వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 17వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఐఐటీలు భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులనూ మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు ఖరగ్‌పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ లో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం బీహార్,ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఐఐటీలు స్థాపిస్తే మొత్తం సంఖ్య 10కి చేరుకుంటుంది. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి సిలబస్ అవే రూపొందించుకుంటాయి.

ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, మరి కొందరు ముఖ్యమైన విద్యా సాంకేతిక నిపుణులు, ప్రభుత్వాధికారులు ఉంటారు. ఐఐటీ కౌన్సిల్ క్రింద ప్రతి ఐఐటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీరి క్రింద సంస్థ యొక్క డైరెక్టర్ ఉంటాడు. అన్ని ఐఐటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE) ద్వారా బ్యాచిలర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ప్రతియేటా సుమారు 3,50,000 మంది పరీక్షకు హాజరయితే అందులోంచి కేవలం 5,000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. అన్ని ఐఐటీలలో కలిపి సుమారు 15 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12 వేలమంది పోస్టు గ్రాడ్యుయేట్లు, మరియు పరిశోధనా విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. అన్ని ఐఐటీలు విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, పరిశోధనా విద్యార్థులకూ క్యాంపస్ లోపలే వసతి సౌకర్యాలు కల్పించబడతాయి.

ఐఐటీలపై ప్రధాన విమర్శ మేధో వలస. ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు.. ...పూర్తి వ్యాసం: పాతవి