హార్సిలీ హిల్స్
హార్సిలీ కొండలు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం | |
Coordinates: 13°39′00″N 78°23′46″E / 13.650°N 78.396°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
Elevation | 1,290 మీ (4,230 అ.) |
భాష | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
హార్సిలీ హిల్స్ (హర్సిలీ కొండ, ఏనుగుల మల్లమ్మ కొండ) ఆంధ్ర ప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి, పర్యాటక ప్రదేశం. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినపుడు, అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించినందున, ఈ ప్రాంతం ఏనుగుల మల్లమ్మ కొండగా పేరుబడిందినే చరిత్ర వుంది. బ్రిటిష్ కాలంలో మదనపల్లె కలెక్టర్ గా పనిచేసిన డబ్ల్యు.డి.హార్సిలీ అనే అధికారి 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించినందున ఆయన పేరుతో పిలుస్తున్నారు. చుట్టుపక్కల పొడిగా, వేడిగా వుండే వాతావరణం కంటె, ఇక్కడ చల్లటి వాతావరణం వలన ఆంధ్రా ఊటీ అని పేరుతో పాటు పర్యాటక ప్రదేశమయ్యింది.[1][2]
చరిత్ర
[మార్చు]హార్సిలీ హిల్స్‌కు పూర్వనామం ఏనుగు మల్లమ్మకొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట. ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట. అలా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం.
డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారానికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం, చల్లదనం ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా 1863 - 67 మధ్య కాలంలో నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. ఒక బంగ్లాను నిర్మించాడు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.
హార్సిలీ కొండపై పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలనూ, పెద్దలనూ అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకూ దుప్పటి కప్పుకొని నిద్దురోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు
భౌగోళికం
[మార్చు]తూర్పు కనుమల లోని దక్షిణ భాగపు కొండల వరుసే ఇక్కడి కొండలు. హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి 1,314 మీ. (4312 అ.) ఎత్తులో ఉంది. ఇది బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్..
హార్సిలీ హిల్స్ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన, ప్రైవేట్ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి.
చూడదగ్గ స్థలాలు
[మార్చు]ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులులవంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు:
- 142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
- వన్యమృగ కేంద్రము (zoo park).
- గవర్నర్ బంగ్లా
- దగ్గరలో జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషి వ్యాలీ పాఠశాల ఉంది.
బొమ్మల కొలువు
[మార్చు]-
కొండ దృశ్యం
-
హార్సిలీ హిల్స్ లో ఫారెస్టు బంగ్లా
-
సూర్యాస్తమయ దృశ్యం
-
వేణుగోపాల విగ్రహం
మూలాలు
[మార్చు]- ↑ "కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో...!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 12 ఏప్రిల్ 2017. Retrieved 12 ఏప్రిల్ 2017.
- ↑ Government of India (1908). The Imperial Gazetteer of India. Volume XIII. Gyaraspur to Jais. Oxford University Press. p. 178.