లావు బాలగంగాధరరావు
ఎల్‌బిజి గా ప్రసిద్ధి చెందిన లావు బాలగంగాధరరావు (ఆగస్టు 3, 1921 - మార్చి 28, 2003) భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ యొక్క అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగాను, పాలిట్‌బ్యూరో సభ్యునిగానూ, కేంద్రకమిటీ సభ్యునిగాను అనేక పర్యాయాలు పనిచేశాడు.[1] ఈయన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కాప్ర గ్రామంలో 1921, ఆగస్టు 3 న సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహక ట్రస్టీగా పనిచేసిన బాలగంగాధరరావు, 2000 సంవత్సరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని గ్రంథాలన్నీ వరద నీటిలో మునిగిపోగా, హుటాహుటిన పునరుద్ధరణ, పరిరక్షణా పనులకు, రెండు కోట్ల రూపాయలు ప్రోగు చేసి, రెండేళ్ళలోనే గ్రంథాలయాన్ని యాధాస్థితి తెచ్చేందుకు విశేష కృషి సలిపాడు.[2]
బాల్యం
[మార్చు]బాలగంగాధరరావు ప్రాథమిక విద్య స్వగ్రామమైన క్రాప లోనే సాగింది. తరుమెళ్లలో ఉన్నతపాఠశాల, గుంటూరు ఎసి కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీను చదివాడు. విద్యార్థి దశ నుంచే ఈయన రాజకీయాల పట్ల ఎక్కువ మక్కువ చూపారు. చదువుతుండగానే 1937లో కొత్తపట్నం రాజకీయపాఠశాలకు హాజరయ్యారు. ఆతరువాత ఏడాదికే కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందారు. విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఎల్‌బిజి ఇంటర్లో చేరేసరికే మాకినేని బసవపున్నయ్య అదే కళాశాలలో బిఎ చదువుతున్నారు. తన చెల్లెలు జగదాంబతో మాకినేని బసవపున్నయ్య వివాహం 1938 మే 5న ఎల్‌బిజినే స్వయంగా జరిపించాడు. బిఏ చివరి సంవత్సరం వచ్చేసరికి ఆయనపై అరెస్టు వారెంటు జారీ అయింది. దాంతో ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసివచ్చింది.[3]
ఉద్యమాల బాటలో
[మార్చు]1939 నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బాలగంగాధరరావు ఎమర్జెన్సీ సయయంలో అరెస్టయ్యి కొంతకాలం జైల్లో గడిపాడు. ఆయన మొత్తం జీవితంలో 11 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో జీవించాడు.[4] బాలగంగాధరరావు 1980 ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుండి లోక్ సభకు కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు అభ్యర్థిగా పోటీచేసి, తన ప్రత్యర్థి మేడూరి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.[5][6]
మరణం
[మార్చు]కమ్యూనిస్టు కురువృద్ధుడు లావు బాలగంగాధర రావు 80 ఏళ్ల వయసులో అస్వస్థతతో, హైదరాబాద్ లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో చికిత్స పొందుతూ 2003, మార్చి 28 న మరణించాడు. ఈయన అంత్యక్రియలు విజయవాడలో జరిగాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-24. Retrieved 2010-06-24.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-05. Retrieved 2010-06-24.
- ↑ ఉద్యమాల ఒరవడి ఎల్‌బిజి[permanent dead link] - ప్రజాశక్తి - ప్రతినిధి స్ఫూర్తి మార్చి 28, 2010
- ↑ Post-independence India: Indian National Congress, Volumes 33-50 By Om Prakash Ralhan[permanent dead link]
- ↑ http://www.rediff.com/news/1998/feb/13tenali.htm
- ↑ http://www.mangalagiri.net/gov/mp.html
- ↑ కమ్యూనిస్టు నేత లావు కన్నుమూత[permanent dead link] - దట్స్ తెలుగు.కామ్ 2003, మార్చి 28
)