChemSpider none ☒N
 ☒N (what is this?)  (verify)

రేబీస్ టీకా అనేది ఒక టీకా, ేబీస్‌‌‍ను నివారించటానికి దీన్ని ఉపయోగిస్తారు.[14] సురక్షితమైన, సమర్థవంతమైనవి చాలా అందుబాటులో ఉన్నాయి.రేబీస్ గల జంతువు కరచిన తరువాత వ్యాధి కలుగుటకు ముందు, రేబీస్‍ను నిరోధించడానికి వీటిని ఉపయోగించవచ్చు. మూడు మోతాదుల తరువాత వృద్ధి చెందే రోగనిరోధకశక్తి ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణంగా చర్మం లేదా కండరాలలోకి ఇంజెక్షన్ ద్వారా వీటిని ఇస్తారు. వ్యాధికి గురయ్యాక ఇచ్చే టీకాను సాధారణంగా రేబీస్ ఇమ్యునోగ్లోబిన్‍తో కలిపి ఉపయోగిస్తారు. వ్యాధికి గురయ్యే ప్రమాదవకాశం ఉన్నవారు దానికి గురవటానికి ముందే టీకా‍ను వేయించుకోవాలని సిఫార్సు చేయబడింది. టీకాలు మానవులలో, ఇతర జంతువులలో సమర్థవంతంగా ఉన్నాయి. వ్యాధి నిరోధీకరణను పొందే కుక్కలు మానవులలో వ్యాధిని నివారించటంలో ఇవి చాలా సమర్థవంతంగా ఉన్నాయి.[14]

భద్రత[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు టీకాను వేయించుకున్నారు, సంవత్సరానికి 250,000 కంటే ఎక్కువ మంది ప్రజలను ఇది కాపాడుతుందని అంచనా వేయబడింది.[14] అన్ని వయసుల వారికి దీన్ని సురక్షితంగా వాడవచ్చు. సుమారు 35 నుండి 45 శాతం ప్రజలలో ఇంజక్షన్ ఇచ్చిన ప్రాంతం వద్ద కొంత సమయం పాటు ఎర్రబడటం, నొప్పి కలిగింది. సుమారు 5 నుండి 15 శాతం ప్రజలకు జ్వరం, తలనొప్పి లేదా వికారం కలుగవచ్చు. రేబీస్‍కు గురయ్యాక దీన్ని వాడటంలో ఎటువంటి నిషేధం లేదు. ఎక్కువ టీకాలు తిమిరొసాల్‌ను కలిగిలేవు. నాడి కణజాలం నుంచి తయారు చేసే టీకాలు ప్రధానంగా కొన్ని దేశాలలో ఆసియా, లాటిన్ అమెరికాలో ఉపయోగించబడుతున్నాయి కానీ ఇవి తక్కువ ప్రభావవంతంగా ఉండి, ఎక్కువ దుష్ప్రభావాలను కలిగియున్నాయి. అందువల్ల వీటి వాడకం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సిఫార్సు చేయబడలేదు.[14]

2014 నాటికి చికిత్స కోర్సు 44 నుండి 78 యుఎస్‍డి టోకుధరగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‍లో రేబీస్ టీకా కోర్సు 750 యుఎస్‍డి కంటే ఎక్కువగా ఉంది.[15]

ఎపిడిమియాలజీ (సాంక్రమిక రోగ విజ్ఞానం)[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 26,000 నుండి 55,000 మరణాలకు రేబీస్ కారణమవుతోంది.[3][16] 95% కంటే ఎక్కువ మరణాలు ఆసియా , ఆఫ్రికాలో సంభవిస్తాయి.[3] రేబీస్ 150 కంటే ఎక్కువ దేశాలలో, అన్ని ఖండాలలో ఉంది కానీ అంటార్కిటికాలో లేదు.[3] ప్రపంచంలో రేబీస్ సంభవించే అనేక ప్రాంతాలలో 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.[3] యూరప్, ఆస్ట్రేలియాలోని అత్యధిక ప్రాంతాలలో, రేబీస్ గబ్బిలాలలో మాత్రమే ఉంది.[17] అనేక చిన్న ఐలాండ్స్‍లో రేబీస్ లేదు.[18] భారతదేశంలో ఏటా సుమారు 20,000 మంది రభసవ్యాధి వలన మరణిస్తుంటారు[19].

ప్రపంచంలో ప్రతి మిలియను జనాభాలో రేబీస్ మరణాలు

పెంపుడు జంతువుల రక్షణ[మార్చు]

పెంపుడు జంతువులకు రభస వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తే మనుష్యులకు కూడా రక్షణ చేకూరుతుంది. పెంపుడు కుక్కలకు, పిల్లులకు రభస వ్యాధి టీకాలు వేయించుట తప్పనిసరి చెయ్యాలి. పెంపుడు జంతువులను వన్యమృగాల బారి నుంచి, ఇతర జంతువుల బారి నుంచి కాపాడుకోవాలి. పెంపుడు జంతువులను విచ్చలవిడిగా అదుపులో లేకుండా బయట తిరగనీయకూడదు. వాటిని మనుష్యులను ఇతర జంతువులను కఱవనీయకుండా యజమానులు వారి ఇళ్ళ లేక పొలాల ప్రాంగణాలలో అదుపులోఉంచుకోవాలి. పెంపుడు

ప్రపంచంలో రేబీస్ లేని దేశాలు

జంతువుల వృషణాలు , అండాలు తొలగించో వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించో వాటి సంఖ్య వృద్ధిపొందకుండా చూసుకోవాలి[20].

వీధుల్లో జంతువులు[మార్చు]

యజమానులు లేని వీధి కుక్కలను, పిల్లులను బాధ్యత తీసుకొని పోషించుటకు, వాటికి రభసవ్యాధి (రేబీస్) టీకాలను వేయిస్తూ తమ అదుపులో ఉంచుకొనుటకు ఎవరూ దొఱకనప్పుడు వాటిని వీధులనుండి  తొలగించి జంతుశాలలలోనో, జంతు పరిరక్షణశాలల్లనో ఆశ్రయం కల్పించడం, వాటికి రభసవ్యాధి టీకాలు వేయించి పోషణ చేకూర్చడం, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం అందఱికీ ఆమోదకరం కావాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రజాహిత సంస్థలు జీవకారుణ్యసంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలి[19]. కుక్కల సగటు జీవనప్రమాణం 11 సంవత్సరాలు కాబట్టి పై సూచనలను అమలుపరుస్తే ఒక దశాబ్దంలో వీధి కుక్కల సంఖ్య బాగా తగ్గిపోవాలి. చాలా దేశాలలో వన్యమృగాలకు కూడా ఆహారం ద్వారా నీరసింపజేసిన రభసవ్యాధి (ఎటెన్యుయేటెడ్ వైరస్) విషజీవాంశాలను టీకాలుగా ఇచ్చి వాటికి చైతన్యరక్షణ (ఏక్టివ్ ఇమ్యూనిటీ) సమకూర్చుతున్నారు.

ప్రస్తావనలు[మార్చు]

  1. 1.0 1.1 "Animals and Rabies | Rabies | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-05. Retrieved 2024-02-27.
  2. Dalfardi2, Behnam2 (2-17-2014). "National Library of Medicine". Retrieved 3-1-2024. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)CS1 maint: numeric names: authors list (link)
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 "Rabies Fact Sheet N°99". World Health Organization. July 2013. Retrieved 28 February 2014.
  4. Cotran RS; Kumar V; Fausto N (2005). Robbins and Cotran Pathologic Basis of Disease (7th ed.). Elsevier/Saunders. p. 1375. ISBN 0-7216-0187-1.
  5. Hemachudha T; Ugolini G; Wacharapluesadee S; Sungkarat W; Shuangshoti S; Laothamatas J (May 2013). "Human rabies: neuropathogenesis, diagnosis, and management". Lancet neurology. 12 (5): 498–513. doi:10.1016/s1474-4422(13)70038-3. PMID 23602163.
  6. "CDC - Diagnosis: Amplification Methods - Rabies". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-22. Retrieved 2024-03-01.
  7. "CDC - Diagnosis: Direct Fluorescent Antibody Test - Rabies". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-11. Retrieved 2024-03-01.
  8. "CDC - Diagnosis: In Animals and Humans - Rabies". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-22. Retrieved 2024-03-01.
  9. "CDC - Diagnosis: Histologic Examination - Rabies". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-22. Retrieved 2024-03-01.
  10. "Rabies Postexposure Prophylaxis (PEP) | Medical Care | Rabies | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-04. Retrieved 2024-03-01.
  11. "Pre-exposure Prophylaxis (PrEP) | Prevention | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-05. Retrieved 2024-03-01.
  12. "CDC - Medical Care: Rabies Vaccine - Rabies". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-22. Retrieved 2024-03-01.
  13. "Pre-exposure Prophylaxis (PrEP) | Prevention | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-05. Retrieved 2024-03-01.
  14. 14.0 14.1 14.2 14.3 "Rabies vaccines: WHO position paper" (PDF). Weekly epidemiological record. 32 (85): 309–320. Aug 6, 2010.
  15. Shlim, David (June 30, 2015). "Perspectives: Intradermal Rabies Preexposure Immunization". Retrieved 6 December 2015.
  16. Lozano R; Naghavi M; Foreman K; Lim S; Shibuya K; Aboyans V; Abraham J; Adair T; Aggarwal R; et al. (Dec 15, 2012). "Global and regional mortality from 235 causes of death for 20 age groups in 1990 and 2010: a systematic analysis for the Global Burden of Disease Study 2010". Lancet. 380 (9859): 2095–128. doi:10.1016/S0140-6736(12)61728-0. PMID 23245604.
  17. "Presence / absence of rabies in 2007". World Health Organization. 2007. Retrieved 1 March 2014.
  18. "Rabies-Free Countries and Political Units". CDC. Archived from the original on 5 మార్చి 2014. Retrieved 1 March 2014.
  19. 19.0 19.1 Carvalho, Stanley. "How to tackle stray dog menace". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-03-01.
  20. "How can you prevent rabies in people? | Prevention | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-11. Retrieved 2024-03-01.
"https://te.wikipedia.org/w/index.php?title=రేబీస్&oldid=4156814" నుండి వెలికితీశారు